దేవుగారింట ఉద్యాపనపత్రము



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

దహనులో బి.వి. దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25, 30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి యుండెను. ఈ కార్యములో 100, 200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి యుండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపు సాహెబుజోగ్ గారికి కొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయ వలయుననియు, వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాసెను. జోగ్ ఆ యుత్తరము చదివి బాబాకు వినిపించెను. మనః పూర్వకమయిన విజ్ఞాపనను విని బాబా యిట్లనియె. “నన్నే గురుతుంచుకొను వారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరములేదు. నన్ను ప్రేమతో బిలచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్ష్యమయ్యెదను. అతనికి సంతోషమయిన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయుము.” జోగ్ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగా రెంతో సంతసించిరి. కాని బాబా రాహాతా, రుయి, నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియును. బాబాకు అశక్యమైన దేమియు లేదు. వారు సర్వాంతర్యామి యగుటచే హఠాత్తుగా నేరూపమున నయిన వచ్చి, తమ వాగ్ధానమును పాలించ వచ్చు ననుకొనెను.

ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి యొకడు గోసంరక్షణకయి సేవచేయుచు దహను స్టేషన్ మాస్టరు వద్దకు చందాలు వసూలుచేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు, ఊరి లోనికి పోయి మామలతదారుని కలిసికొని వారి సహాయముతో చందాలు వసూలు చేయుమనెను. అంతలో మామలతదారే యచ్చటికి వచ్చెను. స్టేషను మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమొనర్చెను. ఇద్దరు ప్లాట్ ఫారమ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు, ఊరిలో నేదో మరొక చందాపట్టి రావుసాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే, నింకొకటి యిప్పుడే తయారుచేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి యచటనుండి పోయెను. ఒకనెల పిమ్మట యా సన్యాసి యొక టాంగాలో వచ్చి, 10 గంటలకు దేవుగారి యింటిముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై యుండుట జూచి, తాను చందాలకొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితిననియు సన్యాసి చెప్పెను. అందుకు దేవు “మంచిది; చాల మంచిది, మీకు స్వాగతము. ఈ గృహము మీదే” యనెను. అప్పుడు సన్యాసి “ఇద్దరు కుర్రవాళ్ళు నాతో నున్నారు.” యనెను. దేవు: “మంచిదే, వారితో కూడ రండు,” అనెను. ఇంకా రెండుగంటల కాలపరిమితి యుండుటచే, వారికొరకు ఎచ్చటికి పంపవలెనని యడిగెను. సన్యాసి ఎవరిని బంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి.

ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపుసాహెబు జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసికొని బాబావద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునుపే బాబా యిట్లనెను. “హా! వాగ్దానము చేసి, దగా చేసితిననుచున్నాడు. ఇద్దరితో కూడ నేను సంతర్పణకు హాజరయితిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేల? సన్యాసి చందాల కొరకు వచ్చెనని యనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి యారగించలేదా? నామాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిచెదను. నామాటలను నేనెప్పుడు పొల్లు చేయను.” ఈ జవాబు జోగ్ హృదయంలో నానందము కలుగ జేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు ఆనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటిరాకచే తానెట్లు మోసపోయెనో; సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలసి భోజనమునకు వచ్చెదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట – మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను.

భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు అనునది యీ కథవల్ల స్పష్టపడుచున్నది.

సంపాదకీయం:  శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles