సాయిబాబా గురించి

saibaba11కలియుగములో వివిధ జాతుల మధ్య సమైఖ్యతకోసం, జనులలో అజ్ఞానాన్ని నిర్మూలించి సన్మార్గం వైపు నడిపించడానికి సాయినాధుడు ఈ భువిపై అవతరించారు. బాబా ఎవరికి పుట్టారో, ఎక్కడనుంచి వచ్చారో ఎవరికి తెలియదు. వారి యొక్క పవిత్ర స్పర్శవలన ఈ శిరిడీ ఎంతో పునీతమయినది. బాబా ఒక సామాన్యమైన ఫకీరులాగ కనిపించినా అంతర్గతముగా వారు పరబ్రహ్మస్వరూపులు. అజ్ఞానమనే చీకటిలో బ్రతుకుతున్న ఈ మానవాళికి జ్యోతియై జ్ఞానమనే వెలుగును ప్రసాదించడానికి వచ్చిన జ్ఞానమూర్తులు. సంసార బాధ్యతను నిర్వహిస్తూ ఆధ్యాత్మిక మార్గములో ఏ విదముగా పయనించి భగవంతుడిని చేరుకోవాలో బాబా తన భక్తులకు తెలియచేయడమే కాకుండా ఎంతో మంది భక్తులకు మార్గదర్శకులై నడిపించి చివరికి మోక్షాన్ని ప్రసాదించారు. వారు తమ భక్తులకు ఎలాంటి మంత్రములు ఉపదేశించలేదు.కేవలం వారి యొక్క వాక్కులు, ఉపదేశాల ద్వారా భక్తుల కష్టాలు, రోగాలు, సందేహాలు తీర్చేవారు. బాబా సామాన్యమైన మానవునివలె అందరితో ఆడేవారు,పాడేవారు, నాట్యం చేసేవారు.

పైకి మాత్రము ఒక్కొక్కసారి తన భక్తులపై కోపము చూపించేవారు, రాళ్ళు విసిరేవారు కాని వారి హృదయము ప్రేమమయం. ఎంత ప్రేమంటే తన భక్తులు కష్టాలను అనుభవిస్తుంటే బాబా బాధపడేవారు, భక్తుల రోగాన్ని తాను భరించేవారు, ఆపదలో వుండి 'సాయి ' అని పిలిస్తే వెళ్ళడానికి క్షణమైన ఆలస్యం చేయరు, ఎప్పుడు తన భక్తులు యోగక్షేమాలే వారికి ముఖ్యం. సృష్టిలో సర్వజీవులను సమానముగా ప్రేమించే సాయికి అంటరానితనము ఎక్కడిది? వారి జీవనమే మానవాళికి ఆదర్శప్రాయము. బాబా ఆజ్ఞలేనిదే తన భక్తులకు మరణం కూడా దరిచేరదు. పంచభూతాలు ఆయన ఆధీనం.

“శిధిలమైన మశీదే ఆయనకు రాజభవనము. ధునిలోని విభూతియే ఆయన యొక్క ధనం. చిగివున్న కఫ్నీయే చీనాంబరము. సట్కాయే ఆయన రాజదండము. తలచుట్టూ రుమాలే వారికున్న రత్న కిరీటము. భిక్షగాళ్ళే వారి కొలువులోని వారు. ఆయనవద్ద ఎప్పుడూ వుండే యిటుకరాయి, గోనెపట్టాలే వారికి దిండు, పట్టుపరుపులు. ఒక రేకుడబ్బా, కొద్ది మట్టికుండలే వారికి స్వర్ణపాత్రలు. మశీదు ముంగిటనున్న పెద్ద రాయియే వారి సింహాసనము. భక్తులు భక్తితో పాడే జానపద పాటలే వారికి నిత్యహారతులు. ప్రేమతో పెట్టే బిక్షాన్నమే వారికి పరమాన్నము. భక్తుల అరిషడ్వర్గాలే ధునిలో వేసే ఆహుతి. భక్తులు సమర్పించే రెండు పైసలు (శ్రద్ద,సబూరి) వారు తీసుకొనే దక్షిణ. నవవిదభక్తి మార్గాలే బాబా భక్తులకు పంచే కానుకలు”.

జనన మరణాలకు అతీతమైన బాబా మనకు సమాధి చెందినట్టు అనిపించినా వారికి మరణమనేది లేదు. బాబా సమాధి చెందే ముందు తన భక్తులకు చెప్పారు "నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది, నా నామం పలుకుతుంది”. జాతి,కుల మత భేదాలు లేకుండా అందరు కలిసిమెలిసి వుండి అధ్యాత్మిక ప్రగతిలో ఉన్నతిని సాధించాలనేదే బాబా అవతార లక్ష్యం.