Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా,,,సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
నలుబది యెనిమిదవ అధ్యాయము
సద్గురుని లక్షణములు; శేవడే; నపత్నేకర్ దంపతులు
ఈ యధ్యాయమును ప్రారంభించునప్పుడెవరో హేమాడ్పంతును ”బాబా గురువా ? లేక సద్గురువా ?” యని ప్రశ్నించిరి.
ఆ ప్రశ్నకు సమాధాన మిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్పంతు ఇట్లు వర్ణించుచున్నారు.
సద్గురుని లక్షణములు :
ఎవరు మనకు వేదవేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా నుపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునఃశ్చరణము చేయుమందురో,
ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కాని ఎవరు స్వయముగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు.
ఎవరయితే చక్కని సంభాషణలవల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరాత్మసాక్షాత్కారమందు మన కభిరుచి కలుగునట్లు జేసెదరో, యెవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే గాక ఆచరణయందనుభవము కూడ పొందియున్నారో అట్టివారు సద్గురువులు.
ఆత్మసాక్షాత్కారమును స్వయముగ పొందని గురువు దానిని శిష్యుల కెట్లు ప్రసాదించగలరు ? సద్గురువు స్వప్న మందయినను శిష్యుల నుండి సేవను గాని ప్రతి ఫలమును గాని యాశించడు.
దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు.
సద్గురువు తన శిష్యుని కొడుకువలె ప్రేమించుటయే గాక తనతో సరిసమానముగా జూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా జూచును.
సద్గురుని ముఖ్య లక్షణమేమన, వారు శాంతమున కునికిపట్టు. వారెన్నడు చాపల్యమునుగాని చికాకుగాని చెందరు.
తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే.
హేమాడ్పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును, సహవాసమును పొందెనని తలంచెను.
బాబా యౌవనమందు కూడ ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని, స్నేహితులు గాని, యిల్లుగాని, ఎట్టి యాధారము గాని లేకుండెను.
18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి. వారొంటరిగా, నిర్భయముగా నుండెడివారు. వారెల్లపుడాత్మాను సంధానమందు మునిగి యుండెడివారు.
భక్తుల స్వచ్ఛమైన యభిమానమును జూచి వారి మేలు కొరకేవైన చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి యుండెడివారు.
వారు భౌతిక శరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ యనుభవముల నిచ్చుచుండిరో, యట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడ వారిపై నాధారపడిన భక్తులకిప్పటికినీ నొసగుచున్నారు.
అందుచే భక్తులు చేయవలసిన దేమన భక్తి విశ్వాసములనెడు హృదయ దీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను.
ఎప్పుడిట్లు చేసెదరో, యప్పుడు జ్ఞానమనే జ్యోతి (ఆత్మ సాక్షాత్కారము) వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును.
ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానమెవరికి అక్కరలేదు. ప్రేమలేనిచో సంతృప్తి యుండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ యుండవలెను.
ప్రేమను మనమెట్లు పొగడగలము ? ప్రతి వస్తువు దాని యెదుట ప్రాముఖ్యము లేనిదగును.
ప్రేమ యనునదే లేని యెడల చదువుట గాని, వినుట గాని, నేర్చుకొనుట గాని నిష్పలములు. ప్రేమ యనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తరువాత నింకొకటి వచ్చును.
దేనిని గూర్చిగాని మిక్కిలి చింతించనిదే దానియందు మనకు ప్రేమ కలుగదు. యదార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియే ప్రేమ; అదే మోక్షమునకు మార్గము.
ఈ యధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించెదము.
స్వచ్ఛమైన మనస్సుతో నెవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు బోయి వారి పాదములపై బడినచో, తుట్టతుదకతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథవలన విశదపడును.
శేవడే :
షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి, సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి శేవడే అతనితో చేరెను.
ఇతర విద్యార్థులు కూడ గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా నున్నది లేనిది చూచుకొను చుండిరి.
ప్రశ్నోత్తరముల వలన శేవడేకు ఏమియు రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి.
అతడు పరీక్షకు సరిగా చదువకపోయినను తనయందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణునగుదునని చెప్పెను.
అందుకు సపత్నేకర్ యాశ్చర్యపడెను. సాయిబాబా యెవరు ? వారినేల యంత పొగడుచున్నావు ? అని అడిగెను.
అందువలన శేవడే యిట్లనెను. ”షిరిడీ మసీదులో నొక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులితరులున్నను, వారమోఘమైనవారు.
పూర్వజన్మ సుకృతమున్న గాని, మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి యున్నాను.
వారు పలుకునది యెన్నడు అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక యుత్తీర్ణుడ నగుదునని వారు నన్ను ఆశీర్వదించి యున్నారు.
కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్షయందు యుత్తీర్ణునడయ్యెద” ననెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడ వెక్కిరించెను.
సపత్నేకర్ దంపతులు :
సపత్నేకర్ న్యాయపరీక్షలో నుత్తీర్ణుడయ్యెను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి, యచట న్యాయవాది యాయెను.
పది సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల యొకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనస్సు వికలమయ్యెను.
పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలె ననుకొనెను. కాని యతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను గాని యది కూడ సహాయపడలేదు.
అంతలో శేవడే మాటలు, అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడ షిరిడీకి పోయి శ్రీసాయిని చూడవలెననుకొనెను.
అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతసించెను.
గొప్ప భక్తితో బాబా వద్దకేగి యొక టెంకాయ నచట బెట్టి, బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను. ”బయటకు పొమ్ము!” అని బాబా యరచెను.
సపత్నేకర్ తలవంచుకొని కొంచెము వెనుకకు జరిగి యచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుట కెవరి సలహాయైన తీసికొనుటకు యత్నించెను.
కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి.
బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో బెట్టి యదెవరిదని యడిగెను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వయిపు చూపెను. బాబా నవ్వగా నచటివారందరు నవ్విరి.
బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయుమనెను.
సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా, బాబా తిరిగి వెడలి పొమ్మని యరచెను. సపత్నేకరు కేమి చేయవలెనో తోచకుండెను.
అన్నదమ్ములిద్దరు చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయుమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ జెందిరి.
బాబా యాజ్ఞను పాలించవలసి యుండుటచే సపత్నేకర్ షిరిడీ విడువ వలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైన దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడెను.
సపత్నేకర్ భార్య :
ఒక సంవత్సరము గడచెను. కాని అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాణగాపురము వెళ్ళెను కాని యశాంతి హెచ్చెను.
విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను; తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకొక స్వప్నదృశ్యము గనపడెను.
స్వప్నములో నామె నీళ్ళ కొరకు కుండ పట్టుకొని లకడ్షాబావికి పోవుచుండెను.
అచ్చట నొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకొని, వేపచెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి ”ఓ అమ్మాయి ! అనవసరముగా శ్రమపడెదవేల? నేను స్వచ్చమైన జలముతో నీ కుండ నింపెదను” అనెను.
ఆమె ఫకీరుకు భయపడి, ఉత్తకుండతో వెనుకకు తిరిగి పోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను.
ఆమె తన కలను భర్తకు జెప్పెను. అదియే శుభశకున మనుకొని యిద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికి బాబా యక్కడ లేకుండెను. వారు లెండీ తోటకు వెళ్ళి యుండిరి.
బాబా తిరిగి వచ్చువరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను జూచిన ఫకీరుకు, బాబాకు భేదమేమియు లేదనెను.
ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు అచటనే కూర్చుండెను.
ఆమె యణకువ జూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో నొక కథ చెప్పుటకు మొదలిడెను.
”నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాల రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేననేకౌషధములు పుచ్చుకొంటిని, కాని నొప్పులు తగ్గలేదు.
మందులు ఫలమీయక పోవుటచే విసుగు జెందితిని. కాని నొప్పులన్ని నిచట వెంటనే నిష్క్రమించుట కాశ్చర్యపడుచుంటిని” అనెను.
పేరు చెప్పనప్పటికి ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే నామె సంతసించెను.
సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసికొనెను. మరల బాబా బయటకు పొమ్మనెను.
ఈసారి యతడు మిక్కిలి పశ్చాత్తాపపడి యెక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి యెగతాళి చేసినదాని ప్రతిఫలమని గ్రహించి, దాని విరుగుడు కొరకు ప్రయత్నించు చుండెను.
బాబా నొంటరిగా కలిసికొని వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను. అట్లే యొనర్చను.
అతడు తన శిరస్సును బాబా పాదములపై బెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్ తలపయి బెట్టెను. బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను.
అంతలో ఒక గొల్లస్త్రీ వచ్చి బాబా నడుమును బట్టుచుండెను. బాబా యొక కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితములోని కష్టములన్నియు వర్ణించెను.
అందులో వాని యొకే కొడుకు మరణించిన సంగతి కూడ చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే యని సపత్నేకర్ మిక్కిలి యాశ్చర్యపడెను.
బాబాకు తన విషయములన్నియు దెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయముల గ్రహించుననెను.
ఈ యాలోచనలు మనస్సున మెదలుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు జూచి యిట్లనెను.
”వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించు చున్నాడు. నేను లోకుల బిడ్డలనుజంపెదనా ? ఇతడు మసీదునకు వచ్చి యేడ్చుచున్నాడేల ? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల దెచ్చెదను”.
ఈ మాటలతో బాబా యతని తలపై హస్తముంచి యోదార్చి యిట్లనియె.
”ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నా యందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును”.
సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను.
సపత్నేకర్ పూజాసామాగ్రి నమర్చుకొని నైవేద్యముతో మసీదుకు భార్యతో బోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొను చుండెడివాడు.
ప్రజలు మసీదులో గుమిగూడి యుండెడివారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో నొక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను.
ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి యుత్సవమును జూచెను. అందు బాబా పాండురంగనివలె ప్రకాశించెను.
ఆ మరుసటి దినమింటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ యిచ్చి తిరిగి యడిగినచో రెండవ రూపాయి లేదనక యివ్వవచ్చునని సపత్నేకర్ అనుకొనెను.
మసీదుకు బోయి ఒక రూపాయి దక్షిణ నివ్వగా బాబా యింకొక రూపాయి కూడ అడిగెను. బాబా వానిని ఆశీర్వదించి యిట్లనెను.
”టెంకాయను దీసికొనుము. నీ భార్య చీరకొంగులో పెట్టుము. హాయిగా పొమ్ము. మనస్సునందెట్టి యాందోళన నుంచకుము!”
అతడట్లే చేసెను. ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై బెట్టి యిట్లు ప్రార్థించిరి.
”ఓ సాయీ ! నీ బాకీ నెటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది. కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి.
నిస్సహాయిల మగుటచే మమ్ముద్దరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే యాశ్రయించెదము గాక.
అనేకాలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను, జాగ్రదవస్థలోను మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము !”
ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ యను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ యను నిద్దరు జన్మించిరి.
బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి యక్షరాల జరుగునని కూడ నమ్మిరి.
నలుబది యెనిమిదవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above text has been typed by: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది రెండవ అధ్యాయము🌹…Audio
- శేవడే
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది యెనిమిదవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది యెనిమిదవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది తొమ్మిదవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments