ద్వారకామాయి

Dwarkamaiకలియుగములో దేవుడు మానుషరూపములో మళ్ళి అవతరించాడనటానికి సాయినాధుడే దీనికి నిదర్శనము. మట్టితో కట్టి శిధిలావస్థలో నున్న మశీదులోనే బాబా రెండవసారి షిరిడి వచ్చినప్పుడు నివశించారు. దీనినే "ద్వారకామాయి" అంటారు. అప్పటిలో వారి దర్శనానికి ముఖ్యముగా భక్త మహల్సాపతి, అప్పాజొగే, కాశీరాంలు మాత్రమే వచ్చేవారు. 1858వ సంవత్సరము నుండి బాబా సమాధి చెందేవరకు 60 సం||లు ఈ ద్వారకామాయిలోనే వున్నారు. అక్కడ వున్న ప్రతి రేణువు బాబా స్పర్శతో పునీతమయినది. ఈ మహరాజుకు
"శిధిలమైన మశీదే ఆయనకు రాజభవనము, ధునిలోని విభూతియే ఆయన యొక్క ధనం. చినిగివున్న కఫ్నీయే చీనాంబరము. సట్కాయే ఆయన రాజదండము. తలచుట్టూ రుమాలే వరికున్న రత్న కిరీటము. భిక్షగాళ్ళే వారి కొలువులోని వారు. ఆయనవద్ద ఎప్పుడూ వుండే యిటుకరాయి, గోనెపట్టాలే వారికి దిండు, పట్టుపరుపులు. ఒక రేకు డబ్బా, కొద్ది మట్టికుండలే వారికి స్వర్ణపాత్రలు. మశీదు ముంగిటనున్న పెద్ద రాయియే వారి సింహాసనము."
బాబా ఎప్పుడు చెప్పేవారు, ఈ ద్వారకామాయి మనది. ఈ మసీదు వడిలో నీవు కూర్చుంటే నీ తల్లిఒడిని చేరినట్లే. ఇది నీకు నిర్బయత్వాన్నిస్తుంది. మరే చింతా ఉండదు. మసీదు మాయి ఎంతో దయగల తల్లి. కల్లాకపటం ఎరుగదు. భక్తులకు మాతృమూర్తి ఎవరు ఎలాంటి విపత్తులో నున్నా ఎంత ప్రమాదకరమైన పరిస్థితులలోనున్న ఆ తల్లి వారిని అక్కున చేర్చుకొని సంరక్షిస్తుంది. ఎవరైతే "ద్వారకామాయి" మెట్లపై కాలుమోపుతారో వారికి కష్టములు తొలగి సకలసంపదులు చేకూరి ఆయురారోగ్యములతో అనందముగానుందురు.
ద్వారకామాయిలోనే బాబా పాదుకలు, బాబా వాడిన మట్టికుండ, బిక్షాన్నం పెట్టుకునే కొళంబే (మట్టిపాత్ర), బాబా స్వయంగా గోధుమలు విసిరిన తిరగలి,గోధుమల బస్తా, బాబా ఫోటో, దాని క్రింద ఆయన మధ్యాహ్న సమయములో కూర్చునే రాయి, బాబా సన్నిధిలో మరణించి సద్గతి పొందిన పులి విగ్రహం, శ్యామకర్ణ గుర్రం విగ్రహం, బాబా నాటిన తులసి బృందావనం, ఆనాడు బాబా స్వయముగా వంట చేసిన పొయ్యి మొదలైన అమూల్య వస్తువలెన్నో వున్నాయి.

ధుని

Dhuniమశీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి. అందులో ఈశాన్యం మూల కేవలమొక గోనెగుడ్డ మీద సాయి కూర్చొనేవారు. ఆయన ఎదుట, ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్ని హోత్రము, లేక ' ధుని ' నిర్వహించేవారు. ఇప్పటికి ధుని వెలుగుతునే వుంది. బాబాకు ముఖ్యమైన వాటిలో ఆగ్ని వెలిగించడం. బాబా ఎక్కడున్నా, అది వేపచెట్టు క్రిందకాని, అడివిలోకాని, మశీదులో అగ్నిని వెలింగించేవారు. బాబాకి ఏ విధమైన పట్టింపులు వుండేవికావు.ఎవరైన వచ్చి ధుని కొరకు నిల్వచేసిన కట్టెలను తీసుకొని వెళ్ళినా ఏమి అనేవారు కాదు. పండుగదినములలో రాధాకృష్ణమాయి మశీదు శుభ్రపరిచేటప్పుడు ధునిని బయటపెట్టేది. బాబా కేవలం కట్టెలను మాత్రమే కాదు ధునిలో వేసేది, వారి విప్పిన పాత వస్త్రములను కూడా అందులో వేసేవారు. ఒకరోజు సాయి ధునిలో కట్టేలు వేస్తున్నారు. మంటలు విజృభించి, మసీదువాసాలు అంటుకునేట్లున్నాయి. భక్తులు ఆందోళన చెందుతూంటే, సాయి సట్కాతో ప్రక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటనుద్దేశించి, "తగ్గు, తగ్గు, జాగ్రత్త!" అన్నారు. ధుని అణిగి మందగా వెలగసాగింది. బాబా భిక్ష చేసి తీసుకొచ్చిన పదార్దాలన్ని ముందు ధునికి ఆహుతి ఇచ్చేవారు. బాబా అలా ఎందుకు చేసేవారో ఎవరికి తెలియదు.

ఊది

ద్వారకామాయిలో ధుని నిరంతరము వెలుగుతూనే ఉంటుంది. దాని నుంచి వచ్చే బూడిదనే "ఊది" అంటున్నాము. బాబా ఈ ఊదిని భక్తులందరికి తమ స్వహస్తాలతో ఇచ్చేవారు. బాబాను దర్శించి తిరిగి ఊదిని ప్రసాదముగా తీసుకొని వెళ్ళేవారు. విశ్వమంతా అశాశ్వతము కట్టెల మాదిరి శరీరము. ఆయువు తీరగానే శవమై కాలి బూడిద అవుతుంది. ప్రపంచములో ప్రతి ప్రాణి కాలి బూడిద అవ్వవలిసిందే. ఈ విశ్వమంతా మాయాజాలం "బ్రహ్మం సత్యం జగత్తు మిధ్య" ఈ అర్ధాన్నే విబూధి భోదిస్తుంది. కాబట్టి అహర్నిశలు దీనిని స్మరించండి. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమియూ తీసుకురాలేదు. పొయేటపుడు ఏమీ తీసుకుపొవు. ఈ సత్యాన్నే ఊది తెలియచేస్తుంది. ఈ ఊదిని శరీరానికి రాయడం వలన శారీరక,మానసిక రోగాలు నశిస్తాయి. ఈ ఊది వివేకపూర్ణ వైరాగ్యాన్ని కలిగి వుండమని సూచిస్తుంది. దక్షిణలు ఇవ్వడంవల్ల మనిషిలో వైరాగ్యం ప్రజ్వరిల్లుతుంది. ఒకరికి వైరాగ్యం ఏర్పడి అది వివేకయుక్తం కాకపోతే ఆవైరాగ్యం వ్యర్ధమవుతుంది. కాబట్టీ విబూధిని ఆదరించండి. వివేక వైరాగ్యాలకు విబూధి దక్షిణలకు సబంధ మేర్పరుచుట జరిగినది. బాబా అనుమతి తీసుకొని వెళ్ళేవారికి తన బ్రొటనవేలితో నుదుటన విబూధి పెట్టి తలపై తన హస్తానుంచి ఆశీర్వదించి పంపేవారు. బాబా ప్రసన్నచిత్తముతో ఉన్నప్పుడు ఈ పాటపాడేవారు. (రమతే రాం ఆయోజీ ఆయోజీ ఊదియాంకి బోనియా లయోజీ) "రమించే రాముడు వచ్చాడు వచ్చాడు సంచులకొలది విబూధి తెచ్చాడు తెచ్చాడు." ఈ ఊది పరమకళ్యాణ దాయకం. వీధిలోని ధూళిని కూడా భక్తిశ్రద్ధలతో "ఊది" అన్న భావనతో ఉపయోగిస్తే అది ధునిలో ఊదిగా ఉపయోగపడుతుంది.

భక్తితో విభూతిని నుదుటిన ధరించిన వారికి కష్టాలు తీరిపోతాయి. కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి నిత్యం విభూతిని దరించి, కొంచెం నీటిలో వేసుకొని బాబా పాదతీర్దముగా స్వీకరిస్తే శుద్ధచిత్తులవుతారు. పూర్ణాయువుతో ఉంటారు. వారి పాపాలు నశిస్తాయి. ఆనందం కలుగుతుంది.

ఎరుపు కొయ్య స్థంభము

ద్వారకామాయిలో ప్రవేశించగానే యెడమవైపునించి లైనులో వెడుతూ ఉంటే, యెడమవైపున చిన్న కొయ్యస్తంభం ఉంటుంది.ఇప్పుడు దాని చుట్టూ రక్షణవలయంగా సన్నటి స్టీలు రాడ్లు బిగించారు. దానినే "కవ్వ"మందురు. పొయ్యివద్దనున్న సమయమున దానిని పట్టుకొని కూర్చొనేవారు. భక్తుల నుండి తాను స్వీకరించిన పాపములను ఈ కవ్వముద్వారా విసర్జించేవారు. భక్తుల సర్వపాపములు పరిహారమయ్యేవి. భక్తులను పునీతులగావించేవారు. భక్తులు ఈతిభాధలను మరచి మానసిక విశ్రాంతిని సుఖశాంతులు పొందేవారు. వారి పాపకర్మలు ప్రక్షాళన మయ్యేవి. ఈ స్థంభమును తాకి శరీరమునానించి ధ్యానించిన సర్వరోగహరమగునని భక్తుల విశ్వాసము.

పొయ్యి

స్థంభము పక్కనే ఒక పొయ్యి కలదు. ఈ పొయ్యిపై తానే స్వయముగా వంటచేయుచూ ఉడికేగిన్నిలో తనచేతి నుంచి గరిటలా కలియబెట్టేవారు.ఆ ఆహరమును ఎక్కువుగా బీదలకు పెట్టేవారు.

కొళంబె

బాబా ఇంటిటింకి వెళ్ళి "అమ్మా, రొట్టే ముక్క పెట్టుము" అని బిక్ష యాచించేవారు. ఆ పదార్ధాలు అన్ని కొళంబె (మట్టిపాత్ర) వేసేవారు. పక్షులు,కుక్కలు,కాకులు,పిల్లులు తినినా అడ్డుచెప్పేవారు కాదు.మసీదు శుభ్రం చెసే అమ్మాయి 10 రొట్టేముక్కలు తీసుకొని వెళ్ళేది. బాబా ఏమి అనేవారు కాదు.

నీటికుండ

మసీదు నైఋతి మూలలో ధునికి ప్రక్కన ఒక మట్టికుండ కలదు. బాబా స్వయముగా నీరు తీసుకొని వచ్చి ఈ కుండలో పోసేవారు. అందులోని నీరు తాగడానికి, ముఖం కడుక్కోవడానికి వాడేవారు. భక్తులు ఈ కుండలో నీటిని "తీర్దముగా" భావించి స్వీకరించేవారు.దీనివలన సకల రోగాలు పోతాయని భక్తులు భావించేవారు. (యిదివరకు ఈ మట్టికుండలో నీరు భక్తులందరూ తాగడానికి వీలుగా ఉండేది.ఇప్పుడు యెలా ఉందో తెలియదు).

స్నానం చేసే రాయి

నాసిక్‌కు చెందిన రాంబాజి ఈ రాయిని తయారుచేసి ఇచ్చాడు. ఇతను బాబా లీలలు విని షిరిడికి వచ్చినాడు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదు. బాబా స్నానం చెసే నీటిని తీర్దముగా భావించి కొంచెం తాగి, కొంచెం తన మీద జల్లుకున్నాడు. ఇలా చెయ్యడం వలన అతని జబ్బు నయమయినది. బాబా మసీదులో తమ కాలు,చేతులు,ముఖము కడుకునేవారు తప్ప ఎక్కువుగా స్నానం చెసేవారు కాదు.

తులసి బృందావనము

మసీదులో బాబాను దర్శనమ చేసుకొని తిరిగి వచ్చేట్టప్పుడు హాలులో ఎడమ చేతివైపు కొంచెం ఎత్తులో తులసి కోట వుంది. హిందువులకు తులసి చెట్టు ఎంతో పూజ్యనియమైనది. మసీదు మరమత్తుల సమయము(1909-1912)లో కొంతమంది హిందు భక్తులు బాబా యొక్క అంగీకారముతో తులసి కోటని ఇక్కడ ప్రతిష్ఠించారు. మసీదులో తులసి కోట పెట్టడం హిందువులు, ముస్లిములు కలిసిమెలిసి వుండాలని బాబా ఉద్దేశం కావచ్చు.

 ఊది స్టాండు

ద్వారకామాయిలో ఊదిపాత్ర నున్న స్తంభానికి ఆనుకొని చెక్కతో చేసిన చిన్న పిట్టగోడలాంటిది ఉంది.బాబా ధునికి ఎదురుగా ఈ పిట్టగోడ వున్న దగ్గర కూర్చుని తన యెడమ చేతిని గోడమీద పెట్టి విశ్రాంతి తీసుకునేవారు. భక్తులు బాబా కుర్చొవడానికి వీలుగా ఒక పరుపును, బాలెసను సమకూర్చారు. ఇక్కడ కుర్చొని భక్తులని ఆశీర్వదించి ఊదీని పెట్టేవారు. విచారముతోనున్న వారెవరైనా ప్రేమతో తమ తలను ఈ గోడకు ఆనిస్తే ప్రశాంతత లభిస్తుంది.

బాబా కుర్చునే రాయి & రాయిమీద నున్న బాబా చిత్రపటము

ద్వారకామాయి తూర్పు దిక్కు వైపు వున్న గోడ మద్యలో బాబా పటము దాని కింద బాబా కుర్చునే రాయి ఉంటుంది. బాబా సజీవముగా వున్నఫ్పుడు ఈ రాయి మీద ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకొని, కుడికాలు యొక్క బొటన వ్రేలు కనిపించేటట్టు ఎడమ చేతిని కుడికాలు మీద పెట్టి కుర్చునేవారు. ఈ రాయి అంతక ముందు లెండిబాగ్‌లో ఉండేది. ఈ రాయి మీద అబ్దుల్లా మరియు అక్కడి ప్రజలు బట్టలు వుతికేవారు. బాబా అప్పుడప్పుడు ఆ రాయి మీద కుర్చోవడం చూసి గ్రామ ప్రజలు దానిని ద్వారకామాయికి తీసుకొని వచ్చారు. ఈ రాయి బాబా ఆసనము గుర్తుగా పాల రాతి పాదుకలు పెట్టారు.

మద్రాసుకు చెందిన డి.డి.నేరోయ్ బాబాకు గొప్ప భక్తుడు. ఇతను బాబా యొక్క చిత్రపటమును మరియు దాని కింద 11 బాబా సూత్రములను వ్రాసి అచ్చు వేయించినాడు. ఇతను అందమైన ఈ చిత్రపటమును గీసి కాము బాబా సలహతో సంస్థానము వారికి ఇచ్చినాడు. ఈ చిత్రమును సభామండపములో పెట్టవలసినదిగా కోరినాడు. బాబా ఈ చిత్రపటము ద్వారా భక్తులకు దర్శనము ఇస్తున్నారు.

పూజా స్తంభము

సం|| 1908లో ఒకరోజు పండరినుండి వచ్చిన కృష్ణజీ నూల్కర్ చావడిలో వున్నాడు. బాబా శ్యామతో "ఆ ముసలయ్య(నూల్కర్)ను ధునివద్ద స్తంభాన్ని పూజించుకొమ్మని చెప్పు" అని అతడు చెప్పి రాగానే, "మీరంతా గూడా చేసుకొరాదా!" అన్నారు సాయి. "దేవా! మీకైతే చేస్తాము గాని, స్తంభాన్నేందుకు పూజిస్తాము?" అన్నాడు శ్యామా. మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నూల్కర్ చూస్తే, నాడు(వ్యాస) గురుపూర్ణిమ! తాత్యా, దాదాకేల్కర్, శ్యామా మొ||న వారు సాయికి ధొవతులిచ్చి పూజించారు. అప్పటినుండి శిరిడిలో గురుపూర్ణిమ చేసుకొవడం ఆచారమైనది.

అయితే సాయి స్తంభాన్నేందుకు పూజించమన్నారు? భక్తుల శ్రేయస్సుకోరి మాత్రమే, 'గురువును సేవించు" అన్న భావాన్నే సంకేతముగా సాయి చెప్పారు. సాయి సద్గురువు. ఇంటికప్పును మోసే ఆధారం స్తంభము. అది నేలలో దృఢంగా నాటుకొని వుంటుంది. అదే దాని బలము. ఆ బలంతోనే అది ఆ భవనాన్నాశ్రయించే వరందరినీ రక్షిస్తుంది. అలానే సద్గురువు సర్వానికీ ఆధారమైన ఆత్మనిష్ఠలో, గురుభక్తిలో నాటుకొని వుంటారు. అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ఠవలన గురువు గూడ తమనాశ్రయించినవారిని రక్షిస్తారు -- స్తంభంలాగే! సాయి శరణానందులతో తాము మశీదులోని స్తంభం క్రిందనున్న గుహలో చాలాకాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు. ఆ స్తంభము క్రింద వెండి పాదుకలు ప్రతిష్ఠించారు.

పాదుకలు

మధ్యాహ్న ఆరతి తర్వాత, లెండీ బాగుకి వెళ్ళేముందు,సాయంత్రంపూట బాబా మశీదు ముందుగల మట్టిగోడకి ఆనుకుని నిలబడి దారినపోయే గ్రామస్తులను కుశలప్రశ్నలు వేసి పలకరిస్తూ ఉండేవారు. ఇక్కడ చిన్న మందిరములో సాయి పాదుకలని అమర్చారు. బాబా ముందుకు వంగి గోడ మీద చేతులు ఆనించినచోట మరొక జత చిన్న పాదుకలని అమర్చారు.

గోధుముల బస్తా

తిరగలి పక్కనే అద్దాల బీరువాలో గోథుమల బస్తా ఉంటుంది. బాలాజి పాటిల్ నేవాస్కర్ సాయిని నిష్కల్మషంగా సేవించిన భక్తుడు. తనకు పండిన పంటనంతా బళ్ళమీద తెచ్చి బాబాకి సమర్పించేవాడు. తరువాత బాబా యెంత ఇస్తే అంత తీసుకునేవాడట. ఇందుకు గుర్తుగా వారి కుటుంబ సభ్యులు కూడా బాలాజీ వంశీకులు నేటికీ సమర్పించే గోథుమల బస్తా యిక్కడుంచుతారు. సంవత్సరానికొకసారి శ్రీరామనవమినాడు ఉదయం ఆ బస్తాలోని గోథుమలు ప్రసాదాలయానికి తీసుకువెళ్ళిపిండిచేసెభక్తులకు ప్రసాదంగా పంచుతారు. మళ్ళీ ఆ స్థానంలో కొత్త గోథుమల బస్తా ఉంచుతారు. ఈ గోథుమలు సంవత్సరకాలం నిలవ ఉన్నాకూడాయే జాగ్రత్తలూ తీసుకోకపోయినా పురుగు పట్టడంచెడకపోవడం విసేషం.

గంట

మశీదులో ప్రవేశించాక యెడమ ప్రక్కన పైభాగములో పెద్ద యిత్తడి గంట వుంటుంది. యిది సాయికాలము నుంచి ఉంది. దీనిని రోజుకు 3 సార్లు మోగిస్తారు, ఉదయము 4.30 గం||లకు, 11.30 గం||లకు మరియు రాత్రి 8.30 గం||లకు.అప్పుడు భక్తులందరు ఆరతికి వస్తారు. పైన చెప్పిన సమయములో కాకుండా వేరే సమయములో గంట మోగితే బాబాకు ఏదైనా కష్టము కలిగిందేమోనని భక్తులందరు ద్వారకామాయికి పరిగెత్తుకుని వస్తారు.

చిలుము

ద్వారకామాయిలో తిరుగలి వున్న ప్రదేశములో ఒక గూటి కలదు.అందులో బాబా తాను పీల్చే చిలుమును పెట్టేవారు. బాబాకు చిలుము పీల్చే అలవాటు బాగా ఉండేది. బాబా చిలుమును పీల్చి తన దగ్గర భక్తులకు ఇచ్చేవారు. ఆ సమయములో బాబా విభిన్న కధలు భక్తులకు చెప్పేవారు. G.S.ఖాపర్డే తన డైరిలో ఇలా వ్రాసుకున్నారు."ఒకసారి బాబా నాకు చిలుము గొట్టం ఇచ్చి పీల్చమన్నారు. అలా పీల్చడం వలన నాకున్న సమస్త సందేహాలు పోయినాయి." బాబా ఈ చిలుమును రోగాలను పొగొట్టడానికి ఉపయోగించేవారు. బాబా భక్తుడైనా హరిభావు క్షయరోగముతో భాదపడుతుండేవాడు. బాబా అతనికి చిలుమును ఇచ్చి పీల్చమన్నారు. అతనికి క్షయరోగము తగ్గింది. ఇప్పుడు ఆ చిలుము గొట్టాలు మసీదులో లేవుగాని వాటిని ప్రదర్శనశాలలో భక్తుల సందర్శనార్దము ఉంచబడినది.

ధునికి ఎదురుగా వున్న బాబా చిత్రపటము

ఈ తైలవర్ణ చిత్రమును ప్రముఖ చిత్రకారుడైన శ్యామరావ్ జయకర్ చిత్రించాడు. మొరేశ్వర్ ప్రధాన్ భక్తుడు, జయకర్‌ను షిరిడికి తీసుకొనివచ్చి బాబా చిత్రములు రెండు గీయవలసినదిగా కోరినాడు. జయకర్ బాబాను దర్శించినప్పుడు, బాబా ఈ విదముగా చెప్పినారు "ఔర్ బనావో జ్యాదా బనావో, మై గల్లి గల్లిమే రెహనేవాలా హూం". బాబా ఆజ్ఞమెరకు రెండుకంటె ఎక్కువ చిత్రములు గీసినాడు. బాబా మహసమాధి చెందిన తరువాత సంస్థాన్‌వారు ఈ చిత్రమును బాబా ఎప్పుడు కుర్చుండేచోట పెట్టినారు.

పులి:

బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు బాబా సముఖమునకు ఒక విచిత్ర సంఘటన జరిగినది. నాటు బండిపై ఇనుప గోలుసులతో కట్టబడిన ఒక పులిని తీసుకొని మసీదు ముందుకు తెచ్చిరి. దానిని ముగ్గురు దర్వీషులు పెంచుకొనుచు ఊరుర త్రిప్పి దానిని ప్రదర్శించి డబ్బులు సంపాదించుకొనుచుండిరి. అదే వారి జీవనోపాధి. ఆ పులి జబ్బుతో బాధపడుచుండుటచే ఎన్ని ఔషధములు వాడినను ప్రయోజనం లేకపోయింది. బాబా కీర్తిని విని వారు దానిని షిరిడి తీసుకోని వచ్చి బాబా సముఖమున యుంచి ఈ విషయమంతయు బాబాకు చెప్పుకొనిరి. పులి బాబా వంక తేరిపార చూచినది. బాబా కాంతికి తట్టుకొనలేక తలవాల్చి తన తోకను మూడు సార్లు నేలపై కొట్టి భయంకరముగ గర్జించుచు క్రిందపడి చచ్చినది. అది తన అంత్యకాలమున బాబా సముఖమున వారి పాదాల చెంత ప్రాణములు విడుచుట దాని పూర్వజన్మ పుణ్యము.అలా దాని బాకి తీరిన వెంటనే బాబాను చేరి సద్గతి పొందింది. దానిని శివాలయం మందిరము ఎదురుగా పాతిపెట్టమని దర్వీషులుకి చెప్పారు. అక్కడే దాన్ని గుర్తుగా పులి బొమ్మని పెట్టారు.

తాబేలు:

ద్వారకామాయి హాలు మధ్యలో చిన్న తాబేలు పాలరాతి విగ్రహం వుంది. ద్వారకామాయిలో హారతి ప్రారంభించుటకు ముందు శ్యామ్‌కర్ణను బాగా అలంకరించి ప్రస్తుతము తాబేలు ఉన్న ప్రాంతములో ఉంచేవారు. హారతి జరుగుచున్నంత వఱకు శ్యామకర్ణ అక్కడే నిలబడి హారతి పాటకు అణుగుణముగా లయానుసారముగా శిరస్సు నూపుచు కాళ్ళు ఆడించేది. భక్తులు దానికి ఇరువైపుల నిలబడి ఆరతి పాడేవారు. హారతి పూర్తికాగానే ద్వారకామాయి తనముందు కాళ్ళను వుంచి బాబాకు వంగి నమస్కరించేది. ఈ స్థలములోనే బాబా కుర్చునే రాయి వుండేది.సంస్థాన్ వారు ఆ రాయిని భక్తుల సందర్శనార్ధం వేరే స్థానములో పెట్టారు. ఆ రాయి గుర్తుగా తాబేలు పాలరాతి విగ్రహం ఉంచారు. హిందువుల పురణాలు ప్రకారం శ్రీహరి తాబేలు రూపములో ఈ భూమండలాన్ని తన వీపు మీద మోసారు.

గుఱ్ఱము(శ్యామ్కర్ణ):

ముస్లిమ్.సత్కార్ వాయిసతారా నివాసి. యితనివద్ద పిల్లలు పుట్టనిది అయిన ఒక గుఱ్ఱము ఉన్నది. ఒకసారి ఇతను షిరిడిలో బాబాను దర్శించినపుడు బాబా ఇతనితో "నీ దగ్గరయున్న గుఱ్ఱమునకు పిల్లలు పుడితే నాకు యిస్తావా" అని అడిగారు. బాబా ఆశీస్సులతో గొడ్డుదైన ఆ గుఱ్ఱము సవంత్సరములోపే ఈనింది. మూడవనెలలో ఆగుఱ్ఱపు పిల్లను సత్కారు షిరిడి తీసుకొనివచ్చి బాబాకు యిచ్చాడు. ఆగుఱ్ఱపు పిల్లపేరే శ్యామకర్ణ. దాని సంరక్షణ భాద్యతను తుకారాం అనే భక్తునకు బాబా ఒప్పగించారు. ఒకసారి తుకారాం ఎంత బ్రతిమాలినా అది పచ్చగడ్డి మేయలేదు. మొండికేసింది.అలా తర్ఫీదు యిస్తూ అది మొండికేసినప్పుడు తుకారాం దీని వీపుపై కొట్టాడు. బాబా తుకారామును తనవద్దకు పిలిపించుకుని "తుకారాం! నా వీపు మీద ఎందుకు కొట్టావ్" అని తన కఫ్నీని పైకెత్తి తన వీపు మీదనున్న దెబ్బల గుర్తును చూపించి, ఆ శ్యామ్‌సుందరుని కొట్టితే నన్ను కొట్టినట్లేనని అతను గుఱ్ఱమును కొట్టిన దెబ్బలే అవియని తెలియచెప్పి ఏ ప్రాణిని హింసించిన తనను హింసించినట్లేనని గుర్తింపు చేసి తాని "విశ్వరూపుడనని" బాబా ఋజువు చేసిరి.

బాబా అనుగ్రహమునకు పాత్రమైన ఈ శ్యామకర్ణ 1945లో మఱుజన్మ లేకుండానే బాబా పాదముల చెంత చేరి సద్గతి పొందినది. దీని భౌతికదేహమును బాబా తఫొవనమైన లెండి తోటలో దత్తాత్రేయ విగ్రహమునకు వెనుక సమాధి చేయబడినది. షిరిడి దర్శించు భక్తులు ఈ సమాధిని దర్శింతురు. దాని విగ్రహమును ద్వారకామాయి ముందు గల షెడ్‌లో భక్తులు దర్శించుకొనుటకు ఏర్పాటు చేయబడినది.

స్టోరెజ్ హాలు

మసీదుకు రెండు వైపుల ఒక గది ఉండేది.అందులో ఒక గదిని ఊరేగింపునకు ఉపయోగించే పల్లకిని వుంచేవారు. మరొక గదిలో పండగ రోజులలో ఉపయోగించే రధమును వుంచేవారు. 1918 సం||లో గురుపౌర్ణమినాడు బాబా భక్తుడైన M.B.రేగే ఈ రధమును బాబాకు సమర్పించుకున్నాడు. 1999 సం||లో మసీదు పొడగించడానికి రధమును ప్రదర్శనశాలలో వుంచారు. రధమున్న గదిలో కట్టెలు మరియు ఊదిని భద్రపరుస్తున్నారు. ఈ గది తులసికొట ఈశ్యానమున వుంది.

దక్షిణ హుండి

1909 వరకు బాబా ఎవరిని దక్షిణ అడిగేవారు కాదు.ఎవరైన నొక కాని గాని రెండు కానులుగాని ఇస్తే వానితో నూనె,పొగాకు కొనెడివారు. బాబా కొంతమంది భక్తులవద్ద దక్షిణ అడిగేవారు. దక్షిణ ఇచ్చుటకు ఇష్టపడేవాళ్ళ దగ్గరే బాబా తీసుకొనేవారు, తమ ఇష్టమునకు వ్యతిరేకముగ ఎవరైనా ఇస్తే బాబా దానిని ముట్టేవారు కాదు.ఎవరైన దక్షిణ తమ ముందుంచినచో దానికి తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా యడిగే దక్షిణ పెద్ద మొత్తములుగాని చిన్న మొత్తములుగాని భక్తుల కోరికలు, భావము,వసతి బట్టీ యుండును.

తాము అడిగినను దక్షిణ యియ్యనివారిపై బాబా కోపించి యుండలేదు. ఎవరు ద్వారానైన భక్తులు దక్షిణ పంపినచో, తెచ్చిన వారు దానిని మరుచునప్పుడు, వారికి దానిని గూర్చి జ్ఞప్తికి దెచ్చి, ఆ దక్షిణను పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణనుంచి కొన్ని రూపాయలు తిరిగి యిచ్చి పూజలో పెట్టుకొనమనెడివారు.దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయొజనము గనిపించుచుండెను. దక్షిణరూపముగా వసూలయిన పైకమునుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు, ధుని కొరకు కర్చు పెట్టుచుండిరి. మిగతదానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరుచుటకు బాబా దక్షిణ యడుగుచుండెను. కాని ఇందులో నొక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొనుదానికి వందరెట్లు తిరిగి యివ్వవలసి వచ్చుచుండెను. దీనికొక యుదాహరణము, గణపతిరావు బోడస్‌యను ప్రముఖ నటుడు, తన మరాఠీ జీవితచరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితి ననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు యెట్టిలోటు లేకుండెననియు వ్రాసెను.

ద్వారకామాయి జెండాలు

శ్రీ సాయిబాబా భక్తులలో గోపాల్రావ్‌గుండు,దామూ అన్నా కాసార్ అను వారిరువురు కలరు. వీరిరువురికిని ఇద్దరేసి భార్యలున్ననూ సంతానము మాత్రము కలగలేదు. చివరికి వారిరువురునూ బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానమును పొందిరి. ఆ సంతోషములో గోపాల్రావ్ శిరిడిలో యొక ఉత్సవమేదైననూ చేయవలెనని సంకల్పించెను. ఈ ఉత్సవమునకు గాను, ఒక జెండా నిచ్చుటకు దామూఅన్నాకాసార్‌కు పురమాయించెను. అతడంగీకరించెను.అట్లే, నానాసాహెబ్ నిమోన్‌కర్ కూడా తానొక నగిషీ జెండా నిచ్చుట కంగీకరించెను. ఉత్సవము శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయమైనది. ఈ రెండు జెండాలను ఉత్సవములో ఉరేగించిన పిమ్మట ద్వారకామాయి పైకప్పు మీద అలంకరిస్తారు.

ఇప్పటికి దాము అన్నా మరియు నిమోన్‌కర్ వంశస్థులు శ్రీరామనవమి ఉత్సవమునకు జెండాలను ఇస్తున్నారు. మొదట జెండాలను తీసుకొనివచ్చి సమాధి మందిరములో పెడతారు. ఆరతి జరిపిన తరువాత, ఆ జెండాలను తుకారామ్ ఇంటికి తీసుకువచ్చి ఆరతి జరుపుతారు. తరువాత గొప్ప ఉరేగింపుతో గ్రామమంతా తిరిగి చివరకు ఆ జెండాలను ద్వారకామాయి మీద అలంకరిస్తారు.

శ్యామ్ సుందర్ హాలు

బాబా సజీవముగా వున్నప్పుడు ద్వారకామాయి ఇరువైపుల అనేకమైన షెడ్‌లు ఉండేవి. ఆ షెడ్‌లు వున్న స్థలములోనే ఇప్పుడు సంస్థానము వుంది. అందున్న ఒక షెడ్‌లో బడి ఉండేది. బాబా ముఖ్య భక్తుడైన మాధవరావు దేశపాండే (శ్యామా) అందులో టీచరుగా పనిచేసేవాడు. శ్యామా చెప్పిన దాని ప్రకారము “ఆయనపై నాకు విశ్వాసముండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని. మశీదులో బాబా ఒక్కరే వుండేవారు. బడి కిటికీనుంచి మశీదు కనిపించేది. అందరూ పిచ్చి ఫకీరనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తుండేవాడిని. అప్పుడప్పుడు మశీదు నుండి ఇంగ్లిషు, హిందీ మొదలగు భాషలలో ఎవరో మాట్లాడటం వినిపించేది. అది బాబాయే అయివుండాలి, కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కల్గింది. "

బాబా సంస్థానము అభివృద్దికి కారణమైన ముఖ్య భక్తురాలు రాధాకృష్ణమాయి ఇంకొక షెడ్‌లో వుండేది. బాబా మొదటిగా షిరిడికి వచ్చిన భక్తులను పరిక్షీంచడానికి రాధాకృష్ణమాయి బడికి దగ్గరకి పంపించేవారు. అబ్దుల్ బాబా కొంతకాలం ఇక్కడ వున్నాడు. ఔరంగాబాద్‌కి చెందిన సకారామ్ భార్యకు 27 సంవత్సరములైనా సంతానము కలుగలేదు. బాబా ఆశీస్సులతో వారికి ఒక బిడ్డ జన్మించాడు. సకారామ్ సంతోషముతో రూ 500/- బాబాకు సమర్పించుకున్నాడు. ఆ డబ్బుతో గుర్రము(శ్యామ్ సుందర్)కి ఒక షెడ్ నిర్మించారు. 1999 సం|| తరువాత షెడ్‌ని తీసి పారాయణము హాలుగా మరియు స్టొరేజ్ హాలుగ అభివృద్ది చేసారు. ఈ పారాయణ హాలు ఉదయం 5 గం||ల నుండి రాత్రి 8 గం||ల వరకు తెరిచే వుంటుంది.

కొక్కాలు

నింబారు ముందుగా మశీదు పైకప్పు దూలాలకు రెండు కొక్కాలు కనిపిస్తాయి. నానాసాహెబు డేంగలే యనువారు బాబా నిద్రించుటకై నాలుగు మూరల పొడవు - ఒక జానెడు మాత్రమే వెడల్పునుగల కఱ్ఱబల్లను తెచ్చిరి.బాబా దానిని నేలపై వేసుకొని పరుండుటకు బదులు, ఉయ్యాలవలె పాతగుడ్డ పీలికలతో మసీదు దూలాలనున్న కొక్కాలకు వ్రేలాడకట్టి నాలుగ వైపుల ప్రమిదలనుంచి దానిపై నిద్రించుట ప్రారంభించారు. ఆ పలుచని పాతగుడ్డ పీలికలు బల్ల బరువును మొయుటయే చిత్రము కాగా, దానికి తోడు బాబా బరువును కూడా భరించుట మరింత విచిత్రము. ఆజానుబాహులైన బాబా- కాళ్ళు చాపి పడుకొనినచో ఏ మాత్రమును చాలని నాలుగు దీపములా ! అందుకే హేమడ్‌పంతు "బాబా బల్లపై పడుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతము చూసి తీరవలసిందేనని వర్ణించియున్నాడు."

అగరుబత్తి స్టాండు

చెక్కతో చేయబడిన చిన్న అగరుబత్తి స్టాండు ద్వారకామాయి ప్రవేశద్వారం దగ్గర కుడివైపున ఉంటుంది. సాయి మధ్యాహ్న ఆరతి అయిన తరువాత ఈ అరుగుమీద కూర్చుని భక్తులకు ఊది ప్రసాదించేవారు.

నింబారు

మసీదులో పడమటి గూటిని నింబారు అంటారు. ప్రతి మశీదులో నింబారు అనేది సాంప్రదాయానుసారముగా నిర్మించేవారు. కాని దీపస్తంభాలు బాబానే ఇక్కడ పెట్టారు. ద్వారకామాయిలో నింబారు, బాబా ఎప్పుడు కుర్చునేచోట దగ్గరలో వుంది కాబట్టి ఇక్కడ పూలమాలను వ్రేలాడగట్టేవారు.

మధ్యాహ్న భోజనసమయమున బాబా నింబారు దగ్గర దక్షిణదిశగా కుర్చోని భోజనము చేసేవారు. ఇరువైపుల భక్తులు కుర్చునేవారు. రాత్రి సమయములో నింబారు వైపు తలపెట్టుకొని నిద్రించేవారు. బాబాకు ఒకవైపు తాత్యా, మరొకవైపు మహల్సాపతి నిద్రించేవారు. బాబా అప్పుడప్పుడు కొంతమంది ముస్లిములతో కలిసి ఇక్కడ నమాజు చేసేవారు. షిరిడి నుంచి 50 కి.మీ దూరములో సంగమనేరు గ్రామము కలదు. బాబా మతవిరుద్దముగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది ముస్లిములు మతపెద్దలకు ఫిర్యాదు చేసినారు. వారు బాబాను విచారించుటకు సంగమనేరు నుంచి మశీదుకు వచ్చినారు. ఆ సమయములో బాబా ఆవుపేడతో మశీదు నేలపై అలుకుతున్నారు. బాబా వారు అడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానము చెప్పినారు. మధ్యాహ్న సమయము కావడముతో తనతో పాటు నమాజు చెయ్యమని వారికి సలహ ఇచ్చినారు. అక్కడ మశీదు నేల తేమగా వుండటము చూసి తమ తెల్లని బట్టలు పాడవుతాయని సంకొచించసాగారు. బాబా వారితో ఈ విదముగా పలికారు "మన మనసుని పవిత్రముగా వుంచుకొని నమాజు చెస్తే ఎలాంటి మురికి మనకు అంటదు". వారికి వేరే అవకాశము లేనందువలన బాబాతో పాటు నమాజు చేసిరి. ఆశ్చర్యముగా వారి బట్టలకు ఎలాంటి మురికి అంటలేదు. వారు బాబాను గొప్ప సాధుసత్పురుషులని అంగీకరించారు.

వెండి పాదుకలు

 బాబా మహసమాధి తరువాత శ్యామా దీక్షిత్‌వాడాలో వుండేవాడు. సంస్థానము ఏర్పడిన తరువాత వారు శ్యామాను వుంటున్నందుకు అద్దె కట్టమని అడిగారు. శ్యామా అక్కడనుంచి వెళ్ళిపోతూ జయకర్ గీసిన చిత్రము మరియు వెండిపాదుకలు తనతో పాటు తీసుకొనివెళ్ళాడు. సంస్థానము వారు బాబా పాదుకలు,చిత్రపటము తిరిగి ఇవ్వవలసినదిగా కొరారు కాని శ్యామా ఒప్పుకోలేదు. ధుమాల్ ఉత్సవముతో వెళ్ళగా, శ్యామా బాబా వస్తువులన్ని వారికి ఇచ్చినాడు. వెండిపాదుకలు మరియు బాబా చిత్రపటము ద్వారకామాయిలో ఉంచినారు. ప్రతిరోజు ఇక్కడ ద్వారకామాయి పూజారి పూజ చేస్తారు. సమాధి మందిరములో వున్న పూజారి మధ్యహ్నా 11.30 గం||ల నుండి 12.00 గం||ల సమయములో ఈ పాదుకలను అలంకరిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ పాదుకలకు వంగి నమస్కరిస్తారు.