హరిశ్చంద్ర పితళే



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!    శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

బొంబాయిలో హరిశ్చంద్ర పితళే యను వారుండిరి. అతనికి మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను, ఆయుర్వేద మందులను కూడ వాడెను గాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపయి బడుట యనే సాధన మొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కనికీర్తనలచే దాసుగణు బాబా కీర్తిని బొంబాయి రాజధానిలో వెల్లడి చేసెనని వింటిమి. 1910లో పితళే అట్టి కథలు కొన్నిటిని వినెను. వానినుండి, యితరులు చెప్పినదానినుండి, బాబా తన దృష్టిచేతను, తాకుటచేతను, బాగుకానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను. సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధముల సన్నాహమై, బహుమానములను వెంట దీసికొని పండ్ల బుట్టలను బట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు బోయెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా యా బిడ్డవైపు చూడగనే యొక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యమును దప్పి నేలపైబడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వానివలె పడెను. దీనిని జూచి తల్లి దండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెనుగాని యీ మూర్ఛ చాలసేపటివర కుండెను. తల్లి కంటినీరు వరదలుగా కారు చుండెను. ఆమె యేడ్చుటకు మొదలిడెను. ఆమె స్థితి దొంగలనుండి తప్పించుకొనవలెనని యొక గృహము లోనికి పరుగెత్తగా అది తన నెత్తిపయి బడినట్లు, పులికి భయపడి పారి పోయి కసాయివాని చేతిలో పడిన యావువలె, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారి పయిబడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను.

ఆమె యిటు లేడ్చుచుండగా బాబా యామెనిటుల యోదార్చెను. “ఇటు లేడ్వవలదు, కొంతసే పాగుము. ఓపికతో నుండుము. కుర్రవానిని బసకు దీసికొని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము పచ్చును.” బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యదార్ధము లయ్యెను. వాడాలోనికి దీసికొని పోగానే, కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితళే కుటుంబమంతయు సంతోషించిరి. వారి సంశయము లన్నియు దీరెను. పితళే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. బాబా పాదములకు వినయముతో సాష్టాంగనమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన యుపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో నిట్లనియె. “నీ యాలోచనలు, సంశయములు, భయోత్పాతములు, ఇప్పుడు చల్ల బడినవా? ఎవరికయితే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును.” పితళే ధనికుడు, మరియాద గలవాడు. అతడందరికి అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము నిచ్చెను. పితళే భార్య సాత్వికురాలు. నిరాడంబరము, ప్రేమభక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబావైపు దృష్టి నిగిడ్చి కండ్లనుండి యానందభాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపయి నాధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను, మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబావద్ద సుఖముగా నున్నపిమ్మట ఇంటికి పోవనిశ్చయించి, బాబా దర్శనమునకయి మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితళేను దగ్గరకు బిలచి యిట్లనెను. “బాపూ, అంతకుముందు 2 రూపాయ లిచ్చియుంటిని. ఇప్పుడు 3 రూపాయ లిచ్చుచున్నాను. వీనిని నీ పూజామందిరములో బెట్టుకొని పూజింపుము. నీవు మేలు పొందెదవు.” పితళే వీనిని ప్రసాదముగా నంగీకరించెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేసి యాశీర్వచనములకయి ప్రార్థించెను. ఇదే తనకు షిరిడీ పోవుటకు మొదటిసారి గనుక, అంతకుముందు 2 రూపాలయిలిచ్చెనను బాబా మాటల యర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలిసి కొనవలెనని కుతూహలపడెను గాని బాబా యూరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలితల్లికి ఈవృత్తాంతమంతయు చెప్పి బాబాయంతకు ముందు రెండురూపాయలిచ్చెననెను; అదేమియని యడిగెను. ఆమె తన పుత్రున కిట్లనెను. నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు, మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు బోయెను. ఆ మహారాజు కూడ సిద్ధపురుషుడు; పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు, మీతండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీతండ్రికి రెండు రూపాయలిచ్చి మందిరములో బెట్టి పూజింపు మనిరి. మీ తండ్రిగారు చనిపోవువరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీ వదృష్టవంతుడ వగుటచే, అక్కల్ కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపములో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి దెచ్చి, నీ కష్టములను తప్పింప జూచుచున్నారు. కాబట్టి యికమీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను, దురాలోచనలను విడువుము. మీ తాతముత్తాతల యాచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనము నవలంబింపుము. కుటుంబదైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాటిని చక్కగా పూజించి వాని విలువను కనుగొని, యోగుల యాశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలుకొరకు దాని నభివృద్ధి చేసికొనుము” తల్లి మాటలు విని పితళే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయియొక్క సర్వాంతర్యామిత్వమునందు, వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యము గ్రహించెను. అప్పటినుండి తన నడవడి గూర్చి చాల జాగ్రత్తగా నుండెను

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles