Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
పదునాలుగవ అధ్యాయము
ప్రస్తావన; నాందేడు పట్టణ నివాసియగు రతన్‌జీ;
దక్షిణ మీమాంస; దక్షిణ గూర్చి యింకొకరి వర్ణన
ప్రస్తావన :
గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యెనో వర్ణించితిమి.
ఈ అధ్యాయములో రతన్‌జీ వాడియా యనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసెనో వర్ణించెదము.
ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడ సహజముగా అత్యంత మధురముగా నుండును.
వారు నడచినా, భుజించినా, మాట్లాడినా, యే పని చేసిననూ అన్నియు మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము.
శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనుల ననేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా నవి యసలైన మతమునకు మార్గమును జూపును.
ప్రపంచములోని జనులందరు హాయిగా నుండవలెనని బాబా యుద్దేశము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెనని వారి యుద్దేశము.
గతజన్మల పుణ్యము కొలది మనకు మానవజన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తి నవలంబించి దానివల్ల జన్మ రాహిత్యమును పొందవలెను.
కనుక మనమెప్పుడును బద్ధకించరాదు; ఎల్లప్పుడు జాగ్రత్తగా నుండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమునునైన మోక్షమును సంపాదించవలెను.
ప్రతినిత్యము సాయిలీలలు వినినచో, నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము.
ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసికొన్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన యెడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు.
నాందేడు పట్టణ నివాసియగు రతన్‌జీ :
ఇక ఈ అధ్యాయపు ముఖ్యకథను ప్రారంభించెదము.
నైజాం యిలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్‌జీ షాపుర్జీ వాడియా.
అతడు చాలా ధనము నార్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుఱ్ఱములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను.
బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా, సంతోషముతో గాన్పించెడివాడు. కాని లోపల వాస్తవముగా నట్లుండెడివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్న వారొక్కరు లేరు.
ధనికుడగు రతన్‌జీ గూడ ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు, అందరి కన్ని విధముల సహాయము చేయుచుండువాడు.
చూచిన వారందరును ”అతడు మంచివాడు; సంతోషముగ నున్నా”డని యనుకొనిరి. కాని రతన్‌జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహియై యుండెను.
భక్తిలేని హరికథ వలె, వరుస లేని సంగీతము వలె, జందెము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్రవలె, కంఠాభరణము లేని యలంకారము వలె రతన్‌జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను, కళావిహీనముగాను యుండెను.
రతన్‌జీ యెల్లప్పుడు ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను.
రతన్‌జీ తనలో తానిట్లనుకొనెను. ”భగవంతుడెన్నడయిన సంతుష్టి జెంది పుత్ర సంతానము కలుగజేయడా” ? మనస్సునందలి ఈ చింతతో అతడాహారమందు రుచి గోల్పోయెను.
రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా యను నాతురతతో నుండువాడు.
దాసగణు మహారాజు నందు గొప్ప గౌరవము కలిగియుండెడివాడు. ఒకనాడు దాసగణు మహరాజ్‌ను కలిసి, ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను.
దాసగణు ఆతనికి షిరిడీకి వెళ్ళుమని సలహా యిచ్చెను. బాబాను దర్శించుమనెను; బాబా ఆశీర్వాదము పొందుమనెను; సంతానము కొరకు వేడుకొనుమనెను. రతన్‌జీ దీనికి సమ్మతించెను.
షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను.
ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి, దానిని బాబా మెడలో వేసి, ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయవిధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను.
”కష్టదశలోనున్న వారనేకమంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదముల నాశ్రయించితిని. కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగ జేయకుము”.
బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్‌జీ తన మనసులో దలచెను.
బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి, అతడా పైకము నిచ్చునంతలో, తనకు రూ. 3-14-0 ఇంతకు పూర్వమే ముట్టి యుండెననీ, కాన మిగిలిన రూ. 1-2-0 మాత్రమే యిమ్మనెను.
ఇది విని రతన్‌జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా యాడిన మాటలను రతన్‌జీ గ్రహించుకొనలేకపోయెను. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ యిచ్చెను.
తాను వచ్చిన పని యంతయు బాబాకు విన్నవించి, తనకు పుత్ర సంతానము కలుగజేయుమని వేడెను.
బాబా మనస్సు కరిగెను. ”దిగులు పడకు ! నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చు” నని చెప్పెను.
బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్‌జీ నాందేడుకు వచ్చెను. దాసగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు దెలిపెను.
అంతయు సవ్యముగా జరిగెననియు, బాబా దర్శనము, వారి యాశీర్వాదము, ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని యనెను.
తమకు అంతకుముందే రూ. 3-14-0 ముట్టినవని బాబా యాడిన మాటల కర్థమేమని దాసగణు నడిగెను.
”ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళియుండలేదే ! నావల్ల బాబాకు రూ. 3-14-0 ఎట్లు ముట్టెను?” అది దాసగణుకు కూడ యొక చిక్కు సమస్యగా తోచెను.
దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమయిన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను.
మౌలానాసాహెబను మహాత్ముని రతన్‌జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను.
నాందేడులో మౌలానాసాహెబు గూర్చి తెలియనివారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్‌జీ షిరిడీకి పోవ నిశ్చయించగనే ఈ మౌలానాసాహెబు రతన్‌జీ ఇంటికి వచ్చెను.
ఆనాటి ఖర్చు సరిగా 3-14-0 అగుట జూచి యందరు ఆశ్చర్యపడిరి. అందరికి బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది.
వారు షిరిడీలో నున్నప్పటికి దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియుచుండెను. లేనిచో మౌలానాసాహెబు కిచ్చిన రూ. 3-14-0 సంగతి బాబాకెట్లు తెలియగలదు ? వారిద్దరొక్కటేయని గ్రహించిరి.
దాసగణు చెప్పిన సమాధానమునకు రతన్‌జీ సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను.
కొద్దికాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతుల యానందమునకు మితి లేకుండెను. కొన్నాళ్ళకు వారికి 12గురు సంతానము కల్గిరి. కాని నలుగురు మాత్రము బ్రతికిరి.
ఈ యధ్యాయము చివరన హరివినాయక సాఠె యనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట, రెండవ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా యాశీర్వదించిన కథ గలదు.
అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు గలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను.
కాని బాబా మాటలెన్నటికి అసత్యములు గానేరవు. మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంత నతడు మిక్కిలి సంతుష్టి చెందెను.
దక్షిణ మీమాంస :
దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి యీ యధ్యాయమును ముగించెదము. బాబా తమను జూచుటకు వెళ్ళిన వారివద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట యందరికి తెలిసిన సంగతే.
బాబా ఫకీరయినచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో, వారు దక్షిణ నెందు కడుగవలెను ? వారు ధనమునేల కాంక్షించవలెనని యెవరైన అడుగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది.
మొట్టమొదట బాబా యేమియు పుచ్చుకొనెడివారు కారు. కాల్చిన యగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు.
భక్తులనుగాని, తదితరులను గాని బాబా యేమియు నడిగెడివారు కారు. ఎవరైన నొక కాని గాని రెండు కానులు గాని యిచ్చినచో వానితో నూనె, పొగాకు కొనెడివారు. బీడిగాని, చిలుముగాని పీల్చేవారు.
రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి గాని రెండుగాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కాని యిచ్చినచో బాబా జేబులో నుంచుకొనెడివారు. అర్థణా అయినచో తిరిగి యిచ్చెడివారు.
బాబా కీర్తి యన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేకమంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ యడుగుచుండెను.
”దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే యా పూజ పూర్తికాదు” అని వేదము చెప్పుచున్నది.
దేవుని పూజ యందు నాణెమవసరమైనచో యోగుల పూజలో మాత్రమేల యుండరాదు ? శాస్త్రములలో గూడ నేమని చెప్పబడినదో వినుడు.
భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెముగాని, డబ్బుగాని సమర్పించవలెను.
ఈ విషయము గూర్చి యుపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము.
బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ‘ద’ యను నక్షరమును బోధించెను.
ఈ అక్షరము వల్ల దేవతలు ‘దమము’ నవలంబించవలెనని గ్రహించిరి. (అనగా నాత్మను స్వాధీనమందుంచుకొనుట) మానవులు ఈ యక్షరమును ‘దానము‘గా గ్రహించిరి.
రాక్షసులు దీనిని ‘దయ’ యని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమమేర్పడెను.
తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల నభ్యసించవలయునని చెప్పును.
దానము గట్టి విశ్వాసముతోను, ధారాళముగను, అణుకువతోను, భయముతోను, కనికరముతోను చేయవలెను.
భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ యడుగుచుండెను. కాని ఇందులో నొక విశేషమున్నది.
బాబా తాము పుచ్చుకొనుదానికి వందరెట్లు తిరిగి యివ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేకమందికి జరిగెను.
దీనికొక యుదాహరణము గణపతిరావు బోడస్‌యను ప్రముఖ నటుడు, తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితిననియు, దీని ఫలితముగా ఆనాటినుండి తన జీవితములో ధనమునకు యెట్టి లోటు లేకుండెననియు వ్రాసెను.
ఎల్లప్పుడు కావలసినంత ధనము గణపతిరావు బోడస్‌కు దొరుకుచుండెను.
బాబా ‘దక్షిణ’ యడిగినపుడు ధనమే ఇవ్వనక్కరలేదను నర్థము గూడ పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి రెండుదాహరణములు.
(1) బాబా 15 రూపాయలు దక్షిణ యిమ్మని ప్రొఫెసర్ జి.జి. నార్కే నడుగగా, నతడు తన వద్ద దమ్మిడీయయిన లేదనెను.
దానికి బాబా యిట్లనెను. ”నీ వద్ద ధనము లేదని నాకు తెలియును. కాని నీవు యోగవాసిష్ఠము చదువుచున్నావు గదా ? దాని నుంచి నాకు దక్షిణ యిమ్ము!” దక్షిణ యనగా నిచ్చట గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమని యర్థము.
(2) ఇంకొకసారి తర్ఖడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ యిమ్మని బాబా యడిగెను. తన వద్ద పైకము లేకుండుటచే నామె మిగుల చిన్నబోయెను.
అప్పుడు అక్కడనేయున్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము జెప్పెను. తన ఆరుగురు శత్రువులను (కామ క్రోధ లోభాదులను) తమకు పూర్తిగ సమర్పించవలెనని బాబా భావమని యతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగ సమ్మతించెను.
బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసిన్నప్పటికి, దానినంతయు వారు ఆనాడే పంచి పెట్టుచుండిరి.
ఆ మరుసటి యుదయమునకు బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేలకొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను, మహాసమాధి చెందునాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను.
వేయేల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుటకొరకే.
దక్షిణ గూర్చి యింకొకరి వర్ణన :
బి.వి. దేవ్ ఠాణా నివాసి; ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు; బాబా భక్తుడు. దక్షిణగూర్చి ఆయన ‘శ్రీ సాయిలీలా మాసిక’ పత్రికలో నిట్లు వ్రాసియున్నారు :
బాబా యందరిని దక్షిణ యడుగువారు కారు. అడుగకుండ ఇచ్చినచో నొక్కొక్కప్పుడు పుచ్చుకొనెడివారు; ఇంకొకప్పుడు నిరాకరించువారు.
బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ యడుగుచుండెను. బాబా యడిగినచో యిచ్చెదమను వారివద్ద బాబా దక్షిణ పుచ్చుకొనెడివారు కారు.
తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైన దక్షిణ యిచ్చినచో, బాబా దానిని ముట్టేవారు కారు.
ఎవరైన దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా యడిగెడు దక్షిణ పెద్ద మొత్తములుగాని, చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి యుండును.
స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ యడుగుచుండెను. వారు అందరు ధనికులను గాని అందరు బీదలను గాని దక్షిణ యడుగలేదు. తాము అడిగినను దక్షిణ యియ్యనివారిపై బాబా కోపించి యుండలేదు.
ఎవరి ద్వారానైన భక్తులు దక్షిణ పంపినచో, తెచ్చినవారు దానిని మరచునప్పుడు, వారికి దానిని గూర్చి జ్ఞప్తికి దెచ్చి, ఆ దక్షిణను పుచ్చుకొనువారు.
ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి యిచ్చి పూజలో పెట్టుకొనమనెడివారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను.
అనుకున్నదానికంటె నెక్కువ యిచ్చినచో, కావలసిన దానినే యుంచుకొని మిగతాదానిని తిరిగి యిచ్చి వేయుచుండిరి.
ఒక్కొక్కప్పుడు భక్తులనుకొనిన దానికంటె నెక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనినచో నెవరివద్దనయిన బదులు పుచ్చుకొనిగాని, అడిగి తీసుకొని గాని ఇవ్వుమనుచుండిరి.
కొందరి వద్ద నుంచి యొకేరోజు మూడు నాలుగు సారులు దక్షిణ కోరుచుండిరి.
దక్షిణ రూపముగా వసూలయిన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు, ధుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతాదాని నంతయు బీదలకు దానము చేయుచుండెడివారు.
50 రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు.
షిరిడీ సంస్థానములో నున్న విలువైన వస్తువులన్నియు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి యిచ్చిరి.
ఎవరయిన విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు.
నానాసాహెబు చాందోర్కరుతో తన యాస్తియంతయు నొక కౌపీనము, ఒక విడిగుడ్డ, యొక కఫనీ, యొక తంబిరేలు గ్లాసు మాత్రమే యనియు అయినప్పటికి భక్తులనవసరమైన నిష్ప్రయోజనమయిన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు.
మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు; మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా యీ రెండు సంస్థలను నియమించి యున్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి.
తన భక్తుల ఈ రెంటిని ఎంతవరకు విడిచి పెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ యడిగి పుచ్చుకొని, ”బడికి” (రాధాకృష్ణమాయి గృహమునకు) పంపుచుండిరి.
ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను.
భగవద్గీతలోను, ఉపనిషత్తులలోను, పవిత్రమైన స్థలమందు పవిత్రున కిచ్చిన దానము, ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని యున్నది.
షిరిడీకన్న పవిత్ర స్థలమేది ? అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న యెవరు ?
పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పన్నెండవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది యొకటవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పదియైదవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పదియారవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది మూడవ అధ్యాయము🌹…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments