హేమాడ్ పంతు ఇంట హోళీపండుగ భోజనము



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము.

1917వ సంవత్సరము హోళీ పండుగనాడు వేకువజామున హేమాడ్ పంతు కొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలె బాబా గాన్పించి, నిద్రనుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్రనుండి లేపినది కూడ కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని, బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు దెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతిమాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము ఏడు సంవత్సరములనుండి యున్నప్పటికి, బాబా ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికి, బాబా తన యింటికి వచ్చి భోజనము చేయునని అతడనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్యవద్దకు బోయి ఒకసన్యాసి భోజనమునకు వచ్చును గాన, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. ఆది హోళీ పండుగదినము. వచ్చువారెవరని, ఎక్కడనుండి వచ్చుచున్నారని యామె యడిగెను. ఆమె ననవసరముగా పెడదారి పట్టించక ఆమె యింకొక విధముగా భావింపకుండునట్లు, జరిగినది జరిగినట్లుగా చెప్ప నెంచి, తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండివంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని, యామెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైన బంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను.

మధ్యాహ్నభోజనమునకై ప్రయత్నము లన్నియు చేసిరి. మిట్టమధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి. ముగ్గులు పెట్టిరి. భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి, రెండింటిమధ్య నొక పీట బాబాకొర కమర్చిరి, గృహములోని వారందరు కొడుకులు, మనుమలు, కొమార్తెలు, అల్లుళ్ళు మొదలగువారందరు వచ్చి వారి వారి స్థలముల నలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరు అతిథికొరకు కనిపెట్టుకొనియుండిరి. 12 గంటలు దాటినప్పటికి ఎవరు రాలేదు. తలుపు వేసి గొండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి యయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుట కిది యొక గుర్తు; అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా, మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపుతీయగా ఇద్దరు మనుష్యులచట నుండిరి. 1. అలీమహమ్మద్, 2. మౌలానా ఇస్ముముజావర్. ఆ యిరువురు, వడ్డన మంతయు పూర్తియై అందరును భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించుమని కోరియిట్లు చెప్పిరి. “భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు. కావున, ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు దెలిపెదము.” అట్లనుచు తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబిల్ పైన బెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరగెను, కండ్లనుండి నీరు కారెను, శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా యీ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని యనుకొనెను. గొప్ప యాసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీమహమ్మద్ ను అడిగెను. అతడా పటమొక యంగడిలో కొంటిననియు, దానికి సంబంధించిన వివరము లన్నియు తరువాత తెలియజేసెద ననెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొని యుండుటచే త్వరగా పొమ్మని యనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెల్పి భోజనశాలలోనికి బోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపయి బెట్టి వండిన పదార్థములన్నియు వడ్డించి, నైవేద్యము పెట్టినపిమ్మట అందరు భుజించి, సకాలమున పూర్తి చేసిరి. పటములో నున్న బాబా యొక్క చక్కని రూపును జూచి యందరు అమితానందభరితు లయిరి. ఇదంతయు నెట్లు జరిగెనని యాశ్చర్యపడిరి.

ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో జెప్పినమాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను.

సంపాదకీయం:  శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles