మహల్సాపతి

మొదటి రోజులలో బాబాను అంటిపెట్టుకొని ఉండువారిలో ఇతను ముఖ్యుడు. బాబా షిరిడి వచ్చినదగ్గర నుంచి మహాసమాధి చెందెవరకు తన దైవముగా భావించి ఎనలేని సేవ చేసిన మహభక్తుడు. బాబా ఎవరు చెప్పినా వినిపించుకొనని విషయములలో మహాల్సాపతి మాట వినేవారు. ఇతడు ప్రాధమిక విద్యనభ్యసించినాడు. విశ్వబ్రాహ్మణ వంశమునకు చెందినవాడు. కంసాలవృత్తి. వీరి కుటుంబమునకు ఏడు ఎకరముల మెట్టభూమియున్నను దానిపై రాబడి లేదు. వీరు వంశీయులు షిరిడిలోని ఖండోబా మందిరమునకు ధర్మకర్తలు. మహల్సాపతి ఈ ఖండోబా మందిర పూజరిగా యుండిరి. అతని కుటుంబ ఆదాయము అంతంతమాత్రమే ఒక్కొకసారి తినడానికి ఏమిలేక పస్తులు పడుకునేవారు. ఇతను ఖండోబా మందిరముకు వచ్చే సాధువులను, ఫకీరులను సాదరముగా అహ్వానించి వారి సౌకర్యములను చూచుకునేవాడు.

అప్పటికి ఏ పేరులేని 20 సం||ల వయస్సుగల ఈ బాలఫకీరును 'సాయీ అనే పేరుతో ఇతను ఆహ్వానించుటచే అప్పటి నుండి ఈ బాలుడు 'సాయీ అనే నామముతో పిలువబడినాడు. 'సాయీ అనే ఈ రెండు అక్షరములే సాయిభక్తులకు భవసాగరము దాటించు తారకమంత్రమైనది.

బాబా ఒకసారి కోపముతో ఎవరికీ చెప్పకుండా వెళ్ళి రూయీ గ్రామం దగ్గర మారుతీ ఆలయము వద్ద ఒక చెట్టుక్రింద కూర్చున్నాడు. బాబా షిరిడి తిరిగిరాకపొతే తాను షిరిడివెళ్ళక బాబాతోనే ఉంటానని, భోజనము చేయనని మహాల్సాపతి పట్టుపట్టాడు. చివరకు బాబా మహాల్సాపతితో తిరిగివచ్చారు.

బాబాతో కలిసి తాత్యా, మహాల్సాపతి రాత్రులయందు మసీదులో పడుకునేవారు.బాబా చావడిలో పడుకొనుచున్నప్పుడు, బాబా మసీదులో పడుకున్న రోజు ఇతను మసీదులో పడుకునేవాడు. యితను బాబాను వదిలి ఉండుటకు యిష్టపడేవాడు కాదు. సాధ్యముకాని కఠినమైన పనులను బాబా ఇతనికి చెప్పేవాడు.

1886 మార్గశిర పౌర్ణమి రోజున వారు సమాధిలోయుండుటకు నిశ్చయించి భక్తమహాల్సాపతితో "నా శరీరమును నీవు జాగ్రత్తగా చూడవలసినది. ఒకవేళ నేను తిరిగి రానియెడల ఆ మసీదుకు ముందునున్న స్థలములో పాతిపెట్టమని చెప్పి అక్కడ గుర్తుగా రెండు జెండాలు పాతమని చెప్పారు. బాబా దేహమును మహాల్సాపతి తన ఒడిలో నుంచుకొని నిద్ర- ఆహరములు మాని కంటికి రెప్పవలె కాపాడిరి. మూడవరోజు తెల్లవారుజామున బాబా శరీరములోనికి ప్రాణము వచ్చింది.

ఇతను బాబా సేవయందే గడిపినను కటిక దరిద్రమును అనుభవించెను. బాబా అందరికి దక్షిణ ఇచ్చినను మహాల్సాపతికి ఏమి ఇచ్చేవారు కదు. షిరిడీకి 150 మైళ్ళదూరమునయున్న జిజూరిలో ప్లేగువ్యాధి యున్న సమయమున మహాల్సా ఖండోబా ఉత్సవమును అచటికి వెళ్ళెను. అక్కడ బాబా సశీరదర్సనమిచ్చి వారి వెంటనే యుండినట్లు తెలియజెప్పిరి. మహాల్సా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు కంఠవ్యాదిని నయము చేసిరి.

బాబా మహసమాధి తరువాత కూడ మహాల్సాపతి రాత్రివేళ మసీదుకువచ్చి గతంలో బాబాతో గడిపిన రోజులు గుర్తుంచేసుకుంటూ రాత్రి అంతా మెలుకువతో యుండి తుదివరకు అచటనే పడుకున్నాడు. బాబా చెప్పినట్లే సాయిబాబా సమాధి చెందిన 4 సంవత్సరములకు అనగా 1922 సెప్టెంబరు 11వతేదీన భాద్రపద ఏకాదశి సోమవారము రోజున "ఈ రోజున నేను స్వర్గమునకు వెళ్ళుచున్నాను" అని చెప్పి తన తండ్రి శ్రాద్దమును పూర్తి చేసి, తాంబూలము వేసుకొని, కఫ్నిధరించి రామనామమును చేయించుచు, తన కుమారుడగు మార్తాండ్‌తో భక్తిమార్గమున నడుచుకొనుమని చెప్పి బాబా తనకిచ్చిన సట్కాను కూమారునికిచ్చి, రామరామ అనుచు ప్రాణములు విడిచి సాయిబాబా పాదముల చెంతకు చేరినాడు.

ద్వారకామాయినుండి కొంత దూరమున మహాల్సాపతి గృహమున్నది. ఆయింటియందే అతని సమాధికూడ ఉన్నది. సాయినాధుడు మహాల్సాపతికిచ్చిన సట్కా(బెత్తము), కోటు, కఫ్ని, పాదుకలు ఈ యింటిలోనే యున్నవి. షిరిడి దర్శించు భక్తులు వీరి గృహమునకు వెళ్ళి వాటిని దర్శించుచుందురు.