Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (18)గురుభక్తి (4వ.భాగం)
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
5. శిష్యునియొక్క తొమ్మిది గుణాలు :
సాయిబాబా తన భౌతిక శరీరాన్ని విడిచి వెళ్ళేముందు లక్ష్మీబాయి షిండేకి తొమ్మిది రూపాయినాణాలను ఇచ్చారు. అధ్యాయమ్ – 42. ఇందులోని గూఢార్ధం ఈ సంఖ్య నవవిధ భక్తులను తెలియచేస్తుంది. శిష్యుని యొక్క తొమ్మిది గుణాలను భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఉద్దవునికి వివరించిన విషయాన్ని హేమాడ్ పంత్ శ్రీసాయి సత్ చరిత్రలో ప్రస్తావించారు.
గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే “శిష్యుడు 1.ఎంతో అణకువగా (అహంకారం లేకుండా) 2. శ్రధ్ధాసక్తుడై, 3.ఈర్ష్యా, అసూయలు లేనివాడుగా 4.ఐహిక సుఖాల యందు అనాసక్తునిగా, 5.నిరంతరం తన గురువుకు సేవ చేసుకోవాలనే తపనతోను, 6.ముక్తి(మోక్షాన్ని) పొందుదామనే జిజ్ఞాసను కలిగినవాడై, 7.చంచల మనస్సు లేకుండా, 8.ఇతరులను దూషించని వానిగా, 9. తన గురువు ఎదుట అనవసరమైన వాదనలు చేయని వాడుగను ఉండాలి. ఈ తొమ్మిది గుణాలతోను తన గురు మహరాజ్ ను సంతృప్తి పరచడానికి కఠోర శ్రమచేయాలి. (ఓ.వి. 125) అధ్యాయం – 42
ఉత్తమ శిష్యుడయిన వానికి పైన చెప్పిన గుణాలన్నీ ఉండాలని చెప్పడం నూటికి నూరు శాతం యధార్ధమే. అవి తప్పకుండా ఉండాల్సిందే. కాని సరైన గురువును ఎంచుకోకపోతే శిష్యునిలో ఉన్న ఆగుణాలన్నీ వ్యర్ధమే కదా. అందుచేత హేమాడ్ పంత్ శ్రీసాయి సత్ చరిత్రలో అనేక చోట్ల సద్గురుని యొక్క లక్షణాలను గురించి వివరించారు.
“ఆరు శాస్త్రాలలోను (న్యాయ, వైసేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత) ప్రావీణ్యం ఉన్నవానిని, వేదాలను ఉపనిషత్తులను వివరించి చెప్పే వానిని తెలివయిన వారు సద్గురువుగా భావింపరు. “ (ఓ.వి. -3)
‘శ్వాసను బిగ పట్టి సమాధిని పొందే వారినీ, కాల్చి ఎఱ్ఱగా చేసి రాగి ధాతువుల ముద్రలను తమ శరీరం మీద వేయించుకుని, ఆచిహ్నాలను ధరించే వారిని, తను స్వీయానుభూతి పొందకుండా తమ వాక్చాతుర్యంతో బ్రహ్మమును గురించి వివరిస్తూ శ్రోతలను రంజింపచేసేవారిని జ్ఞానులు సద్గురువులని అనరు.’ (ఓ.వి. 4)
‘శిష్యులకు శాస్త్రోక్తంగా మంత్రాలనుపదేశించి, వానిని జపం చేయమని ఆజ్ఞాపించేవారు, ఫలప్రాప్తి ఎప్పుడు సిధ్ధిస్తుందో ధృఢంగా చెప్పలేని వారు సద్గురువులు కారు’ (ఓ.వి. 57)
‘బ్రహ్మమును గురించి రసవోత్తరంగా, ఆసక్తికరంగా వివరించినా స్వానుభవం ఎంత మాత్రం లేనివానిని, కేవలం మాటలే తప్ప జ్ఞానం లేని వానిని సద్గురువులుగా భావించరు.” (ఓ.వి.6)
‘వేదాలు, శాస్త్రాలలో పరిపూర్ణమయిన జ్ఞానం ఉండి శిష్యులకు ప్రత్యక్షానుభవాన్ని ఇవ్వడంలో పూర్ణ అనుభవం కలిగి ఉన్నవారికే శిష్యులకు ఉపదేశించటానికి అధికారం ఉంటుంది.’ (ఓ.వి. 8)
‘సద్గురువయినవాడు కలలోనైనా తన శిష్యునినుండి ఏవిధమయిన లాభాన్ని గాని, సేవను గాని కోరడు పైగా తానే తన శిష్యునకు సేవ చేయాలనుకుంటాడు.’ (ఓ.వి. 10)
‘శిష్యుడనగా పనికిమాలిన వాడని భావింపనివాడు, అందరిలోకి తానే శ్రేష్ఠుడిననే అహంకారం లేనివాడే సద్గురువు. అటువంటి వాడే ఈ ప్రపంచంలో శ్రేష్ఠుడయిన సద్గురువు’ (ఓ.వి. 11)
‘శిష్యుడు కూడా పరమాత్మ స్వరూపుడని భావించి పుత్ర ప్రేమతో చూస్తు వారినుంచి తన అవసరాలను తీర్చుకోని వారు సద్గురువులు. అటువంటివారే ఈప్రపంచంలో శ్రే ష్ఠులయిన సద్గురువులు’ (ఓ.వి. 12)
‘పరమశాంతికి నిధానమై, విద్యాదర్పం లేని వారి అందరినీ సమానంగా అనగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చూసేవారే సద్గురువులు’ (ఓ.వి.13) (అధ్యాయం – 48)
‘సద్గురువయిన వాడు తన శిష్యులు మోహ బంధాలలో చిక్కుకుని ఉండటం చూసి మనసులో వ్యాకుల పడుతూ వారిని ఆబంధాల నుంచి ఏవిధంగా బయటపడవేయాలా అని రాత్రింబవళ్ళు చింతిస్తూ ఉంటాడు.’ (ఓ.వి. 58 అధ్యాయం – 10)
‘ఈ ప్రపంచంలో ఎంతో మంది గురువులున్నారు. వారందరూ శిష్యులను పట్టి బలవంతంగా వారికి మంత్రోపదేశం చేసి వారి నుంచి డబ్బులు గుంజి మోసం చేస్తూ ఉంటారు.’ (ఓ.వి. 61)
‘కొంతమంది గురువులు శిష్యులకు ధర్మబధ్ధంగా ఏవిధంగా నడచుకోవాలో బోధిస్తారు. కాని తాము మాత్రం దానికి విరుధ్ధంగా ప్రవర్తిస్తారు. అటువంటివారు మనలను భవసాగరాన్ని ఏవిధంగా దాటించగలరు? మనలను కష్టాల నుండి, బాధల నుండే కాక జనన మరణ చక్రాలనుండి కూడా తప్పించలేరు.’ (ఓ.వి. 62)
‘నియత గురువులని, అనియత గురువులని రెండు రకాల గురువులున్నారు. ఈ రెండు రకాల గురువుల గురించి వివరంగా తెలుసుకుందాము.’ (ఓ.వి. 65)
‘అనియత గురువులు సమయానుకూలముగా వచ్చి ఏదయినా సలహానిచ్చి మన అంతరంగములోని సుగుణాన్ని వృధ్ధి చేసి మోక్షమార్గంలో పయనింప చేస్తారు.’ (ఓ.వి. 66)
‘నియత గురువులతో అనుబంధం ఏర్పడితే నీవు నేను అనే ద్వంద్వ భావాన్ని పోగొట్టి అంతరంగాన్ని యోగంలో ప్రతిష్టించి, ‘తత్వమసి’ అనే మహా వాక్యాన్ని ఆగురువులు ప్రత్యక్షంగా అనుభవింప చేస్తారు. అనగా భగవంతుడు నీవు వేరు కాదనే విషయాన్ని మనకు తెలియచేస్తారు. (ఓ.వి. 67) అధ్యాయం – 10
సాయిబాబా రెండవ కోవకి చెందిన సద్గురువు. అంతే కాదు ఆయన సర్వశక్తిమంతులు. ప్రపంచ జ్ఞానాన్ని బోధించే గురువులు అనేకమంది ఉన్నారు. కాని ఎవరయితె సహజస్థితిలో నిలిచేలా చేసి మనలను ప్రపంచపు ఉనికికి అతీతంగా తీసుకుని వెడతారో ఆయనే అసలయిన సద్గురువు. సంసారసాగరాన్ని సులభంగా దాటించేవారే సమర్ధ సద్గురువు. సద్గురువుయొక్క మహిమ, గొప్పతనం అద్వితీయం. అది అగోచరమయినది. (ఓ.వి. 70) (అధ్యాయం – 10)
అందుచేతనే సాయిబాబా తన భక్తులయిన మహల్సాపతి, కాకాసాహెబ్ దీక్షిత్, దాసగణు మహరాజ్, ఉపాసనీ మహరాజ్ లను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్ళగలిగారు.
ఇంకా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే 1938 సంవత్సరంలో అనగా సాయిబాబా మహా సమాధి చెందిన 20 సంవత్సరముల తరువాత, ఆయన కరాచీలో ఉన్న శ్రీమోటా గారికి దర్శనమిచ్చి ఆత్మసాక్షాత్కారం పొందడానికి చేయవలసిన కొన్ని యోగా పధ్ధతులను వివరించారు. శ్రీమోటా గారికి 29 మార్చి 1938 సంవత్సరంలో రామనవమి రోజున వారణాసిలో ఆత్మసాక్షాత్కారం కలిగింది.
శ్రీమోటాగారు గుజరాత్ రాష్ట్రంలో పేరుగాంచిన గొప్ప యోగీశ్వరుడు. ఆయన తన జీవిత చరిత్రలో “సాయిబాబా నా ఆధ్యాత్మిక ప్రగతికి తుది మెరుగులు దిద్దారు” అని వ్రాసుకున్నారు. (HariOm Asram founded by SrI Mota)
సాయిబాబా వారు చెప్పినట్లుగా పైన చెప్పబడిన సలహాలను పాటించి, శిష్యుడయినవాడు సద్గురువుకు విధేయతలతో సేవ చేసినట్లయితే ఆధ్యాత్మికంగా పురోగతి ఖచ్చితంగా సాధించి తీరతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. గురువు యొక్క యోగ్యత ఎంత ఘనంగా ఉంటే శిష్యుని యొక్క భక్తి కూడా ఆవిధంగానే ఉంటుంది.
‘విశ్వాసంతో మన శరీరాన్ని, మనస్సుని, ధనాన్ని, సర్వస్వాన్ని సద్గురు పాదాల వద్ద భక్తి పూర్వకంగా సమర్పించాలి. జీవితమంతా సద్గురు సేవలో ఆజన్మాంతము ఆయువును వెచ్చించాలి.’ (ఓ.వి. 57)
‘గురునామం, గురు సహవాసం, గురుకృప, గురుచరణ తీర్ధం, గురుమంత్రం, ఇవి ప్రాప్తించడం అత్యంత కష్టం’ (ఓ.వి. 58)
‘తన ప్రచండ శక్తితో గురువు భక్తుల భక్తిని పరీక్షించి, వారిని అవలీలగా మోక్షద్వారానికి తీసుకుని వెడతారు.” (ఓ.వి. 59) అధ్యాయం – 1
(రేపటి సంచికలో జ్యోతిష్య శాస్త్రం)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (18)గురుభక్తి (1వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (18)గురుభక్తి (3వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (18)గురుభక్తి (2వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (14)నిష్ఠ (ధృఢమయిన నమ్మిక) (1వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (10)అహంకారం (1వ.భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments