శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (15)సబూరి (ఓర్పు) (2వ.భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (15)సబూరి (ఓర్పు) (2వ.భాగం)

ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

ఒకసారి బొంబాయిలో కాకాసాహెబ్ దీక్షిత్ కుమార్తె మీద స్టీలు బీరువా పడింది.  బాబా ఆమెను కాపాడటం వల్ల ఏవిధమయిన దెబ్బలు తగలలేదు.  కాని ఆ తరువాత షిరిడీలో ఉన్నపుడు ఆమె చనిపోయింది.  కాకాసాహెబ్ చాలా విచారంలో మునిగిపోయాడు.  సాయిబాబా, ఏకనాధ్ మహరాజ్ రచించిన బావార్ధ రామాయణం గ్రంధాన్ని తీసి, వాలి మరణించిన తరువాత అతని భార్య తారకు శ్రీరామచంద్రుల వారు ఇచ్చిన ఉపదేశం ఉన్న పేజీ చూపించి కాకాసాహెబ్ ను చదవమని చెప్పారు.

**(కల్నల్  నింబాల్కర్ గారు శ్రీరాములవారు ఏమని ఉపదేశం చేసారో వ్రాయలేదు.     పాఠకులకి రామాయణంలో రాముల వారు తారని ఏవిధంగా ఓదార్చారో తెలుసుకోవాలని అనిపిస్తుంది. నాకు కూడా తెలుసుకోవాలనిపించింది.  వాల్మీకి రామాయణం – గోరఖ్ పూర్ గీతాప్రెస్ వారు ముద్రించిన గ్రంధంలోని ఆ భాగాన్ని ఇక్కడ వివరిస్తున్నాను)

కిష్కింధకాండ – 41, 42, 43 శ్లోకాలు

“ఓ వీరపత్నీ! ఇట్లు విరక్తికి లోను కావద్దు.  ఈలోకములనన్నింటిని విధాత (బ్రహ్మ) యే సృష్టించెను కదా!  ఈ సమస్త ప్రాణులకును సుఖ దఃఖములను కూర్చెడివాడు అతడేయని పండితులును, పామరులును ఎఱుగుదురు.  ముల్లోకవాసులును ఆయన వశములోనివారే.  కనుక ఆవిధి (బ్రహ్మ) విధానమును ఎవ్వరును అతిక్రమింపజాలరు.  నీకుమారుడయిన అంగదుడు త్వరలోనే యువరాజు కాగలడు.  ఆవిధముగా నీకు పరమ సంతోషమే ప్రాప్తించును.  విధి నిర్ణయమే అంత.  అందువల్ల వీరపత్నులు ఎవ్వరును విలపింపరాదు.”

44వ.శ్లోకం:

శత్రువులను శిక్షించునట్టి శ్రీరాముడు ఇట్లు యుక్తియుక్తముగా పలికి తారను ఓదార్చెను.  అప్పుడు ఆ వీరపత్ని మిక్కిలి ఊరట చెందినదై ముఖమున సంతృప్తిని స్ఫురింపజేసెను. పిదప ఆమె సంతోష వచనములను పలుకుచు తన దుఃఖమును వీడెను.)

అదే విధంగా 33వ.అధ్యాయంలో నానాసాహెబ్ చందోర్కర్ కుమార్తె మైనతాయి ప్రసవవేదన పడుతున్న సంఘటన గురించి మనకందరకు తెలుసు.  అప్పుడామె షిరిడీ నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న జలగాం జిల్లా జామ్నేర్ లో ఉంది.  సాయిబాబా, రామ్ గిరి బువా ద్వారా ఊదీని, ఆరతిపాటను వెంటనే జామ్ నేర్ కు పంపించి ఆమెకు సుఖప్రసవం కలిగేలా అనుగ్రహించారు.  కాని, ఆతరువాత ఆమె పాప చనిపోయింది.  ఆమె భర్త అంతకు ముందే మరణించాడు.  ఇపుడామెకు సంతనమూ లేక భర్తా లేక తీవ్రమయిన బాధతో కుమిలిపోసాగింది.  అందువల్ల నానాసాహెబ్ తన కుటుంబంతో సహా షిరిడీ వెళ్ళాడు.  బాబా ముందు మొహం చిటపటలాడించుకుంటూ కోపంతో కూర్చున్నాడు.

అపుడు బాబా “నానా! నీ అల్లుడు, మనమరాలు చనిపోయినందువల్ల చాలా విచారంలో మునిగి ఉన్నావు. అందుకే ఇక్కడికి వచ్చావు.  నీదంతా భ్రమ.  ఈ విషయంగానయితే నావద్దకు రావద్దు.  కారణం ఏఒక్కరి చావుపుట్టుకలు నాస్వాధీనంలో లేవు.  అవన్నీ కూడా గతజన్మల కర్మఫలితాలే. ఆఖరికి ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ సర్వశక్తిమంతుడయిన విధాత కూడా ఏవిధమయిన మార్పులు చేయలేడు.  భగవంతుడు కూడా సూర్యచంద్రుల గతిని మార్చలేడు. రెండు గంటల తరువాతగాని రెండు రోజుల తరువాత గాని సూర్యచంద్రులను తమ నియమిత సమయాన్ని దాటి ఉదయించేలా చేయగలడని నువ్వు అనుకుంటున్నావా?  అలా ఎన్నటికీ జరగదు.  భగవంతుడు ఆవిధంగా ఎన్నటికీ చేయడు.  ఆవిధంగా చేసినట్లయితే మొత్తం ప్రపంచమంతా అస్థవ్యస్థమయిపోతుంది” అని అన్నారు.

షిరిడీ నివాసి అప్పాకులకర్ణి పై ప్రభుత్వ సొమ్మును కాజేశాడనే నింద పడింది.  అహ్మద్ నగర్ డిప్యూటీ కలెక్టర్, అతనిని కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా ఉత్తర్వులు పంపించాడు.  అప్పా ఎంతో నీతిమంతుడు.  అతను మోసగాడని లోకులంతా అనుకోసాగారు. అది నిజమో అబద్దమో దేవుడికే తెలియాలి. అప్పా, సాయిబాబా వద్దకు వచ్చి తనను ఈ ఆపదనుంచి రక్షించమని వేడుకొన్నాడు. బాబా అతనికి ఎటువంటి శిక్ష పడకుండా ఆ ఆపదనుంచి కాపాడారు.

ఆ తరువాత అప్పాకు కలరా వ్యాధి సోకి వాంతులు చేసుకోసాగాడు.  అతని భార్య భర్త పరిస్థితికి భయపడి వెంటనే బాబా వద్దకు వెళ్ళి విభూతిని ప్రసాదించి తన భర్త ప్రాణాలను నిలబెట్టమని   మొఱపెట్టుకొంది.  అపుడు బాబా ఆమెతో “ఏడవకు.  పుట్టినవాళ్ళందరూ ఏదో ఒక రోజున మరణించవలసిందే”. (ఓ.వీ. 156)

“ధరించిన వస్త్రము చిరిగిపోయినా లేక దానిని ఇక ధరించటానికి ఇష్టం లేకున్నా దానిని పారవేస్తాము లేక విసర్జిస్తాము.”   ( ఓ.వీ. 159)

“వస్త్రమనే ఈ శరీరాన్ని ఆత్మ ధరిస్తుంది.  ఈ శరీరాన్ని ధరించిన ఆత్మ ప్రాణరూపంలో ఉన్న నారాయణుడు.  ఈ ఆత్మకు జననమరణాలు లేవు.  ఆత్మకు నాశనము లేదు.  ఆత్మ ఛేదింపబడనిది, స్థిరమయినది.”

“జననమరణాలు పరమేశ్వరుని కళలు.  నీకు కూడా అవి తప్పవు.  పాత బొంతకు అతుకులు వేయాలని వ్యర్ధ ప్రయత్నం చేయకు.  అతనికి అడ్డు తగలకు.  అతనిని వెళ్ళిపోనివ్వు.”

“అప్పా నాకంటే ముందుగానే తన శరీరాన్ని మార్చుకోవాలని సిధ్ధమయ్యాడు.  అతనికి సద్గతి కలుగుతుంది.  మోక్షం లభిస్తుంది.

దాసగణు అర్వాచీన భక్తలీలామృతం – 31వ.అధ్యాయం

గోపాల్ అంబడేకర్ కు గ్రహస్థితులు అనుకూలించకపోవడంతో అనేక కష్టనష్టాలకు గురయ్యాడు.  అతని ఆర్ధిక పరిస్థితులు దిగజారిపోయి, కష్టాలు ఒకదాని వెంట మరొకటి చుట్టుముట్టాయి.  జీవితం మీద విరక్తి చెంది షిరిడీలో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకొన్నాడు.  బాబా అతని ప్రయత్నాన్ని విరమింప చేయడానికి అక్కల్ కోట మహరాజ్ స్వామి చరిత్ర పుస్తకాన్నిచ్చి చదవమని చెప్పారు.  అతను ఆపుస్తకం తెరవగానే అతని సమస్యకు పరిష్కారం తెలియచేస్తున్నట్లుగా ఒక భాగం వచ్చింది.  “గత జన్మ పాపపుణ్యములను అనుభవింపక తప్పదు.  కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము తోడ్పడదు.  ఇంకొక జన్మ ఎత్తి అనుభవించవలెను.  చచ్చుటకు ముందు కొంతకాలమేల కర్మననుభవించరాదు?  గత జన్మల పాపములను ఏల తుడిచివేయరాదు?  దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము.”

“మన పూర్వ కర్మననుసరించి వ్యాధులు, కష్టాలు, దురవస్థలు, కుష్టు, రోగాలు వస్తాయి.  ఇవి పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్య చేసుకొంటే ఎటువంటి ఎటువంటి ప్రయోజనం ఉండదు.” (ఓ.వీ. 138)

“అనుభవించవలసిన సుఖాలు గాని కష్టాలు గాని పూర్తి కాకుండా, ఆత్మహత్య చేసుకొన్నచో అవి పూర్తి కావడానికి మరొక జన్మ ఎత్తవలసి ఉంటుంది.  కనుక అలాగే కష్టాలను కొంచెం సహనంతో అనుభవించు.  ఆత్మహత్య చేసుకోవద్దు.  (ఓ.వీ. 136)  అధ్యాయం – 26

అందువల్లనే సహనంతో ఉండమని సాయిబాబా ఎప్పుడూ బోధిస్తూనే ఉండేవారు.  మనం కోరుకొన్న ఫలితం వచ్చేదాక ఎంత కాలమయినా సరే సహనం కోల్పోరాదని, స్థిరమయిన మనస్సుతో ఎటువంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనగలిగేలా ధైర్యంతో ఉండమని బోధించారు.  ధైర్యం లాగే సహనం కూడా.  ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదు.  ఆ ధైర్యమే మనకు కష్టనష్టాలను ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తుంది.

ధైర్యమంటేనే సహనం.  పురుషుల పౌరుషత్వమే సహనం.  ఈ సహనం కష్టాలని, మానసిక అశాంతిని, విచారాన్ని మన దరిచేరకుండా కాపాడుతుంది.  ఈ ఓర్పు అన్ని భయాలని, ఆందోళనలని అనేకమైన యుక్తి, ప్రయుక్తులతో నివారిస్తుంది.

సహనం (సబూరి) సద్గుణ రాశి.  సహనం అన్నది అత్యంత ఉత్తమ లక్షణం.  సద్విచారమనే (మంచి ఆలోచనలకు) రాజుకు రాణివంటిది.  నిష్ఠ, సబూరి అన్యోన్యమయిన అక్క చెల్లెండ్రవంటివి.  అధ్యాయం – 19 ఓ.వీ. 56

(పదవీ విరమణ చేసిన తరవాత నవంబరు 2013వ.సంవత్సరంలో  దుబాయి వెళ్ళి మూడు నెలలు ఉన్నాను.  అప్పుడే శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము అనువాదం ప్రారంభించి 6 అధ్యాయాల వరకు అనువాదం చేశాను.  అక్కడినుండి వచ్చిన తరువాత రెండు సంవత్సరాలు అనువాదం చేయడానికి ఆటంకం కలిగింది.  ఏదయినా మనమంచికే అనుకోవాలేమో..  మూడు నెలల క్రితం ఒక సాయి భక్తుడు దాసగణుగారి అర్వాచీన భక్త లీలామృతం లోని కొన్ని అధ్యాయాలు పంపించారు.  నెలక్రితం శ్రీ సుందర చైతన్యానందస్వామి వారు వ్రాసిన చైతన్య రామాయణం, వారం క్రితం గోరఖ్ పూర్ గీతా ప్రెస్ వారు ప్రచురించిన వాల్మీకి రామాయణం కొన్నాను.  ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఈ భాగం అనువాదం చేస్తుండగా భక్త లీలామృతం, వాల్మీకి రామాయణం పరిశీలించే భాగ్యం కలిగింది.  వాటిలోని విషయాలను కూడా గ్రహించి మీకు అందించగలిగాను.  ఎప్పుడో అనువాదం చేసి ఉంటె ఈ విషయాలను పొందుపరచడం జరిగి ఉండేది కాదనిపించింది.  అంతా బాబా ఎప్పుడు ఏవిధంగా చేయించుకుంటారో అంతా ఆయన అనుగ్రహం. —  ఓమ్ సాయిరామ్)

(తరువాతి అధ్యాయం కష్టాలలో ఉన్నవారికి సేవ)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

 సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles