చావడి

Chavadiచావడి అంటే గ్రామప్రజలు సమావేశమయ్యే ప్రదేశము, ప్రభుత్వకార్యాలయము లేదా గ్రామమునకు సంబందించిన దస్తావేజులు భద్రపరిచే ప్రదేశము. బాబా మహాసమధి చెందిన తరువాత సంస్థానము వారు ఈ ప్రదేశమును సంపాదించి ఇందులో పుస్తకములు భద్రపరచడానికి మరియు యాత్రికుల వసతికి ఉపయోగించారు. 1930 సం|| తరువాత చావడిని బాబా గుడిగా తీర్చిదిద్దారు.

ఒకరోజు పెద్ద వర్షమొచ్చి, మశీదంతా తడిసిపోయీ, బాబాకు కూర్చునేందుకు చోటుగూడ లేకపోయింది. భక్తులాయనను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి బాబా అక్కడ విశ్రమించారు. అప్పటినుండి బాబా ఒక రాత్రి మసీదులోను, ఒకరాత్రి చావడిలోనూ నిద్రించేవారు.

బాబా ఎప్పుడైతే చావడిలో నిద్రించడం మొదలుపెట్టారో అప్పటినుండి శేజారతి ఇవ్వడం మొదలుపెట్టారు.తరువాత బాబా చావడిలో నిద్రనుంచి మేల్కొనగానే కాకడ ఆరతి ఇచ్చేవారు. మసీదు మరమత్తులు చేసిన తరువాత మధ్యాహ్న ఆరతి మరియు సంధ్య ఆరతి మొదలుపెట్టారు.

బాబా భక్తుడైన అన్నాచించినీకర్ దంపతులకి 50 సం||లు దాటినా సంతానము కలుగలేదు. ఒకనాడు శ్యామా, "బాబా! నీవెందరి కోరికలో తీరుస్తున్నావుగాని, వీరింతగా సేవిస్తున్నా ఒక్క బిడ్డను గూడ ప్రసదించవేమి?" అన్నాడు. బాబా నవ్వి, "నన్ను నిజముగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా వున్నానా? ఏమి తెలియనివాడిలా మట్లాడతావేం? వీరేమి అడగలేదు. వీరికి కొడుకును ప్రసాదించినా ఒక్క తరంకంటే వీరి వంశం నిలవదు. అంతకంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ట ప్రసాదిస్తాను" అన్నారు. ఆయన భావమెవరికీ అర్దంకాలేదు. అన్నాకొక కోర్టు వ్యాజ్యం 3 సం||లు నడిచింది. కొద్ది నెలలు తరువాత కోర్టువారు అన్నాకు అనుకూలముగా రూ. 1800/- లకు డిక్రీ చేసారు. అన్నా ఆ పైకమంతా చావడి మరమత్తుకు వినియోగించాడు. అందుకే అక్కడ, 'లక్ష్మీబాయి దామోదర్ బాబరే" అని ఆ దంపతుల పేర్లుంచారు.

గుజరాత్‌లోని నౌసరి గ్రామమునకు చెందిన అంబారామ్ చావడిలోనున్న పెద్ద బాబా చిత్రపటమును గీసినాడు. 1953 సం||లో బాబా అతనికి కలలో దర్శనము ఇచ్చి చిత్రపటమును తాకి అతనిని ఆశీర్వదించారు. అప్పటికి అంబారామ్ వయస్సు 18 సంవత్సరములు. నౌసరి గ్రామప్రజలు చందాలు వసూలు చేసి బాబా చిత్రపటమును కొని షిరిడికీ తీసుకొని వచ్చిరి.

బాబా చిత్రపటము ఎడమవైపు 4 అడుగుల ఎత్తుగల కొయ్యబల్ల వుంది. బాబా చనిపోయిన తరువాత ఈ కొయ్యబల్లపై బాబా దేహమునకు స్నానము చేయించబడినది. ప్రతి గురువారము ఆ కొయ్యబల్ల బయటకితీసి దాని మీద ఉరేగింపుతో తీసుకొచ్చిన పల్లకీనుంచుతారు. అక్కడే చిన్న చక్రముగల కుర్చి వుంది. బాబా ఉబ్బసముతో బాధపడుతున్నప్పుడు భక్తులు సమర్పించుకున్నారు.కాని బాబా దానిని ఎప్పుడు వాడలేదు. చావడి కుడివైపు భాగమున బాబా కాలుమీదకాలు వేసుకున్న చిత్రపటము వుంది. చిత్రపటము చుట్టూ వెండితాపడము చేసి వుంది. ఈ చిత్రపట్టాన్ని పల్లకి ఊరేగింపుతో మసీదు నుంచి చావడికి తీసుకొనివస్తారు. ఇందులో కేవలము పురుషులకు మాత్రమే ప్రవేశము ఆడవాళ్ళకు ఇక్కడ ప్రవేశము లేదు. ఈ ఆచారము బాబా వున్నప్పుడు నుంచి జరుగుతుంది.

చావడి తెరిచి ఉండే సమయము 04.00 A.M - 9.00 P.M.

చావడి ఉత్సవము:-

Chavadiutsavamచావడి ఉత్సవములో మశీదంతా దీపాలతోనూ,తోరణాలతోనూ కళకళలాడుతుండేది. దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలకరించిన శ్యామకర్ణ(గుఱ్ఱం) నిలబడేది.తాత్యా వచ్చి బాబాను లేవదీసాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో సట్కా, చేతిలో చిలుముగొట్టం,పొగాకూ తీసుకుని, భుజానికి పాతగుడ్డ వేసుకునేవారు. బాబా అడుగు ముందుకువేసి, కుడికాలుతో ధునిలో కట్టెలు సర్ది, కుడిచేతితో అక్కడున్న దీపమార్పి బయల్దేరేవారు. వెంటనే భక్తులెంతో వుత్సాహంగా మేళతాళాలు మ్రోగించేవారు. వివిధకాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు. కొందరావేశముతో నృత్యం చేసేవారు. కొందరు జండాలు, ధ్వజాలు మోసేవారు. భక్తులు చామరములతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు. తాత్యా ఒక చేత్తో లాంతరు, మరొక చేత్తో బాబా ఎడమచెయ్యి పట్టుకునేవాడు. కుడిచెయ్యి మహల్సాపతి పట్టుకుని, తర్వాత విడిచి సాయి దుస్తుల అంచులు పట్టుకొని నడిచేవాడు. జోగ్ అయనకు చత్రం పట్టేవాడు. ఆయన ముందు శ్యామకర్ణ, వెనుక భక్తులు, సేవకులు, వాద్యగాళ్ళు నడిచేవారు.

బాబా తమ కుడిచెయ్యి క్రిందకి, పైకీ వూపి వింతైన భంగిమలు చేసేవారు. కాకాసాహెబు వెండి పళ్ళెంలో గులాల్ పూసిన పూలు తెచ్చి అయనపై చల్లుతుండేవాడు. అప్పుడు వాద్యఘోష ఆకాశాన్నంటేది. దానిని స్వయముగా చూచిన హేమాద్‌పంత్, "ఆ దృశ్యము, దాని వైభవము వర్ణించ సాధ్యంకాదు" అని వ్రాశాడు. సాయి చాల నెమ్మదిగా నడిచేవారు. అలా ఊరేగింపు చావడి చేరేది. "ఆ రోజులు గడిచిపోయాయి. ఇపుడు గాని, యిక ముందుగాని అలాంటి ఉత్సవమెవరూ చూడలేరు. అయిన దానిని స్మరించి మనం కొంతవరకూ తృప్తి పొందవచ్చు" అంటాడు హేమాద్‌పంత్.

సాయంత్రము 7.30 గం||లకు బాబా సట్కా,పాదుకలు సమాధి దగ్గర వుంచి ఊరేగింపుతో 9.00 గం||లకు చావడికి తీసుకొని వస్తారు. ఆ సమయములో సమాధి మందిరములో పాదుకలు తాకడానికి చాలామంది భక్తులు వస్తారు ఎందుకంటే ఊరేగింపులో వాటిని తాకనివ్వరు. రాత్రి 9.15 గం||లకు బాజాభజంత్రీలతో, చిన్న పిల్లల నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ, భక్తుల జయజయకారాలతో ఉరేగింపుతో తీసుకొని వెళ్తారు. ఊరేగింపులో బాబాకి అత్యంత ఆప్తుడైన భక్తుడు తాత్యాకోతేపాటిల్ మునిమనవడు బాబా చిత్రపటమును పట్టుకునేవారు. సంస్థానములో పనిచేసే సేవకులలో ఒకరు సట్కా,పాదుకలు తీసుకొనివెళ్ళేవారు. మిగతావారు మహారాష్ట్ర పద్దతిలో ఎరుపు వస్త్రాలు ధరించి వెనుకాలా నడిచేవారు. చాలా మంది భక్తులు ఈ ఉత్సవమును దర్శించడానికి వీధులలో ఎదురుచూచేవారు. పల్లకి రాగానే అందరు 'సచ్చిధానంద సద్గురు సాయినాథ్ మహరాజ్‌కి జై' అంటూ తమ దగ్గర పువ్వులను విసిరేవారు, కొంతమంది ఫోటోలు తీసుకునేవారు. ఈ ఉత్సవము చూడటానికి రెండుకళ్ళూ సరిపొవేమోనని అనిపిస్తుంది.