🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువదియారవ అధ్యాయము🌹…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ఇరువదియారవ అధ్యాయము

ఆంతరిక పూజ; భక్తపంతు; హరిశ్చంద్ర పితలే; గోపాల అంబాడేకర్

ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది.

ఈ వస్తువులు నిజముగా నుండి యుండలేదు. నిజముగా నుండునది ఒక్కటే. అదియే భగవంతుడు.

చీకటిలో తాడును గాని, దండమును కాని చూచి పామనుకొనునట్లు, ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు గాన్పించును;

గాని యంతర్గతముగా నున్న సత్యమును తెలిసికొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా జూచునటుల జేయును.

మనకగుపడునది నిజ స్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని యసలయిన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతముగాక ! అదే సత్యదృష్టి.

ఆంతరిక పూజ :

హేమాడ్‌పంతు మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించు చున్నారు.

సద్గురుని పాదములు కడుగుట కానందభాష్పములనే వేడినీళ్ళ నుపయోగించెదముగాక ! స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక !

దృఢ విశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక !

అష్టసాత్త్విక భావములనెడు ఎనిమిది తామర పుష్పములు సమర్పించెదము గాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించెదము గాక.

భావమను బుక్కా వారి శిరముపై జల్లి భక్తియనే మొలత్రాడును కట్టెదము గాక. మన శిరస్సును వారి బొటన వ్రేళ్ళపై నుంచెదము గాక.

సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతము గాక. అట్టి యానందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదము గాక !

”మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివయిపు పోవునటుల జేయుము.

నిత్యానిత్యములకు గల తారతమ్యమును దెలిసికొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము.

మేము మా శరీరమును, ప్రాణమును, సర్వమును నీకు సమర్పించెదము. సుఖదుఃఖానుభవములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము.

మా శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు నీ యిష్టము వచ్చినటుల చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక”.

ఇక నీ అధ్యాయములోని కథలవైపు మరలుదము.

భక్తపంతు :

ఒకనాడు పంతు అను భక్తుడు, మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవ ఇచ్ఛలేకుండెను.

కాని తానొకటి తలచిన దైవమింకొకటి తలచునందురు. అతడు బి.బి. అండ్‌ సి.ఐ. రైల్వేలో పోవుచుండెను.

అందులో అనేకులు స్నేహితులు, బంధువులు కలిసిరి. వారందరు షిరిడీకి పోవుచుండిరి.

వారందరు తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదన లేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్‌లో దిగెను.

అచ్చట తన గురువును దర్శించి, షిరిడీకి పోవుటకు అనుమతి పొంది, ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని యందరితో  కలిసి షిరిడీకి వచ్చెను.

అందరు ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును జూచి యందరు సంతసించిరి.

కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రిందపడెను. వారందరు భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి.

అతని ముఖముపై నీళ్ళు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచినవానివలె లేచి కూర్చుండెను.

సర్వజ్ఞుగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి, నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునటుల నీ క్రింది విధముగా బలికెను.

”ఏమైనను కానిండు. పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రయము నిలుపుము; ఎల్లప్పుడు నిలకడగా నుండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి యుండుము”.

పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈవిధముగా తన సద్గురుని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన యీ మేలును మరువలేదు.

హరిశ్చంద్ర పితలే :

బొంబాయిలో హరిశ్చంద్ర పితలే యనునాతడుండెను. అతనికి మూర్ఛ రోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు.

ఇంగ్లీషు మందులను ఆయుర్వేదము మందులను కూడ వాడెను గాని జబ్బు కుదురలేదు.

కావున యోగుల పాదములపయి బడుటయనే సాధన యొక్కటే మిగిలెను.

15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగణు బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసెనని తెలుసుకొంటిమి.

1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వానినుండి యితరులు చెప్పిన దానినుండి బాబా తన దృష్టిచేతను, స్పర్శచేతను బాగుకానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను.

సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధముల సన్నాహమై, బహుమానములను వెంట దీసికొని పండ్ల బుట్టలను బట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను.

అతడు మసీదుకు బోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా యా బిడ్డవైపు చూడగనే యొక వింత జరిగెను.

పిల్లవాడు వెంటనే కండ్లు గిఱ్ఱున తిప్పి చైతన్యము తప్పి నేలపై బడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చినవానివలె పడెను.

దీనిని జూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను గాని యీ మూర్ఛ చాలాసేపటి వరకుండెను.

తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె యేడ్చుటకు మొదలిడెను.

ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని యొక గృహము లోనికి పరుగెత్తగా అది తన నెత్తిపై బడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన యావువలె,

ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై బడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను.

ఆమె యిటులేడ్చుచుండగా బాబా యామె నిటుల ఓదార్చెను. ”ఇటు లేడ్వవలదు. కొంతసేపాగుము. ఓపికతో నుండుము. కుఱ్ఱవానిని బసకు దీసికొని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము వచ్చును.”

బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. వాడాలోనికి దీసికొని పోగానే కుఱ్ఱవానికి చైతన్యము వచ్చెను.

పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి.

మనస్సులో బాబా చేసిన యుపకారమునకు నమస్కరించు చుండిరి. బాబా చిరునవ్వుతో నిట్లనిరి.

”నీ యాలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా ? ఎవరికయితే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును”.

పితలే ధనికుడు, మరియాద గలవాడు. అతడందరికి అపరిమితముగా మిఠాయి పంచి పెట్టెను.

బాబాకు చక్కని పండ్లను తాంబూలము నిచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ భక్తులతో నిండియుండెను.

ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి యానంద భాష్పములు రాల్చుచుండెను.

ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపయి నాధారపడెదరు.

ఏ భక్తుడు హృదయపూర్వకముగను, మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును.

వారు కొద్దిరోజులు బాబా వద్ద సుఖముగా నున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకయి మసీదుకు వచ్చిరి.

బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరికి బిలిచి యిట్లనెను.

”బాపూ ! అంతకు ముందు 2 రూపాయలిచ్చి యుంటిని. ఇప్పుడు 3 రూపాయలిచ్చుచున్నాను. వీనిని మీ పూజా మందిరములో బెట్టుకొని పూజింపుము. నీవు మేలు పొందెదవు”.

పితలే వీనిని ప్రసాదముగా నంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి యాశీర్వదనములకయి ప్రార్థించెను.

ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి గనుక, అంతకుముందు 2 రూపాయలిచ్చెనను బాబా మాటల యర్ధమును గ్రహింపలేకుండెను.

దీనిని తెలిసికొనవలెనని కుతూహలపడెను గాని బాబా యూరకొనెను.

స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా యంతకు ముందు రెండు రూపాయలిచ్చెననెను, అదేమియని యడిగెను.

ఆమె తన పుత్రునితో నిట్లనెను : ”నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు, మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్‌ కోట్ కర్ మహారాజు గారి వద్దకు బోయెను.

ఆ మహారాజు కూడ సిద్ధపురుషుడు; పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు.

మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి రెండు రూపాయలిచ్చి మందిరములో బెట్టి పూజింపుమనిరి.

మీ తండ్రిగారు చనిపోవువరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి.

నీవదృష్టవంతుడవగుటచే, అక్కల్‌ కోట్ కర్ మహారాజు శ్రీ సాయి రూపములో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి దెచ్చి, నీ కష్టములను తప్పించ జూచుచున్నారు.

కాబట్టి యికమీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను దురాలోచనములను విడువుము. మీ తాత ముత్తాతల యాచారము ప్రకారము నడువుము.

సత్ప్రవర్తనము నవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి, వాటిని శ్రద్ధగా పూజించి, మహాత్ముల యాశీర్వచనము దొరికినందుకు గర్వించుము.

శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దాని నభివృద్ధి చేసికొనుము”.

తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను.

వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను.

గోపాల అంబాడేకర్‌ గారు :

పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్‌ బాబా భక్తుడు. అతడు ఆబ్‌కారి డిపార్టుమెంటులో 10 సంవత్సరములు నౌకరి చేసెను.

ఠాణా జిల్లాలోను, జవ్హార్ స్టేట్ లోను ఆయన ఉద్యోగములను జేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను. కాని ఫలించలేదు.

అతడనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రానురాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడచెను.

అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో నతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించు కొనెను.

అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములుండెను. దీక్షిత్‌ వాడాకు ముందున్న యెడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలోబడి చావవలెనని నిశ్చయించుకొనెను.

అతడీ ప్రకారము చేయ నిశ్చయించుకొనగనే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను.

కొన్ని అడగుల దూరమున నొక హోటలుండెను. దాని యజమాని సగుణమేరు నాయక్‌. అతడు బాబా భక్తుడు.

అతడు అంబాడేకర్‌ను బిలిచి అక్కల్‌ కోట్ కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా ? యని యడుగుచు పుస్తకము నిచ్చెను.

అంబాడేకర్‌ దానిని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరుచుసరికి ఈ కథ వచ్చెను.

అక్కల్‌ కోట్ కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను.

బాధను సహించలేక నిరాశజెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు దీసి యిట్లనెను.

”గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తికాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు.

నీవింకొక జన్మమెత్తి బాధ యనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మ ననుభవించరాదు ? గత జన్మముల పాపముల నేల తుడిచి వేయరాదు ? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము”.

సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్‌ మిగుల నాశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను.

బాబా సలహా యీ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే యుండును.

బాబా సర్వజ్ఞత్వమును, దయాళుత్వమును జూచి అంబాడేకరుకు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యెను.

అతని తండ్రి అక్కల్‌ కోట్ కర్ మహారాజు భక్తుడు. కాన కొడుకు కూడ తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక.

అతడు బాబా యాశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసికొనెను.

కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగత జీవితమంతయు సుఖముగా గడపెను.

ఇరువదియారవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles