Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
నాల్గవ రోజు పారాయణము
ఆదివారము
ఇరువది మూడవ అధ్యాయము
పస్తావన; యోగము – ఉల్లిపాయ; పాముకాటు నుండి శ్యామాను కాపాడుట;
కలరా రోగము; గురుభక్తిని పరీక్షించుట
ప్రస్తావన :
నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ, రజ, స్తమో గుణముల కతీతుడు.
కాని మాయచే గప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే యనుకొనుచు, అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని యనుకొనుచు, లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు.
విమోచనమునకు మార్గమొక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి.
గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి మార్చెను.
ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని యవతారముగా నెన్నుచున్నాము.
కాని వారెల్లప్పుడు తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు.
వారు అవతార పురుషులయినప్పటికి ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు; ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు.
ఇతరులతో యే విషయములోనూ పోటీ పడేడివారు కారు. తనకొరకేమైన చేయుమని యితరులను కోరెడివారు కారు.
సమస్త చేతనాచేతనములందు, భగవంతుని జూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితముగదా !
ఎవరిని నిరాదరించుటగాని, అవమానించుటగాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు.
‘నేను భగవంతుడను’ అని వారెన్నడు అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు; భగవంతుని ఎల్లప్పుడు తలచువారు. ఎల్లప్పుడు ‘అల్లా మాలిక్’ ! అనగా భగవంతుడే సర్వాధికారియని యనుచుండెడివారు.
మేమితర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్కటాక్షముచే నవతరించి యజ్ఞానులకు, బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రమెరుగుదుము.
మన పుణ్యమేదైన యున్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో నట్లు జరుగదు.
ఇక నీ యధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము.
యోగము – ఉల్లిపాయ :
ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు(స్వామి రాంబాబా) నానాసాహెబు చాందోర్కరుతో కలసి షిరిడీకి వచ్చెను.
అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నియు చదివెను. తుదకు పతంజలి యోగసూత్రములు కూడ చదివెను. కాని యనుభవమేమియు లేకుండెను.
అతడు మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెము సేపయిన నుండలేకుండెను.
సాయిబాబా తన యెడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పెదరని అతడనుకొనెను.
ఈ లక్ష్యముతో నాతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టెను తినుచుండిరి.
దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన మెదిలెను. ‘రుచిలేని రొట్టెను పచ్చి యుల్లిపాయతో తినువాడు నా కష్టముల నెట్లు తీర్చగలడు ? నన్నెట్లు ఉద్ధరించగలడు ?’ సాయిబాబా యతని మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి,
నానాసాహెబుతో నిట్లనియెను. ”నానా ! యెవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలెను”. ఇది విని యోగి యాశ్చర్యపడెను.
వెంటనే బాబా పాదములపయి బడి సర్వస్య శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టముల దెలిపి ప్రత్యుత్తరముల బడసెను.
ఇట్లు సంతృప్తి జెంది యానందించువాడై బాబా ఊదీ ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను.
పాము కాటు నుండి శ్యామాను కాపాడుట :
ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్‌పంత్, జీవుని పంజరములో నున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి.
రెండును బంధింపబడియే యున్నవి; ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని యనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగనే వానికి నిజము తెలియును.
భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తుల జేసినప్పుడు వారి దృష్టి యన్నటికంటె గొప్ప స్థితివైపు బోవును. అప్పుడే గతించిన జీవితము కంటె రానున్నది గొప్పదియని గ్రహింతురు.
గత అధ్యాయములో మిరీకర్‌కు రానున్న యపాయము గనిపెట్టి దాని నుండి యతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటె ఘనమగు కథను ఇచ్చట వినెదరు.
ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెన వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ యెక్కువగా నుండెను.
శ్యామా తాను మరణించెద ననుకొనెను. స్నేహితులాతన్ని విఠోబా గుడికి తీసుకొనిపోవ నిశ్చయించిరి. పాముకాట్లు అచ్చట బాగగుచుండెను.
కాని శ్యామా తన విఠోబాయగు బాబా వద్దకు పరుగిడెను. బాబా యతనిని జూడగనే కోపముతో వానిని తిట్టనారంభించెను. ”ఓరి పిరికి పురోహితుడా ! పైకెక్కవద్దు ! ఎక్కితివో నేమగునో చూడు” మని బెదరించుచూ తరువాత ఇట్లు గర్జించెను :
”పో, వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము” బాబా యిట్లు కోపోద్దీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయమందెను. నిరాశ చెందెను.
అతడు మసీదును తన యిల్లుగా, బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు ? అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను.
కొంతసేపటికి బాబా శాంతించి, శ్యామా దగ్గరకు పోయి కూర్చుని యిట్లనెను : ”భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును.
ఇంటికిపోయి ఊరక కూర్చుండుము. బయటికి పోవద్దు. నాయందు విశ్వాసముంచుము. భయపడకుము. ఆందోళన పడవద్దు”. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను.
వెంటనే బాబా తాత్యా పాటిలును, కాకాసాహెబు దీక్షితుని అతని వద్దకు పంపి, తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగ వచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను.
కొద్ది గంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి యందుంచుకొనవలసినదేమన, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము (పో, వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము) శ్యామాను ఉద్దేశించినదిగాక విషమును ఆజ్ఞాపించిన మాటలు.
ఆ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతట వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి.
మంత్రములలో నారితేరిన తక్కినవారివలె, వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను. మంత్ర బియ్యము కాని, తీర్థముగాని ఉపయోగించనవసరము లేకుండెను.
శ్యామా జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి.
ఎవరైన ఈ కథగాని, యింక నితర కథలు గాని వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును.
మాయయను మహా సముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను.
కలరా రోగము :
ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి.
గ్రామములో పంచాయితీవారు సభచేసి రెండత్యవసరమైన నియమములు చేసి, కలరా నిర్మూలించ ప్రయత్నించిరి.
అవి యేవన 1. కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు; 2. మేకను గ్రామములో కోయరాదు. ఎవరయిన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి.
బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియును. కాబట్టి బాబా యా చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయములో కట్టెలబండి యొకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను.
ఊరిలో కట్టెలకు కరువున్నదని అందిరకి తెలియును. అయినప్పటికి కట్టెలబండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి.
బాబా యా సంగతి తెలిసికొని, అచ్చటికి వచ్చి కట్టెలబండిని మసీదుకు తీసికొనిపొమ్మని యుత్తరువు నిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకెవ్వరు సాహసించలేదు.
ధుని కొరకు కట్టెలు కావలసి యుండెను. కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రివలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే యుంచెను.
అందులకయి వారికి కట్టెలవసరము గనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడు తెరచియుండెడిది.
ఎవరయిన పోవచ్చును. దానికి తాళము గాని చెవి గాని లేదు. కొందరు తమ యుపయోగము కొరకు కొన్ని కఱ్ఱలను తీసికొనిపోవువారు.
అందుకు బాబా యెప్పుడును గొణుగుకొన లేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే యావరించి యుండుటచే వారికి ఎవరియందు శత్రుత్వముండెడిది గాదు.
వారు పరిపూర్ణవిరాగులైనప్పటికి సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై యిట్లు చేయుచుండెడివారు.
గురుభక్తిని పరీక్షించుట :
రెండవ కలరా నిబంధనమును బాబా యెట్లు ధిక్కరించెనో చూతము.
నిబంధనము అమలులో నున్నప్పుడెవరో యొక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను.
ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా యచటనే యుండెను. సాయిబాబా దానిని యొక కత్తివ్రేటుతో నరికి బలివేయుమని బడేబాబాకు చెప్పెను.
ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడు సాయిబాబా తన కుడివయిపున కూర్చొనబెట్టు కొనెడివారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి యితరులకు ఇచ్చెడివారు.
మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగ బడేబాబాను పిలిచి యెడమప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనము ప్రారంభించువారు.
దక్షిణ రూపముగా వసూలయిన పైకము నుంచి ఆయనకు దినమొక్కింటికి 50 రూపాయలు సాయిబాబా యిచ్చుచుండెడివారు.
బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము.
సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలయని బడేబాబా నిరాకరించెను.
అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయుమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని దెచ్చి బాబా ముందు బెట్టెను.
ఎందులకు కత్తిని దెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను.
ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను; కాని వాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబు దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను.
ఒక కత్తి దెచ్చి నరుకుమని బాబా యాజ్ఞాపించెను. అతడు సాఠేవాడాకు బోయి కత్తిని దెచ్చెను. బాబా యుత్తరువు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా నుండెను.
అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట యనునది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుటయందిష్టము లేనివాడయినప్పటికి, మేకను నరకుటకు సంసిద్ధుడయ్యెను.
బడేబాబాయను మహమ్మదీయుడే యిష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్ధపడుచుండెనని యందరాశ్చర్యపడుచుండిరి.
అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పయికెత్తి బాబా యాజ్ఞకై యెదురుచూచుచుండెను.
బాబా ”ఏమి యాలోచించుచుంటివి ? నరుకుము!” అనెను. అతని చేతిలో నున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగుమనెను.
”ఎంతటి కఠినాత్ముడవు ? బ్రాహ్మణుడవయి మేకను చంపెదవా ?” యనెను. బాబా యాజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో నిట్లనియె.
”నీ యమృతము వంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము.
మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా ? యనునది మాకు తెలియదు. దానిని మేము విచారించము.
అది సరియైనదా కాదా ? యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము”.
బాబా తామే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను ‘తకియా’ యనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము.
అచటికి దానిని తీసుకొనిపోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను.
శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమాడ్‌పంతు ముగించుచున్నారు. శిష్యులు మూడు రకములు. 1. ఉత్తములు 2. మధ్యములు 3. సాధారణులు
గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు.
గురుని యాజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు.
మూడవ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు.
శిష్యులకు దృఢమైన నమ్మకముండవలెను. తోడుగా బుద్ధి కుశలత యోరిమి యున్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు.
ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట గాని, హఠయోగము గాని యితర కఠినమయిన సాధనలన్నియు ననవసరము.
పైన చెప్పిన గుణముల నలవరచుకొన్నచో, వారు ఉత్తరోత్తరోపదేశముల కర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు.
వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకొందము.
ఇరువది మూడవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది తొమ్మిదవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది ఐదవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది యొకటవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది రెండవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది యేడవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments