🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబదియవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

నలుబదియవ అధ్యాయము

ప్రస్తావన; దేవుగారింట ఉద్యాపన వ్రతము;

హేమాడ్‌పంతు ఇంటికి ఫోటో రూపములో వెళ్ళుట

ఈ యధ్యాయములో రెండు కథలు చెప్పుదుము. 1. దహనులో బి.వి. దేవుగారింటికి వారి తల్లి యాచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2. బాంద్రాలోని హేమాడ్‌పంతు ఇంటికి హోళీ పండుగనాడు భోజనమునకు పోవుట.

ప్రస్తావన :

శ్రీ సాయి సమర్థుడు, పావనమూర్తి. తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాల నిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును.

సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారి లోనికి పంపించి భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తింపజేయును.

వారు తమ భక్తుల యెడ భేదము లేక, తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున జేర్చుకొనెడి వారు.

వర్షాకాలములో నదులు కలియు సముద్రమువలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యుల కిచ్చును.

దీనినిబట్టి యెవరయితే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడినవారికంటెగాని, యంతకంటె యెక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను.

ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదము.

దేవుగారింట ఉద్యాపనవ్రతము :

దహనులో బి.వి. దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25, 30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి యుండెను.

ఈ కార్యములో 100, 200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి యుండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను.

దేవుగారు బాపూసాహెబు జోగ్‌గారి కొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయ వలయుననియు, వారు రాకున్నచో అసంతృప్తి కరముగా నుండుననియు వ్రాసెను.

జోగ్‌ ఆ యుత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమయిన విజ్ఞాపనను విని బాబా యిట్లనియె. ”నన్నే గుర్తుంచుకొనువారిని నేను మరువను. నాకు బండి గాని, టాంగా గాని, రైలుగాని, విమానము గాని యవసరము లేదు.

నన్ను ప్రేమతో బిలుచువారి యొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను. అతనికి సంతోషమయిన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయుము”.

జోగ్‌ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కాని బాబా రహతా, రుయీ, నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికీ పోరని ఆయనకు తెలియును. బాబాకు అవశ్యమైనదేమియు లేదు.

వారు సర్వాంతర్యామి యగుటచే హఠాత్తుగా నేరూపమున నయిన వచ్చి, తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను.

ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి యొకడు గోసంరక్షణకయి సేవచేయుచు దహను స్టేషను మాస్టరు వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను.

స్టేషన్‌ మాస్టరు, సన్యాసిని ఊరి లోనికి పోయి మామలతదారుని కలిసికొని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను.

అంతలో మామలతదారే యచ్చటికి వచ్చెను. స్టేషన్‌ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమొనర్చెను. ఇద్దరు ప్లాట్ పారమ్ మీద కూర్చుండి మాట్లాడిరి.

దేవు, ఊరిలో నేదో మరొక చందా పట్టి రావుసాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే, నింకొకటి యిప్పుడే తయారుచేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను.

ఈ మాటలు విని సన్యాసి యచట నుండి పోయెను. ఒక నెల పిమ్మట యా సన్యాసి యొక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి యింటిముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమోయని దేవు అనుకొనెను.

ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై యుండుట జూచి, తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితినని సన్యాసి చెప్పెను.

అందుకు దేవు ”మంచిది ! చాల మంచిది ! మీకు స్వాగతము. ఈ గృహము మీదే” ! యనెను. అప్పుడు సన్యాసి ”ఇద్దరు కుఱ్ఱవాళ్ళు నాతో నున్నారు” అనెను.

దేవు ”మంచిది, వారితో కూడ రండు” ! అనెను. ఇంకా రెండు గంటల కాలపరిమితి యుండుటచే, వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని యడిగెను.

సన్యాసి ఎవరిని బంప నవసరము లేదనియు తామే స్వయముగా వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను.

సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి.

ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపూసాహెబు జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను.

జోగు ఉత్తరము తీసికొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునుపే బాబా యిట్లనెను. ”హా ! వాగ్దానము చేసి, దగా చేసితి ననుచున్నాడు.

ఇద్దరితో కూడ నేను సంతర్పణకు హాజరయితిని. కాని నన్ను పోల్చుకొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేల ? సన్యాసి చందాల కొరకు వచ్చెనని యనుకొనెను.

అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి యారగించలేదా ?

నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను”. ఈ జవాబు జోగ్‌ హృదయములో నానందము కలుగజేసెను.

బాబా సమాధాన మంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు ఆనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను.

సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో; సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చెదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట – మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను.

భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు అనునది యీ కథవల్ల స్పష్టమగుచున్నది.

హేమాడ్‌పంతు ఇంటికి ఫోటో రూపములో వెళ్ళుట :

ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము.

1917వ సంవత్సరము హోళీ పండుగనాడు వేకువఝామున హేమాడ్‌పంతు కొక దృశ్యము కనిపించెను.

చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలె బాబా కాన్పించి, నిద్రనుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను.

ఇట్లు తనను నిద్రనుంచి లేపినది కూడ కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసి గాని, బాబా గాని కనిపించలేదు.

స్వప్నమును బాగుగా గుర్తుకు దెచ్చుకొనగా, సన్యాసి చెప్పిన ప్రతిమాట జ్ఞాపకమునకు వచ్చెను.

బాబా గారి సహవాసము ఏడు సంవత్సరములనుండి యున్నప్పటికి, బాబా ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికి, బాబా తన యింటికి వచ్చి భోజనము చేయునని అతడనుకొనలేదు.

బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు బోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాక, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను.

అది హోళీ పండుగ దినము. వచ్చువారెవరని ఎక్కడనుంచి వచ్చుచున్నారని యామె యడిగెను.

ఆమె ననవసరముగా పెడదారి పట్టించక ఆమె యింకొక విధముగా భావింపకుండునట్లు, జరిగినది జరిగినట్లుగా చెప్పనెంచి, తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను.

షిరిడీలో మంచి మంచి పిండివంటలను విడిచి బాబా తనవంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని, యామెకు సంశయము కలిగెను.

అందులకు హేమాడ్‌పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైన బంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను.

మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నము లన్నియు చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోళీ పూజ ముగిసెను.

విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య నొక పీట బాబాకొర కమర్చిరి.

గృహములోని వారందరు కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగువారందరు వచ్చి వారి వారి స్థలముల నలంకరించిరి.

వండిన పదార్థములు వడ్డించిరి. అందరు అతిథి కొరకు కనిపెట్టుకొని యుండిరి.

12 గంటలు దాటినప్పటికి ఎవరు రాలేదు. తలుపు వేసి గొండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి యయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి.

భోజనము ప్రారంభించుట కిది యొక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా మేడ మెట్లపై చప్పుడు వినిపించెను.

హేమాడ్‌పంతు వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు మనుష్యులచట నుండిరి. ఒకరు అలీమహమ్మద్‌ వేరొకరు మౌలానా ఇస్ముముజావర్‌.

ఆ యిరువురు వడ్డన మంతయు పూర్తియై అందరును భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్‌పంతును క్షమించుమని కోరి యిట్లు చెప్పిరి.

”భోజన స్థలము విడిచి పెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు. కావున, ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంత మంతయు దెలిపెదము”.

అట్లనుచు తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబిల్‌పైన బెట్టిరి.

హేమాడ్‌పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటముండెను.

అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను.

అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా యీ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని యనుకొనెను.

గొప్ప యాసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీమహమ్మద్‌ను అడిగెను. అతడా పటమొక యంగడిలో కొంటిననియు, దానికి సంబంధించిన వివరములన్నియు తరువాత తెలియజేసెదననెను.

తక్కినవారు భోజనమునకు కనిపెట్టుకొని యుండుటచే త్వరగా పొమ్మని యనెను. హేమాడ్‌పంతు వారికి అభినందనలు తెల్పి భోజనశాలలోనికి పోయెను.

ఆ పటము బాబా కొరకు వేసిన పీటపయి బెట్టి వండిన పదార్థములన్నియు వడ్డించి, నైవేద్యము పెట్టిన పిమ్మట అందరు భుజించి సకాలమున పూర్తిచేసిరి.

పటములో నున్న బాబా యొక్క చక్కని రూపును జూచి యందరు అమితానంద భరితులయిరి. ఇదంతయు నెట్లు జరిగెనని యాశ్చర్యపడిరి.

ఈవిధముగా బాబా హేమాడ్‌పంతుకు స్వప్నములో జెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను.

ఆ ఫోటో వివరములు అనగా అది అలీమహమ్మదు కెట్లు దొరికెను ? అతడెందుకు తెచ్చెను. దానిని హేమాడ్‌పంతు కెందుకిచ్చెను ? అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందము.

నలుబదియవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles