Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
ముప్పదియైదవ అధ్యాయము
ఊదీ మహిమ; కాకా మహాజని స్నేహితుడు; కాకా మహాజని-యజమాని;
బాంద్రా అనిద్ర రోగి; బాలాజీ పాటీలు నేవాస్కరు;
సాయి పాము వలె కన్పించుట
ఈ అధ్యాయములో కూడ ఊదీ మహిమ వర్ణితము. ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట గూడ చెప్పబడినది.
బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును.
ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు, శాఖలు మన యభివృద్ధికి అడ్డుపడును.
భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడాకారము గలవాడని నమ్మువారిని ఖండించి యది వట్టి భ్రమ యనెదరు.
యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే. కనుక వారికి నమస్కరింపనేల ? యందురు.
ఇతర శాఖల వారు కూడ ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేల ? యందురు.
సాయిబాబా గూర్చి కూడ నట్టి యాక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ యడిగెను.
యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగుచేయుట శ్రేయస్కరమా ? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణము లెక్కడ ? అని విమర్శించిరి.
అనేకమంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచటనే నిలిచిపోయిరి. అటువంటి రెండు ఉదాహరణలీ దిగువ నిచ్చుచున్నాము.
కాకామహాజని స్నేహితుడు :
కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతు నారాధించువాడు. విగ్రహారాధనమున కాతడు విముఖుడు.
అతడు ఊరకనే వింతలేమైన తెలిసికొనుటకు షిరిడీకి పోవ నంగీకరించెను. కాని, బాబాకు నమస్కరించననియు, వారికి దక్షిణ యివ్వననియు చెప్పెను. కాకా యీ షరతులకు ఒప్పుకొనెను.
ఇద్దరును శనివారము నాడు రాత్రి బొంబాయి విడిచి యా మరుసటి దినము షిరిడీకి చేరిరి.
వారు మసీదు మెట్లను ఎక్కగనే కొంచెము దూరమున నున్న బాబా, మహాజని స్నేహితుని మంచి మాటలతో నాహ్వానించెను.
ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠమువలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి దెచ్చెను. శరీరము సంతోషముతో నుప్పొంగెను.
కంఠపు ఆకర్షణ శక్తి యేమని చెప్పుదును ? మిగుల నాశ్చర్యపడి యా స్నేహితుడు ”ఇది తప్పనిసరిగ మా తండ్రి కంఠమే” యనెను.
వెంటనే మసీదు లోపలికి వెళ్ళి, తన మనో నిశ్చయమును మరచినవాడై, బాబా పాదములకు నమస్కరించెను.
ఉదయ మొకసారి మధ్యాహ్న మొకసారి బాబా దక్షిణ యడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కాని యతని స్నేహితుని అడుగలేదు.
అతని స్నేహితుడు కాకా చెవిలో ”బాబా నిన్నే రెండుసారులు దక్షిణ యడినెను. నేను నీతో నున్నాను. నన్నెందుకు విడిచి పెట్టుచున్నారు ?” అనెను.
”నీవే బాబాను అడుగుము” అని యతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకామహాజని నడుగగా, తన స్నేహితుడు తాను కూడ దక్షిణ యివ్వవచ్చునా యని అడుగుచున్నాడనెను.
బాబా ”నీ కిచ్చుటకు మనమున నిష్టము లేకుండును. కాన నిన్నడుగ లేదు. కాని, యిప్పుడు నీ కిష్టమున్న యెడల ఇవ్వవచ్చు” ననెను.
కాకా యిచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడ ఇచ్చెను. బాబా యప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా నిట్లు చెప్పెను.
”నీవు దానిని తీసివేయుము; మనకు మధ్యనున్న యడ్డును తీసివేయుము. అప్పుడు మన మొకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలిసికొనగలము !” పోవుటకు బాబా వారికి సెలవు నిచ్చెను.
ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికి వర్షము వచ్చునేమో యను భయము కలుగుచున్నప్పటికి ప్రయాస లేకుండ ప్రయాణము సాగునని బాబా యాశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి.
అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి రెండు పిచ్చుకలు చచ్చి పడియుండెను. ఇంకొకటి కిటికీ ద్వారా యెగిరిపోయెను.
తానే కిటికీలు తెరిచియుంచినచో పిచ్చుకలు రక్షింపబడియుండును. వాని యదృష్టానుసారముగ నవి చచ్చెను. మూడవ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపె ననుకొనెను.
కాకామహాజని – యజమాని :
ఠక్కర్ థరమ్సె జెఠాభాయి, హైకోర్టు ప్లీడరు నొక కంపెనీ గలదు. దానిలో కాకా మేనేజరుగా పనిచేయుచుండెను.
యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేకసారులు పోవుట, కొన్ని దినము లచటనుండి, తిరిగి బాబా యనుమతి పొంది వచ్చుట, మొదలగునవి ఠక్కరుకు తెలియును.
కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో, ఠక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను.
కాకా యెప్పుడు తిరిగివచ్చునో యనునది నిశ్చయముగా తెలియదు కనుక ఠక్కరింకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరిరి.
బాబా కిచ్చుటకై కాకా రెండు సేర్ల యెండు ద్రాక్షపండ్లు (గింజలతో నున్నవి) దారిలో కొనెను. వారు షిరిడీకి సరియైన వేళకు చేరి, బాబా దర్శనమునకయి మసీదుకు బోయిరి.
అప్పుడక్కడ బాబాసాహెబు తర్ఖడుండెను. ఠక్కర్ మీరెందుకు వచ్చితిరని తర్ఖడు నడిగెను. దర్శనము కొరకని తర్ఖడు జవాబిచ్చెను.
మహిమలేమైన జరిగినవాయని ఠక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైన అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక జరుగుననియు తర్ఖడ్ చెప్పెను.
కాకా బాబా పాదములకు నమస్కరించి యెండు ద్రాక్షపండ్లను అర్పించెను. బాబా వానిని పంచి పెట్టుమని యాజ్ఞాపించెను.
ఠక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుట కిష్టము లేదు. ఎందుచేత ననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా యిచ్చియుండెను.
ఇప్పుడతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుట కిష్టము లేదు కాని బాబా తినుట కాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసికొనెను.
గింజలనేమి చేయవలయునో తోచకుండెను. మసీదులో గింజలుమ్మివేయుటకు జంకుచుండెను. తన యిష్టమునకు వ్యతిరేకముగ తుదకు గింజలు తన జేబులోనే వేసికొనెను.
బాబా యోగి యయినచో తనకు ద్రాక్షపండ్లు ఇష్టము లేదని తెలియదా ? బాబా వానినేల బలవంతముగా నిచ్చెను ?ఈ యాలోచన అతని మనస్సున తట్టగానే బాబా యింకను మరికొన్ని ద్రాక్షపండ్లు ఇచ్చెను.
అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి యాజ్ఞానుసారము తినగా, వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగుల నాశ్చర్యపడెను.
అద్భుతములు చూడలేదనుకొనెను. గాన నాతనిపై నీ యద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలు గల ద్రాక్షపండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను.
ఏమి యాశ్చర్యకరమైన శక్తి ! బాబాను పరీక్షించుటకు తర్ఖడు కెట్టి ద్రాక్షలు దొరికెనని యడిగెను. గింజలతో నున్నవి దొరికెనని తర్ఖడ్ చెప్పెను. ఠక్కరు ఆశ్చర్యపడెను.
తనయందుద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యదార్థముగా యోగి యైనచో ద్రాక్షపండ్లు మొట్టమొదట కాకా కివ్వవలె ననుకొనెను.
అతని మనస్సునందున్న యీ సంగతి కూడ గ్రహించి, బాబా కాకా వద్ద నుంచి యెండు ద్రాక్షల పంపిణి ప్రారంభింపవలయునని యాజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో ఠక్కరు సంతుష్టి చెందెను.
శ్యామా ఠక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయము చేసెను.
అందుకు బాబా యిట్లనెను. ”అతడెట్లు వానికి యజమాని కాగలడు ? అతని యజమాని వేరొకరు గలరు”. కాకా యీ జవాబుకు చాలా ప్రీతి చెందెను.
తన మనోనిశ్చయము మరచి ఠక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను.
మధ్యాహ్న హారతియైన పిమ్మట వారందరు బాబా వద్ద సెలవు దీసికొనుటకు మసీదుకు బోయిరి. శ్యామా వారి పక్షమున మాట్లాడెను. బాబా యిట్లు చెప్పదొడంగెను.
”ఒక చంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడ నుండెను. ఎట్టి విచారములు లేకుండెను.
అనవసరమైన యారాటము పైన వేసుకొని, యక్కడక్కడ తిరుగుచు మనఃశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నియు వదలివేయుచుండెను. మరొకప్పుడు వానిని మోయుచుండెను.
అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీ కిష్టము వచ్చినచోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటు నాశ్రయించుకొని నిలకడగా నుండు” మని చెప్పితిని.
వెంటనే ఠక్కర్ యిదియంతయు తన గూర్చియే యని గ్రహించెను. కాకా కూడ తన వెంట రావలె ననుకొనెను. కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుట కాజ్ఞ దొరుకునని యెవ్వరనుకొనలేదు.
బాబా దీనిని కూడ కనుగొని కాకాను అతని యజమానితో పోవుట కనుజ్ఞనిచ్చెను. ఈవిధముగా బాబా సర్వజ్ఞుడనుట ఠక్కరు కింకొక నిదర్శనము దొరికెను.
బాబా కాకాను 15 రూపాయల దక్షిణ యడిగి పుచ్చుకొని అతనికిట్లని చెప్పెను.
”నేను ఒక రూపాయి దక్షిణ యెవరి వద్ద నుంచి గాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరక యేమి తీసికొనను.
యుక్తాయుక్తములు తెలియకుండ నేనెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను తీసికొనెదను. ఎవరైన ఫకీరుకు గత జన్మ నుంచి బాకీయున్నచో, వాని వద్దనే ధనము పుచ్చుకొందును.
దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే.
ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమయి పోవును. గతజన్మలో నీవిచ్చియుంటేనే గాని, నీవిప్పుడు అనుభవించలేవు.
కనుక ధనమును పొందవలెననినచో, దానిని ప్రస్తుత మితరుల కిచ్చుటే సరియైన మార్గము. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తి జ్ఞానములు కలుగును. ఒక రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును.”
ఈ మాటలు విని, ఠక్కరు తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను.
షిరిడీకి వచ్చుట మేలయిన దనుకొనెను. ఏలన అతని సంశయములన్నియు తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను.
అటువంటి వారి విషయములో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి యమోఘమయినది. అన్ని బాబాయే చేయుచున్నను, దేనియందభిమాన ముంచలేదు.
ఎవరయినను నమస్కరించినను నమస్కరించకపోయినను, దక్షిణ యిచ్చినను, ఈయకున్నను తన కందరు సమానమే.
బాబా యెవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించెడివారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు.
బాంద్రా అనిద్ర రోగి :
బాంద్రా నివాసి, కాయస్థప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్రపట్టక బాధపడుచుండెడివాడు.
నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో గానిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు.
ఇది అతని నిద్రను భంగపరచి రాత్రియందస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజిట్లు జరిగి యేమి చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడెను.
బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగుచేయునని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదీ నిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకొని మిగత పొట్లమును తలక్రింద దిండుకు దిగువ పెట్టుకొనుమనెను.
ఇట్లు చేసిన పిమ్మట సంతోషము, ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచినిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించు చుండెను.
సాయిబాబా పటమును దెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను.
గురువారము నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట నతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను.
బాలాజీ పాటీలు నేవాస్కరు :
ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండ చాల మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా యేయే మార్గముల ద్వారా పోవుచుండెనో వాని నన్నింటిని తుడిచి శుభ్రము చేయుచుండెను.
ఆతని యనంతరము ఈపని రాధాక్రిష్ణమాయి యతి శుభ్రముగా నెరవేర్చు చుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను.
బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగనే దానినంతయు దెచ్చి బాబా కర్పితము చేయుచుండెను. అతడు బాబా యిచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొనువాడు.
ఈ ప్రకారముగా నతడు చాల సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దాని నవలంబించెను.
ఊదీ ప్రభావము :
ఒకనాడు బాలాజీ సంవత్సరీకమునాడు నేవాస్కరు కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు బిలచిరి. భోజన సమయానికి పిలచినవారికంటె మూడురెట్లు బంధువులు వచ్చిరి.
నేవాస్కరు భార్యకు సంశయము కలిగెను. వండిన పదార్థములు వచ్చినవారికి చాలవనియు, కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను.
ఆమె యత్తగారు ఓదార్చుచు, ”భయపడకుము. ఇది మనది కాదు. ఇది సాయి యాహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పి వేయుము.
వానిలో కొంచెము ఊదీ వేయుము. గుడ్డ పూర్తిగా తీయకుండ వడ్డన చేయుము. సాయి మనలను కాపాడును” అనెను.
ఆమె యా సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటయే గాక ఇంకను చాలా మిగిలెను.
తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును బొందవచ్చునని యీ సంఘటనము తెలుపుచున్నది.
సాయి పామువలె కన్పించుట :
ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటీలు నేవాసెలో నున్న బాలాజీ పాటీలింటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాల మొక పాము ఆవుల కొట్టము లోనికి బుసకొట్టుచు దూరెను.
అందులోని పశువులన్ని భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరు భయపడిరి.
కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమియు భయపడక గిన్నెతో పాలు దెచ్చి సర్పము ముందు బెట్టి యిట్లనెను.
”బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు ? ఎందులకీ యలజడి ? మమ్ము భయపెట్ట దలచితివా ? ఈ గిన్నెడు పాలను దీసికొని నెమ్మదిగా త్రాగుము”. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా గూర్చుండెను.
ఇంటిలోని తక్కినవారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెదకినను కనిపించలేదు.
బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. బాబా వారికొరకు చీరలు, బట్టలు కొని యాశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు.
ముప్పది ఐదవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above text has been typed by: Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పన్నెండవ అధ్యాయము🌹…Audio
- కాకా మహాజని స్నేహితుడు
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదమూడవ అధ్యాయము🌹….Audio
- సాయి చూస్తున్నాడు జాగ్రత్త!…..సాయి@366 అక్టోబర్ 24….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదునాలుగవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments