షిరిడిలోని సమాధులు

దీక్షిత్ వాడా ప్రక్క నుంచి వెళ్ళితే, లెండిబాగు ప్రవేశద్వారము వస్తుంది.అక్కడ దగ్గరలో బాబా భక్తులైన వారి 5గురు సమాధులున్నాయి. అవి అబ్దుల్ బాబా, నానావలి, కుంభార్, తాత్యాకోతే పాటిల్, శ్యామసుందర్.

అబ్దుల్ బాబా(1954):-

ఇతడు నాందేడ్ నివాసి. సుల్తాన్ కుమారుడు.1869లో ఇతను జన్మించాడు. అక్కడ ఇతను అమరుద్దీన్ అనే సాధువును సేవించెడివాడు. ఫకీరు అమరుద్దీనుకు సాయిబాబా స్వప్నదర్శనమిచ్చి ఆయన చేతిలో రెండు మామిడి పండ్లు ఉంచి "అబ్దుల్‌ను నా దగ్గరకు పంపవలసినది" అని బాబా అమరుద్దీన్‌కి చెప్పిరి. ఆ విధముగా బాబా అబ్దుల్‌ను షిరిడికీ పిలిపించుకున్నారు. 1889లో తన 20వయేట అబ్దుల్ షిరిడి వచ్చి బాబాను దర్శించుకున్నాడు. అతను రాగానే నా "కాకి" వచ్చినది అని బాబా అతనిని అనుచు ఆదరించినాడు. తన సేవనే చేయమని అబ్దులును బాబా ఆదేశించిరి.

ఇతను ప్రతిరోజు మసీదు, బాబా సంచరించు వీధులు మొదలగు ప్రదేశములు చిమ్మి శుభ్రము చేసెడివాడు. మసీదులోను, చావడిలోను దీపములు పెట్టెడివాడు. ధునిలో కట్టెలు వేసెడివాడు. బాబా లెండి తోటకు వెళ్ళినప్పుడు బాబా వెంట యితను అచటకు వెళ్ళేవాడు. బాబా ధరించు వస్త్రములను అబ్దుల్ ప్రతిరోజూ శుభ్రపరిచెడివాడు. బాబా ఇతనిని ' భంగీవాడు ' మఱియు ' మిరియంబీ ' అని పిలిచెడివారు. ఈ అబ్దుల్‌ను బాబా తిట్టెడివారు, కొట్టెవారు కూడ. బాబా చెప్పే వాటిని వ్రాసియుంచుకొనెడివాడు. అలా వ్రాసి వుంచుకున్న సూక్తులు పుస్తకముగా వ్రాయించి దానినుండి అడిగిన వారి ప్రశ్నలకు సమాధానము చెప్పేవాడు. ఈ విదముగా ఎందరికో సమస్యలు తీర్చాడు.

బాబా దేహత్యాగము తరువాత అబ్ధుల్లా బాబా సమాధి మందిరములో ఎడమవైపునవున్న గదిలో ఉంటూ బాబా సమాధికి అభిషేకము చేయుచు, పూలతో అలంకరించి, మహానైవేద్యము పెట్టి దానిని తన ఆహారముగా స్వీకరించేవాడు. ఇప్పటికి కూడా అబ్దుల్లా వంశస్థులు ఉదయమునే పూలను బాబాకు సమర్పిస్తున్నారు.

అబ్దుల్ దేహంచాలించేంతవరకు 1954 వరకు సమాధి మందిరములో బాబా సేవలోనే గడిపినాడు. ఇతని సమాధి లెండివనముగేటు ముందు యున్నది.షిరిడి దర్శించు భక్తులు ఈ సమాధిని కూడ దర్శించి అబ్దుల్ సేవను గుర్తుచేసుకొందురు. బాబా స్వయముగా పిలిపించుకొని తన సేవను చేయించుకున్న భక్తుడు అబ్దుల్.

 

నానావలి:-

ఇతని అసలు పేరు శంకరునారాయణవైద్య. యితను నానావల్లి అనే మహాత్ముని సమాధిని సేవించుట వలన ఇతనికి "నానావలి" అనే పేరు వచ్చింది. ఇతను పరమాత్మ సాక్షాత్కారము పొందినవాడు. బాబా షిరిడి రెండవసారి వచ్చుటకు ముందు 1857,58 ప్రాంతములలో ఇతను షిరిడీ వచ్చియుండవచ్చు. ఇతను యశ్వంతరావుకు గురుబంధువు.

 

బాబా షిరిడీ వచ్చిన తరువాత యితను బాబాను చూస్తూనే బాబాయొక్క నిజతత్త్వమును గుర్తించినాడు. కాని యితనిని బాబా నోరు ఎత్తవద్దని మందలించారు. యితను బాబాను పూజించేవాడు కాదు. గౌరవించేవాడు. ఒకసారి నానావలి బాబా వద్దకు వచ్చి బాబాను గద్దె(కూర్చునచోట నుండి)పై నుండి లేపి తాను ఆ గద్దెపై కూర్చున్నాడు. మరుక్షణమే ఇతను ఆ గద్దెపై నుండి లేచి బాబాకు నమస్కరించి వెళ్ళినాడు. ఈ సంబంధము బాబాకు నానావలీకే తెలియాలి. అది బాబాను నానావలి పరీక్షించుటకై యుండవచ్చు. నానావలి ఈ చర్యకు భక్తులు భాదపడిరి.ఇతడు కోపిష్టి. అందువలననే ఎవరినీ నానావలి జోలికి వెళ్ళ వద్దని భక్తులతో బాబా అనేవారు. ఒకసారి ఇతను డా||పిళ్ళేను కొట్టినాడు. సాఠె పనులకు విభేదించి కొట్టుటకు అతను వెంబడి పడేవాడు. ఇతడు చంపుతాడనే భయముతో సాఠె షిరిడి విడిచి వెళ్ళినాడు. బాబా వద్దకు వచ్చే భక్తులను కూడ మందలించేవాడు.

బాబా దేహత్యాగము చేయుటతో యితను కలత చెందినట్లు అనిపించుచున్నది. బాబా శరిరము వదలిన 13వ రోజున నానావలి దేహత్యాగము చేసినాడు. అతను మరణించునప్పటికి అతని వయస్సు 70 సంవత్సరములు. ఇతని సమాధి లెండితోట ప్రవేశ ద్వారమువద్ద వున్నది. బాబాను పూర్తిగా గుర్తించిన వాడు నానావలి. ఇతను ఆధ్యాత్మికలో ఉన్నతవ్యక్తి.

 

భావూ మహరాజ్ కుంభార్:-

సాయిబాబా ప్రియమైన భక్తులలో కుంభార్ ఒకరు. ఇతను బాబా మహసమాధి చెందే రెండు,మూడు సంవత్సరాల ముందు షిరిడి వచ్చినాడు. యితను ఎవరితోను ఎక్కువ మాట్లాడకుండ మౌనము పాటించేవాడు. యితని యొక్క కరుణ, అన్ని ప్రాణులయందు దయ, ప్రేమ ఇతనికి మంచి పేరు వచ్చేలాగ చేసింది. కుంభార్ స్వయముగా వీధులను ఊడ్చేవాడు. ఎప్పుడన్నా తన దగ్గర ధనము వుంటే వాటిని ఇతరులకొరకు ఖర్చుపెట్టేవాడు. యితను కౌఫీనము మాత్రమే ధరించేవాడు. ఎవరైనా వస్త్రములు ఇస్తే వాటిని జంతువుల నీడకోసము చెట్టుకు కట్టేవాడు.భావూ మహరాజ్ కుంభార్ 1938లో స్వర్గస్థులైనారు. భావూ సమాధి రాళ్ళతో కట్టకముందు వరకు అక్కడి ప్రజలు అతని సమాధి మీదనున్న మట్టిని కొంచెం తీసుకొని వెళ్ళి బాధము నూనెలో కలిపి పిల్లలకి వాడేవారు. దాని వలన రోగాలు పోతాయని భక్తుల నమ్మకం.

తాత్యాకోతే పాటీలు:-

షిరిడి నివాసి. తండ్రి గణపతి కోతేపాటీలు, తల్లి బయాజీబాయి. ఇతను చిన్నతనమునుండి 5,6 సంవత్సరములు వయస్సునుంచి బాబాను తెలిసియున్నాడు. బాబాతో చనువుగా మెలిగినవాడు. అదేవిధముగా బాబా ఇతనిని ఆదరించిరి. ఇతని తల్లి బాబా షిరిడి వచ్చిన మొదటి రోజులలో రొట్టే, కూర తయారుచేసుకుని వెళ్ళి బాబాను వెదికి భోజనము తినిపించేది. బాబా భిక్షాటనచేయు కాలమునవారు భిక్షచేయు 5యిండ్లలో వీరి ఇల్లుకూడ యుండటతో యితనికి బాబాతో చాలాసన్నిహితము ఏర్పడినది.

సాయిబాబాతో తాత్యా,మహాల్సాపతి కలిసి మశీదులో రాత్రులలో పడుకొనెడివారు.షిరిడిలో గణపతి, శివ, పార్వతి, నంది, మారుతీ మందిరములను తాత్యాచే బాబా పునరుద్దరణ పనులు చేయించిరి.తాత్యా బదులు బాబా దేహత్యాగము చేసినారు. బాబా ప్రసాదించిన తన జీవితమును బాబా సేవలో గడిపి 1945లో దేహత్యాగము చేసెను. ఇతని సమాధి లెండివనము సింహద్వారము వద్ద యున్నది. అంకితభక్తుడైన తాత్యాకోతేపాటీలు.

గుఱ్ఱము(శ్యామ్కర్ణ):-

ముస్లిమ్.సత్కార్ వాయిసతారా నివాసి. యితనివద్ద పిల్లలు పుట్టనిది అయిన ఒక గుఱ్ఱము ఉన్నది. ఒకసారి ఇతను షిరిడిలో బాబాను దర్శించినపుడు బాబా ఇతనితో "నీ దగ్గరయున్న గుఱ్ఱమునకు పిల్లలు పుడితే నాకు యిస్తావా" అని అడిగారు. బాబా ఆశీస్సులతో గొడ్డుదైన ఆ గుఱ్ఱము సవంత్సరములోపే ఈనింది. మూడవనెలలో ఆగుఱ్ఱపు పిల్లను సత్కారు షిరిడి తీసుకొనివచ్చి బాబాకు యిచ్చాడు. ఆగుఱ్ఱపు పిల్లపేరే శ్యామకర్ణ. దాని సంరక్షణ భాద్యతను తుకారాం అనే భక్తునకు బాబా ఒప్పగించారు. ఒకసారి తుకారాం ఎంత బ్రతిమాలినా అది పచ్చగడ్డి మేయలేదు. మొండికేసింది.అలా తర్ఫీదు యిస్తూ అది మొండికేసినప్పుడు తుకారాం దీని వీపుపై కొట్టాడు. బాబా తుకారామును తనవద్దకు పిలిపించుకుని "తుకారాం! నా వీపు మీద ఎందుకు కొట్టావ్" అని తన కఫ్నీని పైకెత్తి తన వీపు మీదనున్న దెబ్బల గుర్తును చూపించి, ఆ శ్యామ్‌సుందరుని కొట్టితే నన్ను కొట్టినట్లేనని అతను గుఱ్ఱమును కొట్టిన దెబ్బలే అవియని తెలియచెప్పి ఏ ప్రాణిని హింసించిన తనను హింసించినట్లేనని గుర్తింపు చేసి తాని "విశ్వరూపుడనని" బాబా ఋజువు చేసిరి.

ద్వారకామాయిలో హారతి ప్రారంభించుటకు ముందు ఈ శ్యామకర్ణను బాబా అలంకరించి ద్వారకామాయి ముందుగల హాలులో ప్రస్తుతము తాబేలు ఉన్న ప్రాంతములో ఉంచేవారు. హారతి జరుగుచున్నంత వఱకు శ్యామకర్ణ అచటనే నిలబడి హారతి పాటకు అనుగుణముగా లయానుసారముగా శిరస్సు నూపుచు కాళ్ళు ఆడించేది. భక్తులు దానికి ఇరువైపుల నిలబడి ఆరతి పాడేవారు.హారతి పూర్తికాగానే ద్వారకామాయి మెట్లపై తనముందు కాళ్ళను ఉంచి బాబాకు వంగి నమస్కరించేది.

బాబా అనుగ్రహమునకు పాత్రమైన ఈ శ్యామకర్ణ 1945లో మఱుజన్మ లేకుండానే బాబా పాదముల చెంత చేరి సద్గతి పొందినది. దీని భౌతికదేహమును బాబా తఫొవనమైన లెండి తోటలో దత్తాత్రేయ విగ్రహమునకు వెనుక సమాధి చేయబడినది. షిరిడి దర్శించు భక్తులు ఈ సమాధిని దర్శింతురు. దాని విగ్రహమును ద్వారకామాయి ముందు గల షెడ్‌లో భక్తులు దర్శించుకొనుటకు ఏర్పాటు చేయబడినది.   జంతు జన్మ ఎత్తిన ఈ శ్యామకర్ణ ఎంతోమంది సాయిభక్తులైన మానవులకు దక్కని అదృష్టం ఈ శ్యామకర్ణ పొందినది.