మాధవరావు దేశపాండే

మాధవరావు దేశపాండేను బాబా "శ్యామా" అని పిలిచేవారు. మొదటలో శ్యామాకు బాబాయందు విశ్వాసము ఉండేదికాదు. కాని తరువాత కాలములో అప్పటి సాయి భక్తులలో, బాబాతో శ్యామాకు వున్నంత సంబంధము ఏ భక్తునికీ లేదని చెప్పవచ్చు. ఇతను బాబాను 'దేవా' అని పిలిచేవాడు. షిరిడి వచ్చే భక్తులకు బాబాకు ఇతను సంధానకర్తగా ఉండేవాడు.

హేమడ్‌పంతు బాబా చరిత్ర వ్రాయుటకు బాబా అనుమతిని శ్యామా ద్వారానే బాబాను ఆమోదించవలసినదిగా కోరినాడు.రాదాబాయి ముసలమ్మ మంత్రోపదేశము పొందుటకు ఉపవాసమున్నప్పుడు శ్యామా బాబాతో చెప్పి ఆమెకు సమాధానము ఇప్పించాడు. శ్రీమతి ఔరంగాబాద్‌కర్ పుత్రసంతానము కొఱకు రాగా సమయమును కనిపెట్టి ఆమెను బాబా సముఖమునకు పిలిచి పుత్ర సంతానమునకు ఆశీర్వాదమిప్పించినాడు.

శ్యామా నిద్రించునపుడు అతని యొక్క ప్రతి ఉచ్చ్వాస - నిశ్వాసములోను స్పష్టముగా "సాయినాధ్ మహారాజ్ - సాయినాధ్ బాబా" అను శబ్ధములు వినిపించెడివని దాదాసాహెబ్ కపర్దే తన డైరిలో వ్రాసినారు. శ్యామా ప్రశాంత జీవితమును గడుపుచూ 1940 ఏప్రియల్ 16వతేది గురువారము రోజున తన 80వయేట సాయి సన్నిధికి చేరినాడు.