Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
ఒకనాడు గోవానుండి యిద్దరు పెద్దమనుష్యులు బాబా దర్శనమునకై వచ్చి, బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరు కలిసివచ్చినప్పటికి, బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ యిమ్మనెను. ఇంకొకరు అడుగకుండగనే 35 రూపాయలివ్వగా నందరికి ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామా బాబా నిట్లడిగెను. “ఇది యేమి? ఇద్దరు కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ యామోదించితివి. రెండవవానిది తిరస్కరించితివి. ఎందులకీ భేద భావము?” బాబా యిట్లు జవాబిచ్చెను. “శ్యామా! ఎందులకో నీకేమియును తెలియదు. నేనెవరివద్ద ఏమియు తీసికొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీయున్న వాడు చెల్లించి, ఋణవిమోచనము పొందును. నా కిల్లుగాని, ఆస్తిగాని, కుటుంబము గాని గలవా? నాకేమీ యక్కరలేదు. నేనెప్పుడు స్వతంత్రుడను. ఋణము, శతృత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు.” పిమ్మట బాబా తన విశిష్టధోరణిలో నిట్లనెను. “ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటినెల జీతము నిచ్చెదనని తన ఇష్టదైవమునకు మ్రొక్కుకొనెను. అతనికి నెలకు 15రూపాయల ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయలనుంచి 30, 60, 100, 200లకు హెచ్చెను. తుదకు 700లకు హెచ్చెను. అతడు ఐశ్వర్యము ననుభవించు కాలమందు తన మ్రొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని నిచటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే (15 రూపాయలు) నేను దక్షిణ రూపముగా నడిగితిని.”
ఇంకొక కథ
సముద్రతీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనమువద్దకు వచ్చి, దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగ నాదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువాప్రక్కన శుభ్రమైన స్థలము చూపి యక్కడ పరుండు మనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢనిద్రలో నుండగా, ఆ మనిషి యొక రాతిపలకను లాగి గోడకు కన్నము చేసి, లోపల ప్రవేశించి, నా జేబులో నున్న ద్రవ్యమునంతయు దొంగలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని, ఏడ్చుచు కూర్చుంటిని. పైక మంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించెననుకొంటిని. భోజనము, నీరు రుచింపవయ్యెను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమున కేడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారివెంట పోవుచు నే నేడ్చుచుండుట జూచి, యెందుల కేడ్చుచుంటి వని యడిగెను. నేను జరిగిన వృత్తాంతము చెప్పితిని. వారిట్లనిరి. “నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నేనిచ్చెదను. వారి శరణు వేడుము. వారు నీ పైకమును నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన యాహారమేదో దానిని నీ ద్రవ్యము దొరకునంతవరకు విసర్జింపుము.” నేను ఫకీరు చెప్పినట్లు నడచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపుటొడ్డునకు బోయితిని. అక్కడొక స్టీమరుండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయితిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు బోయితిని. అది యింకొక యొడ్డునకు దీసికొని పోయినది. అక్కడ రైలుబండి నెక్కి యీ మసీదుకు వచ్చితిని.
కథ పూర్తికాగానే బాబా ఆ యతిథులను భోజనముకొరకు తీసికొని పొమ్మనగా శ్యామా యట్లే చేసెను. శ్యామా వారి నింటికి దీసికొనిపోయి భోజనము పెట్టెను. భోజనసమయములో శ్యామా బాబా చెప్పినకథ చిత్రముగానున్నదనెను. బాబా వారెన్నడు సముద్రతీరమునకు పోయి యుండలేదు. వారివద్ద 30,000 రూపాయలెప్పుడు లేకుండెను. ఎన్నడు ప్రయాణము చేయలేదు. ద్రవ్యమెప్పుడును పోవుటగాని వచ్చుటగాని జరుగలేదు. కాన దాని భావము తమకేమైన దెలిసినదా? యని వారినడిగెను. అతిథుల మనస్సులు కరగెను. వారు కండ్ల తడి పెట్టుకొనిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే యని నుడివిరి. బాబా చెప్పిన కథ మాగూర్చియే. వారు చెప్పిన దంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో యనునది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పెద” మనిరి.
భోజనమయిన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో నొకరు ఇట్లు చెప్పిరి. “లోయ లోనున్న యూరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేనుద్యోగము సంపాదించి గోవా వెళ్ళితిని. నేను దత్తదేవునికి నాకు ఉద్యోగము లభించిన నా మొదటినెల జీతము నిచ్చెదనని మ్రొక్కుకొంటిని. వారి దయ వల్ల 15రూపయల యుద్యోగము నాకు దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయలవరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచితిని. దానిని బాబా యివ్వధముగా జ్ఞప్తికి దెచ్చి నావద్ద 15 రూపాయలు తీసికొనిరి. అది దక్షిణ కాదు. అది పాత బాకీ; తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట.”
నీతి
బాబా యెన్నడు డబ్బు భిక్షమెత్తలేదు, సరికదా తమ భక్తులు కూడ భిక్షమెత్తికొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను, పరమును సాధించుట కడ్డుగాను బావించువారు. భక్తులు దాని చేతులలో జిక్కకుండ కాపాడెడివారు. ఈ విషయమున భక్త మహళ్సాపతి యొక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజనవసతికి కూడ జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా యనుమతించలేదు; దక్షిణలోనుండి కూడ ఏమియు ఈయలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాల ద్రవ్యమును బాబా సముఖమున మహళ్సాపతి కిచ్చెను. కాని బాబా దానిని పుచ్చుకొనుట కనుమతించలేదు.
పిమ్మట రెండవ యతిథి తన కథనిట్లు ప్రారంభించెను. “నా బ్రాహ్మణ వంటమనిషి నావద్ద 35 సంవత్సరములనుండి నౌకరి చేయుచుండినను, దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగలించెను. రాతి పలకను తొలగించి, ధనము దాచిన బోషాణమున్న గదిలో నాయాస్తి సర్వమును అనగా 30,000 రూపాయలు కరెన్సీని దొంగలించి పారిపోయెను. బాబా సరిగా ఆ మొత్తమునే యెట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నియు విఫలమైనవి. ఒక పక్షమువరకు చాల యారాట పడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొనియుండగా ఒక ఫకీరు నా స్థితిని గనిపెట్టి కారణమును దెలిసికొనెను. నేను వివరములన్నియు దెలిపితిని. అతడు “షిరిడీ సాయి యను ఔలియా యున్నారు, వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన యాహారము విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయువరకు నీకు ప్రియమైన యాహారమును తిననని మ్రొక్కుకొనుము.” అనెను. నేనట్టులే “బాబా! నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనము చేసిన పిమ్మట, నేనన్నము తినెదను” అని మ్రొక్కుకొంటిని.
దీని తరువాత 15 దినములు గడచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నా కిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనియెను. “నేను పిచ్చియెత్తి యిట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై బెట్టితిని. దయచేసి క్షమించుము.” ఈ విధముగా కథ సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయమొనర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుట కెంతో గాఢమైన కోరిక కలిగినది. మాయింటి కంత దూరము వచ్చినవారు షిరిడీ సాయిబాబాయే యని నా నమ్మకము. ఎవరయితే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాశ చూపెదరా” దీనికి వ్యతిరేకముగా మావద్దనుంచి యేమియు ఆశించక, ఎల్లప్పుడు తమ చేతనయినంతవరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు.
దొంగలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు బాబాను స్వప్నములో జూచితిని. షిరిడీకి పోవలెనను సంగతి యప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళితిని, అక్కడనుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటునుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని. నేను హార్బరువద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండెను. కేప్టెను ఒప్పుకొనలేదు కాని, నాకు పరిచయములేని నవుకరొకడు చెప్పగా నొప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసికొనివచ్చెను. అక్కడనుండి యిక్కడకు రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడ? మా యిల్లెక్కడ? మా అదృష్టమేమని చెప్పవలెను! బాబా యా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాగుకొనివచ్చెను. షిరిడీ జనులారా! మీరు మాకంటె పుణ్యాత్ములు, మాకంటె యదృష్టవంతులు. ఏలన, బాబా మీతో యాడి, నవ్వి, మాట్లాడి యెన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యమనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా యిప్పించిరి. నన్ను ఇచ్చటకు దెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- తిరుపతిలో వేంకటేశ్వర స్వామి, సాయి వేరు కాదు ఇద్దరు ఒక్కటే
- గ్వాలియర్, గోవా రాజపరివారం వాళ్ళు ఇప్పటికి సాయి బాబా భక్తులే
- ఒకరు కాదు ఇద్దరు…..సాయి@366 సెప్టెంబర్ 1….Audio
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- సాయిబాబా వారిగాధలే నాకు మార్గదర్శి అన్న మహేష్ బాబా.—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments