Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
ఇరువదవ అధ్యాయము
ఈశావాస్యోపనిషత్తు; సద్గురువే బోధించుటకు యోగ్యత – సమర్థత గలవారు,
కాకా యొక్క పనిపిల్ల; విశిష్టమైన బోధనా విధానము
ఈ అధ్యాయములో దాసగణుకు గలిగిన యొక సమస్యను కాకాసాహెబు ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్‌పంతు చెప్పెను.
మౌలికముగా సాయి నిరాకారుడు. భక్తులకొరకాకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమునందు మాయయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి.
సాయిని స్మరించి ధ్యానింతము గాక. షిరిడీకి పోయి యచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము.
హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి, గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోను, దయతోను భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి.
భక్తులు కూడ సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారివైపు చూచుచు ఊదీ ప్రసాదపు జల్లులనుభవించుచుండిరి.
బాబా భక్తుల చేతులలో పిడికిళ్ళతో ఊదీ పోయుచు, వారి నుదుటిపై తమ చేతులతో ఊదీబొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తులయెడ అమితమైన ప్రేమ.
బాబా భక్తులనీ క్రింది విధముగా పలుకరించుచుండిరి.
”అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము ! బాబా, నీ బసకు పో, బాపూ ! భోజనము చేయుము” ఈ విధముగా ప్రతిభక్తుని పలకరించి యింటికి సాగనంపుచుండిరి.
ఇప్పటికి అది యంతయు ఊహించుకొన్నచో, ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము గలుగును.
మనోఫలకమున సాయిని నిల్పి, వారిని ఆపాద మస్తకము ధ్యానింతము. వారి పాదములపైబడి సగౌరవముగ ప్రేమతో వినయముగ సాష్టాంగనమస్కార మొనర్చుచు, ఈ అధ్యాయములోని కథను చెప్పెదను.
ఈశావాస్యోపనిషత్తు :
ఒకప్పుడు దాసగణు ఈశావాస్యోపనిషత్తుపై మరాటీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలిడెను. మొట్టమొదట ఈ యుపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము.
వేదసంహితలోని మంత్రములు గలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా యందురు.
ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజసనేయ సంహిత యుండుటచే, దీనికి వాజసనేయ సంహితోపనిషత్తని కూడా పేరు.
వైదిక సంహిత లుండుటచే దీని నితర ఉపనిషత్తులకన్న శ్రేష్ఠమని భావించెదరు. దీనికొక యుదాహరణము. ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు యీ ఈశావాస్యోపనిషత్‌పై వ్యాఖ్యయని పండితుడగు సాత్వలేకర్‌గారు భావించుచున్నారు.
ప్రొఫెసరు రానడేగారిట్లనుచున్నారు : ”ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికి దానిలో అంతర్‌దృష్టిని కలిగించు అనేకాంశములున్నవి.
18 శ్లోకములలో ఆత్మ గూర్చి విలువైన యపురూపమగు వర్ణన, అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన లిందున్నవి.
తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ యుపనిషత్తు. తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగ నున్న సంగతులు చెప్పబడినవి.
జ్ఞానమార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట యీ యుపనిషత్తులోని సారాంశము”.
ఇంకొకచోట వారిట్లనిరి : ”ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము”.
పై వర్ణమును బట్టి యీ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును.
దాసగణు దీనిని మరాఠీ ఓవీ ఛందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితో నతడు తృప్తి చెందలేదు.
అతడు కొందరు పండితుల నడిగెను, వారితో చర్చించెను. కాని వారు సరియైన సమాధానమియ్యకుండిరి. కావున దాసగణు కొంతవరకు వికలమనస్కుడయ్యెను.
సద్గురువే బోధించుటకు యోగ్యత – సమర్థత గలవారు :
ఈ యుపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది యాత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము.
ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును.
కనుక ఎవరయితే యాత్మ సాక్షాత్కారము పొంది యున్నారో యట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను.
ఎవరును దీనికి తగిన సమాధానము నివ్వనప్పుడు దాసగణు సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను.
అవకాశము దొరకగానే షిరిడీకి పోయి, సాయిబాబాను దర్శించి, వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన కష్టముల జెప్పి, సరియైన యర్థమును బోధింపమని వేడుకొనెను.
సాయిబాబా యాశీర్వదించి యిట్లనెను: ”తొందర పడవద్దు. ఆ విషయములో నెట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును”.
అప్పుడక్కడ నున్నవారీ మాటలు విని, బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి.
భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయమెట్లు చెప్పగలదనిరి. కాని దాసగణు అట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకొనెను.
కాకా యొక్క పనిపిల్ల :
బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి, దాసగణు షిరిడీ విడిచి విలేపార్లే చేరి, కాకాసాహెబు దీక్షితు ఇంటిలో బసచేసెను.
ఆ మరుసటి దినముదయము దాసగణు నిద్ర నుంచి లేవగనే, యొక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను.
ఆ పాటలోని విషయము ఎఱ్ఱచీర వర్ణనము. అది చాల బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా నుండెననియు, దాని యంచుల చివరలు చాలా సుందరముగా నుండెననియు ఆమె పాడుచుండెను.
ఆ పాట నచ్చుటచే దాసగణు బయటకు వచ్చి వినెను. అది కాకా పనిమనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను.
ఆమె చిన్నపిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోష భావమును గాంచి దాసగణు ఆమెపై జాలిపడెను.
ఆ మరుసటి దినము రావుబహద్దూర్ యమ్.వి. ప్రధాన్ (మోరేశ్వర్ విశ్వనాధ్ ప్రధాన్) తనకు ధోవతుల చాపులివ్వగ, ఆ పేదపిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పెను.
రావుబహద్దూర్ ఒక మంచి చిన్న చీరను కొని యామెకు బహుకరించెను.
ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె యమితానంద పరవశురాలయ్యెను.
ఆ మరుసటి దినమామె యా కొత్త చీరను ధరించెను. అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలసి గిఱ్ఱున తిరుగుచు నాట్యము చేసెను.
అందరికంటె తానే బాగుగ ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కాని యామె యానందమునకు లోటు లేకుండెను.
ఇదంతయు చూచి దాసగణు జాలి భావము మెచ్చుకోలుగా మారెను.
పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్తచీర గలదు, గాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికి విచారమనునది గాని, నిరాశ యనునది గాని లేక యాడుచు పాడుచుండెను.
కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై నాధారపడి యుండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను.
భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల నన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలుకొరకే యని గ్రహించెను.
ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్తచీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దాన భావము ఇవి యన్నియు భగవంతుని యంశములే.
భగవంతుడు యీ యన్నిటియందు వ్యాపించియున్నాడు. ఇచ్చట దాసగణు ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట,
ఏది మనకు సంభవించుచున్నదో యది అంతయు భగవంతుని యాజ్ఞచే జరుగుచున్న దనియు, తుదకది మన మేలు కొరకే యనియు గ్రహించెను.
విశిష్టమైన బోధనా విధానము :
పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు, అపూర్వ మైనదనియు పాఠకులు గ్రహించియేయుందురు.
బాబా షిరిడీని విడువనప్పటికి కొందరిని మచ్ఛీంద్రగడ్ కు, కొందరిని కొల్హాపూరుకు గాని, షోలాపూరుకు గాని సాధన నిమిత్తము పంపుచుండెను.
కొందరికి సాధారణ రూపములోను, కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రిగాని, పగలుగాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను.
భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయములో దాసగణును విలేపార్లే పంపి, పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను.
కాని విలేపార్లే పంపకుండ షిరిడీలోనే బాబా బోధించరాదాయని కొందరనవచ్చును.
కాని బాబా అవలంబించినదే సరియైన మార్గము. కానిచో పేద నౌకరు పిల్ల, యామె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే యని దాసగణు ఎట్లు నేర్చుకొని యుండును ?
ఈశావాస్యోపనిషత్తులోని నీతి :
ఈశావాస్యోపనిషత్తులో నున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే.
ఈ ఉపనిషత్తులో నున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడియున్నది.
ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి యని చెప్పుచున్నవి.
దీనినిబట్టి మనము గ్రహించవలసిన దేమన మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందవలెను.
ఏలయన భగవంతుడన్నింటియందు గలడు. కావున భగవంతుడేది యిచ్చెనో అదియెల్ల మన మేలుకొరకే యని గ్రహించవలెను.
దీనిని బట్టి యితరుల సొత్తుకై యాశించరాదనియు, ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలుకొరకే దానినిచ్చియున్నాడనియు, కావున నది మనకు మేలు కలుగజేయునదేయనియు గ్రహించవలెను.
దీనిలోని ఇంకొక నీతి యేమన మనుష్యుడెల్లప్పుడేదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే యుండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను.
భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండ నుండుట యాత్మ నాశనమునకు కారణము.
మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును.
ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ యన్నిటియందుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు, సకల వస్తువులు ఆత్మగా భావించునో, యట్టివాడెందుకు మోహమును పొందును?
వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో నాత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి.
ఎవడయితే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికయితే సమస్త మాత్మయగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖవికారములకు లోనుగాడు.
ఇరువదవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదునైదవ అధ్యాయము🌹…Audio
- ప్రసాదం – ధన ప్రసాదం…..సాయి@366 ఆగస్టు 19….Audio
- సాయినాథుని చీపురు…..సాయి@366 నవంబర్ 28…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదునాలుగవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నాలుగవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments