🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది రెండవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ఇరువది రెండవ అధ్యాయము

ప్రస్తావన; బాలాసాహెబు మిరీకర్‌; బాపూ సాహెబు బూటీ; అమీరు శక్కర్‌;

తేలు – పాము; బాబా అభిప్రాయము

పస్తావన :

బాబాను ధ్యానించుటెట్లు ? భగవంతుని నైజముగాని, స్వరూపము గాని అగాధములు. వేదములు గాని, వెయ్యి నాలుకలుగల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు.

భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ యానందమునకు భగవంతుని పాదములే ముఖ్యమార్గమని వారికి తెలియును.

జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని యింకొక మార్గము లేదని వారలకు తెలియును.

హేమాడ్‌పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడ అనుకూలించును.

నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు. వెన్నెల కూడ రాదు.

శుక్లపక్షము ప్రారంభమవగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు. రెండవనాడది సరిగా కనిపించదు.

అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడుమనెదరు. ఆతురతతో నేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచునప్పుడు దూరముగా నున్న చంద్రుని యాకారమొక గీతవలె గాన్పించును. వారప్పుడు సంతసించెదరు.

ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును జూచెదము గాక. బాబా కూర్చున్న విధానమును జూడుడు. అది యెంత సుందరముగా నున్నది !

వారు కాళ్ళను ఒకదానిపైని ఇంకొకటి వేసియున్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడిపాదముపై వేసియున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్ను మధ్య వ్రేలున్ను ఉన్నవి.

ఈ కూర్చున్న విధమునుబట్టి చూడగా బాబా మనకీ దిగువ విషయము చెప్పనిశ్చయించుకొన్నట్లున్నది.

”నా ప్రకాశమును చూడవలెనంటే, అహంకారమును విడిచి మిక్కిలి యణకువతో చూపుడు వ్రేలుకు మధ్యవ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును జూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము”.

ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ యొక యాత్రాస్థలమాయెను.

అన్ని మూలలనుండి ప్రజలచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడ అనేక విధముల మేలు పొందుచుండెడివారు.

బాబా యొక్క యనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన, సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు ?

వీనిలో నేదైన నొకదానిని గాని, యన్నియుగాని యనుభవించినవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము.

ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా నుండువారు. ఆనందమున కవతారముగా భక్తులచే పరివేష్ఠితులై యుండెడివారు.

ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము, తమాషా చేయుటలో మునిగెడివారు.

ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా యని తోచువారు. ఒక్కొక్కపుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు.

అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడెడివారు. ఈ ప్రకారముగ సందర్భావసరముల బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండెడిది.

వారి జీవితమగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండెడిదికాదు.

వారి ముఖారవిందమును జూచుటయందు ఆసక్తిగాని, వారితో సంభాషించుట యందుగాని, వారి లీలలు వినుట యందుగాని తనివితీరెడిది కాదు.

అయినప్పటికి సంతోషముతో నుప్పొంగుచుండేవారము. వర్షబిందువులను లెక్కించగలము; తోలుసంచిలో గాలిని మూయగలము. కాని బాబా లీలలను లెక్కించలేము.

వానిలో నొక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల యాపదలను కనుగొని, భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా యెట్లు తప్పించుచుండెనో యిచట చెప్పుదుము.

బాలాసాహెబు మిరీకర్‌ :

సర్దారు కాకాసాహెబు మిరీకర్‌ కొడుకగు బాలాసాహెబు మిరీకర్‌ కోపర్‌గాంకు మామలతదారుగా నుండెను.

అతడొకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీకి వచ్చెను.

మసీదుకుబోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమముల నడిగి జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు నిట్లిగెను.

”నీకు మన ద్వారకామాయి తెలియునా ?” బాలాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడక పోవుటచే ఊరకుండెను.

”నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టముల నుండి యాతురతల నుండి తప్పించును.

ఈ మసీదు తల్లి చాల దయార్ధ్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును.

ఆమె ఒడి నాశ్రయించిన వారి కష్టములన్నియు సమసిపోవును. ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును” అనెను.

పిమ్మట బాలాసాహెబుకు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా ”నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియునా? అదే సర్పము !” అనెను.

బాబా తమ ఎడమచేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాముపడగవలె నుంచి “అతడు మిక్కిలి భయంకరమైనవాడు  కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ? ద్వారకామాయి కాపాడుచుండగా, పాము యేమి చేయగలదు ?” అనెను.

అక్కడున్న వారందరు దీని భావమును దెలిసికొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును దెలిసికొనుటకు కుతూహలపడుచుండిరి.

కాని బాబా నీ విషయమై యడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి, మసీదును విడచి శ్యామాతో వెళ్ళెను.

బాబా శ్యామాను బిలిచి, బాలాసాహెబుతో చితలీ వెళ్ళి యానందించుమనెను. బాబా యాజ్ఞానుసారము తాను కూడ వెంట వచ్చెదనని శ్యామా బాలాసాహెబుతో చెప్పెను.

అసౌకర్యముగ నుండును కాన, వద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పెను. శ్యామా బాబాకీ సంగతి దెలిపెను.

బాబా యిట్లనెను. ”సరే, వెళ్ళవద్దు. వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో యది జరుగక తప్పదు”.

ఈలోపల బాలాసాహెబు తిరిగి యాలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను. శ్యామా బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను.

వారు రాత్రి 9 గంటలకు చితలీ చేరిరి. ఆంజనేయాలయములో బసచేసిరి. కచేరీలో పనిచేయువారెవరు రాలేదు; కావున నెమ్మదిగా నొకమూల కూర్చొని మాట్లాడుచుండిరి.

చాపపైని కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై నొక సర్పముండెను. దాని నెవ్వరును చూడలేదు. అది బుసకొట్టుచు కదలుచుండెను.

ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు దెచ్చి సర్పమును జూచి పాము పామని యరచెను. బాలాసాహెబు భయపడెను. వణకుట ప్రారంభించెను.

శ్యామా కూడ ఆశ్చర్యపడెను. అందరు మెల్లగా కట్టెలను దీసిరి. బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి.

ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను.

బాపూ సాహెబు బూటీ :

నానా డేంగలే యను గొప్ప జ్యోతిష్కుడు, బాపూసాహెబు బూటీ షిరిడీలో నుండునప్పుడు ఒకనాడిట్లనెను. ”ఈ దినము నీకు అశుభము. నీకీ దినము ప్రాణగండమున్నది”. ఇది బాపూసాహెబును ఆందోళనకు గురిచేసెను.

 ఆయన యథాప్రకారము మసీదుకుబోగా, బాబా బాపూసాహెబుతో నిట్లనియెను.

”ఈ నానా యేమనుచున్నాడు ? నీకు మరణ మున్నదని చెప్పుచున్నాడు గదా ? సరే ! నీవు యేమీ భయపడనక్కరలేదు. ‘మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక !’ యని వానికి ధైర్యముతో జవాబిమ్ము !”

ఆనాటి సాయంకాలము బాపూసాహెబు బూటీ మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును జూచెను.

అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయినెత్తి కొట్టబోయెను. బాపూసాహెబు పెద్దకఱ్ఱను దీసికొని రమ్మనెను. నౌకరు కఱ్ఱను తీసికొని వచ్చునంతలో, పాము కదలిపోయి యదృశ్యమయ్యెను.

ధైర్యముతో నుండుమని యాడిన బాబా పలుకులను బాపూసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను.

అమీరు శక్కర్‌ :

కోపర్‌గాం తాలుకాలో కొరాలే గ్రామనివాసి అమీరు శక్కర్‌. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమీషను వ్యాపారిగ పనిచేసెను. అక్కడతనికి మంచి పలుకుబడి కలదు.

అతడు కీళ్ళవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధనుండి తప్పింపుమని బాబాను వేడెను.

చావడిలో కూర్చొనుమని బాబా అతని నాజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరియైనది కాదు. అది యెల్లప్పుడు తేమగా నుండును. గ్రామములో నింకేదైన స్థలము బాగుండెడిది.

కాని బాబా పలుకులే తగిన యౌషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చొనుమని యాజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి యయ్యెను.

ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడివైపు పోవుచుండెను. అదియును గాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయి బాబా యచట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను.

పూర్తిగా 9 మాసములు అమీరుశక్కర్‌ అక్కడ నుండెను. కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను.

ఒకనాటి రాత్రి యెవరికి చెప్పకుండ కోపర్‌గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను.

ఫకీరు నీళ్ళు కావలెననగా అమీరు పోయి నీరు తెచ్చి యిచ్చెను. ఆ నీళ్ళను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను.

అతడు పోలీసువారికి తెలియపరచినచో, మొట్టమొదట సమాచారమును దెచ్చినవాడగుటచే తనకా ఫకీరు విషయమేమైన తెలిసియుండునని పట్టుకొనెదరు.

ఆ చావునకు అతడు కూడ కారణభూతుడయి యుండవచ్చునని యనుమానించెదరు. బాబా యాజ్ఞ లేనిది షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను.

షిరిడీ పోవ నిశ్చయించుకొని యా రాత్రియే యచట నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను.

సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి యాతురత నుండి తప్పించుకొనెను. బాబా యాజ్ఞానుసారము చావడిలోనే యుండి రోగవిముక్తుడయ్యెను.

ఒకనాటి మధ్య రాత్రి బాబా ”ఓ అబ్దుల్‌ ! నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది” యని యరచెను.

లాంతరు దీసికొని అబ్దుల్‌ వచ్చి బాబా పరుపు జూచెను గాని యేమియు గాన్పించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను.

అమీరుశక్కర్‌ బాబా లీలను జూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా యనుమానించి యుండునని యనుకొనెను.

బాబా సాంగత్యము వలన బాబా యాడుమాటల, చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను.

అమీరు తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట గమనించి, అబ్దుల్‌ను లాంతరు తీసికొని రమ్మనెను.

అంతలో నచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందికి పయికి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను.

తేలు – పాము :

తేలు : బాబా ఆజ్ఞచే కాకాసాహెబు దీక్షిత్‌ నిత్యము శ్రీ ఏకనాథ మహరాజ్‌ రచించిన భాగవతమును, భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను.

ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్‌పంతు గూడ శ్రోతయయ్యెను.

రామాయణములో ఆంజనేయుడు తన తల్లి యాజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరు మైమరిచియుండిరి. అందులో హేమాడ్‌పంతొకడు.

ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్‌పంతు భుజముపై బడి వాని యుత్తరీయముపై కూర్చుండెను. మొదట దాని నెవ్వరు గమనించలేదు.

ఎవరు పురాణముల శ్రవణము జేసెదరో వారిని భగవంతుడు రక్షించును.

ఇంతలో హేమాడ్‌పంతు తన కుడి భుజముపై నున్న తేలును జూచెను. అది చచ్చినదానివలె నిశ్శబ్దముగా కదలకుండెను. అదికూడ పురాణము వినుచున్నట్లు గనుపించెను.

భగవంతుని కటాక్షమును స్మరించి, పురాణ శ్రవణములో నున్న నితరులకు భంగము కలుగజేయకుండ, యుత్తరీయము రెండు చివరలను పట్టుకొని, దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవైచెను.

పాము : ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడ మీద కొందరు కూర్చొనియుండిరి. ఒక సర్పము కిటికీలో నున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును దెచ్చిరి.

మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికి అది నెమ్మదిగా కూర్చొనెను.

తల మాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు కఱ్ఱలు తీసుకొని వేగముగా వచ్చిరి.

అది యెటూ కాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని యా సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరు ఆపద నుండి తప్పించుకొనిరి.

బాబా అభిప్రాయము :

ముక్తారామ్‌ యను నొక భక్తుడు పాము తప్పించుకొనిపోవుటచే మంచియే జరిగినదనెను.

హేమాడ్‌పంతు అందుల కొప్పుకొనలేదు. అది సరియైన యాలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను.

ముక్తారామ్‌ సర్పములు మొదలగు క్రూర జంతువులను చంప నవసరము లేదనెను. హేమాడ్‌పంతు వానిని తప్పక చంపవలెననెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి గాకుండెను.

ఆ మరుసటి దిన మా ప్రశ్నను బాబా నడిగిరి. బాబా యిట్లు జవాబిచ్చెను : ”భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని, తేళ్ళు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు.

సకల జంతుకోటి పాములు, తేళ్ళతో సహ సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావహించును. వారి యాజ్ఞయైనగాని యెవరు యెవరినీ యేమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై నాధారపడి యున్నది.

ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను.

అనవసరమైన కలహములందు, చంపుట యందు పాల్గొనక యోపికతో నుండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే !’

ఇరువది రెండవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

మూడవరోజు పారాయణము సమాప్తము

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles