🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹రెండవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice By: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

రెండవ అధ్యాయము

ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము; గ్రంథ రచనకు పూనుకొనుటకు

అసమర్థత-బాబా అభయము; వాడాలో తీవ్ర వాగ్వివాదము;

‘హేమాడ్‌పంతు’ అను బిరుదునకు మూలకారణము, గురువు యొక్క ఆవశ్యకత

ఈ గ్రంథ రచనకు ముఖ్యకారణము :

     మొదటి యధ్యాయములో గోధుమలు విసరి యా పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని.

ఇదేగాక శ్రీ సాయి యొక్క యితర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది.

అదేగాక బాబాగారి వింత లీలలును చర్యలును మనస్సున కానందము కలుగజేయును;

అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును; తుదకు పాపములు బోగొట్టును గదా యని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయ మొదలిడితిని.

యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును, ఆధ్యాత్మికమునునైన మార్గమును జూపును.

గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత – బాబా అభయము :

శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్‌పంతు భయపడెను.

అతడిట్లనుకొనెను : ”నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును?

అవతార పురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను ?

సప్త సముద్రముల లోతును గొలువ వచ్చును. ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహుకష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియును”

అందువలన నలుగురిలో నవ్వులపాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను.

మహారాష్ట్ర దేశములోని ప్రధమ కవియు, యోగీశ్వరుడునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు.

ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గముల నవలంబించెదరు.

యోగులే యట్టిపనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు.

1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను.

యోగులు ఆతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి.

మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి.

దాసగణు వ్రాసినవి భక్తలీలామృతము, సంతకథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు.

భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంతకథామృతములోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు, వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి.

ఇవి సాయిలీలా మాసపత్రిక, సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ యధ్యాయములు కూడా పఠించవలెను.

శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రీబాయి రఘునాథ్ తెండూల్కర్‌చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి.

దాసగణు మహారాజుగారు కూడ శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు.

గుజరాతీ భాషలో అమీదాస్‌ భవాని మెహతా యను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు.

సాయినాథప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణభిక్ష సంస్థ వారు ప్రచురించి యున్నారు.

ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి ? దాని యవసరమేమి ? యని ఎవరైనను ప్రశ్నింప వచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక !

సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తి, జ్ఞానములను మణులను వెలికితీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చును.

శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి యాశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందినవారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి యానందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును.

వేదములవలె రంజకములును ఉపదేశకములునునగు బాబా ప్రబోధములు విని, వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి, అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు.

అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని.

బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగజేయును.

అందుచేత బాబాగారి యాత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని.

సాయిబాబాయే యీ కార్యమునకు నన్ను  ప్రోత్సహించెను. నా యహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని.

కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా యిహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని.

నా యంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క యనుమతిని పొందలేకుంటిని.

మాధవరావు దేశపాండే ఉరఫ్‌ శ్యామా అనువారు బాబాకు ముఖ్యభక్తుడు.

వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరుపున వారు బాబాతో నిట్లనిరి.

”ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. ‘నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేద’ని యనవద్దు !

మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు. లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క యనుమతి యాశీర్వాదము లేనిదే యేదియు జయప్రదముగా చేయలేము”.

అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి, నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను.

మరియు (శ్యామాతో) నిట్లు చెప్ప దొడంగెను. ”కథలను, అనుభవములను ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసెదను.

వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెట్టవలెను.

ఎవరయితే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను.

నా జీవిత చర్యలకొరకే కాదు. సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను.

వాని యహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడ లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును.

నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు.

నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము.

ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు”.

వివాదమనగనే నన్ను ‘హేమాడ్‌పంతు’ అని పిల్చుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది.

ఇప్పుడు దానినే మీకు చెప్పబోవుచున్నాను. కాకాసాహెబు దీక్షిత్‌, నానాసాహెబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని.

వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి. అట్లే చేసెదనని వారికి నేను వాగ్దానము చేసితిని.

ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమున కడ్డుపడినది.

లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రము లన్నియు నుపయోగించెను గాని నిష్పలమయ్యెను. జబ్బు తగ్గలేదు.

తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయోజనము లేకుండెను.

ఈ సంగతి విని, ”నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి ? గురువు మనకు ఏమియు సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ యేల పోవలెను ?” అని భావించి, షిరిడీ ప్రయాణమును మానుకొంటిని.

కాని కానున్నది కాకమానదు. అది యీ క్రింది విధముగా జరిగెను.

నానాసాహెబు చాందోర్కర్‌ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా యొకనాడయన వసయీకి పర్యటనకై పోవుచుండెను.

ఠాణానుండి దాదరుకు వచ్చి యచ్చట వసయీ పోవు బండికొరకు కనిపెట్టుకొని యుండెను.

ఈలోగా బాంద్రా లోకల్‌ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి, నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను.

నానా చెప్పినది సంతోష దాయకముగను సమ్మతముగాను ఉండెను. అందుచే నా రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించితిని.

సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడ్‌ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకొంటిని. అటులనే దాదరుకు టిక్కట్టు కొని, రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని.

బండి ఇక బయలుదేరుననగా, మహమ్మదీయుడొకడు నేను కూర్చొనిన పెట్టెలోనికి హడావిడిగా వచ్చి, నా సరంజామానంతయు జూచి, యెక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను.

నా యాలోచన వారికి చెప్పితిని, వెంటనే ఆతడు దాదరు స్టేషనులో దిగవద్దనీ, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదరులో ఆగదనీ, అదే రైలులో ఇంకనూ ముందుకుబోయి బోరీబందరు స్టేషనులో దిగమని నాకు సలహా చెప్పెను.

ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకొనిన ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయెడివాడను.

అనేక సందేహములు కూడా కలిగి యుండెడివి. కాని నా యదృష్టవశాత్తు యది యట్లు జరుగలేదు.

మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబు దీక్షిత్‌ కనిపెట్టుకొని యుండెను.

ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడా యెక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి యుండెను.

టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను.

అంతలో, అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబు నూల్కరు బాబా వాడా చివరన ఉన్నారనియూ, మొట్టమొదట ధూళిదర్శనము చేసుకొనమని నాకు సలహా యిచ్చెను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను.

ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసితిని. నాలో ఆనందము పొంగిపొరలినది.

నానాసాహెబు చాందోర్కరు చెప్పిన దానికన్ననూ ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది యాకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను.

నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికి నేనెంతో ఋణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని.

వారి ఋణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణము చేసితిని.

నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యాలోచనలు  మారిపోవును.

వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించిన దనుకొంటిని.

సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను.

వాడాలో తీవ్ర వాగ్వివాదము :

నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు భాటేకును గురువు యొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను.

మన స్వేచ్ఛను విడిచి యింకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని.

”మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమి ? తనంతట తానే కృషి చేసి, మిక్కిలి యత్నముతో యీ జన్మదుఃఖము నుండి తప్పించుకొన వలెను.

ఏమియు చేయక సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడు ?” అని నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించితిని.

భాటే యింకొక వాదమును బట్టుకొని, ప్రారబ్ధము తరపున వాదించుచు, ”కాకున్నది కాక మానదు. మహనీయులు కూడ నీ విషయములో నోడిపోయిరి.

మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వముగాని యహంకారము కాని మీకు తోడ్పడవు” అనెను.

ఈ వాదన యొక గంట వరకు జరిగెను. కాని యిదమిత్థమని యేమియూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణవల్ల నా మనఃశ్శాంతి తప్పినది.

దేహాత్మబుద్ధి, అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించితిని. వేయేల, వివాదమునకు మూల కారణ మహంకారము.

ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా, బాబా కాకాను బిలిచి యిట్లిగెను : ”వాడాలో నేమి జరిగినది ? ఏమిటా వివాదము ? అది దేనిని గూర్చి? ఈ హేమాడ్‌పంతు ఏమనుచున్నాడు ?”

ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడా మసీదునకు చాలా దూరముగా నున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను ?

అతడు సర్వజ్ఞుడై యుండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును ? బాబా మన యంతరాత్మపై నధికారియై యుండవచ్చును.

హేమాడ్ పంతు అను బిరుదునకు మూలకారణము :

సాయిబాబా నన్నెందులకు ‘హేమాడ్‌పంత‘ని పిలిచెనని ఆలోచింప సాగితిని? ఇది ‘హేమాద్రిపంతు’ అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రిపంతు ప్రధానామాత్యుడు.

అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు; చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తి యను గొప్ప గ్రంథములను రచించినవాడు; మోడీ భాషను, ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు.

ఇక నేనా ? వానికి వ్యతిరేకబుద్ధి గలవాడను, మేధాశక్తి యంతగా లేనివాడను. మరి, సాయిబాబా నాకెందుకీ ‘బిరుదు’ నొసంగిరో తెలియకుండెను.

ఆలోచన చేయగా నిది నా యహంకారమును చంపుటకొక యమ్మనియు, నేనెప్పుడును అణకువ నమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరికయయి యుండవచ్చుననియు గ్రహించితిని.

అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలకు బాబా యీ రీతిగా అభినందించి యుండవచ్చని యనుకొంటిని.

భవిష్యచ్చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు (దాభోళ్కరును ‘హేమాడ్‌పంతు’ అనుట) గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా యట్లనెననియు భావించవచ్చును.

ఏలయనగా హేమాడ్‌పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను.

అదేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర యను గొప్ప గ్రంథమును రచించెను.

గురువు యొక్క యావశ్యకత :

ఈ విషయమై బాబా యేమనెనో హేమాడ్‌పంతు వ్రాసియుండలేదు. కానీ, కాకాసాహెబు దీక్షిత్‌ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన  దానిని ప్రచురించెను.

హేమాడ్‌పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షిత్‌ బాబా వద్దకు వచ్చి ”షిరిడీ నుండి వెళ్ళవచ్చునా” యని యడిగెను. బాబా యట్లే యని జవాబిచ్చెను. ‘‘ఎక్కడకు’‘ అని ఎవరో యడుగగా, ”చాలా పైకి” అని బాబా చెప్పెను.

”మార్గమేది’‘ యని దీక్షిత్‌ యడిగెను. ”అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున నున్న యడవిలో పులులు, తోడేళ్ళు కల” వని బాబా బదులిడెను.

”మార్గదర్శకుని వెంట దీసికొని పోయినచో” నని కాకాసాహెబు యడుగగా, ”అట్లయినచో కష్టమే లేద”ని బాబా జవాబిచ్చెను.

మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడేళ్ళు, పులులు గోతుల నుండి తప్పించును.

మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును. లేదా దారితప్పి గుంటలలో పడిపోవచ్చుననెను.

మసీదులో అప్పుడచ్చటనే యున్న దాభోళ్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను.

వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా ? యను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను.

పరమార్థము నిజముగా గురుబోధవల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వసిష్ఠ సాందీపులకు లొంగి యణకువతో నుండి యాత్మ సాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము (నిష్ఠ), ఓపిక (సబూరి) యను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను.

రెండవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles