Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice By: R C M Raju and team
🌹సాయిబాబా… సాయిబాబా… సాయిబాబా… సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
పన్నెండవ అధ్యాయము
ప్రస్తావన; కాకా మహాజని; భావూ సాహెబు ధూమాల్ ; నిమోన్‌కర్ భార్య;
నాసిక్ నివాసి యగు ములేశాస్త్రి; రామభక్తుడైన డాక్టరు
ప్రస్తావన :
శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతు డవతరించునను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలిసికొన్నాము.
కాని సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును నొకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు.
భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు.
భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగ వారు భగవంతుని కంటె వేరుకారు.
సద్గురుశ్రేష్టుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులై, దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరిని సమానముగ ప్రేమించెడివారు.
వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరు వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు.
భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరచి యెప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు.
వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు, వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు.
మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలెనను బుద్ధి యెట్లు పుట్టును ? కొందరు బాబాను దర్శింప వలెననుకొనిరి. కాని బాబా మహాసమాధి చెందు లోపల వారికా యవకాశము కలుగలేదు.
బాబాను దర్శించవలెనను కోరికగల వారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు.
కొందరదృష్టవశమున వారి దర్శనము చేసికొన్నను, బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకొనినను నచ్చట ఉండలేకుండిరి.
ఎవ్వరును తమ యిష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా యాజ్ఞ యెంతవరకు గలదో యంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి.
బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపైననే ఆధారపడియుండెను.
కాకా మహాజని :
ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి యుత్సవమును చూడవలె ననుకొనెను.
బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా యిట్లనిరి. ”ఎప్పుడు తిరిగి యింటికి పోయెదవు ?” ఈ ప్రశ్న విని మహాజని యాశ్చర్యపడెను.
కాని యేదో జవాబు నివ్వవలయును కదా ! బాబా యాజ్ఞ యెప్పుడయిన నప్పుడే పోయెదనని కాకా జవాబిచ్చెను.
అందులకు బాబా యిట్లనియెను, ”రేపు పొమ్ము !” బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము. కావునట్లే చేయవలసి వచ్చెను.
అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని యున్నట్లు తెలిసెను.
ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన యవసరము యేర్పడెను.
ఈ విషయమై యజమాని షిరిడీలో నున్న కాకా మహాజని కొక యుత్తరము కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తరువాత తిరుగు టపాలో బొంబాయి చేరినది.
భావూసాహెబు ధుమాల్ :
పై దానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు. ప్లీడరు వృత్తిలో నుండిన భావూసాహెబు ధుమాల్ యొకసారి కోర్టుపనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను.
బాబా దర్శనము చేసికొని, వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరెను. కాని బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే యింకొక వారముండునట్లు చేసెను.
ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా, అక్కడి మేజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను.
తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. నలుగురు మేజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను.
నిమోన్‌కర్ భార్య :
నిమోన్ గ్రామ వతనుదారుడు, గౌరవ మేజిస్ట్రేటును అగు నానాసాహెబు నిమోన్‌కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలముండెను.
ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపూరులో నున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చెను.
బేలాపూర్ పోయి తన కుమారుని, అక్కడున్న తమ బంధువులను జూచి, యక్కడ కొన్ని దినములుండవలెనని తల్లి అనుకొనెను. కాని బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీ తిరిగి రావలెనని భర్త చెప్పెను.
ఆమె సందిగ్ధములో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే యామెనప్పుడు ఆదుకొనెను.
బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాఠేవాడా ముందర నానాసాహెబు మొదలగువారితో నుండెను.
ఆమె బాబా వద్దకుపోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూరు పోవుటకు అనుమతి నిమ్మని కోరెను.
అప్పుడు బాబా ఆమెతో యిట్లు చెప్పెను. ”వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు! హాయిగా బేలాపూరులో నాలుగురోజులుండిరా ! నీ బంధువు లందరిని చూచి, నింపాదిగా షిరిడీకి రమ్ము !”
బాబా మాటలెంత సమయానుకూలముగ నుండెనో గమనించుడు. నిమోన్‌కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దుచేసెను.
నాసిక్ నివాసి యగు ములేశాస్త్రి :
ములేశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్ శాస్త్ర పారంగతుడు. జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట.
అతడు నాగపూరుకు చెందిన కోటీశ్వరుడగు బాపుసాహెబు బూటీని కలిసికొనుటకు షిరిడీకి వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను.
బాబా తన డబ్బుతో మామిడిపండ్లను, కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులో నున్న వారందరికి పంచిపెట్టుచుండెను.
మామిడిపండును బాబా యొక చిత్రమైన విధముగ అన్నివైపుల నొక్కెడివారు. తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి బోయి తొక్క, టెంక మిగిలెడివి.
అరటిపండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి, తొక్కలు బాబా తమ వద్ద యుంచుకొనెడివారు.
ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని యడిగెను. బాబా దానినసలు పట్టించుకొనక, నాలుగు అరటిపండ్లు అతని చేతిలో బెట్టిరి.
తరువాత నందరు వాడా చేరిరి. ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని యగ్నిహోత్రము మొదలగునవి యాచరించుటకు మొదలిడెను. బాబా మామూలుగనే లెండీ తోటకు బయలుదేరెను.
మార్గమధ్యమున బాబా హఠాత్తుగా, ”గేరు (ఎఱ్ఱరంగు) తయారుగ నుంచుడు. ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను” అని యనెను.
ఆ మాటలెవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీ తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యెను.
మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా యని ములేశాస్త్రిని బూటీ యడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసికొనెదనని శాస్త్రి బదులు చెప్పెను అంతలో బాబా తన యాసనముపై కూర్చుండెను.
భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను.
బాబా యాజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను : ”నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును. కానీ, నేనాయన ఆశ్రితుడను గానే ! వారికి నేనెందులకు దక్షిణ నీయవలెను”?
సాయిబాబా యంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను.
తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి, బూటీతో మసీదుకు బయలుదేరెను. మడితో నున్న తాను మసీదులో అడుగిడిన మైలపడిపోవుదునని భావించి, మసీదు బయటే దూరముగ నిలువబడి, బాబాపై పువ్వులను విసరెను.
హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువగు ఘోలవ్‌స్వామి కూర్చొని యుండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది కలా నిజమా యని సందేహపడెను.
తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగ్రదావస్థలోనే యున్నాడు. భ్రాంతి యగుటకు వీలులేదు. అయినచో యేనాడో గతించిన తన గురువచ్చటకెట్లు వచ్చెను ? అతనికి నోట మాట రాకుండెను.
తుదకు సందిగ్ధములన్నియు విడచిపెట్టి మసీదులో ప్రవేశించి, తన గురువు పాదములపై బడి, లేచి చేతులు జోడించి నిలువబడెను.
తక్కిన వారందరు బాబా హారతి పాడుచుండగా, ములేశాస్త్రి తన గురునామము నుచ్ఛరించుచుండెను.
తాను అగ్రకకులమునకు చెందినవాడను, పవిత్రుడనుయను అభిజాత్యమును వదలిపెట్టి, తన గురుని పాదములపైబడి సాష్టాంగ నమస్కార మొనర్చి కండ్లు మూసికొనెను.
లేచి కండ్లు తెరచి చూచుసరికి, వానిని దక్షిణ యడుగుచూ సాయిబాబా కాన్పించెను. బాబా వారి ఆనంద రూపమును, ఊహకందని వారి శక్తిని జూచి ములేశాస్త్రి మైమరచెను; మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష భాష్పములచే నిండెను.
మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు, తనకు గురుదర్శనమైనదనియు చెప్పెను.
బాబా యొక్క యా ఆశ్చర్యకరమైన లీలను గాంచినవారందరు అచ్చెరువొందిరి. ”గేరు తెండు ! కాషాయవస్త్రముల ధరించెద”నని అంతకు ముందు బాబా పలికిన మాటల కర్థమును అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు.
రామభక్తుడైన డాక్టరు :
ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడగు డాక్టరుతో కలసి షిరిడీ వచ్చెను.
షిరిడీ బయలుదేరుటకు ముందు, తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు, తాను షిరిడీకి పోయి యొక మహమ్మదీయునికి నమస్కరించ మనస్కరించుట లేదనియు చెప్పెను.
అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించుమని యెవ్వరూ బలవంతపెట్టరనియు, కలసి సరదాగా గడుపుటకు తనతో రావలెననియు మామలతదారు కోరెను.
దానికి ఆ డాక్టరు సమ్మతించెను. షిరిడీ చేరి, బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటె ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట జూచి అందరు ఆశ్చర్యపడిరి.
తన మనోనిశ్చయమును మార్చుకొని యొక మహమ్మదీయునికెట్లు నమస్కరించితివని యందరు అడిగిరి.
తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు గాన్పించుటచే వారి పాదములపైబడి సాష్టాంగ నమస్కారమొనర్చితినని డాక్టరు బదులిడెను.
అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే గాన్పించెను. ఏమీ తోచక, అతడు ”ఇది స్వప్నమా యేమి ? వారు మహమ్మదీయుడగుట ఎట్లు ? వారు గొప్ప యోగ సంపన్నులైన యవతారపురుషులు” అని నుడివెను.
ఆ మరుసటి దినమే డాక్టరు యేదో దీక్ష వహించి ఉపవాసముండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను.
ఇట్లు మూడు రోజులు గడచెను. నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేషు నుండి రాగా, వానితో కలసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసివచ్చెను.
బాబాకు నమస్కరించగనే, బాబా అతనితో, ”ఎవరైన వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా, యేమి ? ఇట్లు వచ్చితివి” అని ప్రశ్నించెను.
ఆ ప్రశ్న డాక్టరు మనస్సును కదలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మికానుభూతి కలిగి, అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను.
ఆ తరువాత అతడు తన ఊరికి బోయిననూ, ఆ యానందానుభూతి 15 దినముల వరకు అటులనే యుండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను.
పై కథల వలన, ముఖ్యముగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకొనిన నీతి యేమన మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలెను. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలు చెప్పెదము.
పన్నెండవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏబది యొకటవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹మొదటి అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పదియేడవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదనొకండవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబదియవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments