ముఖ్యమైన పండుగలు

షిరిడిలో జరుపుకునే మూడు ముఖ్యమైన పండుగలు శ్రీరామనవమి(మార్చి/ఏప్రియల్), గురుపూర్ణిమ(జులై), విజయదశమి(అక్టోబరు). ఈ పండుగలు రెండు (లేక) నాలుగు రోజులు జరుపుతారు. ఇందులో కొన్ని వేల మంది భక్తులు ఉత్సాహాముగా పాల్గొంటారు. పండుగలలో ఎన్నొ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలలో పూజ,సంగీతం, భజన, పారాయణము, మహావైభవముగా పల్లకి, రధము ఊరేగింపు ఉంటాయి. పండుగ రోజులలో సమాధి మందిరము రాత్రంతా తెరిచే వుంటుంది. ద్వారకామాయి పైన భాగము మాత్రము పండుగ ముందు రోజు రాత్రంతా తెరిచివుంచుతారు. షిరిడి గ్రామమంతా రాత్రికి భజనలు చేస్తూ, సభలు నిర్వహిస్తారు.

గురుపూర్ణిమ:-

సం|| 1908లో ఒకరోజు పండరినుండి వచ్చిన కృష్ణజీ నూల్కర్ చావడిలో వున్నాడు. బాబా శ్యామతో "ఆ ముసలయ్య(నూల్కర్)ను ధునివద్ద స్తంభాన్ని పూజించుకొమ్మని చెప్పు" అని అతడు చెప్పి రాగానే, "మీరంతా గుదా చేసుకొరాదా!" అన్నారు సాయి. "దేవా! మీకైతే చేస్తాము గాని, స్తంభాన్నేందుకు పూజిస్తాము?" అన్నాడు శ్యామా. మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నూల్కర్ చూస్తే, నాడు(వ్యాస) గురుపూర్ణిమ! తాత్యా, దాదాకేల్కర్, శ్యామా మొ||న వారు సాయికి ధొవతులిచ్చి పూజించారు. అప్పటినుండి శిరిడిలో గురుపూర్ణిమ చేసుకొవడం ఆచారమైనది. సాయి నోటిమీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవమిదొక్కటే!

అయితే సాయి స్తంభాన్నేందుకు పూజించమన్నారు? భక్తుల శ్రేయస్సుకోరి మాత్రమే, 'గురువును సేవించు" అన్న భావాన్నే సంకేతముగా సాయి చెప్పారు. సాయి సద్గురువు. ఇంటికప్పును మోసే ఆధారం స్తంభము. అది నేలలో దృఢంగా నాటుకొని వుంటుంది. అదే దాని బలము. ఆ బలంతోనే అది ఆ భవనాన్నాశ్రయించే వరందరినీ రక్షిస్తుంది. అలానే సద్గురువు సర్వానికీ ఆధారమైన ఆత్మనిష్ఠలో, గురుభక్తిలో నాటుకొని వుంటారు. అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ఠవలన గురువు గూడ తమనాశ్రయించినవారిని రక్షిస్తారు -- స్తంభంలాగే! గురురూపాన్ని తగురీతిన కొలవమని సాయి భావం. అంతేకాదు. సాయి శరణానందులతో తాము మశీదులోని స్తంభం క్రిందనున్న గుహలో చాలాకాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు. ఆ స్తంభము క్రింద వెండి పాదుకలు ప్రతిష్ఠించారు.

ప్రతిసంవత్సరము గురుపూర్ణిమ రోజున షిరిడిలోని సాయి మందిరములలోను, యితర అన్ని సాయి మందిరములలోను బాబాకు గురుపూజోత్సవమును జరుపుకొనుచున్నారు. ఇచట గమనించవలసిన విషయమేమనగా; బాబా ఈ పూజను గురించి కృష్ణ నూల్కరుకు చెప్పమనుటలో సరైన గురువిధానమును తన భక్తులకందించి సుస్థిరపరచుటకు చెప్పిన లీల.

శ్రీరామనవమి:-

శిరిడిలో జరిగే పండుగలన్నింటిలో మతసామరస్యమే సాయి సంకల్పం గనుక శిరిడిలో శ్రీరామనవమి జరపలని హిందువులకు, ఉరుసు జరపాలని ముస్లిములకూ స్ఫురించింది.

బాబా భక్తుడైన గుండుకు మూడు వివాహాలు చేసుకున్నా, దాము అన్నాకు రెండు వివాహాలు చేసుకున్నా బిడ్డలు కలుగలేదు. చివరికి సాయి ఆశీస్సులతో వారికి సంతానం కల్గింది. అందువలన వీరు 1897లో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలనుకున్నారు. దానికి సాయి అనుమతించారు. ఉరుసుకు దామూ అన్నా, నిమోనకర్‌లు రెండు జెండాలు, అమీర్‌షక్కర్‌దలాల్ చందనము సమర్పించేవారు. ఆ గంధమొక పళ్ళెంలో వుంచి, జెండాలతో పాటు వేళతాళాలతో వూరేగించి చివరికి ఆ గంధం మసీదులో గోడలమీద చేతులతో అద్దేవారు. జెండాలు మసీదుకు రెండువైపులా కట్టేవారు. ఉత్సవం ఈర్పాట్లన్ని తాత్యా చూస్తే, భక్తుల అవసరాలు రాధాకృష్ణ ఆయి చూచుకునేది. భారి ఎత్తున అన్నదానము గూడ ప్రతి సంవత్సరమూ జరిగేది.

హిందువులకు శ్రీరామనవమి పండుగ ఎంతో ప్రాముఖ్యమైనది. 1912వ సంవత్సరము నుండి ప్రతి సంవత్సరము ఈ పండుగ జరుప నిర్ణయించబడినది. ఉత్సవములు ప్రారంభించగానే రాధాకృష్ణమాయి ఒక ఊయలను తెప్పించి బాబా ఆసనము ముందు వ్రేలాడదీసినది. భీష్ముడు కధాగానము చేయుటకు సంసిద్దుడాయెను. మహాజని హోర్మొనియంచేత బూనెను. అప్పుడే లెండీ నుండి మసీదుకు వచ్చిన బాబా ఇదంతా చూసి మహజనిని పిలిచి ఇక్కడ ఏమి జరుగుతున్నది, ఊయలనెందుకు కట్టినారు అడిగారు. ఈ దినము శ్రీరామనవమి ఉత్సవములు ప్రారంభమయినాయి అని చెప్పినారు. రెండు పూలదండలను తీసి ఒకటి మహజని మెడలోను రెండవది భీష్మమెడలోను బాబా వేసినారు. కధాకాలక్షేపాలతో బాజాభజంత్రీలతో ఉత్సవాలు పూర్తి అయ్యాయి.

ఇప్పటికి షిరిడిలో శ్రీరామనవమి ఉత్సవము ఎంతో వైభవముగా జరుపుతారు.ఈ రోజు ద్వారకామాయిలో పాత గోధుముల బస్తాను తీసి ఇంకొకటి ఉంచుతారు. పాత గోధుముల బస్తాను ప్రసాదాలయమునకు పంపిస్తారు. జెండాలను ఉరేగింపుతో తీసుకొచ్చి ద్వారకామాయి మీదున్న పాత జెండాను తీసి కొత్తవి పెడతారు.

విజయదశమి:-

భారతదేశమంతటా జరుపుకునే ముఖ్యమైన పండుగులలో విజయదశమి ఒకటి. అమ్మవారు దుష్టశక్తులను హరించి లోకానికి శ్రేయస్సును చేకూర్చిన రోజు కాబట్టి ఎంతో వైభవముగా ఈ పండుగను అందరు జరుపుకుంటారు. దీనినే దసరా అని కూడా అంటారు. ఈ తొమ్మిది రోజులు అంటే దశమి వరకు అమ్మవారిని కొలుస్తారు. అందుకేనెమో బాబా మహాసమాధి అవ్వడానికి ఈరోజును ఎంచుకున్నారు. ఆయన సమాధి చెందిన రోజు కాబట్టి షిరిడిలో ఎంతో వైభవముగా పూజలు నిర్వహిస్తునారు అంతేకాకుండా ఇతర సాయి దేవాలయాలలో కుడా పూజలు నిర్వహిస్తునారు. అన్నదానము చేస్తారు. 1954 సం||లో విజయదశమి రోజునే సాయిబాబా విగ్రహప్రతిష్ఠ జరిగింది. అదే రోజు ఎంతో మందిని సాయిమార్గములోకి తీసుకొచ్చిన శరత్ బాబుజి జన్మించారు.