గురుస్థానము

Gurustan_1 copyగురుస్థానము అంటే "గురువు నివసించిన ప్రదేశము". 1854వ సంవత్సరములో సాయిబాబా మొదటిసారిగా షిరిడి గ్రామములో నున్న వేపచెట్టుక్రింద ఆసనమున కూర్చొని తపస్సు చేయుచు సమాధిలోయుండుట గ్రామప్రజలు చూచి ఆశ్చర్యపడిరి. ఒకరోజున షిరిడీ వాసులు ఖండోబా ఆవేశించిన గణాచారిని ప్రశ్నింపగా, ఆ బాలుడు కూర్చుండెడి వేపచెట్టు క్రింద తవ్వించెను. అచ్చట ఒక సందు, అందు నాలుగు దీపములు వెలుగుచుండుట, భూగృహము, దానిలొ గోముఖ నిర్మాణము, కఱ్ఱబల్లలు, జపమాల కనిపించినవి. ఇది చూచి బాబా అది తన గురుస్థానమని వారికి చెప్పి దానిని మూయించినారు. భక్తులు బాబా గురుస్థానముగా తలిచి నమస్కరిస్తున్నారు.

సాఠె వేపచెట్టు చుట్టూ అరుగు కట్టించాడు. సాఠెవాడ కట్టడము జరుగుతుంటే ఆ వేపచెట్టు కొమ్మలు అడ్డువచ్చినవి.బాబా అడ్డువచ్చిన కొమ్మలను నరికివేయమన్నారు. గర్బములో పిండం అడ్డం తిరిగితే చేధించి తీయవలసినదే అని అన్నారు బాబా. బాబాయే స్వయముగా ఆ కొమ్మలు నరికారు.

పాదుకల వృతాంతము:

1912 సం||లో బొంబాయినుండి డాక్టరు రామారావు కొఠారెయను నతడు శిరిడికి వచ్చెను. వానితోపాటు అతను కంపౌండర్‌ను, మరియు అతని మిత్రుడైన భాయికృష్ణజీ అలీబాగ్‌కర్ వెంటవచ్చిరి. వీరు భక్తసగుణు, జి.కె.దీక్షితులతో స్నేహముగాయుండిరి. బాబా మొదటగా షిరిడివచ్చి వేపచెట్టుక్రింద కూర్చొని ధ్యాననిమగ్నులై యున్నందున అందుకు గుర్తుగా ఆవేపచెట్టు క్రింద బాబా పాదుకలు ప్రతిష్టచేయవలెనని వీరు అనుకొనినారు. వారు రామారావు కొఠారే గారికి పాదుకల గురించి చెప్పిరి. వారు షిరిడీ వచ్చి పాదుకలు ఎట్లుచేయవలెనో నమూనాను తయారుచేసిరి. ఉపాసనీమహరాజు ఆపాదుకల నమూనాను చూచి దానికి కొన్ని మార్పులను -చేర్పులను చేసి అందు పద్మము, శంఖము, చక్రము మొదలగున్నవి చేర్పించి తాను వ్రాసియున్న ఈ క్రింద పద్యమును కూడ వ్రాయించిరి.

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్

సుధా స్రావిణం తిక్తమప్యప్రియం తమ్

తరుం కల్పవృక్షాధికం సాధయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాధమ్ ||

పై నమూనా ప్రకారము డాక్టరు రామారావుగారు బొంబాయిలో తయారుచేయించి కాంపౌడరు ద్వారా షిరిడి పంపిరి. సాయిబాబా ఆ పాదుకలను శ్రావణ పౌర్ణమినాడు ప్రతిష్ట చేయమని ఆజ్ఞాపించిరి. 1912 శ్రావణ పౌర్ణమినాడు ఉదయం గం11-00లకు జి.కే.దీక్షిత్ ఆపాదుకలను తన తలపై నుంచుకొని ఖండోబా మందిరము నుండి ఊరేగింపు ఉత్సవముతో ద్వారకామాయి వద్దకు రాగా సాయిబాబా ఆ పాదుకలను తాకి, యివి భగవంతుని పాదుకలని, చెట్టుక్రింద ప్రతిష్టచేయమని వారిని ఆజ్ఞాపించిరి. ఆ విధముగా సాయిబాబా పాదుకలు మొదటిసారిగా షిరిడిలో గురుస్థానములో గల వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించబడినవి.

పాదుకలు ప్రతిష్టచేసిన కొన్ని నెలలు తరువాత ఒక పిచ్చివాడు పాదుకలను మరియు ఇతర మందిరములోనున్న విగ్రహాలను పగులగొట్టాడు. భక్తులు దుఃఖముతో ఈ విషయము బాబాకు విన్నవించుకోగా, వారు మాములుగా పాదుకలని సిమెంటుతో అతికించమని చెప్పినారు. తరువాత క్రొత్తపాదుకలు అమర్చి విరిగినపాదుకలు విగ్రహము క్రింద పెట్టారని చెబుతుండేవారు. మొదటి ఐదుసంవత్సరములు ఇచ్చట పూజను జి.కె.దీక్షిత్ అను బ్రాహ్మణుడు చేసెను. తరువాత లక్ష్మన్ కచెశ్వర్ జఖాడెయను బ్రాహ్మణుడు పూజ చేసియుండెను. సగుణ్‌మేరు నాయక్ నైవేద్యము,దీపము పెట్టినాడు. హరివినాయక్ సాఠె ఈ వేపచెట్టుగల స్థలమును కొన్నప్పుడు ఈచెట్టుచుట్టూ ఎత్తయిన అరుగు కట్టించి దానిని ఎక్కుటకు మెట్లు నిర్మించారు. యిప్పుడు ఈ పాదుకలు ప్రతిష్టించిన వేపచెట్టు ప్రదేశమైన గురుస్థానమును చాలా అభివృద్దిపరిచినారు. అరుగును ఎత్తుగా ఏర్పాటుచేసిరి. యిందులో శివలింగము, బాబా చిన్న విగ్రహమును ప్రతిష్టించిరి. పైనకప్పు వేయబడి చుట్టూ ఐరన్‌గ్రిల్‌ను ఏర్పాటుచేసి రాళ్ళను పరచిరి. కట్టడము చుట్టును క్యూలు ఏర్పాటుచేసిరి. బయటనుండి ప్రదక్షిణలు చేయవలసియున్నది. రాత్రులందు కూడ ప్రదక్షిణములు భక్తులు చేయుచుందురు. ఇది సాయి భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలము.

భక్తులు మండపముపై ఉత్తరపు ముఖముగా కూర్చుందురు. గురు,శుక్రువారములు ఇచ్చట ఎవరు దీపము వెలిగించి, ధూపము వేయుదురో వారు బాబా కృపవలన సంతోషముతో నుండెదరని, శుభము కలుగునని భక్తుల విశ్వాసము. గురుస్థానము ముందు ఖాళీ జాగాలో చిన్న ధుని వుంది. రోజు దీనిలోకి కట్టెనిప్పులను ద్వారకామాయి నుంచి తీసుకొని వచ్చేవారు కాని ప్రస్తుతము గురువారము, శుక్రువారము మాత్రమే వేస్తున్నారు. భక్తులు తమతో సాంభ్రాణి, వత్తులు, నూనె తీసుకొని వెళ్ళి యిచట దీపము వెలిగించి, ముందు ఖాళీజాగాలో ఎప్పుడు మండుచు పొగవేయు పాత్రలో సాంభ్రాణితో ధూపము వేయుచుందురు. ప్రదక్షిణ, ధ్యానము, జపము, చరిత్రపారాయణ భక్తులు ఇచట చేయుచుందురు.

తకియా (రచ్చ):

ప్రస్తుతము దీక్షిత్‌వాడాకి తూర్పు దిక్కున, వేపచెట్టు ఎదురుగా ఒక హాలు నిర్మింపబడినది. అంతకముందు ఇక్కడ 'తకియా'(రచ్చ) వుండేది. శిరిడికి వచ్చె ఫకీర్లు ఇక్కడ విశ్రాంతి తీసుకొనేవారు. బాబా యీ మసీదుకు రాకపూర్వము 'తకియా' (రచ్చ)లో చాలాకాలము నివసించిరి. బాబాకి సంగీతము, నృత్యము అంటే చాలా ఇష్టం. శిరిడి వచ్చిన రోజులలో బాబా 'తకియా'కి వెళ్ళి వివిధ బాషలలో(అరబిక్,పెర్షియన్,హింది..) భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు. 1890 వరకు బాబా కాలికి గజ్జలుకట్టి ఇక్కడ యితర ఫకీర్లతో కలిసి సొగసుగా నాట్యము చేయుచు పాటలు పాడేవారు. ఇప్పుడు 'తకియా' అక్కడ లేదు, కాని బాబా నాట్యం చేసే దృశ్యాన్ని గుర్తుచేసుకుంటే మనల్ని మనం మైమరిచిపోతాము.