సాయి కథామృతం 99

                                                                                                         1.లోక నాయక లోక రక్షక

 శిరిడీనాథ సాయి ప్రభో !

 నీ కథ వ్రాయగ నా ఈ కోరిక

 నీ సంకల్పమే కాద విభో !!

2.పెండ్లివారి బృఁదముతోన

కాలిడితివి శిరిడీ లోన!

ఆవో సాయీ అని మహాల్సా ఆహ్వానించె

అదే నీ పేరుగ నేటికీ నిలచె!!

3.గోధుమ రూపున కలరా జాడ్యమే

విసరి ఆవల పారవేచితివి!

సంసారమనెడి ఈ సాగరమునే

దాటగ మాకు తోడ్పడవా!!

4.దాభోల్కరునే కరుణించి

హేమాడ్పంతను బిరుదిచ్చితివి!

నీకథ రాయగ తలంపునిచ్చి

సాయిచరితనే మాకందించితివి!!

5.రోహిల్లా మనసుకు నిలకడని

అణ్ణా మనసుకు శాంతిని!

హేమాడ్ పంతుకు ఉపదేశముని

దయతో నీవే ప్రసాదించితివి!!

6.గోదావరీ నదీ ప్రాంతములు

పుణ్యతమములు,  బహుపావనములు!

శిరిడి లోని సకల జనులు

నీ దయ చేత బహు పుణ్యాత్ములు!!

7.నీ పదముల నుండి గంగా యమునలు

కాల్వలై పారెను చమత్కారముగ!

నీ పావన మధుర సంకీర్తనలు

స్రవించే దాసగణు నోట కవితవేశాముగ!!

8.తంబోలితో కుస్తీ పట్టే

నీ జీవనమును మార్చేసే!

నీటిని నూనెగ మార్చినవైనమే

వ్యాపారుల  నైజమునే మర్చేసే!!

9.చల్లని నీ కరస్పర్స చేతనే

మాన్పితి వెన్నో వ్యాధులను!

కేవలము నీ ఊది ప్రసాదమె

మందుగ మారే ఎందరికో!!

10. కొందరిని నీ మాటలచే

మరి కొందరిని నీ చేతలచే!

ఎందరినో దృశ్య, స్వప్నములచే

మార్చితివి, మనుషులుగా తీర్చితివి!!

11.ధనికుడొకడు బ్రహ్మమును చూడకోరగా

వాని మోహమును విడనాడ చేసితివి!

మా మనమున ఎగిసే భావోద్వేగములు

అణచివేసితివి నీ బోధలతో!!

12.నీవు చేయు భిక్షాటనము

పంచ సూనముల పారద్రోలు మార్గము!

శిరిడీ చేరుట  వీడుటయు

నీ సంకల్పమే అది అంతయు!!

13.జీవులన్నిటా భగవంతుని

దర్శింపగ నీవుబోధించితివి!

మా మనములందలి ఆలోచనలను

మేము తెలుపకయే బయల్పరచితివి!!

14.కాకాను శిరిడీ రప్పించ్చేందుకే

శ్యామాను వణికి పంపితివి!

శ్యామా తల్లి  మ్రొక్కులవే తీరినవీ

కాకాజీకి నీ దర్శన భాగ్యం కలిగినది!!

15.బాబా నీ దివ్యసన్నిధి

క్రమముగా మేఘుని  మార్చినది!

బాబా నీ మెత్తని మందలింపదె

రామదాసీకి సమతను నేర్పినది!!

16.దామూకు సంతతి కలుగ చేసే

బాబా నీదు ఆమ్ర లీల!

కాపాడె వ్యాపారంలో నష్టంనుండి

అత్యాశకు పోవలదన్న నీ వాక్కులవే!!

17.ఎంతో మధురం నీ చమత్కార భరిత బోధలు,

ఏది తిన్నా ముందుగా దైవార్పితం చేయమన్న నీ మాటలు!

పరనింద చేయువాని పోకడ మార్చిన నీ వాక్కులు,

“పో, పొమ్ము,  క్రిందకు పొమ్ము” అంటూ విషాన్ని హరించిన నీ పలుకులు!!

18.బాబా నీదు ఊది మహత్యం

ఎంత చెప్పినా తరగదు సత్యం!  

మైనతాయికి ప్రసాదించే సుఖ ప్రసవం

పిళ్లేకి నారి కురుపునుంచీ విమోచనం!!

19.బాలాజీ పాటిల్ ఇంట సంతర్పణలో

అన్న ప్రసాదాలను అక్షయము చేసే!

తేలు కాటుకీ, మూర్చ రోగికీ,

 అందరికీ అది ఔషది కాగా!!

20.మూడున్నర మూరల శరీరం కాదు నీవని

చిత్ర పటము రూపమున హేమాద్రిపంతు ఇంట!

సన్యాసి రూపున దేవు ఇంట

ప్రత్యక్షమైనది బాబా నీవే కాదా!!

21.సమాధి మందిర నిర్మాణము

కాదా బాబా అది నీ సంకల్పము!

బయజా సేవకు ప్రతిఫలము

తాంత్యా ప్రాణము నిలిపిన నీ త్యాగము!!

22.నల్ల జీడి గింజ, సోనాముఖీ కాషాయం,

బాదాం, పిస్తా, వేరుశనగతో నీ వైద్యం!

అబ్బుర పడదా వైద్య బృందం.

నీ వాక్కే వానికి కలిగించే ఆ సుగుణం!!

23.నాగపూర్, గ్వాలియర్, కాశీ, గయా,

ప్రయాగ దర్శింప బోయిన శ్యామాకు!

ఆతని కంటే గయకు ముందుగా

చేరెదనంటు మాటిచ్చితివి!!

24.శ్యామా కొలిచిన పటము రూపున

గయ పండా ఇంట దర్శనమిచ్చితివీ!

శ్యామాకు ఎనలేని గౌరవమర్యాదలు

కలుగగ  చేసెను నీ ప్రేమాదరములు!!

25.రోహిల్లా చేసే “అల్లాహు అక్బర్” ఆబోతు రంకెలు

వానిని వారింపమని కోరిన శిరిడీ ప్రజలు!

దైవప్రార్ధనలందు నీ ప్రేమ మిక్కుటంబని

చాటెను వారిపై నీవు ప్రకటించిన కోపము!!

26.చావడి ఉత్సవము, చందనోత్సవము

జెండా ఉత్సవము, శ్రీరామనవమి ఉత్సవము!

చాటెను బాబా నీ సర్వమత సామరస్యము

నేర్పెను బాబా మాకు సమత, సౌభ్రాతృత్వము!!

27.కుష్టు రోగి బాగొజీ సేవను

విచిత్ర పురుషుడు నానవలి తీరును!

కోటీశ్వరుడు బుట్టీ భక్తిని

చూచితివి బాబా ఒక్క తీరుగనె!!

28.శిరిడిలో గొప్ప తుఫాను సంభవించగా

శాంతింపచేసితివి ఆగు ఆగను గర్జనతో!

ధునిలో అపరిమితంగా లేచిన మంటలను

చల్లర్చితివి దిగు, దిగను పలుకులతో!!

29.దాసగణు హరి కథల వల్లన

చోల్కరు మదిలో నీకు మ్రొక్కెను!

సర్కారు నౌకరీ వచ్చిన  తోడనె

నీ పాదాలకు మ్రొక్కి, కలకండ పంచగా!!

30.నీ మ్రొక్కును  చేల్లింప ఆ పేద భక్తుడు

ద్రవ్యము మిగిల్చె తేనీటిలో చక్కర మాని ఆతడు!

ఆ సంగతి నీవు బయల్పరచగా

చోల్కర్ మనసు కరిగి భక్తి ఇనుమడించెను!!

31.నీ భక్తుల్లెవ్వరును ఉపవసింపగా

నీ కిష్టం లేదను విషయమును!

మా కందరికీ తేటతెల్లపరచితివి

గోఖలేగారి భార్య దీక్షను మాన్పి!!

32.గోవా నుండి వచ్చిరి పెద్దమనుషులిద్దరు

ఒకనిని పదిహేను రూపాయలడిగితివి!

బాబా కాదది నీవడుగ దక్షిణ

తీర్పగ చేసితివాతని ఋణమును!!

33.రెండవ వానిని డబ్బివ్వనుండగా

వలదని నీవే వారించితివి!

పోయిన డబ్బును తిరిగిప్పించిన

నీ కెందుకు ఆతడు ఇచ్చు దక్షిణ!!

34.బాబా నీదు వంట పాత్రలు

సమానత్వముకు అవి తార్కాణములు!

అన్న దానమును  యెంత  ప్రీతితో

చేయవలయునో అవి చాటి చెప్పెను!!

35.మేఘుని, బుర్హాన్ పూర్ మహిళను, లక్ష్మిచంద్ను

శిరిడికి ఈడ్చెను నీ ప్రేమ పాశము!

బాబావారిని కడవరకునూ

కాపాడెను నీ పై వారి భక్తి భావము!!

36.బాబా నీదు సంస్కృత పరిజ్ఞానము

గీతా శ్లోకమునకు నీవు చెప్పిన అర్థము!

చిటికలో పటా పంచలు చేసెను

నానా యొక్క గర్వాహంకారములను!!

37.రామచంద్ర పాటీలుకు బాబా

తాంత్య మృత్యువును సూచించితివి!

కాని బాబా అదే రోజున

వానికి మారుగా నీవే ఈ లోకము వీడితివీ!!

38.బాబా నీవీ జగతిని వీడినా

ఈనాటికీ మా వెంట నుంటివీ!  

నీ సమాధి నుండి ఇప్పటికీ   

నీ బిడ్డల మమ్ము కాపాడుచుంటివీ!!

39.సన్యాసి  విజయానందుడు,

నూల్కర్,  మాన్కర్, మేఘశ్యాముడు! 

వారితో పాటు ఒక వ్యాఘ్రము కూడా

ధన్యులాయిరి, మరణము పొంది నీ సన్నిధిలో!!

40.అట్టి సద్గతినే నాకును కలుగగ

చేయ గదయ్యా సాయీశా !

నీ నామమునే నిత్యము ధ్యానించు,

నీ రూపమునే మదిలో దర్శించు

భాగ్యము లలితకు కలిగించు!!

పూర్తి ఆయెను నీదయతోన

బాబా నీయీ చాలీసా

చదువుచుందుము జీవితాంతమూ

మమందరినీ చల్లగా కాపాడు

లోకా సమస్తా సుఖినో భవంతు

సర్వేజనా సుఖినో భవంతు

ఓమ్ శాంతిః శాంతిః శాంతిః

 

  జై శ్రీ సాయిరాం ------------లలిత