🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదునైదవ అధ్యాయము🌹…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

పదునైదవ అధ్యాయము

నారదీయ కీర్తన పద్ధతి; చోల్కరు చక్కెరలేని తేనీరు; రెండు బల్లులు

ఆరవ అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమెట్లు ప్రారంభమయ్యెను?

ఆ సమయములో హరిదాసును దెచ్చుట యెంత కష్టముగ నుండెడిది ? తుదకు ఆ పనిని దాసగణు మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగణు జయప్రదముగా నడుపుట యనునవి చదువరులు జ్ఞాపకముంచు కొనియే యుందురు.

ఈ అధ్యాయములో దాసగణు హరికథలనెట్లు చెప్పువారో వర్ణింతును.`

నారదీయ కీర్తన పద్ధతి :

సాధారణముగ మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసికొనెదరు.

తలపైని పాగా గాని, పేటా (ఒకవిధమైన యెఱ్ఱని మహారాష్ట్రపు టోపీ) కాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన నుత్తరీయము, మామూలుగా ధరించెడి ధోవతిని కట్టుకొనెదరు.

ఈ ప్రకారముగా దుస్తులు ధరించి, షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగణు తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై మసీదుకు బోయెను.

బాబా అతనితో ”ఏమోయ్, పెండ్లికొడుకా ! ఇంత చక్కగ ముస్తాబై యెక్కడకు పోవుచున్నావు ?” అనెను.

హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగణు జవాబిచ్చెను.

అప్పుడు బాబా యిట్లనెను. ”దానికి ఈ దుస్తులన్ని యెందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరముపై యీ అలంకారాలన్నీ యెందుకు” ? వెంటనే దాసగణు వానినన్నిటిని తీసి బాబా పాదముల వద్ద నుంచెను.

అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగణు యెన్నడు ధరించలేదు. నడుము మొదలు తలవరకు ఏమియు వేసికొనెడివాడు కాదు.

చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించెడివాడు. ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము.

నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపైని, శరీరముపైన ఏమియు తొడిగెడివారుకారు.

చేతియందు వీణను ధరించి యొక చోటు నుంచి యింకొక చోటికి హరినామసంకీర్తన చేయుచు పోవువారు.

చోల్కరు చక్కెరలేని తేనీరు :

పూనా అహ్మదునగరు జిల్లాలలో బాబాను గూర్చి యందరికి తెలియును గాని, నానాసాహెబు చాందోర్కరు ఉపన్యాసముల వల్లను దాసగణు హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను.

నిజముగా దాసగణు తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయ మొనర్చెను.

హరికథలు వినుటకు వచ్చినవారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు;

కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము గలుగజేయును.

కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు; అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు.

వచ్చిన వారిలో చాలా కొద్దిమందికి మాత్రమే భగవంతుని యందుగాని, యోగులయందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును.

కాని దాసగణు యొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావమతి సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట నొక యుదాహరణము నిచ్చెదము.

ఠాణాలో నున్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగణు మహరాజ్‌ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను.

కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్‌ యనునతడుండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్‌ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగణు కీర్తన నతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరగెను.

వెంటనే అక్కడకక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. ”బాబా ! నేను పేదవాడను, నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను.

మీ యనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో నుత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చెదను.

నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెదను. నీ పేరున కలకండ పంచి పెట్టుదును”.

బాబా కృపచే చోల్కరు పరీక్షలో ప్యాసయ్యెను. స్థిరమైన యుద్యోగము దొరకెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో నంత బాగుండు ననుకొనెను.

చోల్కరు బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీయాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను.

ఎవరైన పర్వత శిఖరమునైన దాటవచ్చునుగాని, బీదవాడు తన యింటి గడపనే దాటలేడనిగదా లోకోక్తి!

చోల్కరు కెటులైన శ్రీ సాయి మ్రొక్కును త్వరలో చెల్లించవలెనని యాతురత కలిగెను. కావున తన సంసారమునకగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను.

తేనీటిలో వేయు చక్కెరను మాని యా మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను.

ఇవ్విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట, షిరిడీకి వచ్చి బాబా పాదములపై బడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను.

తాను మ్రొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నియు ఆనాడు నెరవేరినవనియు, తనకు యెంతయో తృప్తిగ నున్నదనియు బాబాతో చెప్పెను.

చోల్కరు బాపూసాహెబు జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును బిలచి యిట్లనెను.

”నీ యతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి యిమ్ము !” ఈ పలుకులలోని భావమును గ్రహించినవాడై, చోల్కరు మనస్సు కరగెను. అతడాశ్చర్యమగ్నుడయ్యెను.

వానికండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై బడెను. జోగు కూడ ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర యెక్కువగా కలుపుట యనుదాని భావము ఏమైయుండునా యని యోచించెను.

బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి, నమ్మకములను కలుగజేయవలెనని యుద్దేశించెను.

వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియు, తేయాకు నీళ్ళలో చక్కెర నుపయోగించక పోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియు చెప్పెను.

బాబా యిట్లు చెప్పనుద్దేశించెను. ”నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహము నిచ్చట నున్నప్పటికి సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును.

ప్రపంచమున మీ కిచ్చ వచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు.

నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు; పావనులు; అదృష్టవంతులు”.

బాబా చోల్కరు కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో గదా !

రెండు బల్లులు :

ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించెదము.

ఒకనాడు బాబా మసీదులో కూర్చొని యుండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని యుండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను.

కుతూహలమునకై యా భక్తుడు బల్లి పలికిన దాని కర్థమేమని బాబా నడిగెను. అది శుభశకునమా, లేక యశుభమా యని ప్రశ్నించెను.

తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని యా బల్లి యానందించుచున్నదని బాబా పలికెను.

భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి యెవరో గుఱ్ఱముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి.

అతడింకను కొంతదూరము పోవలసి యుండెను. కాని వాని గుఱ్ఱము ఆకలిచే ముందుకు పోలేకుండెను.

గుఱ్ఱమునకు ఉలవలు కావలసి యుండెను. తన భుజముపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై బోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను.

అందులో నుండి యొక బల్లి క్రిందపడి యందరు చూచుచుండగా గోడనెక్కెను.

ప్రశ్నించిన భక్తునకదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే యా బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను.

చాలాకాలము పిమ్మట అక్కచెల్లెండ్రు కలిసికొనిరి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచు నధిక ప్రేమతో నాడిరి.

షిరిడీ యెక్కడ ? ఔరంగాబాదెక్కడ ? గుఱ్ఱపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసికొని షిరిడీకి ఎట్లు వచ్చెను ?

రాబోయే యిద్దరు అక్కచెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే యెట్లు చెప్పగలిగెను ? ఇదియంతయు బహుచిత్రముగా నున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది.

ఉత్తర లేఖనము :

ఎవరయితే యీ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నియు శ్రీ సాయినాథుని కృపచే తొలగును.

పదునైదవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

రెండవరోజు పారాయణము సమాప్తము

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles