భక్తుల ఇళ్ళు

బాబా బిక్షకు వెళ్ళిన ఐదు ఇళ్ళు:-

బాబా ప్రతినిత్యము మధ్యాహ్నం 12 గంటలకు షిరిడిలో ఐదు యిండ్ల వద్ద భిక్ష చేసేవారు. సాయిబాబా వెళ్ళేమార్గము ఎప్పుడు ఒకే విధముగా యుండేది. బాబా కుడిచేతిలో రేకుడబ్బా, ఎడమ భుజానికి నాలుగు మడతల మడచిన గుడ్డ జోలె ధరించి యిండ్ల వద్ద భిక్షకునిలా నిలిచి "అక్కా, రొట్టెముక్క పెట్టు" అని అనుచు చేయిచాచి అన్నము, రొట్టెలు జోలెలోను, పలుచని పదార్దములు పులుసు,మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులోను పోసుకునేవారు. బాబా మొదటి 15 సంవత్సరములు పలుసార్లు భిక్షచేసేవారు. తరువాత రోజులలొ ఒకసారి మాత్రమే భిక్షచేసేవారు. బాబా నడవలేనప్పుడు కూడ భక్తులను పట్టుకొని భిక్షకు వెళ్ళేవారు. భక్తులు పంచభక్ష్య పరమాన్నములు తెచ్చినను వాటికాశించక భిక్షాన్నమునే బాబా భుజించి యుండిరి.

బాబా ప్రతిరోజూ షిరిడి గ్రామములో ఐదు యిండ్లలో భిక్షచేసెడివారు.ఆ ఐదు ఇండ్లలో వామన్ గోడ్ కర్ మరియు సఖారాం షిల్కె ఇద్దరు. వీరిద్దరు ధనవంతులైన భూస్వాములు. వీరి ఇల్లు చావడి ప్రక్కన వుండేది. 2001లో వాళ్ళ ఇల్లు పడగొట్టారు. కాని వారి సమాధులు నరసింహ మందిరము ప్రక్కన ఇప్పటికి ఉన్నాయి. వామన్ గోడ్ కర్ ఇంటి గురించి హేమడ్‌పంత్ సాయిసచ్చరిత్రలో వివరించారు. ఒకసారి రాధాకృష్ణ మాయికి చలి జ్వరము వచ్చినప్పుడు ఒక కుర్రవానిచే నిచ్చెన తెప్పించి బాబా వామన్ యింటి కాపు పైకి ఎక్కి రాధాకృష్ణమాయి యింటి కప్పుపై నుండి యింకొక ప్రక్కకు దిగిరి.ఆ లీల ద్వారా రాధాకృష్ణమాయి చలి జ్వరము తగ్గినది.ఆ నిచ్చెన తెచ్చిన కుర్రవానికి బాబా రూ.2/-లు ఇచ్చిరి. ఏ పనిని ఎవరిచేతా ఊరకనే చేయించుకొనకూడదనే లీలను కూడ ఇచట చూపిరి.

బాబా భిక్షకు వెళ్ళే మిగతా రెండు ఇల్లు బాయాజిబాయి మరియు అప్పాకోతే పాటిల్. వీరి ఇల్లు నరసింహలాడ్జ్ దాటిన తరువాత, ఇతిరాజ్ హోటల్ ఎదురుగా, ఒక మూలన ప్రస్తుతం ఉన్న 'సాయిక్కొన్ కలర్ లెబరెటరి 'ఉంది. బాయాజిబాయి కుటుంబము అక్కడ నుంచి మాహాలక్ష్మి మందిరము వెనుకాల కొంచెం దూరములో వున్న ఇంటికి మారారు. అక్కడ ఇంటిని బాయాజిబాయి గెస్ట్‌హౌస్ అనే పేరుతో ఒక హోటల్‌ను నిర్మించారు.

చివరిగా బాబా వడ్డివ్యాపారి అయిన నందుమార్వాడి ఇంటికి బిక్షకు వెళ్ళేవారు. ఇతని ఇల్లు ద్వారకామాయి మరియు గురుస్థాన్ మధ్యలోనున్న వీదిలో ఉంది.ఇప్పుడు అక్కడ మద్రాస్ హోటల్ వుంది. బాబా ఈ ఇళ్ళకే కాకుండా మిగతా కొంతమంది ఇంటికి భిక్షకు వెళ్ళేవారు. రోజుకు ఒకసారి గాని లేదంటే 5,6 సారులుగాని ఒకేఇంటికి భిక్షకు వెళ్ళేవారు. బాబా నందుమార్వాడి ఇంటికి బిక్షకు వెళ్ళినప్పుడు అతని భార్య తీసుకురావడం ఆలస్యం అయితే బాబా గట్టిగా అరిచి ఆమెను తిట్టేవారు. ప్రస్తుతము నందుమార్వాడి వంశస్థులు ఇక్కడనే వుంటున్నారు.

ప్రతి సంవత్సరము విజయదశమి నాడు బాబా చేసే బిక్షని భక్తుల చేత ఆచారవంతముగా నిర్వహించబడుతున్నది. బిక్షలో పాల్గొనే భక్తులను సంస్థానము వాళ్ళు లాటరి ద్వారా ఎంపిక చేస్తారు. సమాది మందిరము నుంచి ఊరేగింపుగా భక్తులు ద్వారకామాయి మీదుగా ఈ ఐదు ఇళ్ళకు భిక్షకు వెళ్ళతారు.