Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
నలుబది యొకటవ అధ్యాయము
చిత్రపటము యొక్క వృత్తాంతము;
గుడ్డపీలికలను దొంగిలించుట-జ్ఞానేశ్వరి చదువుట
చిత్రపటము యొక్క వృత్తాంతము :
గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము.
గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్, హేమాడ్‌పంతును కలిసి ఈ దిగువ కథ నతనికి జెప్పెను.
ఒకనాడు బొంబాయి వీధులలో బోవునప్పుడు, వీధిలో తిరిగి యమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను.
దానికి చట్రము కట్టించి, తన బాంద్రా యింటిలో గోడకు వ్రేలాడదీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను.
హేమాడ్‌పంతుకు ఆ పట మిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలుమీద కురుపులేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను.
అప్పుడతడు బొంబాయిలో నున్న తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్‌భాయి యింటిలో పడియుండెను. బాంద్రాలో తన యిల్లు 3 మాసముల వరకు మూయబడి యుండెను.
అక్కడ ఎవ్వరును లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి జెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలాని సాహెబు, మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు (సజీవ) యోగుల పటములుండెను.
వానిని కూడ కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటము లేల బాధపడవలెను ? పటములకు గూడ చావుపుట్టుక లున్నట్లుండెను.
పటములన్నియు వాని వాని యదృష్టము లనుభవించెను; కాని సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను.
అదెట్లు తప్పించుకొనగలిగెనో నాకింత వరకెవరు చెప్పలేరైరి. దీనినిబట్టి సాయిబాబా సర్వాంతర్యామి యనియు, సర్వవ్యాపి యనియు ననంత శక్తుడనియు దెలియుచున్నది.
అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ థారియా వద్ద సంపాదించెను.
దానిని తన బావమరిది యగు నూర్ మహమ్మద్ పీర్‌భాయికి ఇచ్చెను. అది యతని టేబిల్‌లో 8 సంవత్సరములు పడి యుండెను.
ఒకనాడు అతడు దానిని జూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసికొనిపోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను.
అందులో నొకటి అలీ మహమ్మద్ కిచ్చెను. దాని నతడు తన బాంద్రా యింటిలో బెట్టెను.
నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా నతడు గురువు గారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదు నచటి నుండి తరిమివేసిరి.
అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయెను గదా యని చింతించెను.
విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొనిపోయి, ఒక పడవను అద్దెకు గట్టించుకొని సముద్రములోనికి పోయి, దానినక్కడ నీళ్ళలో ముంచివేసెను.
తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి (6 పటములు) వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను.
ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది యింటిలో నుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను.
అది విని అలీ మహమ్మద్ తన మేనేజర్‌ను బాంద్రా యింటికి పంపి యక్కడున్న పటముల నన్నింటిని సముద్రములో వేయించెను.
రెండు నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటివలె గోడమీద నుండుట గమనించి యాశ్చర్యపడెను.
తన మేనేజరు పటములన్ని దీసివైచి బాబా పటము నెట్లు మరచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్న తన బావమరిది దానిని చూచినచో దానిని కూడ నాశనము చేయునని భయపడెను.
దాని నెవరికివ్వవలెను ? దానిని నెవరు జాగ్రత్త పరచెదరు ? దానిని భద్రముగా నెవరుంచగలరు ? అను విషయముల నాలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ముముజావర్‌ను కలిసి వారి యభిప్రాయము ప్రకారము చేయవలసినదని తోచునట్లు చేసెను.
అలీ మహమమ్మద్ ఇస్ముముజావర్‌ను కలిసికొని జరిగినదంతయు చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి యా పటమును హేమాడ్‌పంతు కివ్వ నిశ్చయించిరి.
అతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను. ఇద్దరును హేమాడ్‌పంతు వద్దకు బోయి సరియైన కాలములో దానిని బహూకరించిరి.
ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యద్వర్తమానములు తెలియుననియు, చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు నెట్టుల నెరవేర్చుచుండెనో కూడా తెలియుచున్నది.
ఎవరికయితే ఆధ్యాత్మిక విషయములలో నెక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటేకాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా జేయుచుండిరని రాబోవు కథవలన తెలియును.
గుడ్డపీలికలను దొంగిలించుట – జ్ఞానేశ్వరి చదువుట :
బి.వి. దేవు దహనులో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని, ఇతర మత గ్రంథములను చదువవలెనని చాలాకాలము నుండి కోరుచుండెను.
భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో నొక యధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను.
కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగనే ఏవో అవాంతరము లేర్పడుటచే పారాయణ మాగి పోవుచుండెను.
మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి యక్కడ నుండి తన స్వగ్రామమగు పౌండకు బోయెను.
ఇతర గ్రంథములన్నియు నచట చదువగలిగెను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగనే యేమో విపరీతమైన చెడ్డ యాలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువలేకుండెను.
అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడ చదువలేకపోయెను.
కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగజేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటివెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించెదననియు అంతవరకు దానిని తెరువననియు నిశ్చయము చేసికొనెను.
అతడు 1914వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీ వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపూసాహెబు జోగ్, దేవుగారి నడిగెను.
దేవు తనకు అట్టి కోరిక గలదనియు, కాని దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు, బాబా యాజ్ఞాపించినచో దానిని ప్రారంభించెదననియు చెప్పెను.
అప్పుడు జోగ్, ఒక పుస్తకమును దీసికొని బాబా కిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి యిచ్చెదరనియు అప్పటి నుండి నిరాటంకముగా చదువువచ్చుననియు దేవుకు సలహానిచ్చెను.
బాబాకు తన యుద్దేశము తెలియును గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా ? దానిని పారాయణ చేయుమని స్పష్టముగా నాజ్ఞాపించలేరా ? యనెను.
దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణ నిచ్చెను. బాబా 20 రూపాయలు దక్షిణ యడుగగా దానిని చెల్లించెను.
ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలిసికొని యతడు బాబాయందు భక్తిని వారి యనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను.
మరుసటి దినము హారతి పిమ్మట అంతయు దెలిపెదనని యతడు బదులిచ్చెను.
ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను.
మసీదు నిండ జనులు నిండి యుండుటచే దేవు ఒక మూలకు బోయి కూర్చుండెను. బాబా అతనిని బిలచి శాంతముగా తన దగ్గర కూర్చొనుమనియెను. దేవు అట్లనే చేసెను.
మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరు పోయిన తరువాత దేవు, బాలకరాముని జూచి యాతని పూర్వ వృత్తాంతముతో బాటు బాబా యాతని కేమేమి చెప్పెనో, ధ్యానము నెట్లు నేర్పిరో యని యడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను.
అంతలో బాబా చంద్రు అను కుష్ఠు రోగ భక్తుని బంపి దేవును తీసికొని రమ్మనెను. దేవు బాబా వద్దకు బోగా నెవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా యడిగెను.
బాలకరామునితో మాట్లాడుచుంటిననియు, బాబా కీర్తి వినుచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను.
అతనిని బాబా లోపలకు దీసికొనిపోయి స్తంభము వద్ద కూర్చుండి ”నా గుడ్డ పీలికలను నాకు దెలియకుండ దొంగిలించితివేల ?” యనెను.
దేవు తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి యేమియు తెలియదనెను. బాబా యతనిని వెదకుమనెను. అతడు వెదకెను. కాని యచ్చట ఏమియు దొరకలేదు.
బాబా కోపగించి యిట్లనెను. ”ఇక్కడ ఇంకెవ్వరు లేరు. నీ వొక్కడవే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికి ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా ?” యని కోపగించెను.
బాబా మతి చెడినవానివలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను.
దేవు తాను సటకా దెబ్బలు కూడ తినునేమో యనుకొనెను. ఒక గంట తరువాత బాబా యతనిని వాడాకు వెళ్ళుమనెను.
దేవు అచ్చటికేగి జరిగినదంతయు జోగుకు, బాలకరామునకు తెలియజేసెను. సాయంకాల మందరిని రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను.
”నా మాటలు వృద్ధుని బాధించి యుండవచ్చునుగాని, యతడు దొంగిలించుటచే నేనట్లు పలుకవలసి వచ్చె” నని బాబా నుడివెను.
తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి, సాష్టాంగ నమస్కారము చేసెను.
బాబా యిట్లనెను. ”ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము. పోయి వాడాలో కూర్చుండుము. ప్రతి నిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము.
చదువునపుడు దగ్గరనున్న వారికి శ్రద్ధా, భక్తులతో బోధపరచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లా నిచ్చుటకు ఇచట కూర్చొని యున్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేల ? నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని యున్నదా” ?
బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని యాజ్ఞాపించెననియు, తనకు కావలసినదేదో యది దొరికెననియు, అప్పటి నుండి తాను సులభముగ చదువగల ననియు అనుకొనెను.
తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కార మొనర్చెను. తాను శరణువేడెను కనుక తనను బిడ్డగానెంచి, జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను.
పీలికలు దొంగిలించుట యనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డపీలికలు దొంగిలించుట.
బాబా కట్టి వైఖరి యిష్టము లేదు. ఏ ప్రశ్నకైన సమాధానము ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరుల నడుగుట బాబాకు ఇష్టము లేదు.
అందుచే నతని బాధించి చికాకు పెట్టెను. అదియునుగాక యితరుల నడుగకుండ బాబానే సర్వము అడిగి తెలిసికొన వలయుననియు, నితరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను.
దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగ భావించి సంతుష్టితో ఇంటికి బోయెను. ఆ సంగతి యంతటితో సమాప్తి కాలేదు.
బాబా చదువుమని యాజ్ఞాపించి ఊరుకొనలేదు. ఒక సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని యభివృద్ధి కనుగొనెను.
1914వ సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి ”జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా ?” యని యడిగెను. ”లేదు’‘ అని దేవు జవాబిచ్చెను.
బాబా : ఇంకా యెప్పుడు తెలిసికొనెదవు ?
దేవు కండ్ల తడిపెట్టుకొని ”నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగా నున్నది, బోధపడుట చాలా కష్టముగా నున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.
బాబా : చదువునప్పుడు నీవు తొందర పడుచున్నావు. నా ముందర చదువుము. నా సమక్షమున చదువుము.
దేవు : ఏమి చదువవలెను ?
బాబా : అధ్యాత్మ చదువుము.
పుస్తకమును తీసికొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచెను. ఈ దృశ్యమును జూచిన పిమ్మట దేవుకెంత యానందము, సంతోషము కలిగెనో చదువరులే గ్రహింతురు గాక !
నలుబదియొకటవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above text has been typed by: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏబది యొకటవ అధ్యాయము🌹…Audio
- శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది యొకటవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది రెండవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది యేడవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది తొమ్మిదవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments