కాకాసాహెబు దీక్షిత్ (1864 – 1926)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

మధ్యపరగణాలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణకుటుంబములో హరిసీతారామ్ ఉరఫ్ కాకాసాహెబు దీక్షిత్ జన్మించెను. ప్రాథమికవిద్యను ఖాండ్వాలో హింగన్ ఘాట్ లలో పూర్తి చేసెను, నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్ స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడ ఉత్తీర్ణుడై లిటిల్ అండు కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంతన్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను.

1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్ కు తెలియదు. అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లొనావాలాలో నున్నప్పుడు, తన పాతస్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్ ను జూచెను. ఇద్దరును కలిసియేవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారిపడిన యపాయమునుగూర్చి వర్ణించెను. వందలకొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పియు, కుంటితనమును పోవలెనన్నచో, అతడు సద్గురువగు సాయివద్దకు పోవలెనని నానాసాహెబు సలహా నిచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా “నా భక్తుని సప్తసముద్రముల మీద నుంచిగూడ పిచ్చుక కాలికి దారముకట్టి యీడ్చినట్లు లాగుకొని వచ్చెదను.” అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి, “సాయిబాబా వద్దకుపోయి, వారిని దర్శించి కాలుయొక్క కుంటితనమునకంటె నా మనస్సుయొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజేయమని వేడుకొనెద”నని నానాసాహెబుతో చెప్పెను.

కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహమద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్ లేటివ్ కౌన్సిల్ లో వోట్లకై సర్దార్ కాకాసాహెబు మిరికర్ యింటిలో దిగెను. కాకాసాహెబు మిరీకర్ కొడుకు బాలాసాహెబు మిరీకర్. వీరు కోపర్ గాం కు మామలతుదారు. వీరు కూడ గుఱ్ఱపు ప్రదర్శన సందర్భములో అహమద్ నగరు వచ్చి యుండిరి. ఎలక్షను పూర్తియైన పిమ్మట కాకాసాహెబు షిరిడీకి పోవ నిశ్చయించు కొనెను. మిరీకర్ తండ్రీకొడుకులు వీరిని ఎవరివెంట షిరిడీకి పంపవలెనాయని యాలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. ఆహమద్ నగరులో నున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు, శ్యామాను తన భార్యతో గూడ రావలసినదనియు టెలిగ్రామ్ యిచ్చిరి. బాబా యాజ్ఞను పొంది శ్యామా అహమద్ నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలిసికొనెను. మార్గములో గుఱ్ఱపు ప్రదర్శనమునకు బోవుచున్న నానాసాహెబు పాన్సే, అప్పాసాహెబు గద్రే శ్యామాను గలిసి, మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబు దీక్షితుని కలసి, వారిని షిరిడీకి తీసికొని వెళ్ళుమనిరి. కాకాసాహెబు దీక్షితుకు మిరీకరులకు శ్యామా అహమద్ నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామా మీరీకరులవద్దకు పోయెను. వారు శ్యామాకు కాకా సాహెబుదీక్షిత్ తో పరిచయము కలుగజేసిరి. శ్యామా కాకాసాహెబు దీక్షితుతో కోపర్ గాం కు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే యొకవింత జరిగెను. బాబాయొక్క పెద్దపటము మీది తెరను బాలాసాహెబు మిరీకరు తీసి దానిని కాకాసాహెబు దీక్షితుకు చూపెను. కాకాసాహెబు శిరీడీకి పోయి యెవరినయితే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో, వారే పటము రూపముగా నచట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగా నున్నట్లు తెలిసి యతడు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ పెద్దపటము మేఘశ్యామునిది. దానిపై యద్దముపగిలినందున నాతడు దానికింకొక యద్దము వేయుటకు మిరీకరులవద్దకు బంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబు శ్యామాలద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి.

10 గంటల లోపల స్టేషనుకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండుక్లాసు క్రిక్కిరిసి యుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టుక్లాసులో కూర్చుంటబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్ గాం లో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగా నున్న నానాసాహెబు చాందోర్కరును జూచి మిక్కిలి యానందించిరి. కాకాసాహెబు, నానాసాహెబు కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా, కాకా సాహెబు మనస్సు కరగెను. కండ్లు ఆనందబాష్పములచే నిండెను. అత డానందముచే పొంగిపొరలుచుండెను. బాబా కూడ వారికొరకు తాము కనిపెట్టుకొని యున్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకే శ్యామాను బంపినట్లును తెలియజేసెను.

పిమ్మట కాకాసాహెబు బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా గడపెను. షిరిడీలో నొక వాడాను గట్టి దానినే తన నివాసస్థలముగా జేసికొనెను. అతడు బాబావల్ల పొందిన యనుభవములు లెక్కలేనన్ని గలవు. వాని నన్నిటిని ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబుతో “అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయెదను” అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమడ్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు, సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమడ్ పంతు భుజముపై వాల్చి యే బాధయు లేక, యెట్టి చీకాకు పొందక ప్రాణములు విడిచెను.

సంపాదకీయం:  శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles