Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (3వ.భాగం)
ఆంగ్ల మూలం : లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
ఉపవాసం :
ఉప + వాస్, అనునది సంస్కృత శబ్దం. అనగా సమీపముగా ఉండుట. ఉపవాసమనగా మతాచారానికి సంబంధించి భగవంతునికి సమీపముగా ఉండుట. మరొక విధంగా చెప్పాలంటే ఉపవాసమున్న రోజున మన మనసు, ఆలోచనలు భగవంతునియందే నిలిపి ఉంచాలి. ఆయన రూపాన్నే ధ్యానం చేయాలి. మన మనసు, ఆలోచనలు నిర్మలంగా ఉండాలి. చేసే పనులు కూడా భగవంతునికి సంబంధించినవై ఉండాలి.
కాని, ఈ విధంగా మనమందరమూ ఆచరిస్తున్నామా అన్నది మనకి మనమే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఉపవాసం ఉన్న రోజున మన దైనందిన జీవితంలో వ్యాపార వ్యవహారాలు, సాంసారిక వ్యవహారాలు మొదలయిన వాటిలో మనం నిండా మునిగిపోయి, అనైతికంగా వ్యవహారాలు నడపటం, అసత్యాలు పలకటం, ఇతరులను మోసం చేయడం, ఇటువంటి పనులన్నిటినీ చేస్తూ ఉంటాము. మన మత గ్రంధాలలో ఉపవాసం ఏవిధంగా చేయాలో దానికి చాలా పధ్ధతులు వివరింపబడి ఉన్నాయి. కాని ప్రస్తుతం ఈ క్రింద వివరింపబడిన పద్ధతులు వాడుకలో ఉన్నాయి.
1) పగలు, రాత్రి భోజనం చేయకుండా, పళ్ళు, పాలు మాత్రమే తీసుకొనుట
2) పగలు పళ్ళు, పాలు తీసుకొని రాత్రికి భోజనం చేయుట
3) పగలు ఒంటిపూట మాత్రమే భోజనం చేసి రాత్రికి పళ్ళు, పాలు తీసుకొనుట
4)పూర్తిగా రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటం.
కాని వీటినయినా మనం సరిగా ఆచరిస్తున్నామా? ఉపవాసం ఉన్న రోజులలో మనం ఏమి తీసుకున్నాగాని, ఫలహారం గాని, భోజనం గాని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. దీనిలో ఉన్న భావం ఏమిటంటే మన జీర్ణవ్యవస్థకి కాస్తంత విశ్రాంతినివ్వాలి. మరి మనం చేస్తున్నదేమిటి? మనం చాలా అరుదుగా పండ్లు తింటాము. కాని మిగిలిన పదార్ధాలని మనం కడుపారా ఎక్కువసార్లు తింటూ ఉంటాము. మనం ఒంటిపూట భోజనం చేసినా కూడా అమితంగా తినడమే కాక, అన్ని పదార్ధాలను మక్కువతో తింటాము. దాని ఫలితం అజీర్తి తప్ప మరింకేమీ ఆధ్యాత్మికంగా లాభంలేదు. ఆవిధంగా మతపరంగా గాని, ఆరోగ్యపరంగా గాని ఏవిధంగా చూసినా ఎటువంటి ప్రయోజనం లభించదు. ఇవన్నీ గ్రహించే సాయిబాబా తన భక్తులను భగవంతుని పేరుతో ఏవిధమయిన ఉపవాసాలు చేయవద్దని వారించారు.
అన్నిటికి అతీతంగా అనగా ప్రాపంచిక విషయాలపై దృష్టి పెట్టకుండా, కేవలం భగవంతుని నామాన్నే స్మరిస్తూ, పురాణాలు, సద్గ్రంధాలను పఠిస్తూ, శరీరాన్ని కష్టపెట్టకుండా చేసిన ఉపవాసం సత్ఫలితాలనిస్తుంది. ఉపవాసం ఉండి, టి.వీ లో అనవసరమైన కార్యక్రమాలను చూస్తూ కాలక్షేపం చేసి రాత్రికి పలహారం చేసినట్లయితే ఆఉపవాసానికి అర్ధమేమయినా ఉందా?
(నేను చదువుకునే రోజుల్లో అప్పట్లో పి.యు.సి.చదువుతున్నాను. కాలేజీలో చదివే అమ్మాయిలు ముక్కోటి ఏకాదశినాడు జాగారమ్ చేయాలనుకున్నారు. వారు చేసిన జాగారం??… రాత్రంతా నవలలను చదివి కాలక్షేపం చేసారు. ఒకళ్ళు చదివిన నవల పూర్తవగానే మరొకరు చదవడం. వారెంత పుణ్యం సంపాదించుకున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.)
ఆహారమును (భోజనమును) అలక్ష్యము చేయరాదు.
భోజన సమయములో ఎవరయినా భోజనము చేసి వెళ్ళమన్నపుడు అలక్ష్యము చేసి ఖాళీ కడుపుతో బయటకు వెళ్ళవద్దని సాయిబాబా సలహానిచ్చారు. దానిని ఒక శుభసూచకంగా భావించాలి. మనం ఏపని చేసినా అది సవ్యంగా సాగాలంటే మనకు తగిన శక్తి కావాలి. ఆశక్తి ఆహారం వల్లనే లభిస్తుంది. ఇక రెండవ విషయం ఎవరయినా ప్రేమతో భోజనం చేసి వెళ్ళమన్నప్పుడు నిరాకరిస్తే వారి మనోభావాలను గాయపరచడమే కాక, ఆవిధంగా చేయడం కూడా తప్పని చెప్పారు సాయిబాబా. నలుగురు పండితులతో కలసి భగవంతుని అన్వేషించుటకు అడవులలో తిరుగుతూ ఉండగా, ఒక బంజారా వారిని కలిసి భోజనము చేసి వెళ్లమనగా, తిరస్కరించడం వల్ల, అడవులలో దారితప్పిన తమ అనుభవాన్ని వివరించారు సాయిబాబా (అధ్యాయం – 32).
“ఉత్త కడుపుతో నేయన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు. వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజనపదార్ధములర్పించుట శుభసూచకము.” (అధ్యాయం – 32)
తరువాత సాయిబాబా బంజారా పెట్టిన భోజనము స్వీకరించి, ఆతరువాత అతని మార్గదర్శకత్వంలో తమ అన్వేషణను విజయవంతంగా చేపట్టారు. అదేవిధంగా అప్పాసాహెబ్ కులకర్ణి భోజనము చేయకుండానే హడావిడిగా ఫకీరును వెదకటానికి ఇంటినుండి బయటకు పరుగెత్తాడు (అధ్యాయం – 33). అతని అన్వేషణ నిష్ఫలమవడంతో ఇంటికి వచ్చి భోజనము చేసిన పిమ్మట, తన స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరాడు. అపుడు ఆఫకీరు తనంతతానే అతని ఎదుటకు వచ్చి దక్షిణ అడిగాడు.
ఇక్కడ నేను మీకొక విషయం కూడా చెప్పాలి. భోజనం వడ్డించిన వెంటనే మనం తినడానికి ఉపక్రమించాలి. కొంతమంది భోజనం వడ్డించిన వెంటనే రాకుండా వేరే వ్యాపకంలో మునిగిపోయి తరవాత తింటాను అలా ఉంచు అంటారు. భోజనం మనకోసం ఎదురు చూడకూడదు. ఈ విషయం గుర్తు పెట్టుకోండి.
(ఆహారం 4వ.భాగమ్ రేపటి సంచికలో)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (2వ.భాగం)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (5వ.భాగం)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (4వ.భాగం)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (1వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (16)దీనజనోధ్ధరణ (2వ.భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments