Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
ఇరువది యేడవ అధ్యాయము
పస్తావన; గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట;
శ్యామా విష్ణు సహస్ర నామ పుస్తకము; గీతారహస్యము; ఖాపర్డే దంపతులు
పస్తావన :
బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్మృశించి, పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి యీ అధ్యాయములో చెప్పుకొందము.
మానవుడు సముద్రములో మునుగగనే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును.
అటులనే మానవుడు సద్గురుని పాదారవిందముల నాశ్రయింపగనే, త్రిమూర్తులకు (బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు) నమస్కరించిన ఫలముతోపాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడ లభించును.
కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రమును, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక !
ఓ సాయి ! నీ కథలందు శ్రద్ధను కలుగజేయుము. చాతకపక్షి మేఘజలము త్రాగి యెట్లు సంతసించునో, అటులనే నీ కథలను చదువువారును, వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురు గాక.
నీ కథలు వినునప్పుడు వారికి, వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగును గాక ! వారి శరీరములు చెమరించుగాక ! వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక !
వారి ప్రాణములు స్థిరపడుగాక ! వారి మనస్సులు ఏకాగ్రమగుగాక ! వారికి గగుర్పాటు కలుగుగాక !
వారు వెక్కుచు ఏడ్చి వణకెదరు గాక ! వారిలోగల వైషమ్యములు తర తమ భేదములు నిష్క్రమించుగాక !
ఇట్లు జరిగినచో గురువు గారి కటాక్షము వారిపైన ప్రసరించిన దనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు, గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును.
మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగ శరణాగతి వేడవలెను.
వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే యాపని చేయగలరు. సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు.
గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట :
ముందటి అధ్యాయములో బాబా బోధలొనర్చు తీరులను జూచితిమి. అందులో నింకొకదానిని యీ అధ్యాయములో జూచెదము.
కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనెడివారు.
అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో నున్నటుల భావించెడివారు.
ఒకనాడు కాకామహాజని ఏకనాథ భాగవతమును దీసికొని షిరిడీకి వచ్చెను.
శ్యామా యా పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు బోయెను. అచ్చట బాబా దానిని తీసుకొని చేతితో తాకి, కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద నుంచుకొమ్మనెను.
అది కాకా పుస్తకమనియు, నందుచే దాని నాతని కిచ్చి వేయవలెననియు శ్యామా చెప్పెను.
కాని బాబా ”దానిని నేను నీకిచ్చితిని. దానిని జాగ్రత్తగా నీవద్ద నుంచుము. అది నీకు పనికివచ్చు” ననిరి. ఈ ప్రకారముగ బాబా అనేక పుస్తకములు శ్యామా వద్ద నుంచెను.
కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబా కిచ్చెను.
బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది యాతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను.
శ్యామా విష్ణుసహస్రనామ పుస్తకము :
శ్యామా బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా యతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణుసహస్ర నామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను.
ఒకప్పుడు ఒక రామదాసి (సమర్థ రామదాసు భక్తుడు) షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ నుండెను.
ప్రతిరోజు ఉదయమే లేచి, ముఖము కడుగుకొని, స్నానము చేసి, పట్టుబట్టలు ధరించి, విభూతి పూసికొని, విష్ణు సహస్ర నామమును, అధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను.
అతడీ గ్రంథముల ననేకసారులు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలుచేయ నిశ్చయించి విష్ణుసహస్రనామ పారాయణము చేయింపదలచెను.
కావున రామదాసిని బిలచి తనకు కడుపునొప్పిగా నున్నదనియు సోనాముఖి తీసికొననిదే నొప్పి తగ్గదనియు, కనుక బజారుకు పోయి యా మందును తీసికొని రమ్మని కోరెను.
పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును దీసికొని తమ స్థలమునకు తిరిగి వచ్చి యిట్లనెను.
”ఓ శ్యామా ! యీ గ్రంథము మిగుల విలువైనది. ఫలప్రదమైనది. కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని.
నా హృదయము కొట్టుకొనెను. నా జీవిత మపాయములో నుండెను. అట్టి సందిగ్ధస్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా ! అది నాకు గొప్ప మేలు చేసెను.
అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసెనని యనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజునకొక నామము చదివినను మేలు కలుగజేయును”.
శ్యామా తనకా పుస్తక మక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి. కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదువలేననెను.
వినోదార్ధము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయు చున్నాడని శ్యామా యనుకొనెనే గాని, బాబా తనకు మేలు కలుగజేయనున్నాడని యనుకొనలేదు.
బాబా యా సహస్ర నామమనే మాలను శ్యామా మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడయినప్పటికి బాబాకు ముఖ్యభక్తుడు. బాబా ఈ ప్రకారమతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను.
భగవన్నామ ఫలిత మందరికి విశదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటె సులభమయిన సాధన మింకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్ధమైనది. దానికెట్టి తంతు కూడ అవసరము లేదు. దానికి నియమము లేమియు లేవు. అది మిగుల సులభమైనది; ఫలప్రదమైనది.
శ్యామాకు ఇష్టము లేనప్పటికి వానిచే దాని నభ్యసింపచేయవలెనని బాబాకు దయకలిగెను. కనుక దానిని బాబా వానిపయి బలవంతముగా రుద్దెను.
ఆ ప్రకారముగనే చాలాకాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణుసహస్రనామము నొక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను.
విష్ణుసహస్రనామ పారాయణ చిత్తశుద్ధికొక విశాలమయిన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను.
రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నాచించణీకర్ యక్కడనే యుండెను. నారదునివలె నటించి జరిగినదంతయు వానికి జెప్పెను.
రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామాపయిబడి, శ్యామాయే కడుపునొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్లు చేసి ఈలోపల పుస్తకమును తీసికొనెనని యనెను.
శ్యామాను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనిచో తల పగులగొట్టుకొందుననెను. శ్యామా నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను.
అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను. ”ఓ రామదాసీ ! యేమి సమాచారము ? ఎందులకు చికాకుపడుచున్నావు ? శ్యామా మనవాడు కాడా ? అనవసరముగా వాని నేల తిట్టెదవు ?
ఎందుకు జగడ మాడుచున్నావు ? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా ? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి గాని, యింకను నీ మనస్సు నపవిత్రముగాను, అస్వాధీనముగాను ఉన్నట్లున్నది.
నీ వెట్టి రామదాసివయ్యా ? సమస్త విషయములందు నీవు నిర్మలుడవుగా నుండవలెను. నీవా పుస్తకమును అంతగా నభిలషించుట వింతగా నున్నది.
నిజమైన రామదాసికి మమత కాక సమత యుండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము.
ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ యెంత ? శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు.
నేనే దానిని తీసికొని వానికిచ్చితిని. నీకది కంఠపాఠముగా వచ్చును కదా ! కావున శ్యామా దానిని చదివి మేలు పొందుననుకొంటిని. అందుచే దానినతనికిచ్చితిని”.
బాబా పలుకులెంత మధురముగా మెత్తగా కోమలముగా అమృత తుల్యముగా నున్నవి ! వాని ప్రభావము విచిత్రమయినది. రామదాసి శాంతించెను.
దానికి బదులు పంచరత్నగీతయను గ్రంథమును శ్యామా వద్ద తీసికొనెదననెను. శ్యామా మిక్కిలి సంతసించి, ”ఒక్కటేల పది పుస్తకములు నిచ్చెద” ననెను.
బాబా ఈ విధముగా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించ వలసిన విషయమేమన రామదాసి పంచరత్నగీత నేల కోరెను ? అతడు లోనున్న భగవంతుని తెలిసికొనుట కెన్నడు యత్నించి యుండలేదు.
ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు, శ్యామాతో బాబా యెదుట ఏల జగడ మాడెను ?
మనము ఎవరిని నిందించవలెనో, యెవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము భగన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసియుండవు.
బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి.
ఈ గ్రంథమును క్రమముగ శ్యామా చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను.
శ్రీమాన్ బూటీ అల్లుడగు జి.జి. నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా యింజనీరింగు కాలేజి ప్రిన్సిపాలుగా నుండెను.
గీతారహస్యము :
బ్రహ్మవిద్య నధ్యయనము చేయువారిని బాబా యెల్లప్పుడు ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచట దానికొక యుదాహరణ మిచ్చెదము.
ఒకనాడు బాపూసాహెబు జోగ్కు ఒక పార్సెలు వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతారహస్యముండెను.
అతడా పార్సిలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేయునప్పుడది క్రింద పడెను.
అదేమని బాబా యడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచెను.
బాబా కొన్ని నిముషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులోనుండి ఒక రూపాయి తీసి పుస్తకముపైబెట్టి దక్షిణతో గూడ పుస్తకమును జోగున కందించుచు, ”దీనిని పూర్తిగ చదువుము. నీకు మేలు కలుగును” అనిరి.
ఖాపర్డే దంపతులు :
ఖాపర్డేల వృత్తాంతముతో నీ యధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు ఖాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను.
దాదాసాహెబు ఖాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివయినవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందర నెప్పుడు నోరు తెరవలేదు.
అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి; కాని ముగ్గురు మాత్రము ఖాపర్డే, నూల్కర్, బూటీ నిశ్శబ్దముగా కూర్చుండువారు. వారు వినయవిధేయత నమ్రతలున్న ప్రముఖులు.
పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్డే బాబా ముందర మసీదులో కూర్చొనునప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు.
నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేదపారాయణ చేసినవాడైనను, బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తకజ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు.
దాదాసాహెబు ఖాపర్డే 4 మాసములుండెను. కాని యతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో నుండుటచే సంతసించిరి.
ఖాపర్డేగారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు గలిగి యుండెడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను.
ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా దెచ్చుచుండెను. దానిని బాబా యామోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను.
ఆమె యొక్క నిలకడను, నిశ్చలభక్తిని బాబా యితరులకు బోధించనెంచెను.
ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజా, పూరీ, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు దెచ్చెను.
గంటల కొలది యూరకనే యుండు బాబా యానాడు వెంటనే లేచి, భోజన స్థలములో గూర్చుండి, యామె తెచ్చిన పళ్ళెము పయి యాకు దీసి త్వరగా తిననారంభించెను.
శ్యామా యిట్లడిగెను. ”ఎందుకీ పక్షపాతము ? ఇతరుల పళ్ళెముల నెట్టివైచెదవు. వానివైపు చూడనయిన చూడవుకాని, దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనమెందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగా నున్నది”
బాబా యిట్లు బోధించెను. ”ఈ భోజనము యదార్థముగా మిక్కిలి యమూల్యమయినది. గత జన్మలో నీమె ఒక వర్తకుని యావు. అది బాగా పాలిచ్చుచుండెను.
అచ్చటి నుండి నిష్క్రమించి, ఒక తోటమాలి యింటిలో జన్మించెను. తదుపరి యొక క్షత్రియుని యింటిలో జన్మించి యొక వర్తకుని వివాహమాడెను.
తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలాకాలము పిమ్మట ఆమెను నేను జూచితిని కావున ఆమె పళ్ళెము నుండి యింకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను దీసికొననిండు”. ఇట్లనుచు బాబా యామె పళ్ళెము ఖాళీ చేసెను.
నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపయి కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను.
బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా యామెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న యామె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను.
గురుశిష్యులు ఒండొరలు సేవ చేసికొనుట జూచి శ్యామా యిటులనెను. ”చాల బాగా జరుగుచున్నది. భగవంతుడును, భక్తురాలును ఒకరికొకరు సేవ చేసికొనుట మిగుల వింతగా నున్నది”.
ఆమె యదార్థమయిన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువయిన యాకర్షించు కంఠముతో ‘రాజారామ్’ యను మంత్రమును ఎల్లప్పుడు జపించు మనచు నిట్లనియెను.
”నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతించును. నీకు మేలగును”.
ఆధ్యాత్మికము తెలియనివారికి ఇది సామాన్య విషయమువలె గాన్పించును. కాని యది యట్లుగాదు. అది శక్తిపాతము; అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట.
బాబా యొక్క మాటలెంత బలమయినవి ! ఎంత ఫలవంతమయినవి ! ఒక్క క్షణములో నవి యామె హృదయములో ప్రవేశించి స్థిరపడేను.
ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది.
ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసికొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్దరొకటే. ఒకరు లేనిదే మరియొకరు లేరు.
శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట బాహ్యదృశ్యమే గాని, యదార్థముగా వారిరువురు లోపల ఒక్కటే.
వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు; సంపూర్ణ జ్ఞానము లేనివారును.
ఇరువది యేడవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above text has been typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది ఐదవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది మూడవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది రెండవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది యేడవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది తొమ్మిదవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments