🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది రెండవ అధ్యాయము🌹…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

నలుబది రెండవ అధ్యాయము

బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట; రామచంద్ర,

తాత్యాకోతే పాటీలుల మరణము తప్పించుట;

లక్ష్మీబాయి శిందేకుదానము; బాబా సర్వజీవ వ్యాపి

ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము.

గత అధ్యాయములలో చెప్పిన లీలలు, బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలిసికొనగలమో, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును.

సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచు కొనినచో మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోల్పోవును.

ఐహిక దుఃఖములు నశించును. ఎవరయితే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును.

బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట :

చదువరులింతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక.

1918 సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము రెండు మూడు దినములుండెను. కాని అటు తరువాత బాబా భోజనము మానెను.

అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్‌ 15వ తేదీ మంగళవారము 2-30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి.

ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించిరి గాని, యది యెవరికి బోధపడలేదు. అది యిట్లు జరిగెను.

1916వ సంవత్సరము విజయదశమినాడు సాయంకాలము గ్రామములోని వారందరు సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి.

సీమోల్లంఘన మనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫనీ, లంగోటీ తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి విసరివైచిరి.

దీని మూలముగా ధుని యెక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను.

బాబా అక్కడ దిగంబరులై నిలచి ఎఱ్ఱగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరచెను. ‘‘ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో, మహమ్మదీయడనో చెప్పుడు”.

అచటనున్న ప్రతివాడు గడగడ వణకిపోయెను. బాబా వద్దకు పోవుట కెవ్వరును సాహసించలేకపోయిరి.

కొంతసేపటికి భాగోజి శిందే (కుష్ఠురోగ భక్తుడు) ధైర్యముతో దగ్గరకు బోయి లంగోటీని కట్టి యిట్లనెను. ”బాబా ! సీమోల్లంఘనమునాడు ఇదంతయు నేమి”?

”ఈరోజు నా సీమోల్లంఘనము” అనుచు బాబా సటకాతో నేలపై గొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు.

ఆ రాత్రి చావడి యుత్సవము జరుగునో లేదో యని యందరు సంశయించిరి. ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను.

ఎప్పటివలె దుస్తులు వేసికొని చావడి యుత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని యది యెవరికి అర్థము కాలేదు.

దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక్క సూచన గూడ చేసిరి.

రామచంద్ర, తాత్యాకోతే పాటీళ్ళ మరణము తప్పించుట :

ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను.

అన్ని ఔషధములు ఉపయోగించెను గాని, అవి గుణము నివ్వలేదు. నిరాశ చెంది, చావుకు సిద్ధముగా నుండెను.

ఒకనాడు నడిరేయి బాబా యతని దిండు వద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, ”నేను నా జీవితముపై ఆశ వదలుకొన్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు” అనెను.

దాక్షిణ్యమూర్తియగు బాబా ”నీవాతురపడవద్దు, నీ చావు చీటి తీసివేసితిని ! త్వరలో బాగుపడెదవు కాని, తాత్యాకోతే పాటీలు గూర్చి సంశయించుచున్నాను.

అతడు శక సంవత్సరము 1840 (1918) విజయదశమి నాడు మరణించును. ఇది యెవరికిని తెలియనీయకు. వానికి కూడ చెప్పవద్దు, చెప్పినచో మిక్కిలి భయపడును” అనిరి.

రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని యతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా రెండు సంవత్సరములలో మరణము చెందుననుకొనెను.

దీనిని రహస్యముగా నుంచెను. ఎవరికిని తెలియనీయలేదు కాని, బాలాషింపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాషింపి ఈ యిరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి.

రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగెను. కాలము వేగముగా కదలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను.

బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడ జ్వరముతో నుండెను.

తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను.

ఎల్లప్పుడు బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడ క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను.

రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యా గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను.

బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చె ననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని యనుకొనిరి.

ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను, అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు గనిపించెను.

బాబా తన ప్రాణమును తాత్యా కోసమర్పించెనని జనులనుకొనిరి. బాబా యెందుకిట్లు చేసెనో బాబాకే తెలియును. వారి కృత్యములగోచరములు.

ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి

ఆ మరుసటి యుదయము అనగా అక్టోబర్‌ 16వ తేదీన పండరీ పురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి యిట్లనిరి.

”మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాల చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచి పెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే యక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము”.

షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడ దాసగణుకీ సంగతి దెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను.

బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామ స్మరణ చేయుచు నొక చక్కని పువ్వుల హారమును స్వయముగా గ్రుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను.

లక్ష్మీబాయి శిందేకు దానము :

దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభసమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా నున్నది.

కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి.

చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండ, లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు గనపడిరి.

అపాయస్థితి దాటినదని, బాబా కోలుకొనుచుండెనని యందరనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియును, కాన లక్ష్మీబాయి శిందేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి.

బాబా సర్వజీవవ్యాపి :

ఈ లక్ష్మీబాయి శిందే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను.

రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి శిందే తప్ప తదితరులెవ్వరు మసీదులో కాలుపెట్టుట కాజ్ఞ లేకుండెను.

ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొనియుండగా లక్ష్మీబాయి శిందే వచ్చి బాబాకు నమస్కరించెను.

బాబా యిట్లనెను, ”ఓ లక్ష్మీ ! నాకు చాల ఆకలి వేయుచున్నది”. వెంటనే యామె లేచి ”కొంచెము సేపాగుము. నేను త్వరలో రొట్టెను దీసికొని వచ్చెద” ననెను.

అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె, కూర తీసికొని వచ్చి బాబా ముందుపెట్టెను. బాబా దానిని అందుకొని యొక కుక్కకు వేసెను.

లక్ష్మీబాయి యిట్లడిగెను. ”ఇదియేమి బాబా ! నేను పరుగెత్తికొని పోయి నా చేతులార నీ కొరకు రొట్టె చేసితిని. నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి”.

అందుకు బాబా యిట్లు సమాధానమిచ్చెను. ”అనవసరముగా విచారించెదవేల ? కుక్క యాకలి దీర్చుట నా యాకలి దీర్చుట వంటిది. కుక్కకు కూడ ఆత్మ గలదు. ప్రాణులు వేరు కావచ్చును.

కాని అందరి యాకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవానివలె మాట్లాడలేరు. ఎవరయితే యాకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము” .

ఇది చాల చిన్న విషయముగాని, బాబా దాని వల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి, ఇతరుల కెట్టి బాధయు కలుగకుండ నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి.

ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని యెంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే యెల్లప్పుడు తినుచుండెను.

ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనినిబట్టి బాబా సర్వజీవులయందు గలడని తెలిసికొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు.

బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. ఆమెను మరచెదరెట్లు ?

బాబా తన భౌతిక శరీరమును విడుచునప్పుడు తన జేబులో చేయిపెట్టి యొకసారి 5 రూపాయలు, యింకొకసారి 4 రూపాయలు మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయి కిచ్చిరి.

ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియజేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ యనుకొనవచ్చును.

లక్ష్మీబాయి శిందే ధనవంతురాలగుటచే నామెకు ధనమవసరము లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించియుండవచ్చును.

భాగవతము ఏకాదశస్కంధము దశమాధ్యాయములో ఆరవ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడియున్నది.

బాబా ఈ ప్రకారముగ మొదట 5, తదుపరి 4 మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక తొమ్మిదేకాక తొమ్మిదికి ఎన్నోరెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమైనవి. కాని బాబా యిచ్చిన ఈ తొమ్మిది రూపాయల నామె యెన్నటికి మరువదు.

మిక్కిలి జాగరూకత మరియు పూర్ణచైతన్యము కలిగియుండు బాబా యవసానకాలమందు కూడ తగిన జాగ్రత్త పడెను.

తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగుల్కొనకుండునట్లు, వారందరిని లేచిపొమ్మనిరి.

కాకాసాహెబు దీక్షిత్‌, బాపూసాహెబు బూటీ మొదలగువారు మసీదు నందు ఆందోళనతో బాబాను గనిపెట్టుకొనియుండిరి. కాని బాబా వారిని వాడాకు బోయి భోజనము చేసి రండనిరి.

వారు బాబాను విడువ లేకుండిరి; బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికి వారు పోలేక పోలేక మసీదు విడిచి పోయిరి.

బాబా స్థితి యపారకరముగా నుండెనని వారికి తెలియును. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు బాబాపై నుండెను.

వారు భోజనము పూర్తి చేయక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి యందరు మసీదుకు పరుగెత్తిరి.

బయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి యుండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు,

తమ స్థలములో ప్రశాంతముగా గూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి.

యోగులు శరీరము ధరించి యేదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో యంత శాంతముగా వెళ్ళెదరు.

నలుబదిరెండవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles