🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది యెనిమిదవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ఆరవ రోజు పారాయణము

మంగళవారము

ముప్పది యెనిమిదవ అధ్యాయము

ప్రస్తావన; బాబా వంట పాత్ర; నానాసాహెబు దేవాలయమును

అగౌరవించుట; కాలా (మిశ్రమము); ఒక గిన్నెడు మజ్జిగ

గత అధ్యాయములో బాబాగారి చావడి యుత్సవము వర్ణించితిమి. ఈ యధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగువానిని గూర్చి చదివెదము.

పస్తావన :

ఓ సద్గురుసాయి ! నీవు పావనమూర్తివి ! ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదముల నాశ్రయించినవారి బాధలను తొలగించితివి.

నిన్ను శరణు  జొచ్చినవారిని ఉదార స్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుటకొరకు నీవవతరించెదవు.

పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దాని నుండి యోగులలో నలంకారమగు సాయి వేడలెను.

ఈ సాయి యాత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నియు పొందినవారై, వారు భక్తులను నిష్కాములను జేసి విముక్తుల జేసిరి.

బాబా వంటపాత్ర :

యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి.

కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి.

దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్ఠమయినది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాల బాధపడెదము.

అట్టి పరిస్థితులలో నితర జీవులు కూడ నట్లే బాధపడును. ఈ విషయము తెలిసి యెవరయితే బీదలకు, ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు.

తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది. ”ఆహారమే పరబ్రహ్మ స్వరూపము, ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట నవి తిరిగి ఆహారములో ప్రవేశించును”.

మిట్టమధ్యాహ్నము మన యింటికెవరైన అతిథి వచ్చినచో, వారి నాహ్వానించి భోజనము పెట్టుట మన విధి.

ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి యిచ్చునప్పుడు కొంత విచక్షణ కావలెను. కాని యాహార విషయములో నట్టి యాలోచన యనవసరము.

మన యింటికి మిట్ట మధ్యాహ్న మెవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను.

కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను.

మన బంధువులు మొ.గు వారికి పెట్టుట కంటె, నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట యెంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో నితర దానములు ప్రకాశించవు.

ఎట్లన చంద్రుడు లేని నక్షత్రములవలె, పతకము లేని కంఠహారమువలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెఱువువలె, భక్తిలేని భజనవలె, కుంకుమబొట్టులేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాటవలె, ఉప్పులేని మజ్జిగ వలె రుచింపవు.

అన్ని వ్యంజనముల కంటె పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదాన మెక్కువ. బాబా ఆహారము నెట్లు తయారుచేసి పంచి పెట్టుచుండెనో చూచెదము.

బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసియుండెను. అదియు కొన్ని యిండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనెడివారని యిదివరకే తెలిసికొంటిమి.

ఏనాడైనా అందరికి భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకొన్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటు లన్నియు వారే స్వయముగా చేసికొనెడివారు.

ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు; ఎవరికిని బాధ కలుగజేయలేదు.

మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి యన్నియు నగదునిచ్చి కొనెడివారు. వారే విసరుచుండెడివారు.

మసీదు ముందున్న ఖాళీస్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారము నీళ్ళు పోసి పెట్టెడివారు.

వారి వద్ద వంటపాత్రలు రెండు గలవు. ఒకటి పెద్దది వందమందికి సరిపోవునది, రెండవది చిన్నది 50 మందికి మాత్రము సరిపోవునది.

ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పలావు వండెడివారు.

ఒక్కొక్కప్పుడు పప్పుచారుడుకునప్పుడు గోధుమపిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు.

పదార్థములు చాల రుచిగా నుండుట కెంత శ్రమ తీసికొనవలెనో అంత శ్రమను పడుచుండెడివారు.

అప్పుడప్పుడు అంబలి వండెడివారు. అనగా జొన్నపిండిని నీళ్ళలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడ అందరికి కొంచెము కొంచెముగా పెట్టెడివారు.

అన్నము సరిగా నుడికినదో లేదో యని పరీక్షించుటకు బాబా తన కఫనీపై కెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో బెట్టి కలుపు చుండెడివారు.

వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించెడిది కాదు.

వంట పూర్తికాగానే, బాబా ఆ పాత్రలను మసీదులోనికి దెచ్చి, మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు.

మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతాదానిని బీదవాండ్రకు దిక్కులేనివారికి సంతృప్తిగా బెట్టుచుండిరి.

బాబా స్వయముగా తన చేతులతో తయారుచేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసినవారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులయి యుండవలెను.

బాబా తన భక్తులందరికి శాకాహారము మాంసాహార మొకేరీతిగ బెట్టుచుండెనా యని ఎవరికైన సందేహము కలుగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది.

ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహారులు కాని వారి నా పాత్రను గూడ ముట్టనీయలేదు.

వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడ కలుగ నిచ్చెడివారు కారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా యని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు.

దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా యొక్కొక్కప్పుడు పరీక్షించు చుండెడివారు.

దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశినాడు దాదాకేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను.

ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును.

సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాలా గురువు ఆజ్ఞ పాటించుటే యనియు,

గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే యనియు, ఇదియే నిజమైన దక్షిణ యనియు, దీనివల్లనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియును.

కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలచి తానే స్వయముగా పోవలదనియు నింకెవరినైన పంపుమనెను.

అతడు పాండువను నౌకరును బంపెను. వాడు బయలుదేరుట జూచి బాబా వానిని కూడ వెనుకకు బిలిపించి యానాడు మాంసము వండుట మానుకొనిరి.

ఇంకొకసారి బాబా దాదాకేల్కరును బిలిచి పొయ్యిమీద నున్న పులావు ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కర్‌ దానిని పరీక్షించకయే సరిగా నున్నదని జవాబిచ్చెను.

అప్పుడు బాబా ”నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా నున్నదని యెట్లు చెప్పితివి. మూతతీసి చూడుము” అనుచు బాబా యతని చేతిని బట్టుకొని మరుగుచున్న డేకిసాలో బెట్టెను.

ఇంకను నిట్లనెను. ”నీ చేయిని తీయుము. నీ ఆచారము నొక ప్రక్కకు బెట్టి తెడ్డుతో దీసి, కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలిసికొనుము”.

తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించునప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ యేడ్చునప్పుడు దానిని కౌగలించి ముద్దుబెట్టుకొనును.

అట్లనే బాబా కూడ కన్నతల్లివలె దాదాకేల్కరును ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగిగాని, గురువుగాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు.

ఈవిధముగా బాబా పలావు వండుట 1910వ సంవత్సరము వరకు జరుగుతుండెడిది.

పూర్వము చెప్పిన రీతిగా దాసగణు బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను.

ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ యొక పుణ్యక్షేత్రమాయెను.

భక్తులనేక రకముల యాహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు, బీదలు తినగా నింకను మిగులుచుండెను.

నైవేద్యము నెట్లు పంచి పెట్టెడివారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయము లందును, నందుండు దేవతల యందును గల గౌరవమును చాటెడు నానాసాహెబు చాందోర్కరు కథ తెలిసికొందము.

నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట :

ఎవరికి తోచినట్లు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి.

నిజముగా బాబా యేజాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతియందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో యెవరికి తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడుగాని, మహమ్మదీయుడుగాని యెట్లు కాగలరు ?

వారు మహమ్మదీయులయినచో మసీదులో నెప్పుడు ధుని నెట్లు మండనిత్తురు ? అచ్చోట తులసీ బృందావన మెట్లుండును ? శంఖము లూదుట కెట్లు ఒప్పుకొందురు ?

గంటలను మ్రోయించుట కెట్లు సమ్మతింతురు ? సంగీత వాద్యముల నెటుల వాయించ నిత్తురు ? హిందువుల మతప్రకారము షోడశోపచార పూజలెటుల జరుగనిత్తురు ?

వారు మహమ్మదీయులయినచో వారి చెవులకు కుట్లు (రంధ్రములు) ఎటులుండును ? గ్రామములోని హిందూ దేవాలయము లన్నిటిని ఏల మరమ్మతు చేయించిరి ?

బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏ మాత్రము అగౌరవించినను ఊరకొనెడివారు కారు.

ఒకనాడు నానాసాహెబు చాందోర్కరు తన షడ్డకుడగు బినీవాల్యతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా

నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, ”నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు నిట్లేల చేసితివి?” అనెను.

నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను.

కోపర్‌గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా యతని నడిగెను. నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించెను.

సాధారణముగా షిరిడీకి పోవునపుడెల్ల నానాసాహెబ్‌ కోపర్‌గాంలో దిగి దత్త దర్శనము చేసికొనెడివాడు.

కాని ఈసారి తన బంధువు దత్త భక్తుడయినప్పటికి అతనిని గూడ వెళ్ళనీయక, యాలస్యమయిపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను.

ఇదంతయు బాబాకు తెలియజేయుచు, తాను గోదావరిలో స్నానము చేయునప్పుడొక ముల్లు పాదములో గ్రుచ్చుకొని తనను చాల బాధ పెట్టెనని చెప్పెను.

బాబా యది కొంతవరకు ప్రాయశ్చిత్తమే యనుచు నిక మీదట జాగ్రత్తయని హెచ్చరించెను.

కాలా (మిశ్రమము) :

ఇక నైవేద్యమెటుల పంచి పెట్టెడివారో చూచెదము. హారతి పిమ్మట, భక్తులందరికి ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి బోయి నింబారువైపు వీపు పెట్టి కూర్చొనుచుండిరి.

కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో బెట్టి బాబా యాశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిలుచుచుండిరి.

అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నము మొదలగునవన్నియు ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు.

బాబా దీనిని దైవమునకు అర్పించి, పావన మొనర్చు చుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకొని యున్నవారికి పంచి తక్కినది బాబాకు అటు నిటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి.

శ్యామా, నానాసాహెబు నిమోన్‌కర్‌ వడ్డించువారు. వచ్చినవారి సౌకర్యములను వీరు చూచువారు. వారాపని అతి జాగ్రత్తగాను, ఇష్టముగాను చేయుచుండిరి.

తిన్నట్టి ప్రతి రేణువు కూడ తృప్తియు, సత్తువయు కలుగజేయుచుండెను. అది యట్టి రుచి, ప్రేమ, శక్తి గలిగిన యాహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది.

ఒక గిన్నెడు మజ్జిగ :

ఒకనాడు హేమాడ్‌పంతు మసీదులో నందరితో కడుపునిండ తినెను. అట్టి సమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని యిచ్చెను.

అది తెల్లగా చూచుట కింపుగా నుండెను. కాని యతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను.

అతని గుంజాటనము గనిపెట్టి బాబా యతనితో నిట్లనెను. ”దానినంతయు త్రాగుము. నీకిక మీదట ఇట్టి యవకాశము దొరకదు”. అతడు వెంటనే దానినంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి.

పాఠకులారా ! హేమాడ్‌పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను.

కాని మనకు కావలసినంత యమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము ఈ యమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది యానందించెదముగాక!

ముప్పది యెనిమిదవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles