🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది నాలుగవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ఇరువది నాలుగవ అధ్యాయము

శనగల కథ – నీతి; సుదాముని కథ; అణ్ణా చించణీకరు-మావిశీబాయి;

బాబా నైజము – భక్త పరాయణత్వము

ఈ అధ్యాయములో గాని, వచ్చే అధ్యాయములలో గాని ఫలానిది చెప్పెదమనుట ఒక విధముగా అహంకారమే.

మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని, మన ప్రయత్నమందు జయమును పొందము. మన మహంకార రహితుల మయినచో, మన జయము నిశ్చయము.

సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చును.

మన మూల ప్రకృతియందు పాతుకొని, శాంతి సౌఖ్యములను పొందెదము.

కాబట్టి యెవరయితే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను; మననము చేయవలెను.

దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు. తుదకు మోక్షానందమును పొందెదరు.

సాధారణముగా నందరు హాస్యము, చమత్కార భాషణమన్న నిష్టపడెదరు గాని, తాము హాస్యాస్పదులగుట కిష్టపడరు.

కాని బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగ నీతిదాయకముగ నుండెడిది.

కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికి అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్‌పంతు తన విషయమునే యీ క్రింద తెలుపుచున్నాడు.

శనగల కథ :

షిరిడీలో ఆదివారము నాడు సంత జరిగెడిది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీథులలో దుకాణములు వేసికొని వారి సరుకులు అమ్ము చుండెడివారు.

ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసి పోవుచుండెను.

ఒక ఆదివారమునాడు హేమాడ్‌పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదము లొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను.

బాబా యెడమ వైపు శ్యామా, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్‌ బూటీ, కాకా సాహెబుదీక్షిత్‌ మొదలగువారు కూడ నుండిరి.

శ్యామా నవ్వుచు అణ్ణా సాహెబుతో, ”నీ కోటుకు శనగగింజ లంటినట్లున్నవి చూడుము” అనెను. అట్లనుచు హేమాడ్‌పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను.

హేమాడ్‌పంతు తన చొక్కా ఎడమచేతి ముందు భాగమును సాచెను. అందరికి ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి.

ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరు ఆశ్చర్యపడిరి.

ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో నెట్లు ప్రవేశించి యుండునో ఊహించనారంభించిరి.

శనగలు చొక్కాలో నెట్లుదూరి యచట నిలువగలిగినవో హేమాడ్‌పంతు కూడ గ్రహించలేకుండెను.

ఎవ్వరికి సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరును ఈ యద్భుతమున కాశ్చర్యపడుచుండగా

బాబా, ”వీనికి (అణ్ణాసాహెబుకు) తానొక్కడే తిను దుర్గుణమొకటి కలదు. ఈనాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో నేమి యాశ్చర్యమున్నది ?” అనిరి.

హేమాడ్‌పంతు : బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని యెరుగను. అయితే యీ దుర్గణమును నాపైనేల మోపెదవు ? ఈనాటికి ఎన్నడును షిరిడీలోని సంత నేను చూచి యుండలేదు.

ఈ దినము కూడ నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని ? నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును ? నాదగ్గర నున్నవారికి పెట్టకుండ నే నెప్పుడేమియు తిని యెరుగను.

బాబా : అవును అది నిజమే. దగ్గరున్న వారి కిచ్చెదవు. ఎవరును దగ్గర లేనప్పుడు నీవుగాని, నేనుగాని యేమి చేయగలము ?

కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా ? నేనెల్లప్పుడు నీ చెంతలేనా ? నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా ?

నీతి :

ఈ సంఘటనమున బాబా యేమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము.

పంచేంద్రియములకంటే ముందే మనస్సు, బుద్ధి విషయానంద మనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో నిది కూడ ఒక విధముగ భగవంతుని కర్పితమగును.

విషయములను విడిచి పంచేంద్రియము లుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వాని యందభిమానము సహజముగా అదృశ్యమైపోవును.

ఇవ్విధముగా కామము, క్రోధము, లోభము మొదలగువాని గూర్చిన వృత్తులన్నిటిని (ఆలోచనలను) మొట్టమొదట గురుని కర్పించవలెను.

ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నియు నిర్మూలనమగుటకు సహాయపడును.

విషయముల ననుభవించు ముందు బాబా మనచెంతనే యున్నట్లు భావించినచో, ఆ వస్తువు ననుభవించవచ్చునా ? లేదా ? యను ప్రశ్న యేర్పడును.

ఏది యనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈవిధముగా మన దుర్గుణములన్నియు నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును.

శుద్ధజ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి, బుద్ధి చైతన్య ఘనమున లీనమగును.

అప్పుడే మనకానందము, సంతృప్తి కలుగును. గురువునకు, దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను జూడలేరు.

భేదములన్నింటిని ప్రక్కకు త్రోసి, గురువును, దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతిచెందును.

మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన మనము గురుని స్మరించనిదే యే వస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు.

మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తియందుంచుకొనెదము. మనకు బాబా ధ్యానమెన్నో రెట్లు వృద్ధిపొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల యెదుట నిలుచును.

అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడయితే నిలుపగలమో, అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము.

ప్రపంచ సుఖములందు గల యభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును.

సుదాముని కథ :

పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్‌పంతుకు సుదాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడ ఇదే నీతి యున్నది. కనుక దానినిక్కడ చెప్పుచున్నాము.

శ్రీకృష్ణుడు, అతని యన్న బలరాముడు, మరియొక సహపాఠి సుదాముడనువాడును గురువగు సాందీపుని యాశ్రమములో నివసించు చుండిరి.

శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసికొని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుదాముని కూడ అదే పనిమీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను.

కృష్ణుడు సుదాముని యడవిలో గలసి ”దాదా, నీళ్ళు కావలెను, నాకు దాహము వేయుచున్నది” అనెను. సుదాముడు ”ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడవాగుట మంచి”దనెను.

కాని తనవద్ద శనగలున్నవని, కొంచెము తినుమని యనలేదు. శ్రీ కృష్ణుడు అలసియుండుటచే సుదాముని తొడపయి తల యుంచి గుఱ్ఱుపెట్టుచు నిద్రపోయెను.

ఇది కనిపెట్టి సుదాముడు తన జేబులోని శనగలు తీసి తినుట కారంభించెను.

హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనెను. ”దాదా యేమి తినుచుంటివి? ఎక్కడ నుంచి యీ శబ్దము వచ్చుచున్నది ?”

సుదాముడిట్లనెను. ”తినుట కేమున్నది ? నేను చలితో వణకుచున్నాను. నా పండ్లు కటకట మనుచున్నవి, విష్ణుసహస్రనామమును కూడ సరిగా ఉచ్ఛరించలేకున్నాను”.

ఇది విని సర్వజ్ఞుగు శ్రీకృష్ణుడిట్లనెను. ”నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను.

ఏమి తినుచుంటివని యడుగగా ఏమున్నది తినుటకు మన్నా ? యనెను. అనగా తినుట కేమియు లేదని భావము.

రెండవవాడు ‘తథాస్తు’ అనెను. దాదా ! యిది యొక స్వప్నము. నాకివ్వకుండ నీవేమియు తినవని నాకు తెలియును. స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని యడిగితిని”.

శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడనిగాని, అతని లీలలు గాని తెలిసియున్నచో సుదాముడట్లు చేసి యుండడు. కాబట్టి అతను చేసినదానిని తానే యనుభవింపవలసి వచ్చెను.

శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడయినప్పటికి అతని ఉత్తరకాల మంతయు గర్భ దారిద్య్రముచే బాధపడవలసి వచ్చెను.

కొన్నాళ్ళకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము ననుభవించుట కిచ్చెను.

ఎవరికయితే దగ్గరున్నవారి కియ్యకుండ తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచు కొనవలెను.

శ్రుతి కూడ దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడ దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను.

అణ్ణా చించణీకరు – మావిశీబాయి :

హేమాడ్‌పంతు నిచ్చట నింకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను.

దామోదర్‌ ఘనశ్యామ్‌ బాబరె వురఫ్‌ అణ్ణా చించణీకర్‌ యను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు,

ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు; ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కఠినునివలెను, హఠము చేయువానివలెను గాన్పించినను, వాడు మంచి హృదయము గలవాడు. నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను.

అందరు సేవచేయునట్లే, యితడు కూడ మధ్యాహ్నము బాబా యెడమచేతిని (కఠడా పైన వేసి యున్నదానిని) తోముచుండెను.

కుడివయిపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి యనునామె యుండెను. ఆమెను బాబా ‘అమ్మా’ యని పిలిచెడివారు. ఇతరులు మావిశీబాయి యని పిలిచెడివారు.

ఆమె కూడ బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను.

ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు గాన్పించుచుండెను. ఇంకొక ప్రక్క అణ్ణా తోముచుండెను.

మావిశీబాయి ముఖము క్రిందకు మీదకగుచుండెను. ఒకసారి యామె ముఖము అణ్ణా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను.

హాస్యమాడు నైజము గలదగుటచే నామె, ”ఓహో ! అణ్ణా చెడ్డవాడు, నన్ను ముద్దుబెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడయినప్పటికి నన్ను ముద్దుపెట్టుకొనుటకు సిగ్గులేదా ?” యనెను. అణ్ణాకు కోపము వచ్చెను.

చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను. ”నేను ముసలివాడను దుర్మార్గుడన ననుచున్నావు. నేను వెఱ్ఱివాడనా ? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు” అక్కడున్నవారందరు ఈ ముసలివాండ్ర కలహమును జూచి నవ్వుచుండిరి.

బాబా యిద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలెనని తలచి యీ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచిరి.

బాబా ప్రేమతో ”ఓ అణ్ణా ! ఎందుకనవసరముగా గోల చేయుచున్నావు ? తల్లిని ముద్దుపెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి?” యనెను.

బాబా మాటలు విని యిద్దరు సంతుష్టి జెందిరి. అందరు సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి.

బాబా నైజము, భక్త పరాయణత్వము :

బాబా తన భక్తులకు వారి వారి యిష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో నితరులు జోక్యము కలుగుజేసికొనుట బాబా కిష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము.

ఈ మావిశీబాయియే యింకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును జూచి, యితర భక్తులు ఆతురపడిరి.

వారిట్లనిరి. ”అమ్మా ! కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు”.

ఇట్లనగనే, బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను. వారి కండ్లు నిప్పు కణములవలె ఎఱ్ఱనాయెను. బాబాను జూచుట కెవ్వరికి ధైర్యము లేకుండెను.

బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు నానించెను.

సటకా యంతయు పొత్తికడుపులో దూరినట్లు కానవచ్చు చుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలుననుకొనిరి. బాబా క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి.

ఆశ్చర్యముతోను, భయముతోను మాట్లాడలేక మూగవాండ్రవలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి.

తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండ తోముమనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి. దీనికి కూడ బాబా యొప్పుకొనలేదు.

వారి మంచి యుద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమియు చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను.

సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల యిష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసికొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ యెట్టితో బాబాకే గుర్తు.

ఇరువది నాలుగవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles