Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice By: R C M Raju and team
🌹సాయిబాబా… సాయిబాబా… సాయిబాబా… సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
మొదటి అధ్యాయము
గురుదేవతా స్తుతి ; తిరగలి విసరుట – దాని వేదాంత తత్త్వము
గురుదేవతాస్తుతి :
పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్‌పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు.
1. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు.
2. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తననీ గ్రంథ రచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు, శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు.
3. తదుపరి సృష్టి, స్థితి, లయ కారకులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు, సమర్థ సద్గురువులనియు, వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు.
4. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి, వారు కొంకణ దేశములో వెలసిరనియు, ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు, వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి.
5. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించెను.
అంతేగాక, యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాదులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్థనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారామ్, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను.
6. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను.
7. అటుపైన పాఠకులకు నమస్కరించి, తన గ్రంథమును ఏకాగ్రచిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను.
8. చివరగా తన గురువు, దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి, తాను వారిపై పూర్తిగా నాధారపడి యున్నానని చెప్పుచు, ఈ ప్రపంచము మిథ్యయనియు, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు, నీ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికి నమస్కరించెను.
పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట, హేమాడ్‌పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను.
1910 సం. తదుపరి యొకనాటి ఉదయమున నేను శిరిడీ మసీదులో నున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని.
అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి యాశ్చర్యపడితిని.
బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసరుటకు సంసిద్దుడగుచుండెను.
వారు నేలపై గోనె పరచి, దానిపై తిరుగలి యుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసికొని, కఫనీ (చొక్కా) చేతులు పైకి మడచి, పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి.
అది చూచి నాలో నేను, ”ఈ గోధుమపిండిని బాబా యేమిచేయును ?” ఆయనెందులకు గోధుమలు విసరుచుండెను ? వారు భిక్షాటనముచే జీవించువారే ! వారికి గోధుమపిండితో నేమి నిమిత్తము ? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే !” యని చింతించితిని.
అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా నిట్లే యాశ్చర్యమగ్నులయిరి.
కాని మాలో నెవరికి గూడ బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను.
ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి.
నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి, వారే విసరుట ప్రారంభించిరి.
వారు తిరుగలి పిడిని చేతపట్టుకొని, బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి.
ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని, వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిఱునవ్వునవ్విరి.
విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి. ”బాబాకు ఇల్లు పిల్లలు లేరు. ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడినవారు, ఆయన పోషించవలసిన వారెవరును లేరు.
వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమపిండితో నిమిత్తము లేదు.
అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమపిండితో నేమిపని ? బాబా మిగుల దయార్ద్ర హృదయుడగుటచే మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు”
ఈవిధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసరుట ముగించి, పిండిని నాలుగు భాగములుగా చేసి యొక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసికొనుచుండిరి.
అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను.
”ఓ వనితలారా ! మీకు పిచ్చిపట్టినదా యేమి ? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినాయేమి ? ఏ కారణము చేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు ? సరే, యిట్లు చేయుడు.
పిండిని తీసికొనిపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు”. అది విని యా వనిత లాశ్చర్యమగ్నలయిరి, సిగ్గుపడిరి, గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి.
నేనిదంతయు జూచి, షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని.
ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుట కది బాబా సాధనమనియు చెప్పిరి.
అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు, వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలిరనియు చెప్పిరి.
అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరు ఆనందించిరి.
ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూడార్థమును తెలిసికొన కుతూహలము కలిగెను.
గోధుమపిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ? ఒకటి యింకొక దానినెట్లు శాంతింపజేసెను ? ఇదంతయు అగోచరముగా తోచెను.
అందుచే నేను తప్పక యీ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొన వలయునని నిశ్చయించుకొంటిని.
ఈ లీలను జూచి యిట్లు భావించుకొని హృదయానంద పూరితుడనయితిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని.
అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను, జయప్రదముగను పూర్తియైనది.
తిరగలి విసరుట – దాని వేదాంత తత్త్వము :
తిరుగలి విసరుటను గూర్చి షిరిడీ ప్రజలనుకొనురీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను.
ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండిరి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనో విచారములు మొదలగునవి.
తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ; మీది రాయి భక్తి; చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము.
జ్ఞానోదయమునకు గాని, ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలయును. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును.
ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును.
ఒకనాడు స్త్రీ యొకతె తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు యేడ్వసాగెను.
నిపతి నిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు యిట్లు జవాబిచ్చెను;
”నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా ?” దానికి నిపతినిరంజనుడిట్లు బదులు చెప్పెను :
”భయము లేదు ! తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము.
మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖము గానిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు”.
మొదటి అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹రెండవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏబది యొకటవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పదియేడవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పన్నెండవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదునైదవ అధ్యాయము🌹…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments