సమాధి మందిరము

Samadhiసమాధి మందిరము:-

1912లో నాగపూర్ నివాసియగు బాపుసాహెబ్‌గోపాలరావు బూటీ దీక్షిత్ వాడలో నిద్రించుచుండగా బాబా స్వప్నములో కనిపించి "ఒక వాడను మందిరముతో నిర్మింపమని" చెప్పినారు. 1918 సం||నకు ఆ మందిరము తయారయింది. అక్కడ మురళీధరుని విగ్రహం ప్రతిష్ఠించాలని బూటీ అనుకున్నాడు. కాని బాబా అనుమతించలేదు. బాబా ద్వరకామాయిలో అంతిమశ్వాస విడుస్థు "నన్ను ఆ రాతిమేడలో ఉంచండి" అన్నారు. అందుకే వారి సమాధి అక్కడ ఏర్పడింది. సమాధి మందిరములో ముత్యంలా బాసించే శ్రీ సాయి మూర్తిని 1954వ సం||లో విజయ దశమినాడు ప్రతిష్ఠించారు.

బాబా అభయవాక్యాలు తన భక్తులకు చెప్పినారు. "నా భౌతిక దేహనంతరము నేను అప్రమత్తుడనే" అని బాబా అభయ ప్రదానమిచ్చినారు. దాము అన్నా బాబాతో బాబా!మీరు భౌతికదేహము విడిచిన పిమ్మట నాగతి ఏమి? అని ప్రశ్నించగా "ఎక్కడైనను, ఎప్పుడైనను నా గురించి ఆలోచించినచో నేనక్కడనే యుండెదనని బాబా చెప్పినారు. సమాధి చెందినప్పటికి నా సమాధి నుండి నా యెముకలు మట్లాడును. నేను మీ వద్ద యుండనేమోయని మీరాందోళన పడవద్దు. నా యెముకలు మట్లాడుచూ మీయోగక్షేమములు కనుగొనుచుండును.

బాబా చెప్పెవారు "నా భక్తుడు ఎన్ని వేల కిలోమీటరులు దూరములోనున్నా పిచ్చుక కాలికి దారంకట్టి లాగినట్టు నా దగ్గరికి లాక్కుంటాను". అలా ఎంతో మందిని తన వద్దకు పిలిపించుకుంటున్నారు. బాబాను చూడాలనే రోజు కొన్ని వేలమంది భక్తులు షిరిడికీ వస్తుంటారు.వారి ప్రయాణము షిరిడిలోనున్న బాబా మూర్తిని, సమాధిని దర్శించడముతో ముగుస్తుంది. మాములు రోజులలో బాబాను దర్శించడానికి క్యూలైనులో 2 లేక 3 గంటలు సమయము పడుతుంది.పండుగ దినములలో ఈ క్యూలైను ఆలయము బయట కొన్ని మీటర్ల దూరము వరకు వుంటుంది. భక్తులు "సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కీ జై " అంటూ నినాదాలు చేస్తూ సమాధి మందిరములోకి ప్రవేశిస్తారు. ఇక్కడ రెండువైపుల క్యూలైను వుంటుంది. ఒకవైపు వెళ్ళితే బాబా శిరస్సును తాకవచ్చు. పాదాలు వున్నవైపు వెండిపాదుకలున్నాయి, వాటిని మరియు సమాధిని తాకవచ్చు. బాబాను దర్శించేటప్పుడు కొంతమంది బాబాకు గులాబీ పూలను,స్వీట్స్, పళ్ళు, శాలువాను సమర్పిస్తారు. కొంతమంది పారాయణము పుస్తకములను, చిన్న బాబా విగ్రహాలను, కీచైనులను, శాలువాను బాబాకు తాకించి ఇంటికి తీసుకొని వెళ్ళతారు.

సమాధి మందిరములో బాబాకు ఉదయం వెన్న నివేదించి 4:30 గం||లకు ఆరతి యిస్తారు. తరువాత పాలతో అభిషేకము చేసి వేడినీటితో స్నానము చేయించుతారు. తరువాత నూతన వస్త్రములు కట్టి నైవేద్యం సమర్పిస్తారు. మధ్యాహ్న 12గం||లకు, సాయంత్రము 6గం||లకు వస్త్రములు మార్చి కీరీటము పెట్టి మహరాజులాగ కొలువైనున్న సాయికి ఆరతి ఇస్తారు. మధ్యాహ్నా బాబాకు భోజనము పెడతారు. రాత్రి తెల్లని శాలువాను కట్టి ఆరతి యిచ్చాకా దోమతెర వేసి, గ్లాసుతో నీరు పెట్టి నిద్రపుచ్చుతారు.

బాబా పాలరాతి విగ్రహమును ప్రతిష్ఠించుట:-

షిరిడి సంస్థానము వారు బాబా విగ్రహమును తయారుచేయుంచుటకు బొంబాయి నుండి "తాలిమ్" అనే శిల్పిని పిలిపించారు. అతనికి బాబా పటములలోని వివిధ కోణములు పరిశీలించినను బాబా శిల్పము చెక్కుట కుదరలేదు. అతను సాయిబాబాను ప్రార్ధించాడు. ఆరోజు రాత్రి సాయిబాబా ఇతనికి స్వప్నములో కనుపించి "నా రూపమును మరల మరల చూడవలెనన్న సాధ్యము కాదు జాగ్రత్తగా చూచుకో" అని తనరూపమును తాలిమ్‌కి చూపి బాబా తన విగ్రహమును చెక్కించుకున్నారు. బాబాయే స్వయముగా తనరూపము చూపి చెక్కించుకున్నందున సాయిబాబాకు సమాధిమందిరములోని ఈ సాయి విగ్రహమునకు బేధములేదు. ఇటాలియిన్ పాలరాతి బాబా విగ్రహమును 5-"5" ఎత్తున ఇతను చెక్కినాడు. సమాధి వెనుకయున్న బాబా చిత్తరువును తొలగించి ఈ పాలరాతివిగ్రహమును సమాధివెనుక ది 7-10-1954న శ్రీస్వామి శరణానంద ప్రతిష్ఠచేసిరి.

బాబా నిలువెత్తు పాలరాతి విగ్రహము సమాధివెనుక కాలుపైకాలు వేసుకొని కూర్చుని వెండిసింహాసనముపై ఆసినులైనట్లు మనకు కనిపించును. ఈ సాయిబాబా విగ్రహము జీవముతో తొణికసలాడుచు బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచూ కరుణారసము జాలువారునట్లు మనకు స్పురించును. సాయిసమాధి చలువరాతితో కట్టబడి యున్నది. విగ్రహమునకు చత్రము అమర్చబడి యున్నది. అభిషేకసమయమున వృద్దునిగా కనిపించు బాబా, వస్త్రములు,పూలు, కిరీటముల అలంకరణతో రాజాధిరాజుగా మనకు దర్శన మిచ్చుచున్నారు బాబా. బాబాకు దక్షణపు ప్రక్క బాబాపాదుకలు అమర్చిరి.