Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 27
04.12.1912 ఆదివారమ్
ఉదయం తొందరగా లేచి కాకడ ఆరతికి వెళ్ళి, ఆ తరువాత ప్రార్ధన పూర్తి చేసుకున్నాను. నేను స్నానం చేస్తుండగా నారాయణరావు వామన్ రావ్ గావ్ కర్ గురించి వాకబు చేస్తూ ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు. వారు లింగాయత్ శాస్త్రులు. వారిలో పెద్దాయన పేరు శివానందశాస్త్రి. వారితో కూడా ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారు. వారిలో పెద్దావిడ పేరు బ్రహ్మానందబాయి. ఆవిడ మూడు సంవత్సరాల క్రితం నాసిక్ లో నిజానందబాయి అనే ఆవిడని కలుసుకుంది. ఆవిడ యోగాలో పురోగతి సాధించింది. ఆవిడ బ్రహ్మానంద బాయికి ఉపదేశం చేసింది. సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు, మసీదుకు తిరిగి వచ్చేటప్పుడు మేమంతా దర్శనం చేసుకున్నాము. బ్రహ్మానందబాయి ఆయనను పూజించి రెండు ఆరతులు శ్రావ్యంగా పాడింది. మధ్యాహ్న ఆరతి తరువాత భోజనం చేసి కాసేపు పడుకున్నాను. తరువాత దీక్షిత్ పురాణం జరిగింది. ఆ తరువాత సాయిబాబా సాయంత్రం వ్యాహ్యాళికి వెడుతున్నపుడు దర్శించుకున్నాము. వాడాలో రాత్రి ఆరతి తరవాత దీక్షిత్ పురాణ పఠనం, భీష్మ భజన జరిగాయి. బ్రహ్మానందబాయి, ఆమెతో కూడా వచ్చినామె ఇద్దరూ చాలా అద్భుతంగా పాడారు. భీష్మ భజన మాకెంతో సంతోషాన్ని కలిగించింది. శివానందశాస్త్రి కూడా పాట పాడాడు ఇద్దరు శాస్త్రులు, స్త్రీలు, నాసిక్ నుండి వచ్చారు. వారక్కడ శాశ్వతంగా నివసించేవారే.
05.02.1912 సోమవారమ్
ప్రొద్దున్న నా ప్రార్ధన పూర్తిచేశానో లేదో, నాగపూర్ నుండి రాజారామ్ పంత్ దీక్షిత్ వచ్చారు. ఆయన కాకాసాహెబ్ దీక్షిత్ అన్నగారు. ఆయన సాయిమహరాజ్ ను దర్శించుకోవడానికి వెళ్ళారు. పంచదశి క్లాసుకు వెళ్ళాను. బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ శాస్త్రి, శివానంద శాస్త్రి, బ్రహ్మానందబాయి, ఇంకా మరికొందరం కలిసి పంచదశి, అమృతానుభవంలో ఒక శ్లోకం చదివాము. సాయిమహరాజ్ బయటకు వెళ్ళటం చూశాము. ఆయన తిరిగి వచ్చిన తరువాత మసీదుకు వెళ్ళాము. ఆయన నాయందు చాలా దయగా ఉన్నారు. కొద్దిమాటలు మాట్లాడారు. ఆరతి అయిన తరువాత అందరినీ పంపించేశాక, నన్ను పేరుపెట్టి పిలిచి నా బధ్ధకం వదిలించుకోమన్నారు. స్త్రీలను, పిల్లలను కనిపెట్టుకుని చూస్తూండమన్నారు. లక్ష్మీబాయి కౌజల్గీకి ఒక రొట్టిముక్క ఇచ్చి, రాధాకృష్ణమాయి వద్దకు వెళ్ళి తినమన్నారు. ఇది అదృష్టంగా లభించిన పదార్ధం. ఇకనుంచీ ఆమె చాలా ఆనందంగా ఉంటుంది. నేను శివానందశాస్త్రిని, బ్రహ్మానంద బాయిని, ఇంకా వారితో ఉన్న వాళ్ళందరినీ మాతో మధ్యాహ్న భోజనానికి పిలిచాను. ఆ తరువాత కొద్ది నిమిషాలు పడుకొన్నాను. తరువాత దీక్షిత్ రామాయణం చదివాడు. తరువాత సాయి మహరాజ్ వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు దర్శించుకున్నాము. వాడాలో ఆరతి తరువాత శేజ్ ఆరతికి వెళ్ళాము. రాత్రి బ్రహ్మానందబాయి భజన పాటలు చాలా అద్భుతంగా పాడింది. అర్ధరాత్రి దాటేవరకు భజన జరిగింది. నేను తిరిగి వెళ్ళటం గురించి ఈరోజు ప్రస్తావన వచ్చింది. అది రేపు నిర్ణయం కావచ్చు.
06.02.1912 మంగళవారం
ఉదయాన్నే లేచి కాకడ ఆరతికి వెళ్ళాను. నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఈ రోజు అనుమతి లభించవచ్చని మాధవరావు దేశ్ పాండే చెప్పాడు. అందుచేత నేను అతనితోను, వామన్ గావ్ కర్ తో కలిసి ఉదయం 7.30 కి సాయిసాహెబ్ వద్దకు వెళ్ళాను. సాయిసాహెబ్ మమ్మల్ని మరలా మధ్యాహ్నం రమ్మన్నారు. ఇక మేము తిరిగి వచ్చి మా రోజువారీ పనులను ప్రారంభించాము. నేను, ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్ పంచదశి చదివాము. సాయిమహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు దర్శించుకున్నాము. మధ్యాహ్న ఆరతికి వెళ్ళాము. అక్కడ బ్రహ్మానందబాయి ఆరతి, కొన్ని పాటలు పాడింది. బాపూసాహెబ్ జోగ్ పెన్షన్ తీసుకోవటానికి ఈ రోజు కోపర్ గావ్ వెళ్ళాడు. అందువల్ల ఆరతి తొందరగా ముగిసింది. మధ్యాహ్న భోజనం అయిన తరువాత నేను, వామన్ గావ్ కర్, మసీదుకు వెళ్ళాము. అక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు. అక్కడికి మాధవరావు దేశ్ పాండే కూడా వచ్చాడు. సాయి మహరాజ్ తాను చాలా కాలంగా రాత్రి పగలు ఆలోచిస్తునామన్నారు. అందరూ దొంగలే, కాని వారితోనే కలిసి ఉండాలి. వారిని బాగుచేయమని లేదా వారిని తొలగించమని పగలు రాత్రి భగవంతుని ప్రార్ధిస్తున్నానని చెప్పారు. కాని తన అభిప్రాయాన్ని అంగీకరించి తన ప్రార్ధనను మన్నించడంలో భగవంతుడు ఆలస్యం చేస్తున్నాడని అన్నారు. తాము ఒక నెలో రెండు నెలలో వేచి చూస్తాననీ, కానీ తన ప్రార్ధన తాను ఉండగానో లేక పోయాకనో తప్పక నెరవేరుతుందని అన్నారు. తాము ఇక నూనె వ్యాపారస్థుల వద్దకు ఇక ఎన్నటికీ వెళ్ళి భిక్ష తీసుకోమన్నారు. మనుషులలో మంచితనం, భక్తి లేవన్నారు. వారి మనసులు స్థిరంగా ఉండవు.
ఆయన ఇంకా “కొంతమంది మిత్రులు కలుస్తారనీ, దివ్యజ్ఞానం గురించి మాట్లాడుకుంటారనీ, దాని గురించి కూర్చుని ఆత్మ విచారణ చేస్తారు” అన్నారు. ఆయన కొన్ని వేలరూపాయల గురించి ప్రస్తావించారు, కాని ఏ సందర్భంలో ఆయన అలా అన్నారో నాకు గుర్తు లేదు. తిరిగి వచ్చిన తరువాత దీక్షిత్ రామాయణ పఠనం జరిగింది. ఆ తరువాత బాబా వ్యాహ్యాళికి బయటకు వెళ్ళినపుడు దర్శించుకున్నాము. ఆయన ఉల్లాసంగా ఉన్నారు. రాజారామ్ దీక్షిత్ ఈరోజు తిరిగి వెళ్ళిపోయాడు. ఉపాసనీ శాస్త్రి భార్య మరణించింది. ఈ విచారకర వార్త ఉత్తరం ద్వారా తెలిసింది. నేను, దీక్షిత్, మాధవరావు, ఉపాసనీ దగ్గరకు వెళ్ళి అతనిని ఓదార్చి, వాడాకు తీసుకుని వచ్చాము. ఫకీర్ బాబా నేను తిరిగి వెళ్ళడం గురించి అడిగినట్లున్నాడు, సాయి బాబా “అతను రేపు వెడతానని అన్నాడు” అని చెప్పారట. నా తిరుగు ప్రయాణం గురించి నాభార్య అడిగినప్పుడు, నన్నతను స్వయంగా వచ్చి అనుమతి అడగలేదు కదా అందుచేత నేనేమీ చెప్పలేను అన్నారట సాయిబాబా. నేను ఆ వెంటనే సాయిబాబా వద్దకు వెళ్ళాను. “దాదా భట్ నుండి అయిదు వందల రూపాయలు, మరొకరి వద్దనుండి రెండు వందల రూపాయలు తీసుకుని మొత్తం నాకివ్వనిదే నువ్వు వెళ్ళలేవు” అన్నారు. బాపూసాహెబ్ జోగ్ కోపర్ గావ్ నుండి తిరిగి రావడం ఆలస్యమయినందు వల్ల రాత్రి వాడాలో ఆరతి కాస్త ఆలస్యమయింది. బ్రహ్మానంద బాయి శివానంద శాస్త్రి భజన చేశారు. భీష్మకూడా భజన చేశాడు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 18 వ భాగం–Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 26 వ భాగం
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 21 వ భాగం
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 20 వ భాగం
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 19 వ భాగం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments