🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పదియేడవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ముప్పదియేడవ అధ్యాయము

పస్తావన; చావడి ఉత్సవము

హేమాడ్‌పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి యుత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు.

పస్తావన :

శ్రీసాయి జీవితము మిగుల పావనమయినది. వారి నిత్య కృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు వర్ణింప నలవికానివి.

కొన్ని సమయము లందు వారు బ్రహ్మానందముతో మైమరచెడివారు. మరికొన్ని సమయములందాత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు.

ఒక్కొక్కప్పుడన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడివారు. ఒక్కొక్కప్పుడేమియు చేయనట్లు గన్పించినప్పటికిని వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని కనిపించెడువారు కారు.

వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానము చేసెడివారు. వారు సముద్రమువలె శాంతముగా తొణకక యుండినట్లు గనిపించినను వారి గాంభీర్యము, లోతు కనుగొనరానివి.

వర్ణనాతీతమయిన వారి నైజము వర్ణింపగలవారెవ్వరు ? పురుషులను అన్నదమ్ములవలె, స్త్రీల నక్కచెల్లెండ్రవలె చూచుకొనెడివారు. వారి శాశ్వతాస్థలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే.

వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచుగాక !

ఎల్లప్పుడు హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసెదముగాక ! వారిని సకల జీవకోటియందు జూచెదము గాక ! వారి నామము నెల్లప్పుడు ప్రేమించెదముగాక !

వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్‌పంతు చావడి యుత్సవమును వర్ణించుటకు మొదలిడెను.

చావడి ఉత్సవము :

బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను, ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి.

మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందువరకు ఒకరోజు మసీదులో, ఇంకొకరోజు చావడిలో నిద్రించుచుండిరి.

1910 డిసెంబరు 10వ తేదీనుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరుప మొదలిడిరి.

బాబా కటాక్షముచే దీనినే యిప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు.

భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసీ బృందావనము, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను.

భజనయందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంజిరా, మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండెడివారు.

సూదంటురాయివలె సాయిబాబా భక్తులందరిని తమ వద్దకు ఈడ్చుకొనెడివారు.

బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి నలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి ‘శ్రీ సాయినాథ మహారాజ్‌కీ జై’ ! యని కేకలు వేయుచుండిరి.

మసీదు మూలలు తోరణములతో నలంకరించుచుండిరి. మసీదు చుట్టు దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను.

బాబా గుఱ్ఱము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పెడివాడు.

బాబా నిశ్చలముగా కూర్చొనెడివారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తు చుండెను.

తాత్యా బాబాను ‘మామా’ యని పిలచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహిత మయినది.

బాబా శరీరముపై మామూలు కఫనీ వేసికొని చంకలో సటకా పెట్టుకొని, చిలుమును పొగాకును తీసికొని పైన ఉత్తరీయము వేసుకొని, బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి.

పిమ్మట తాత్యా జలతారు శెల్లాను బాబా ఒడలిపై వేసెడివారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతితో మండుచున్న దీపము నార్పి, చావడికి బయలుదేరెడివారు.

అన్ని వాయిద్యములు మ్రోగెడివి; మతాబా మందు సామాను లనేక రంగులు ప్రదర్శించుచు కాలెడివి. పురుషులు, స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడచుచుండిరి.

కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండలను చేత బట్టుకొను చుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు ‘శ్రీ సాయినాథ్‌ మహరాజ్‌కీ జై’ ! అని కేకలు పెట్టుచుండిరి.

బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచెడువారు.

వానిపై బాబా భక్తుల కేలూతలతో నడచెడువారు. తాత్యా యెడమచేతిని, మహల్సాపతి కుడిచేతిని, బాపు సాహెబుజోగ్‌ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనెడివారు.

ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను, పూర్తిగాను నలంకరించిన యేఱ్ఱ గుఱ్ఱము శ్యామకర్ణ దారి తీయుచుండెను.

దాని వెనుక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు, భక్తుల సమూహముండెడిది.

హరినామ స్మరణతోను, బాబా నామ స్మరణతోను ఆకాశము బ్రద్దలగునటుల మారు మ్రోగుచుండెను. ఈ మాదిరిగ శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొనువారందరు ఆనందించుచుండిరి.

ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడివైపు ముఖము పెట్టి నిలిచి యొక విచిత్రమైన ప్రకాశముతో వెలిగెడివారు.

వారి ముఖము ఉదయ సంధ్యవలె లేదా బాలభానునివలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలచెడివారు. వారెవరినో పిలుచునటుల గనిపించెడిది.

సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబు దీక్షిత్‌ ముందుకు వచ్చి యొక వెండి పళ్ళెములో పువ్వులు గులాల్‌ పొడిని దీసికొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను.

అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను, సౌందర్యముతోడను వెలుగుచుండెను.

అందరు ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడనందమును భరించలేక మహల్సాపతి దేవత యావేశించినవానివలె నృత్యము చేయువాడు.

కాని బాబా యొక్క ధ్యానమేమాత్రము చెదరక యుండెడిది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడచుచుండెను. భక్త మహల్సాపతి కుడివయిపు నడచుచు బాబా సెల్లాయంచును పట్టుకొనెడివారు.

ఈ యుత్సవమెంతో రమణీయముగ నుండెడిది. వారి భక్తి చెప్పనలవికానిది. ఈ పల్లకి యుత్సవము చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి.

బాబా నెమ్మదిగా నడచుచుండెను. భక్తి, ప్రేమలతో భక్తమండలి బాబా కిరుప్రక్కల నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై యుండగ శోభాయాత్ర చావడి చేరుచుండెను.

ఆ దృశ్యము, ఆ కాలము గడచిపోయినవి. ప్రస్తుతముగాని, యికముందుగాని యీ దృశ్యమును గనలేము. ఐనను ఆ దృశ్యమును జ్ఞప్తికి దెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును.

చావడిని బాగుగా నలంకరించుచుండిరి. దానిని తెల్లని పై కప్పుతోను, నిలువుటద్దములతోను, అనేక రంగుల దీపములతోను, వ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోను అలంకరించుచుండిరి.

చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి యొక యాసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి యంగరఖా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధముల పూజించు చుండిరి.

బాబా తలపై తురాయి కిరీటమును బెట్టి, పువ్వుల మాలలు వేసి, మెడలో నగలు వేయుచుండిరి.

ముఖమునకు కస్తూరి నామమును, మధ్యను బొట్టును పెట్టి మనఃస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరముగా జూచెడివారు.

తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసరివైచునని వారి భయము.

బాబా భక్తుల యంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండెడివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కారు. ఈ యలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా గనుపించుచుండిరి.

నానాసాహెబు నిమోన్‌కర్‌ గిఱ్ఱున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొను చుండెను.

బాపూసాహెబు జోగ్‌ యొక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి, యర్ఘ్యపాద్యము లర్పించి చేతులకు గంధము పూసి, తాంబూలము నిచ్చుచుండెను.

బాబా గద్దెపై కూర్చొనియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి.

బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని యుండగా భక్తులు ఇరువైపుల చామరలతోను, విసనకఱ్ఱలతోను విసరుచుండిరి.

అప్పుడు శ్యామా చిలుమును తయారుచేసి, తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పుపీల్చి బాబా కిచ్చుచుండెను.

బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చెడివారు. తదుపరి యితరులకు లభించుచుండెను.

జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది యనేక తపఃపరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకొన్నది.

ఆ యుత్సవము పూర్తి యయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు.

బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యముల కవతారమగుటచేత ఆ యలంకరణములను గాని మరియాదలను గాని లెక్కపెట్టువారు కారు.

భక్తులందుగల యనురాగముచే, వారి సంతుష్టి కొరకు వారి యిష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి.

ఆఖరుకు బాపూసాహెబ్‌ జోగ్‌ సర్వలాంఛనములతో హారతి నిచ్చువాడు. హారతి సమయమున బాజాభజంత్రీ మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు.

హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి యొకరి తరువాత నొకరు తమ తమ యిండ్లకు బోవుచుండిరి.

చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా యింటికి పోవుటకు లేవగా, బాబా ప్రేమతో నాతనితో నిట్లనును.

”నన్ను కాపాడుము. నీకిష్టమున్నచో వెళ్ళుము గాని రాత్రి యొకసారి వచ్చి నా గూర్చి కనుగొను చుండుము”. అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడచి గృహమునకు పోవుచుండెను.

బాబా తన పరుపును తానే యమర్చుకొనువారు. 50, 60 దుప్పట్లను ఒకదానిపై నింకొకటి వేసి దానిపై నిద్రించువారు.

మనము కూడ ఇప్పుడు విశ్రమించెదము. ఈ యధ్యాయమును ముగించకముందు భక్తుల కొక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను, వారి చావడి యుత్సవమును జ్ఞప్తికి దెచ్చుకొనవలెను.

ముప్పది యేడవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

ఐదవరోజు పారాయణము సమాప్తము

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles