Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!! శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)
రాధాబాయి యను ముసలమ్మ యుండెను. ఆమె ఖాశాభా దేశ్ ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసికొని యేదైన యుపదేశమును పొందవలెనని మనో నిశ్చయము చేసికొనెను. ఆమె కింకేమియు తెలియకుండెను. బాబా యామెను ఆమోదించక మంత్రోపదెశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము, నీరు మూడుదినములవరకు మానివేసెను. ఆమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని. “దేవా! మీరేమి ప్రారంభించితిరి? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని, నీ వెరిగియే యుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడియున్నది. నీవు ఆమె నామోదించి ఉపదేశమిచ్చునంతవరకామె యిట్లు చేయనున్నది. ఏమైన హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశ మివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెనుకరుణించుము. ఆశీర్వదించుము. తగిన సలహా యిమ్ము”. ఆమె మనో నిశ్చయమును జూచి, బాబా యామెను బిలిపించి, ఈ క్రింది విధముగా బోధించి యామె మనస్సును మార్చెను.
“ఓ తల్లీ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి; నేను నీ బిడ్డను. నాయందు కనికరించి నేను చెప్పునది పూర్తిగ వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీ కది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు; మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలాకాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారే మంత్రము నూదలేదు. వారిని విడుచు తలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారిసేవ చేయుటకు, వారివద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి; రెండు పైసలు దక్షిణ యడిగిరి. వెంటనే యిచ్చితిని. “మీ గురువుగారు పూర్ణకాములయినచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల? వారు నిష్కాములని యెట్లనిపించుకొందురు?” అని మీరడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయున దేమున్నది? వారు కోరిన రెండు కాసులు 1. దృఢమైన విశ్వాసము 2. ఓపిక లేదా సహనము. నేనీ రెండు కాసులను లేదా వస్తువులను వారి కర్పించితిని, వారు సంతోషించిరి.
నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనమునకుగాని వస్త్రమునకుగాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్ప వచ్చును. నేను దాని నెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు. నేను వారిని జూచునప్పుడు, వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనుపించుచుండిరి. మేమిద్దర మానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టినిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా యాశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడు వారియిందే నాటుకొని యుండెడిది. ఇదియే ఒక పైసా దక్షిణ. సాబూరి (ఓపిక) యనునది రెండవ పైసా. నేను మిక్కిలి యోరిమితో చాలకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపిక యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి యనునది పురుషలక్షణము. అది పాపము లన్నిటిని తొలగించి, భయమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములు తొలగించి, భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగజేయును. సాబూరి యనునది సుగుణములకు గణి, మంచి యాలోచనకు తోడువంటిది. నిష్ఠ (నమ్మకము), సాబూరి (ఓపిక) అన్యోన్యముగా ప్రేమించు అక్క చెల్లెండ్రవంటివారు.
నా గురువు నానుండి యితర మేమియు నాశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాలసర్వావస్థలయందు కాపాడుచుండెడి వారు. నేను వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను, వారి ప్రేమకు ఎన్నడును లోటు కలుగలేదు. వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచునట్లు నన్ను గూడ మా గురువుదృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక యొడ్డున నుండును. బిడ్డతాబేలు రెండవ యొడ్డున ఉండును. తల్లి తాబేలు, పిల్లతాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దది యగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిల్పి నన్ను ప్రేమతో గాపాడిరి. ఓ తల్లీ! నా గురువు నాకు మంత్రమేమియు నుపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్ర మెట్లు ఊదగలను? గురువుగారి ప్రేమమయమయిన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపక ముంచుకొనుము. మంత్రముగాని యుపదేశముగాని యెవ్వరివద్దనుంచి పొందుటకు ప్రయత్నించకుము. నీ యాలోచనలు నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడము. నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనలుగాని యారు శాస్త్రములలో ప్రావీణ్యముగాని యవసరము లేదు. నీ గురువు నందు నమ్మకము విశ్వాసము నుంచుము. గురువే సర్వమును చేయు వాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని హరిహర బ్రహ్మల (త్రిమూర్తుల) యవతారమని యెంచెదరో వారే ధన్యులు.”
ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యాముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదులుకొనెను.
ఈ కథను జాగ్రత్తగాను, శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును, సందర్భమును గుర్తించి, హేమడ్ పంతు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ యాశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని యాపాదమస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను. ఒక్క మాటైన మాట్లాడుటకు చేతకాకుండెను. శ్యామా అతని నీస్థితిలో జూచి “ఏమి జరిగినది; యేల యూరకున్నవు? అట్టి బాబా లీలలు నీ కెన్ని వర్ణింపవలెను?” అని యడిగెను.
అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి. కనుక శ్యామా, హేమాడ్ పంతు మసీదుకు త్వరగా పోయిరి. బాపుసాహెబు జోగు అప్పడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరు భాజాభజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామా; ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని జూచి బాబా హేమాడ్ పంతుకు శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామా రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెదననియు, శ్యామా ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చు ననెను. బాబా యిట్లనెను. “సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడితిరా? అట్లయినచో మీ రేమి మాట్లాడితిరో చెప్పుము.” గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని, లెక్కించక హేమడ్ పంతు బాబాకు జరిగిన దంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించిన దంతయు చాల ఆనందము కలుగ జేసినదనియు ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి యాశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరమని, తెలిసికొంటిననియు ఆ కథరూపముతో తనను బాబా ఆశీర్వదించిరని హేమడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా యిట్లనియె. “కథ చాల అద్భుతమైనది. నీ వెట్లు ఆనందించితివి? నాకా విషయమై వివరములన్నియు చెప్పుము.” అప్పుడు హేమాడ్ పంతు తానింతకుముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి. యది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. “ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా?” యని బాబా హేమాడ్ పంతు నడిగెను. “అవును బాబా! నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలిగితిని” అని హేమాడ్ పంతు బదులిచ్చెను.
బాబా యిట్లు చెప్పెను. “నా పద్దతి మిక్కిలి విశిష్ఠమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము. అది మిక్కిలి యుపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యాన మవసరము. దాని నలవరచు కొన్నచో వృత్తులన్నియును శాంతించును. కోరికలన్నియు విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశియందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకారస్వభావమును ధ్యానించిన అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా యాకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు, చైతన్యముతో నైక్యమై, బ్రహ్మముతో నభిన్నమగును. తల్లితాబేలు నదికి ఒక యొడ్డున నుండును. దాని పిల్ల లింకొక యొడ్డున నుండును. వానికి పాలిచ్చుటగాని, పొదువుకొనుటగాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీచేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లితాబేలు చూపు చిన్నవానికి యమృతధారవలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమున కాధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే.” బాబా యీ మాటలు పూర్తిచేయుసరికి, హారతి పూర్తియాయెను. అందరు ‘శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై’ యని కేక పెట్టిరి. ఓ ప్రియమైన చదువరులారా! యీ సమయమందు మనముకూడ మసీదులోని గుంపులో కలిసి యున్నట్లు భావించి మనము కూడ జయజయ ధ్వనులతో పాల్గొందుము.
హారతి పూర్తి కాగానే, ప్రసాదము పంచి పెట్టిరి. బాబాకు నమస్కరించి బాపుసాహెబు జోగ్ బాబాచేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంతు చెతిలో పెట్టి యిట్లనెను. “ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో, నీ స్థితి కలకండ వలె తియ్యగా నుండును. నీ కోరికలన్నియు నెరవేరును. నీవు సుఖముగా నుందువు.” హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగనమస్కారము చేసి “ఇట్లు ఎల్లప్పుడు నాకు మేలు చేయుము, ఆశీర్వదించుము, కాపాడుము.” అని బతిమాలెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. “ఈ కథను వినుము. దీనిని మననము చేయుము. ఇది ధ్యానము చేయుము. అట్లయనచో నీవు భగవంతుని ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగను.”
ఓ ప్రియమైన చదువరులారా! అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి, ధ్యానించి, మనస్సున నిలిపెదము. ఇట్లు బాబాకృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ నాల్గవ భాగం–Audio
- ఉద్ధవరావ్ దేశ్ పాండే
- శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ రెండవ భాగం–Audio
- సాయి మార్గములో పెద్దలు(శ్రీమతి దండి విమల అమ్మగారు)
- మాధవరావు దేశ్పాండే ఉరప్ శ్యామా ఏడవ భాగం ….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments