🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది యెనిమిదవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాథాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ఇరువది యెనిమిదవ అధ్యాయము

బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట

లాలా లక్ష్మీచంద్‌; బురహన్‌పూరు మహిళ; మేఘుశ్యాముడు

బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట :

శ్రీ సాయి యనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి.

వేద జ్ఞానమందు, ఆత్మసాక్షాత్కారవిద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్య ముండుటచే వారు సద్గురువు లనిపించుకొనుటకు సమర్థులు.

పండితులయినప్పటికి శిష్యుల నెవరైతే ప్రేరేపించి యాత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు.

సాధారణముగ తండ్రి శరీరమును పుట్టించును. పిమ్మట చావు జీవితమును వెంబడించును.

కాని సద్గురువు చావుపుట్టుకలను రెంటిని దాటింతురు. కాబట్టి వారందరి కంటె దయార్ధ్ర హృదయులు.

సాయిబాబా యనేకసార్లు లిట్లు నుడివిరి. ”నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి, 1000 క్రోసుల దూరమున నున్నప్పటికి, పిచ్చుక కాళ్ళకు దారము కట్టి యీడ్చినటుల అతనిని షిరిడీకి లాగెదను” అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకొందము.

లాలా లక్ష్మీచంద్‌ :

అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తరువాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదస్సు కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగము చేసెను.

1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను.

శాంతాక్రజులో, క్రిస్‌మస్‌ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము, స్వప్నములో గడ్డముతో నున్న యొక ముసలివానిని, చుట్టు భక్తులు గుంపులు గూడి యున్నట్లు చూచెను.

కొన్నాళ్ళ తరువాత దాసగణు కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్‌ బిజూర్‌ యింటికి వెళ్ళెను.

కీర్తన చేయునప్పుడు దాసగణు బాబా పటమును సభలో పెట్టుట యాచారము.

స్వప్నములో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో జూచినటుల గ్రహించెను.

పటము, దాసగణు కీర్తన, తుకారాం జీవితము (అప్పుడు దాసగణు చెప్పుచున్న హరికథ) ఇవన్నియు మనస్సున నాటి, లక్ష్మీచంద్‌ షిరిడీ పోవుట కువ్విళ్ళూరుచుండెను.

సద్గురుని వెదకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడు ననునది భక్తుల యనుభవమే.

ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చెదవాయని అడిగెను. అతని యానందమున కంతులేకుండెను. షిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను.

పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పుపుచ్చుకొని కావలసిన యేర్పాటు లన్నియును జేసికొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను.

రైలులో నతడును, స్నేహితుడగు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణీకుల నడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో నున్న సాయిబాబా గొప్ప యోగిపుంగవులని వారు చెప్పిరి.

కోపర్‌గాం రాగానే అతడు బాబా కొరకు జామపండ్లను కొనవలెననుకొనెను. కాని యా గ్రామపరిసరములను ప్రకృతి దృశ్యములను జూచి యానందించి యా విషయమును మరచెను.

షిరిడీ సమీపించుచుండగా వారికీ సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే యొక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గంప పెట్టుకొని తమ గుఱ్ఱపుబండి వెంట పరుగెత్తుకొని వచ్చుచుండెను.

అతడు బండినాపి కొన్ని యెంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడ తీసికొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను.

జామపండ్లను కొనవలెననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసికొనుట, యామె భక్తి, యివన్నియు నిద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను.

ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై యుండవచ్చు ననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను.

వారు మసీదుపయి జండాలను చూచి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను యుచితరీతిన పూజించిరి. లక్ష్మీచంద్‌ మనస్సు కరిగెను. బాబాను జూచి చాలా సంతసించెను.

సువాసనగల తామరపువ్వును భ్రమరము జూచి సంతసించునటుల బాబా పాదముల జూచి సంతసించెను.

అప్పుడు బాబా యిట్లనెను. ”టక్కరివాడు ! దారిలో భజన చేయును. నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరుల నడుగనేల ? మన కండ్లతోడ సమస్తము చూడవలెను.

ఇతరుల నడుగవలసిన యవసరమేమి ? నీ స్వప్నము నిజమయినదా కాదా యనునది యాలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసికొని షిరిడీ దర్శనము చేయవలసిన యవసరమేమి? హృదయములోని కోరిక యిప్పుడయిన నెరవేరినదా ?”

ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్‌ యాశ్చర్యపడెను. బాబాకీ సంగతులన్నియు నెటుల దెలిసినవని అతడాశ్చర్యపడెను.

ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకుగాని, సెలవురోజు అనగా పండుగ దినము గడుపుటకుగాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పుచేయరాదని బాబా యభిప్రాయము.

సాంజా (ఉప్మా) :

మధ్యాహ్న భోజనమునకు గూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను.

ఆ మరుసటి దినము కూడ  దాని నశించెను. కాని యెవరును సాంజా తేలేదు.  అతడు సాంజాకై కనిపెట్టుకొని యుండెను.

మూడవరోజు హారతి సమయమందు బాపూసాహెబ్‌ జోగ్‌ యేమి నైవేద్యము తీసికొని రావలెనని బాబాను అడిగెను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పెను.

భక్తులు రెండు కుండల నిండ సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా యాకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను.

బాబా యిట్లనెను. ”నీవు ఆకలితో నుండుట మేలయినది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి  ఏదయిన ఔషధము తీసికొనుము” .

బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్‌ రెండవసారి యాశ్చర్యపడెను. బాబా యెంత సర్వజ్ఞుడు.

దోషదృష్టి :

ఆ సమయముననే లక్ష్మీచందు చావడి యుత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధ పడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగిన దనుకొనెను.

ఆ మరుసటి యుదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామాతో నిట్లనియె.

”ఎవరిదో దోషదృష్టి నాపయి పడుటచే నేను బాధపడుచున్నాను”. ఇట్లు లక్ష్మీచందు మనస్సులో నేమి భావించుచుండెనో యది యంతయు బాబా వెల్లడి చేయుచుండెను.

ఈవిధముగా సర్వజ్ఞతకు, కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపైబడి ”మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడు నాయందు దయాదాక్షిణ్యములు జూపి నన్ను రక్షించుము.

నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప యితర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడును మీ పాదపూజయందు, మీ భజన యందు ప్రీతి జెందునుగాక. మీ కాటాక్షముచే నన్ను ప్రపంచ బాధలనుండి కాపాడుదురుగాక !

నేనెల్లప్పుడు మీ నామమునే జపించుచు సంతోషముతో నుందునుగాక !” యని ప్రార్థించెను.

బాబా యాశీర్వాదమును, ఊదీ ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్‌ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను.

దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను.

బురహన్‌పూరు మహిళ(చిడి బాయి అలియాస్ మెహతా బాయి) :

ఇంకొక పిచ్చుక (భక్తురాలి) వృత్తాంతము జూచెదము. బురహన్‌ పూరులో నొక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు ‘కిచిడీ’ కావలెననెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద నెవ్వరు లేకుండిరి.

చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె యందరికి తెలియజేసెను. తన భర్తకు గూడ తెలిపెను.

అతడు పోస్టాఫీసులో నుద్యోగము చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి.

మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి, అచట రెండు మాసములుండిరి.

ప్రతిరోజు మసీదుకుబోయి బాబాను దర్శించి, పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి.

కాని యది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన యిష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను.

మసీదులో నందరు భోజనమునకు కూర్చొనిరి. కనుక తెరవేసి యుండెను. తెరవేసి యుండునప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయెను.

ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా యానాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని యున్నట్లు తోచెను.

ఆమె కిచిడీ యచట పెట్టగనే బాబా సంతసముతో ముద్దమీద ముద్ద మ్రింగుట ప్రారంభించెను.

బాబా యాతురతను జూచి యందరు ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ యుండుననుటను విశ్వసించిరి.

మేఘాశ్యాముడు :

ఇక అన్నిటికంటె పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరమ్‌గాం నివాసియగు మేఘాశ్యాముడు హరి వినాయక సాఠేగారి వంట బ్రాహ్మణుడు.

అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడు శివపంచాక్షరి (‘ఓం నమశ్శివాయ’) జపించువాడు.

అతనికి సంధ్యావందనముగాని, గాయత్రీ మంత్రముగాని తెలియకుండెను. సాఠేగారికి వీనియందు శ్రద్ధ గలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి.

సాయిబాబా శివుని యవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను.

బ్రోచి స్టేషను వద్ద సాయిబాబా మహమ్మదీయుడని యెవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను.

కాని ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయితీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు టుత్తరము షిరిడీవాసి తన మామగారగు దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలెనని ఇచ్చెను.

షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానీయక, ”ఈ వెధవను తన్ని తరిమి వేయుడు !” అని గర్జించి మేఘునితో నిట్లనెను.

”నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు. నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీ విచటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము !”

ఈ మాటలు విని మేఘుడు వణక నారంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములు బాబా కెట్లు దెలిసెనని యాశ్చర్యపడెను.

కొన్ని దినములచటనే యుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని యతడు సంతృప్తి చెందలేదు.

తరువాత తన యింటికి పోయెను. అక్కడనుండి త్య్రంబక్‌ (నాసిక్‌ జిల్లా) పోయి యచట ఒక సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను.

ఈసారి దాదాకేల్కర్‌ కల్పించుకొనుటచే నాతడు మసీదులో ప్రవేశించుటకు, షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను.

మేఘశ్యామునకు బాబా యుపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయుచు చాలా మేలుచేసెను.

అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని యవతారముగా భావించుచుండెను. శివుని యర్చనకు బిల్వపత్రి కావలెను.

మేఘుడు ప్రతిరోజు మైళ్ళకొలది నడచి పత్రిని దెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములో నున్న దేవతల నందరిని పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను.

కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాద తీర్థమును త్రాగుచుండెడివాడు.

ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి యుండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేసెను.

ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి యుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను.

గంగాస్నానము :

ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో నభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను.

కాని యతడనేకసారులు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘుశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడచి గోమతీనదీ తీర్థము తేవలసియుండెను.

అతడు తీర్థము దెచ్చి, యత్నము లన్నియు జేసికొని, బాబా వద్దకు 12 గంటలకు వచ్చి, స్నానమునకు సిద్ధముగా నుండుమనెను.

బాబా తనకా యభిషేకము వలదనియు, ఫకీరగుటచే గంగాజలముతో నెట్టి సంబంధము లేదనియు చెప్పెను. కాని మేఘుడు వినలేదు.

శివుని కభిషేక మిష్టము గనుక, తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలెనని పట్టుబట్టెను.

బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపయి కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను.

”ఓ మేఘా ! ఈ చిన్న యుపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము. కావున తలపైనే నీళ్ళు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును”.

అట్లనేయని మేఘశ్యాము డొప్పుకొని, నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను.

కాని భక్తి పారవశ్యమున ‘హరగంగే, హరగంగే’ యనుచు శరీరమంతటిపై నీళ్ళు పోసెను.

కుండనొక ప్రక్కకు బెట్టి బాబావయిపు జూచెను. వాని యాశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగా నుండెను.

త్రిశూలము – లింగము :

మేఘ శ్యాముడు బాబాను రెండుచోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను.

వాడాలో నానాసాహెబు చాందోర్కరిచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను.

వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను.

ఒకనాడు వేకువఝామున మేఘుడు తన శయ్యపయి పండుకొని కండ్లు మూసియున్నప్పటికి, లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును జూచెను.

బాబా అతనిపై యక్షతలు చల్లి ”మేఘా ! త్రిశూలమును గీయుము!” అని చెప్పి అదృశ్యుడయ్యెను.

మేఘుడు బాబా మాటలు విని, యాతురతగా కండ్లు దెరచెను. బాబా కనిపించలేదు గాని, యక్షత లక్కడక్కడ పడియుండెను.

బాబా వద్దకు పోయి, చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశాలమును గీయుట కాజ్ఞ నిమ్మనెను. బాబా యిట్లనెను :

”నా మాటలు వినలేదా ? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యము కాదు. స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు. అర్థవంతములు”.

మేఘుడిట్లు పలికెను. ”మీరు నన్ను లేపినటుల భావించితిని. తలుపులన్ని వేసి యుండుటచే నది దృశ్యమనుకొంటిని”.

బాబా తిరిగి యిట్లు జవాబిచ్చెను: ”ప్రవేశించుటకు నాకు వాకిలి యవసరము లేదు. నాకు రూపము లేదు. నేనన్నిచోట్ల నివసించుచున్నాను. ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను”.

మేఘుడు వాడాకు తిరిగి వచ్చి, బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎఱ్ఱరంగుతో గీసెను.

ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను.

అప్పుడే మేఘుడు కూడ అచ్చటకు వచ్చెను. బాబా యిట్లనెను. ”చూడు శంకరుడు వచ్చినాడు ! జాగ్రత్తగా పూజింపుము” ! మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట గాంచెను.

అతడాశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను.

దీక్షిత్‌ దానిని  జూచి సరిగా నది తన ధ్యానములో కనపడినదానివలె నున్నదని సంతసించెను.

కొద్దిరోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తికాగా బాబా, మేఘశ్యాముడు పూజచేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను.

మేఘశ్యామునకు శివుని పూజించుట చాల ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి, లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వానియందుండు నమ్మకమును స్థిరపరచెను.

అనేక సంవత్సరములు బాబా సేవ చేసి యనగా పూజా, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912(ది 19 .01 .2012)లో మేఘశ్యాముడు కాలము నొందెను.

బాబా వాని కళేబరముపయి చేతులు చాచి ”ఇతడు నా నిజమయిన భక్తు”డనెను.

బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయుమనెను. కాకాసాహెబు దీక్షిత్‌ బాబా ఆజ్ఞ నెరవేర్చెను.

ఇరువది యెనిమిదవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles