🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏబదియవ అధ్యాయము🌹…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ఏబదియవ అధ్యాయము

కాకాసాహెబు దీక్షిత్‌; శ్రీ టెంబెస్వామి; బాలారామ్‌ దురంధర్

శ్రీ సాయి సచ్ఛరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది.

కారణము అందులోని యితివృత్తము గూడ నిదియే కనుక. సచ్చరిత్రలోని 51వ అధ్యాయమిచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను.

భక్తుల కాశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక ! వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు.

ఓ సాయీ ! మాయందు కనికరించుము. మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయపర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును.

మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగ జేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి.

అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు.

కాకాసాహెబు దీక్షిత్‌ (1864 – 1926):

మధ్య పరగణాలలోని ఖాండ్వా  గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరిసీతారామ్‌ ఉరఫ్‌ కాకాసాహెబ్‌ దీక్షిత్‌ జన్మించెను.

ప్రాథమిక విద్యను ఖండ్వా, హింగన్‌ఘాట్ లలో పూర్తి చేసెను. నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను.

బొంబాయి విల్సన్‌, ఎల్పిన్ స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడ ఉత్తీర్ణులై లిటిల్‌ అండ్‌ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను.

1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్‌కు తెలియదు. అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి.

ఒకానొకప్పుడు లొనావాలాలో నున్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్‌ను జూచెను.

ఇద్దరును కలిసి యేవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారి పడిన యపాయమును గూర్చి వర్ణించెను.

వందలకొలది ఔషధములు దానిని నయము చేయలేక పోయెను. కాలునొప్పియు, కుంటితనమును పోవలెనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలెనని నానాసాహెబు సలహా ఇచ్చెను.

సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను.

సాయిబాబా ”నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి గూడ పిచ్చుక కాలికి దారము కట్టి యీడ్చినట్లు లాగుకొనివచ్చెదను”. అను వాగ్దానమును,

ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను.

ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి, ‘సాయిబాబా వద్దకుపోయి, వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటె నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజేయుమని వేడుకొనెద”నని నానాసాహెబుతో చెప్పెను.

కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహమద్‌నగర్‌ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో వోట్లకై సర్దార్‌ కాకాసాహెబు మిరీకర్ యింటిలో దిగెను.

కాకాసాహెబు మిరీకర్‌ కొడుకు బాలాసాహెబు మిరీకర్‌. వీరు కోపర్‌గాంకు మామలతదారు. వీరు కూడ గుఱ్ఱపు ప్రదర్శన సందర్భములో అహమద్‌నగరు వచ్చి యుండిరి.

ఎలక్షను పూర్తియైన పిమ్మట కాకాసాహెబు షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను.

మిరీకర్‌ తండ్రి కొడుకులు వీరిని ఎవరివెంట షిరిడీకి పంపవలెనా యని యాలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను.

అహమద్‌నగరులో నున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు, శ్యామాను తన భార్యతో గూడ రావలసినదనియు టెలిగ్రామ్‌ యిచ్చిరి.

బాబా యాజ్ఞను పొంది శ్యామా అహమద్‌నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలిసికొనెను.

మార్గములో గుఱ్ఱపు ప్రదర్శనమునకు బోవుచున్న నానాసాహెబు పాన్సే, అప్పాసాహెబు గద్రే శ్యామాను కలిసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబు దీక్షితుని కలిసి, వారిని షిరిడీకి తీసుకొని వెళ్ళుమనిరి.

కాకాసాహెబు దీక్షితుకు మిరీకరులకు శ్యామా అహమద్‌నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామా మిరీకరుల వద్దకు పోయెను.

వారు శ్యామాకు కాకాసాహెబు దీక్షిత్‌తో పరిచయము కలుగజేసిరి. శ్యామా కాకాసాహెబు దీక్షిత్‌తో కోపర్‌గాంకు ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవలెనని నిశ్చయించిరి.

ఇది నిశ్చయించిన వెంటనే యొక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబు మిరీకరు తీసి దానిని కాకాసాహెబు దీక్షితుకు చూపెను.

కాకాసాహెబు షిరిడీకి పోయి యెవరినయితే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో, వారే పటము రూపముగా నచట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగా నున్నట్లు తెలిసి యతడు మిక్కిలి యాశ్చర్యపడెను.

ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున నాతడు దానికింకొక అద్దము వేయుటకు మిరీకరుల వద్దకు బంపెను.

చేయవలసిన మరమ్మతు పూర్తిచేసి ఆ పటమును కాకాసాహెబు, శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి.

10 గంటల లోపల స్టేషనుకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండు క్లాసు క్రిక్కిరిసి యుండుటచే వారికి జాగా లేకుండెను.

అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టుక్లాసులో కూర్చుండ బెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్‌గాంలో దిగిరి.

బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగా నున్న నానాసాహెబు చాందోర్కరును జూచి మిక్కిలి యానందించిరి.

కాకాసాహెబు, నానాసాహెబు కౌగిలించు కొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి.

షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా, కాకాసాహెబు మనస్సు కరగెను. కండ్లు ఆనందభాష్పములచే నిండెను.

అతడానందముచే పొంగిపొరలుచుండెను. బాబా కూడ వారి కొరకు తాము కనిపెట్టుకొని యున్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లును తెలియజేసెను.

పిమ్మట కాకాసాహెబు బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడీలో నొక వాడాను గట్టి దానినే తన నివాస స్థలముగా జేసికొనెను.

అతడు బాబా వల్ల పొందిన యనుభవములు లెక్కలేనన్ని గలవు. వాటి నన్నిటిని ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము.

బాబా కాకాసాహెబుతో ”అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకపోయెదను” అన్న వాగ్దానము సత్యమైనది.

1926వ సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమాడ్‌పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు, సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను.

ఉన్నట్లుండి తన శిరమును హేమాడ్‌పంతు భుజముపై వాల్చి యే బాధయులేక, యెట్టి చికాకు పొందక ప్రాణములు విడచెను.

శ్రీ టెంబె స్వామి:

యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాములవారు (టెంబె స్వామి) రాజమండ్రిలో మకాం చేసిరి.

ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను.

వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చెను.

బాబా పేరు విని స్వామి చేతులు జోడించి, ఒక టెంకాయను దీసి పుండలీకరావు కిచ్చి యిట్లనిరి.

”దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము, నన్ను మరువవద్దని వేడుము. నాయందు ప్రేమ చూపుమనుము”.

ఆయన స్వాములు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది యొక అపవాదమనియు చెప్పెను.

పుండలీకరావు ఆ టెంకాయను, సమాచారమును షిరిడీకి దీసికొని పోవుటకు సమ్మతించెను.

బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెల్గించియే యుంచిరి.

ఒకనెల పిమ్మట పుండలీకరావు తదితరులును షిరిడీకి టెంకాయను దీసికొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి.

దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు బోయిరి. పరగడుపున నీళ్ళు త్రాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి.

అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి యటుకులను రుచికరముగా జేసిరి.

దురదృష్టము కొలది యా కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావు కిచ్చినది. షిరిడీ చేరునప్పటికి పుండలీకరావుకీ విషయము జ్ఞప్తికి వచ్చెను.

అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచు సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయమప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను.

బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను దెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా బట్టుకొని, తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు, పశ్చాత్తాపపడుచు, బాబాను క్షమాపణ వేడెను.

దానికి బదులింకొక టెంకాయను సమర్పించెదననెను. కాని బాబా యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవున దింకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను.

ఇంకను బాబా యిట్లనెను. ”ఆ విషయమై నీవే మాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను.

దానికి నీవే కర్తవని యనుకొననేల? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకార రహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును”. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుడు!

బాలారామ్‌ దురంధర్‌ (1878-1925):

బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రజ్‌లో పఠారే ప్రభు జాతికి చెందిన బాలారామ్‌ దురంధర్‌ యనువారుండిరి.

వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను.

దురంధర్‌ కుటుంబములోని వారందరు భక్తులు, పవిత్రులు, భగవచ్ఛింతన గలవారు. బాలారామ్‌ తన జాతికి సేవ చేసెను.

ఆ విషయమై యొక గ్రంథము వ్రాసెను. అటుపిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను.

గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మవిద్య మొదలగు వానిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు.

అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులగు బాబుల్జీయును, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి.

ఇంటికి వచ్చి వారి యనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరు బాబాను చూడ నిశ్చయించిరి.

వారు షిరిడీకి రాకమునుపే బాబా యిట్లు చెప్పెను. ”ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు”. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికి బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయ మొందిరి.

తక్కిన వారందరు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో మాట్లాడుచు కూర్చొని యుండిరి.

బాబా వారితో నిట్లనెను. ”వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని”

బాబా దురంధర సోదరులతో నిట్లనెను. ”గత 60 తరముల నుండి మన మొండొరులము పరిచయము గలవారము”. సోదరులందరు వినయ విధేయతలు గలవారు.

వారు చేతులు జోడించుకొని నిలచి, బాబా పాదముల వైపు దృష్టిని నిగిడించిరి.

సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుక యార్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరగించెను. వారందరానందించిరి.

భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారామ్‌ బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదము లొత్తుచుండెను.

బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామున కిచ్చి పీల్చుమనెను. బాలారామ్‌ చిలుము పీల్చుట కలవాటు పడి యుండలేదు.

అయినప్పటికి దాని నందుకొని కష్టముతో బీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను. ఇదియే బాలారామునకు శుభసమయము.

అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు.

6 సంవత్సరముల పిమ్మట నొకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను.

వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి యుత్సవము జూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను.

చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను.

బాలారామ్‌ దురంధర్‌ మరాఠీ భాషలో తుకారామ్‌ జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడకమునుపే అతడు చనిపోయెను.

1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమమున వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడియున్నది.

ఏబదియవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles