Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా..సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
43, 44 అధ్యాయములు
బాబా సమాధి చెందుట – ముందుగా సన్నాహము; ఇటుకరాయి విరుగుట;
72 గంటల సమాధి; బాపుసాహెబు జోగ్ సన్యాసము; అమృత తుల్యమగు
బాబా పలుకులు; నేననగా నెవరు ?
43 మరియు 44 అధ్యాయములు కూడ బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించునవి కనుక వాటినొకచోట చేర్చుట జరిగినది.
ముందుగా సన్నాహము :
హిందువులలో నెవరైన మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు, మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారము.
ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమొనర్చినచో నతడు పరమును సహజముగాను సులభముగాను పొందును.
పరీక్షిన్మహారాజు బ్రాహ్మణ ఋషిబాలునిచే శపింపబడి, వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా నున్నప్పుడు గొప్పయోగి యగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను.
ఈ అభ్యాసము ఇప్పటికిని అలవాటులో నున్నది. చనిపోవుటకు సిద్ధముగా నున్నవారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు.
కాని, బాబా భగవంతుని యవతారమగుటచే వారికట్టిది యవసరము లేదు. కాని, బాబా యితరులకు ఆదర్శముగా నుండుటకు ఈ యలవాటును పాటించిరి.
త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగనే వారు వజేయను నాతని బిలిచి రామవిజయమను గ్రంథమును పారాయణ చేయుమనిరి.
అతడు వారములో గ్రంథము నొకసారి పఠించెను. తిరిగి దానిని చదవుమని బాబా యాజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి మూడు దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను.
ఈవిధముగా 11 దినములు గడచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి యలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను.
బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకయి యెదురు చూచుచుండిరి.
రెండు మూడు దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి.
చివర వరకు బాబా చైతన్యముతో నుండి, అందరిని ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయెదరో ఎవరికి తెలియనీయలేదు.
ప్రతిదినము కాకాసాహెబు దీక్షితు, శ్రీమాన్ బూటీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు.
ఆనాడు (1918 అక్టోబరు 15వ తారీఖు) హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు బోయి భోజనము చేయుమనిరి.
అయినను కొంతమంది లక్ష్మీబాయి శిందే, భాగోజిశిందే, బాయాజి, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబు నిమోన్‌కర్ యక్కడనే యుండిరి. దిగువ మెట్ల మీద శ్యామా కూర్చొనియుండెను.
లక్ష్మీబాయి శిందేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట, బాబా తన కాస్థలము (మసీదు) బాగలేదనియు, అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడ లోనికి దీసికొని పోయిన నచట బాగుగా నుండుననియు చెప్పెను.
ఈ తుదిపలుకు లాడుచు బాబా బయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను.
భాగోజీ దీనిని గనిపెట్టెను. దిగువ కూర్చొనియున్న నానాసాహెబు నిమోన్‌కర్‌కు ఈ సంగతి చెప్పెను.
నానాసాహెబు నీళ్ళు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను.
అతడు బిగ్గరగా ”ఓ దేవా !” యని యరచెను. అంతలో బాబా కండ్లు తెరచి మెల్లగా ”ఆ” ! యనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచి పెట్టెనని తేలిపోయెను.
బాబా సమాధి చెందెనను సంగతి షిరిడీ గ్రామములో కార్చిచ్చువలె వ్యాపించెను.
ప్రజలందరు స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి యేడ్వసాగిరి. కొందరు బిగ్గరగా నేడ్చిరి.
కొందరు వీధులలో నేడ్చుచుండిరి. కొందరు తెలివితప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్ళు కాలువల వలె పారుచుండెను. అందరును విచారగ్రస్తులయిరి.
కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొన మొదలిడిరి. మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యెదనని బాబా తమ భక్తులతో చెప్పిరని యొకరనిరి.
ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక నెవ్వరును సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణువీ కార్యమే యొనర్చెను.
సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో, శ్రీకృష్ణుడు దేవికీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను.
ఆ యవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ యవతారము (సాయిబాబా) భక్తుల నుద్ధరించుటకై వచ్చినది. కనుక సంశయింప కారణమేమున్నది ?
యోగుల జాడ లగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధ మీ యొక్క జన్మతోడిదే కాదు.
అది కడచిన డెబ్బది రెండు జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కల్గించిన యా మహారాజు (సాయిబాబా) ఎచటికో పర్యటనకై పోయినట్లని పించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢవిశ్వాసము భక్తులకు గలదు.
బాబా శరీరము నెట్లు సమాధి చేయవలెనను విషయము గొప్ప సమస్య యాయెను.
కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధిచేసి దానిపై గోరి కట్టవలెననిరి. కుషాల్‌చంద్, అమీర్‌శక్కర్ కూడ ఈ యభిప్రాయమునే వెలిబుచ్చిరి.
కాని రామచంద్ర పాటీలు అను గ్రామ మునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో ”మీ యాలోచన నాకు సమ్మతము కాదు. బాబా శరీరము రాతి వాడాలో పెట్టవలసినదే” యనెను.
అందుచే గ్రామస్థులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి.
బుధవార ముదయము గ్రామములోని జ్యోతిష్కుడును, శ్యామాకు మేనమామయునగు లక్ష్మణ్‌మామా జోషికి బాబా స్వప్నములో గాన్పించి చేయిపట్టి లాగి యిట్లనెను :
”త్వరగా లెమ్ము, బాపూసాహెబు నేను మరణించితి ననుకొనుచున్నాడు. అందుచే నతడు రాడు. నీవు పూజ చేసి, కాకడ హారతిని ఇమ్ము!”
లక్ష్మణ్ మామా సనాతనాచార పరాయణుడయిన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు.
అతనికి బాబా యందు పూర్ణభక్తి విశ్వాసము లుండెను. ఈ దృశ్యమును చూడగనే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంక పరచుచున్నను పూజను హారతిని చేసి పోయెను.
మిట్టమధ్యాహ్నము బాపూసాహెబు జోగ్ పూజాద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను.
బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్యభాగమున త్రవ్వుట ప్రారంభించిరి.
మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్‌ఇన్‌స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరు దానిని ఆమోదించిరి.
ఆ మరుసటి యుదయము అమీర్‌భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్‌గాం నుండి మామలతదారు వచ్చెను.
ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి. కనుక, మామలతదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలెననెను.
వాడా నుపయోగించుటకు రెండు రెట్ల కంటె ఎక్కువ వోట్లు వచ్చెను. అయినప్పటికి జిల్లా కలెక్టరుతో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకాసాహెబు దీక్షిత్ అహమద్‌నగర్ పోవుటకు సిద్ధపడెను.
ఈలోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టి యొక్క మనస్సు మారెను. అందరు ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుట కంగీకరించిరి.
బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసికొనిపోయిరి.
మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యదార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యెను. అది యొక పూజామందిర మాయెను.
అనేకమంది భక్తులచ్చటకు బోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తరక్రియలు బాలాసాహెబు భాటే, ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా, బాబాకు గొప్పభక్తుడు.
ఈ సందర్భములో నొక విషయము గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికి అది బిగిసిపోలేదు. అవయవములన్నియు సాగుచుండెను. బాబా కఫనీ చింపకుండ సులభముగా దీయగలిగిరి.
ఇటుకరాయి విరుగుట :
బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకున మయ్యెను.
మసీదులో ఒక పాత యిటుక యుండెను. బాబా దానిపై చేయివేసి యానుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని యాసనస్థు లగుచుండిరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను.
ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు, ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు, దానిని చేతితో పట్టుకొనియుండగా అది చేతి నుండి జారి క్రిందపడి రెండు ముక్కలయిపోయెను.
ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి యిట్లని యేడ్చిరి. ”ఇటుక కాదు, నా యదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడాను.
నా జీవితమునందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది”.
ఎవరైన ఒక ప్రశ్న అడుగవచ్చును. ”బాబా నిర్జీవియగు ఇటుక కోసమింత విచారపడనేల ?” అందులకు హేమాడ్‌పంతు ఇట్లు సమాధానమిచ్చెను.
”యోగులు బీదవారికి, నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజలవలె నటింతురు.
వారు మనవలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధచైతన్యులయి వారి కర్తవ్య విధుల నెరుగుదురు”.
72 గంటల సమాధి :
ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా, 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను.
ఒక మార్గశిర పౌర్ణమినాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి దీసికొనిపోయి సమాధిలో నుండవలెననుకొని, భక్త మహల్సాపతితో నిట్లనిరి.
”నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయిన సరే, లేని యెడల నా శరీరము నెదురుగా నున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండలను పాతుము” అని స్థలమును జూపిరి.
ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడ ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను.
ఊరివారందరు అచ్చట చేరి న్యాయవిచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహల్సాపతి యడ్డగించెను.
తన ఒడిలో బాబా శరీరము నుంచుకొని మూడురోజులట్లే కాపాడుచు కూర్చుండెను. మూడు దినముల పిమ్మట తెల్లవారుఝామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు గనిపించెను.
ఊపిరి ఆడ నారంభించెను, కడుపు కదలెను, కండ్లు తెరచెను, కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను.
దీనినిబట్టి చదువరు లాలోచించిన విషయమేమన బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా ? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును.
శరీర మశాశ్వతముగాని, లోనున్న యాత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధసత్తాయే బ్రహ్మము.
అదియే పంచేంద్రియములను, మనస్సును స్వాధీనమందుంచుకొనునది, పరిపాలించునది. అదియే సాయి.
అదియే ఈ జగత్తునందు గల వస్తువులన్నిటియందు వ్యాపించి యున్నది. అదిలేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను.
సాయి యెల్లప్పుడు ఉండువారు. అట్లనే పూర్వము గాణుగాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు, వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని,
సమస్త చేతనా చేతనములందు గూడ నుండి వానిని నియమించువారును, పరిపాలించువారును వారే.
ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికిని, మనఃస్ఫూర్తిగా భక్తితో పూజించువారికిని అనుభవనీయమయిన సంగతి.
ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేనప్పటికిని, మనము షిరిడీకి వెళ్ళినచో, వారి జీవితమెత్తు పటము మసీదులో నున్నది.
దీనిని శ్యామరావు జయకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడు నైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికిని బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగజేయును.
బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికి వారక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వమువలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు.
బాబా వంటి యోగులు ఎన్నడు మరణించరు. వారు మానవులవలె గనిపించినను నిజముగా వారే దైవము.
బాపుసాహెబు జోగ్ సన్యాసము :
జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాడ్‌పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు.
సఖారాం హరి వురఫ్ బాపూసాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్‌గారికి చిన్నాయన.
1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తరువాత (P.W.D. Supervisor) భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను.
వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి.
మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబు జోగ్ మసీదులోను, చావడిలోను కూడ బాబా మహాసమాధి పొందువరకు హారతి ఇచ్చుచుండెను.
అదియునుగాక ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వరియు, ఏకనాథ భాగవతమును చదివి, వినవచ్చినవారందరికి బోధించుచుండెను.
అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్, బాబాతో ”నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని. నా మనస్సు ఇంకను శాంతము కాలేదు.
యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు ?” అనెను.
ఆ ప్రార్థన విని బాబా ”కొద్దికాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును. నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవభిమానమును పోగొట్టుకొని, మోహమును రుచిని జయించెదవో,
యాటంకములన్నిటిని కడచెదవో, హృదయపూర్వకముగ భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు” అనిరి.
కొద్దికాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికింకొక యభిమానమేదియు లేకుండుటచే నతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవితపరమావధిని పొందెను.
అమృతతుల్యమగు బాబా పలుకులు :
దయాదాక్షిణ్యమూర్తి యగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి.
”ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము, నా కథలు తప్ప మరేమియు చెప్పడు, సదా నన్నే ధ్యానము చేయును.
నా నామమునే యెల్లప్పుడు జపించుచుండును. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను, వారికి మోక్షమునిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను.
ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే యేమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడియుందును.
ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు.
కనుక నీవు గర్వము, అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములో నున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను”.
నేననగా నెవరు ? :
నేను అనగా నెవ్వరో సాయిబాబా యెన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి. ‘‘నన్ను వెదకుటకు నీవు దూరముగాని మరెచ్చటికిగాని పోనక్కరలేదు.
నీ నామము నీ యాకారము విడిచినచో నీలోనేగాక యన్ని జీవులలోను చైతన్యము లేదా యంతరాత్మ యని యొకటి యుండును. అదే నేను.
దీనిని నీవు గ్రహించి, నీలోనే గాక అన్నిటిలోను నన్ను జూడుము. దీనిని నీవభ్యసించినచో, సర్వవ్యాపకత్వ మనుభవించి నాలో ఐక్యము పొందెదవు”.
హేమాడ్‌పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా వారు వినయవిధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక!
బాబా పెక్కుసారులు ”ఎవరయితే యితరులను నిందించుదురో వారు నన్ను హింసించినవారగుదురు. ఎవరయితే బాధ లనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు” అని చెప్పిరి గదా !
బాబా సర్వ వస్తుజీవ సముదాయములో నైక్యమైయున్నారు. భక్తులకు నలుప్రక్కల నిలచి సహాయపడెదరు.
సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియు కోరరు. ఇట్టి శుభమయిన పరిశుభ్రమయిన యమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను.
హేమాడ్‌పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులును సాయిలో నైక్యమగుదురు.
43, 44 అధ్యాయములు సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
ఆరవరోజు పారాయణము సమాప్తము
The above text has been typed by: Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹16-17వ అధ్యాయములు🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹18-19 అధ్యాయములు🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది రెండవ అధ్యాయము🌹…Audio
- కర్రలతో కొడతాను…..సాయి@366 నవంబర్ 5….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబదియారవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments