సచ్చరిత్ర పారాయణం సకల శుభ ప్రదాయం ….!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా పెద్ద అమ్మాయి పెళ్లి అయ్యాక 2 సార్లు అబార్షన్ అయ్యాయి. ఆ తర్వాత నెల తప్పినప్పుడు 7 వ నెల వచ్చాక సడన్ గా బ్లీడింగ్ అయ్యి బాబు పుట్టి చనిపోయాడు.

ఆ తరువాత మళ్ళీ నెల తప్పినప్పుడు నేను పిల్లని కాస్త రెస్టుగా ఉంచాలి అని తీసుకువచ్చాను.

అయినా దీనికి ఎందుకు ఆలా అవుతుంది అని ఎవరైనా ఏమైనా చేస్తున్నారా అన్న అనుమానం నాకు ఉండేది.

ఒక రోజు నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో మా అమ్మాయి ఒక డాబా పైన గోడ దగ్గరగా నిలబడి ఉంది, బయట రోడ్డు మీద 4, 5 గురు దీన్ని పిలుస్తున్నారు, ఇది వాళ్ళని తొంగి చూస్తోంది,

ఇంతలో డాబా మీద నుండి డాబా మీదకి ”బాబా” వచ్చి మా అమ్మాయి పైన చేయి వేసి ఆ రోడ్డు పైన వారికి కనపడకుండా దీని తలని కిందకి వత్తుతున్నారు,

ఆ బయట వాళ్ళతో ”మీరు పిలవకండి ఈ అమ్మాయి రాదు వెళ్లిపోండి, ఈ సారి ఎలాగైనా కని తీరాలి మీరు వెళ్లిపోండి” అంటున్నాడు.

మా అమ్మాయి వాళ్ళని చూడటానికి తొంగి చూస్తోంది, ”బాబా” దాని తలని కిందకి వత్తుతున్నాడు అదీ కల.

మా అమ్మాయికి 9 వ నెల వచ్చాక కూడా అదే కల వచ్చింది, నెలలు నిండాక పాప పుట్టింది.

మా అమ్మాయి వాళ్ళు సొంతగా బిజినెస్ పెట్టుకోవాలి అని అనుకున్నారు. అంతకు ముందు జాయింట్ బిజినెస్ చేసారు. అది రెండు మూడు సార్లు నష్టమే వచ్చింది.

ఇప్పుడు సొంతగా చేయాలి అనుకుంటున్నారు. ఒక పేరు పెట్టి రిజిస్ట్రేషన్ కి పంపిస్తూంటే అది ప్రతిసారి రిజెక్ట్ అయిపోతోంది. అలా చాలా సార్లు అయ్యింది.

అప్పుడు మా అమ్మాయి, ”అమ్మా మేము ఇలా సొంతంగా బిజినెస్ చేయాలి అనుకుంటున్నాము, మేము ఎంత ప్రయత్నం చేసినా కుదరటం లేదు, నువ్వు నా పేరు చెప్పి పారాయణం చెయ్యి” అంది.

“మీ ఆయనకీ అసలు బాబా పైన నమ్మకం లేదు అటువంటప్పుడు నేను పారాయణం చేసి ప్రయోజనం లేదు” అన్నాను.

”లేదమ్మా! చదువు” అంది. సరేనని నేను వాళ్ళింట్లో పూజ చేసి పారాయణం మొదలు పెట్టి చదువుతున్నాను,

చివరి రోజు పూజ అయ్యి బాబాకి తాంబూలం పెట్టి పారాయణం మొదలు పెట్టాను ఇంకా 5, 6 పేజీలు మాత్రమే ఉన్నాయి పూర్తి అవ్వటానికి,

ఆ సమయం లో మా అల్లుడికి ఫోన్ లో మెసేజ్ వచ్చింది, ఏ పేరు అయితే వీళ్ళు పెట్టారో ఆ పేరుతోనే రెజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని . అది మా అమ్మాయి కి చెప్పాడతను.

”చూసారా మీరు బాబాను నమ్మలేదు గాని అమ్మ మనకోసం బాబా పారాయణం చదువుతోంది. ఇంకా పూర్తి కాలేదు చూడండి రిజల్ట్స్” అంది అతనితో. ”అవును నేను నమ్మలేదు గాని, మంచి జరిగింది” అన్నాడు.

మా వారు కొద్దీ రోజుల్లో పోతారనగా నాకు బాబా కలలో మా ఇంట్లోకి వచ్చి ”మోహనరావు ఎక్కడ” అన్నాడు, ”నేను లోపల ఉన్నారు” అన్నాను,

ఏడీ అంటూ లోపలికి వచ్చి ఆయన్ని చంక క్రింద చెయ్యి పెట్టి పట్టుకొనివెళ్ళిపోతున్నాడు.

బాబాను నేను ”ఆగు” అన్నాను, ”ఏమిటి” అన్నాడు బాబా. ”ఎక్కడికి తీసుకెళ్తావు ఆయన్ని” అన్నాను, ”తీసుకువెళ్లిపోతున్నాను” అని అన్నాడు బాబా,

‘వీలు లేదు వద్దు” అన్నాను, ”సరే” అని ఆయన్ని వదిలి వెళ్ళిపోయాడు,

అలా అయ్యాక ఒక రోజు మంచి నీళ్లు కూడా అడక్కుండానే సునాయాసంగా వెళ్లి పోయారు.

నేను మా గురువు గారి శిష్యుడిని అడిగాను. దానికాయన అమ్మా! ఆయన ఇంకా బ్రతికుంటే నువ్వు ఆయనకి సేవ చేయలేవు నువ్వు ఆయన్ని తొందరగా తీసుకుపొమ్మని ఈ సారి ”బాబా” ను కోరుకోవాల్సి ఉంటుంది అన్నారు.

”నేను అలా ఎలా కోరుకుంటాను” అన్నాను. ”నువ్వుండి ఆయన పోతే పర్వాలేదు. ఆయన ఉండి నువ్వు పోతే ఆయన్ని ఎవరు చూసుకుంటారు, పైగా ఆయనకి కళ్ళు కూడా లేవు కదా!” అన్నారాయన.

మా వారు పోయాక కొన్ని రోజులు నేను పూజలు పునస్కారాలు మానేసి అలా కూర్చుని ఏడుస్తుండే దాన్ని.

ఒక సారి బాబా, భరద్వాజ్ మాస్టర్ ఇద్దరు నా కలలో కనపడి ”ఎందుకు మమ్మల్ని కించపరిచే మాటలు అంటున్నావు? ఎందుకు పూజలు మానేసావు? మోహనరావు ఎక్కడమ్మా?” అని అడిగారు.

ఆయనెలా వస్తారు అన్నాను. ”రారుకదా మరెందుకు ఏడుస్తున్నావు నువ్వు పూజ భజనలు మానవద్దు” అన్నారు. మరలా అప్పటి నుంచి పూజ, భజనలు మొదలు పెట్టాను.

మా గురువు గారు భరద్వాజ మాస్టర్ గారి ప్రతి జన్మ దినానికి కొంత మందిని దత్త క్షేత్రాలు పంపుతుంటారు.

అది ఎలాగంటే భరద్వాజ్ గారి సాయి లీలామృతం పుస్తకాన్ని మొత్తం చూసి రాయాలి. కొంతమంది చేత రాయిస్తారు.

అలా పుస్తకాలు రాయించడానికి ఇష్టమున్న వాళ్ళకి నెంబర్లు ఇస్తారు, ఆ నెంబర్లని డ్రా లో వేస్తారు. ఆ డ్రా లో మాస్టారు గారి వయసు ఎంతైతే అంత మందిని డ్రా తీసి పంపిస్తారు.

ఒక సారి అలా డ్రా తీసినప్పుడు మా చిన్న అమ్మాయి పేరు వచ్చింది. వాళ్ళని మా ఖర్చులు మేము పెట్టుకుంటాము అని అడిగి మేము 10  మందిమి వెళ్ళాము,

అక్కడ మా మేనల్లుడుకి నేను నా బ్యాగ్ పట్టుకోమని ఇచ్చాను, వాడు ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అందులో 16, 000 రూపాయలు సెల్ మరియు కెమెరాలు ఉన్నాయి.

మా వాడిని ఎక్కడ పెట్టావు అని అడిగితే అసలు నాకెక్కడ ఇచ్చావు అన్నాడు.

క్షణాల్లో ఈ వార్త గురువు గారి శిష్యులకి చేరిపోయింది ఆయన నన్ను పిలిచి విషయం తెలుసుకుని నేను ఏడుస్తుంటే ఏడవవద్దు నీ బ్యాగ్ ఎక్కడికీ పోదు,

నువ్వు ”సాయి లీలామృతం” పుస్తకం తీసుకుని అందరికీ దూరంగా వెళ్లి ”సకల సాధు స్వరూపం”, ”జన్మాంతర జ్ఞానం” ఈ రెండు అధ్యయాలు చదువు, అయ్యే సరికి నీ బ్యాగ్ నీ దగ్గర ఉంటుంది అని చెప్పారు.

నేను చదివాను మధ్యలో నన్ను ఒకళ్ళిద్దరు డిస్టర్బ్ చేయబోయారు కాని మొత్తం మీద పూర్తి చేశాను, నా బ్యాగ్ దొరికింది.

ఎక్కడైతే మా మేనల్లుడు చెట్టు కింద పెట్టి మర్చిపోయాడో అక్కడే ఉంది. మా వాళ్ళు వెతికితే కనపడింది.

దాదాపు నాలుగు గంటలు తరువాతైనా ఆ బ్యాగ్ అక్కడే ఉంది. అందులో ఉండ వలసిన సామానంతా అలాగే ఉంది ఏమీ పోలేదు. అంతా బాబా దయ.

సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు.

శుభం భవతు.

The above miracle has been typed by:  Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles