🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నాలుగవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice By: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

నాలుగవ అధ్యాయము

యోగీశ్వరుల కర్తవ్యము; పవిత్ర షిరిడీ క్షేత్రము ; సాయిబాబా రూపురేఖలు;

గౌలిబువా అభిప్రాయము; విఠల దేవుడు దర్శనమిచ్చుట; భగవంతరావు

క్షీరసాగరుని కథ; ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము; బాబా

అయోనిసంభవుడు- షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట; మూడు వసతి గృహములు

యోగీశ్వరుల కర్తవ్యము :

భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు.

ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు, యుగయుగములందు అవతరించెదను”. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ.

భగవంతుని ప్రతినిధులగు యోగులు సన్యాసులు అవసరము వచ్చినపుడెల్ల అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు.

ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతులవారి హక్కులను అపహరించునప్పుడు,

మత గురువులను గౌరవించక యవమానించునప్పుడు, ఎవరును మత బోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని యనుకొనునప్పుడు,

జనులు నిషిద్ధాహారములు మద్యపానముల కలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు,

వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు,

సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనదారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్షమార్గమును మరచునప్పుడు,

యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున బెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు.

వారు దీపస్తంభములవలె సహాయపడి, మనము నడుపవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు.

ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయీ, ఏకనాథుడు, తుకారం, నరహరి, నర్సిబాయి, సజన్‌కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగాగల యోగులును, తదితరులు

వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును జూపిరి. అట్లే సాయిబాబాగూడ సకాలమందు షిరిడీ చేరిరి.

పవిత్ర షిరిడీ క్షేత్రము :

        అహమదునగరు జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన నచ్చట ననేక యోగులుద్భవించిరి, నివసించిరి. అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్‌ మహరాజ్‌.

షిరిడీ గ్రామము అహమదునగరు జిల్లాలోని కోపర్‌గాం తాలూకాకు చెందినది. కోపర్‌గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను.

నది దాటి 3 కోసులు పోయినచో నీమ్‌గాంవ్‌ వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును.

కృష్ణా తీరమందుగల గాణగాపురము, నరసింహవాడి, ఔదుంబర్‌ మొదలుగా గల పుణ్యక్షేత్రములవలె షిరిడీకూడ గొప్పగా పేరు గాంచినది.

పండరీపురమునకు సమీపమున గల మంగళవేధ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢ మందు సమర్థ రామదాసు, నర్సోబాచీవాడీయందు శ్రీ నరసింహ సరస్వతీస్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్ర మొనర్చెను.

సాయిబాబా రూపురేఖలు :

       సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా యెట్టి వ్యక్తియో పరిశీలింతము.

వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవభక్తుల కిల్లువంటివారు; ఉదార స్వభావులు; సారములోని సారాంశమువంటివారు; నశించు వస్తువులందభిమానము లేనివారు;

ఎల్లప్పుడు ఆత్మ సాక్షాత్కారమందే మునిగియుండెడివారు; భూలోకమందుగాని, స్వర్గలోకమందుగాని గల వస్తువుల యందభిమానము లేనివారు. వారి యంతరంగము అద్దమువలె స్వచ్ఛమైనది.

వారి వాక్కుల నుండి యమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానావమానాలను లెక్కించినవారు కారు. అందరికి వారు ప్రభువు.

అందరితో కలిసి మెలసి యుండెడివారు. ఆటలు గావించెడివారు; పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడు అల్లా నామము నుచ్ఛరించుచుండెడివారు.

ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగనిద్ర యందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి యంతరంగము లోతయిన సమద్రమువలె ప్రశాంతము.

వారి యాశ్రమము, వారి చర్యలు ఇదమిత్థముగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండియున్నప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నియు వారికి తెలియును.

వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికిని మౌనము తప్పెడివారు కారు.

ఎల్లప్పుడు మసీదు గోడకు ఆనుకుని నిలుచువారు. లేదా, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండీ తోటవైపుగాని చావడివైపుగాని పచార్లు చేయుచుండెడివారు.

ఎల్లప్పుడు ఆత్మధ్యానమునందే మునిగి యుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకునివలె నటించువారు.

అణకువ నమ్రత కలిగి, యహంకారము లేక యందరిని ఆనందింప జేయువారు. అట్టివారు సాయిబాబా.

షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్‌ మహరాజ్‌ ఆళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను.

షిరిడీలోని గడ్డి, రాళ్ళు పుణ్యము చేసికొన్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసికొనగలిగినవి.

షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశి, రామేశ్వరము, బదరీ, కేదార్‌, నాసిక్‌, త్య్రంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదయినది.

షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము. అది మాకు సంసార బంధముల సన్నగిలచేసి యాత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును.

శ్రీ సాయి దర్శనమే మాకు యోగసాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను.

త్రివేణీ ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయు చుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది.

వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి.

వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు; నిరుత్సాహముగాని ఉల్లాసముగాని యెరుగరు.

వారు ఎల్లప్పుడు సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి.

ఇట్లు వారి కీర్తి దూర దేశములకు వ్యాపించగా, భక్తులన్నిదేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి యాశీర్వాదమును పొందుచుండిరి.

వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్‌ రఖుమాయీలను దర్శించినచో భక్తులకు కలిగెడి యానందము షిరిడీలో దొరుకుచుండెను.

ఇది యతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. 

గౌలిబువా అభిప్రాయము :

     95 సంవత్సరముల వయస్సు గల గౌలిబువా యను వృద్ధభక్తుడు ఒకడు పండరీయాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు.

ఎనిమిది మాసములు పండరీ పురమందు, మిగత నాలుగు మాసములు – ఆషాఢము మొదలు కార్తీకము వరకు (జులై – నవంబరు) గంగానది యొడ్డునను ఉండెడివాడు.

సామాను మోయుట కొక గాడిదను, తోడుగా నొక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసికొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు.

అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ యిట్లనెడివాడు:వీరు పండరీనాథుని యవతారమే ! అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి !”

గౌలిబువా విఠోబాదేవుని ముసలిభక్తుడు. పండరీయాత్ర యెన్ని సారులో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని యవతారమని నిర్ధారణ పరచిరి.

విఠల దేవుడు దర్శనమిచ్చుట :

    సాయిబాబాకు భగవన్నామస్మరణయందును, సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లామాలిక్‌’అనగా, ‘అల్లాయే యజమాని’ అని యనుచుండెడివారు.

ఏడు రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయించు చుండెడివారు. దీనినే నామసప్తాహమందురు.

బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహము చేయుమనిరి.

సప్తాహము ముగియునాడు విఠల్‌ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగణు జవాబిచ్చెను.

బాబా తన గుండెపై చేయి వేసి, ”తప్పనిసరిగ దర్శనమిచ్చును గాని, భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను.

డాకూరునాథ్‌ యొక్క డాకూరు పట్టణము, విఠల్‌ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము, ఇక్కడనే యనగా షిరిడీలోనే యున్నవి.

ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే యవతరించును” అన్నారు.

సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ క్రింది విధముగా దర్శనమిచ్చెను.

స్నానానంతరము కాకాసాహెబు దీక్షిత్‌ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను.

కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా కాకాను బాబా యిట్లడిగెను. ”విఠల్‌ పాటిల్‌ వచ్చినాడా ? నీవు వానిని జూచితివా ? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏ మాత్రము అజాగ్రత్తగనున్నను తప్పించుకొని పారిపోవును.”

ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25, 30 విఠోబా చిత్ర పటములను అమ్మకమునకు తెచ్చెను.

ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను.

దీనిని జూచి బాబా మాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటము నొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను.

భగవంతరావు క్షీరసాగరుని కథ:

       విఠల పూజయందు బాబా కెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది.

భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీ పురమునకు నియమముగ యాత్ర చేయుచుండెడివాడు. ఇంటివద్ద కూడ విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు.

అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు, బాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకొని :

”వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడ ఆకలితో మాడ్చినాడు.

అందుచేత వీని నిక్కడకు తెచ్చితిని. వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను” అనిరి.

ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము :

    గంగానది యమునానది కలియుచోటునకు ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము.

అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచటికి పోయి స్నానమాడుదురు. దాసగణు కూడా ప్రయాగపోయి అచ్చట సంగమములో స్నానము చేయవలెనని మనస్సున దలచెను.

బాబా వద్దకేగి యనుమతించమనెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను.

”అంతదూరము పోవలసిన అవసమే లేదు. మన ప్రయాగ యిచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము”.

ఇట్లనునంతలో నాశ్చర్యములన్నికంటె నాశ్చర్యకరమైన వింత జరిగినది.

దాసగణు మహరాజ్‌ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటన వ్రేళ్ళ నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను.

ఈ చమత్కారమును చూచి దాసగణు ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి.

అతని హృదయంలో వుప్పొంగిన కవితావేశం శ్రీ  సాయిలీలా గానరూపంలో పెల్లుబికింది.

బాబా అయోనిసంభవుడుషిరిడీ మొట్టమొదట ప్రవేశించుట :

     సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మము గూర్చి గాని జన్మస్థానమును గూర్చి గాని యెవరికి ఏమియు తెలియదు.

ఎందరో పెక్కుసారులీ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లీ విషయముగ బాబాను ప్రశ్నించిరి గాని, యెట్టి సమాధానము గాని, సమాచారము గాని పొందకుండిరి.

నామదేవు, కబీరు సామాన్యమానవులవలె జన్మించి యుండలేదు. ముత్యపుచిప్పలలో చిన్న పాపలవలె లభించిరి.

నామదేవుడు భీమారథి నదీతటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథీ నదీతటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము.

భక్తుల కొరకు బాబా పదునారేళ్ళ బాలుడుగా షిరిడీలోని వేపచెట్టు క్రింద నవతరించెను.

బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. బాబా స్వప్నావస్థ యందయినను ప్రపంచ వస్తువులను కాంక్షించెడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను.

నానాచోప్‌దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది.

ఈ చక్కని చురుకైన కుఱ్ఱవాడు వేపచెట్టు క్రింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపక యంతటి చిన్న కుఱ్ఱవాడు కఠిన తప మాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడిరి.

ఆ బాలుడు పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రియందెవరికి భయపడువాడు కాడు.

చూచినవారాశ్చర్య నిమగ్నులై యీ చిన్న కుఱ్ఱవాడెక్కడ నుండి వచ్చినాడని యడుగసాగిరి.

అతని రూపు, ముఖ లక్షణములు చాలా అందముగ నుండెను. చూచిన వారెల్లరు ఒక్కసారిగ ముగ్ధులగుచుండిరి.

ఆయన ఎవరి యింటికి పోకుండెను, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్న బాలుని వలె గాన్పించినప్పటికిని చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే.

నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతని గూర్చి యెవరికి నేమి తెలియ కుండెను”.

ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా నీ బాలుడెవడయి యుండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చటనుండి వచ్చినాడని యడిగిరి.

ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి, గడ్డపారను దీసికొని వచ్చి యచ్చట త్రవ్వుమనెను.

అట్లు త్రవ్వగా నందులో కొన్ని నిటుకలు, వాని యెగువ వెడల్పు రాయి యొకటి గాన్పించెను.

ఆ బండను తొలగించగా క్రిందనొక సందు గాన్పించెను. అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను.

ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా నచ్చట నొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కఱ్ఱబల్లలు, జపమాలలు గాన్పించెను.

ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు నభ్యసించెనని ఖండోబా చెప్పెను.

పిమ్మట కుఱ్ఱవాని నీ విషయము ప్రశ్నించగా, వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు, వారి సమాధి యచ్చట గలదు గావున దానిని కాపాడవలెననియు చెప్పెను.

వెంటనే దాని నెప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షములవలె నీ వేపచెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు.

మహాల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబాయొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 

మూడు వసతి గృహములు :

     వేపచెట్టును, దాని చుట్టునున్న స్థలమును హరి వినాయక సాఠే అనువాడు కొని సాఠేవాడాయను నొక పెద్ద వసతి గృహమును గట్టించెను.

అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలికిది యొక్కటియే నివాసస్థలము. వేపచెట్టు చుట్టు ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి.

మెట్ల దిగువన నొక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తరాభిముఖముగా కూర్చొనెదరు.

ఎవరిచ్చట గురు, శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు.

ఈ వాడా చాలా పురాతనమైనది. కావున మరమ్మత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి.

కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్‌ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది.

న్యాయవాదియైన కాకాసాహెబు దీక్షిత్‌ ఇంగ్లండుకు బోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది యెంత ప్రయత్నించినను బాగు కాలేదు.

తన స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా యిచ్చెను.

1909వ సంవత్సరమున కాకా షిరిడీకి బోయెను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను.

కాలు కుంటితనముకన్న తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించెను.

తన కొరకును, ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడాను నిర్మించెను.

10-12-1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను. (1) దాదా సాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. (2) చావడిలో శేజ్‌ (రాత్రి) హారతి ప్రారంభమయ్యెను.

దీక్షిత్‌వాడా పూర్తికాగానే 1911వ సంవత్సరములో శ్రీరామనవమి(ఏప్రిల్‌ 7) సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి.

తరువాత, కోటీశ్వరుడును నాగపూరు నివాసియునగు బూటీ మరియొక పెద్ద రాతిమేడను నిర్మించెను.

అతడు చాలా ద్రవ్యము దీనికొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్ధకమయ్యెను.

ఏలయన బాబాగారి భౌతిక శరీర మందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు.

ఈ స్థలములో మొట్టమొదట పూలతోట యుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్ళు పోయుట మొదలగునవి చేసెడివారు.

ఇట్లు మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక్క వసతిగృహము కూడ లేకుండెను. అన్నిటికంటె సాఠేవాడా మొదటి రోజులలో అందరికి చాలా ఉపకరించుచుండెను.

నాలుగవ అధ్యాయము సంపూర్ణము.

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles