🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదమూడవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

పదమూడవ అధ్యాయము

మాయ యొక్క అనంత శక్తి; భీమాజీ పాటీలు; బాలా గణపతి షింపి; బాపు

సాహెబు బూటీ; ఆళందిస్వామి; కాకా మహాజని; హర్దా నివాసి దత్తోపంతు;

ఇంకొక మూడు వ్యాధులు

మాయ యొక్క అనంత శక్తి :

బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తివంతముగను సమతూకముతోను నుండెడివి. వారు ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా నుండువారు.

బాబా యిట్లనిరి. ”నేను ఫకీరునయినప్పటికీ, ఇల్లు వాకిలి, భార్యబిడ్డలు, తదితర బాదరబందీలేవీ లేకుండా, ఎక్కడికీ కదలక యొకచోట కూర్చునియునప్పటికీ, తప్పించుకొనలేని మాయ నన్నునూ బాధించుచున్నది.

నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది.

హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా, నా వంటి దుర్భలుడయిన ఫకీరనగ నెంత ? హరి ప్రసన్నుడైనపుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం” . మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను.

మహాభాగవతములో శ్రీ కృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు.

తన భక్తుల మేలుకొరకు బాబా యింకా యేమి చెప్పియున్నారో వినుడు : ”ఎవరు అదృష్టవంతులో, యెవరి పాపములు క్షీణించినవో, వారే నన్ను భజించుట యందు తత్పరులై నన్నెఱుగగలరు.

ఎల్లప్పుడు ‘సాయి సాయి’ అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. తప్పక మేలు పొందెదవు.

పూజా తంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని అష్టాంగయోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి యున్నచోటనే నా నివాసము”. ఇక తమకు పూర్తిగ శరణాగతులైనవారి క్షేమము కొరకు బాబా యేమి చేసెనో వినుడు.

భీమాజీ పాటీలు :

పూనాజిల్లా జున్నరు తాలుకా, నారాయణ గాంవ్‌ వాస్తవ్యుడు భీమాజీ పాటీలు. 1909వ సంవత్సరములో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను.

అన్ని రకముల యౌషధములను వాడెను గాని ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నియు వదలుకొని, ”ఓ భగవంతుడా ! ఇక నీవే నా దిక్కు ! నన్ను కాపాడు !” అని ప్రార్థించెను.

మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము భగవంతుని తలచము అను సంగతి యందరికి తెలిసినదే. కష్టములు మనల నావరించునప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొనెదము.

అట్లనే భీమాజీ కూడ భగవంతుని స్మరించెను. ఆ తరువాత, తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబు చాందోర్కరుతో సలహా చేయవలెనను ఆలోచన కలిగెను.

వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నియు దెలుపుచు ఆయనకొక లేఖ వ్రాసి యతని యభిప్రాయమడిగెను.

బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే యారోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కరు జవాబు వ్రాసెను.

అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుట కేర్పాటులన్నియు చేసికొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో నున్న బాబా ముందు కూర్చునబెట్టిరి.

నానాసాహెబు, శ్యామా కూడ నచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గతజన్మలోని పాపకర్మల ఫలితమనీ, అతని విషయములో తాను జోక్యము జేసికొనదలచుట లేదనియు బాబా చెప్పెను.

కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను.

అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో నిట్లనిరి : ”ఊరడిల్లుము ! నీ యాతురతను పారద్రోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ, బాధలున్నవారైనను ఎప్పుడైతే యీ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును.

ఇచ్చటి  ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారి రోగమును తప్పక బాగుచేయును. ఈ ఫకీరు అందరిని ప్రేమతోను దయతోను కాపాడును”.

ప్రతి అయిదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున యొక్కసారియైన రక్తము గ్రక్కలేదు !

బాబా వానిని దయతో గాపాడెదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను.

వానిని భీమాబాయి యింటిలో బసచేయుమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది గాని, ఆరోగ్యకరమైనది గాని కాదు. కాని బాబా యాజ్ఞ జవదాటరానిది.

అతడు షిరిడీలో నుండునప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవముల నిచ్చి, వాని రోగమును కుదిర్చెను.

మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను.

రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధననుభవించెను. స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను.

ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తియందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను ?

బాబా తన భక్తుల వద్దనుంచి యేమియు కాంక్షించెడివారు కారు. వారికి కావలసిన దేమన, భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తియందుంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగియుంటయే.

మహారాష్ట్ర దేశములో నెలకొకసారిగాని, పక్షమున కొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయము.

కాని భీమాజీ పాటీలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయిసత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను.

బాలాగణపతి షింపీ :

బాలాగణపతి యనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను.

అన్ని రకముల యౌషధములు, కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైన తగ్గలేదు.

షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపైబడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందరనున్న నల్లకుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను.

ఈ వింత రోగనివారణోపాయము నెట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట జూచెను.

రెంటిని కలిపి లక్ష్మీమందిరము వద్దకు దెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక యాడించుకొనుచూ కనిపించెను.

పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను.

బాపుసాహెబు బూటీ :

ఒకానొకప్పుడు బాపుసాహెబు బూటీ జిగట విరేచనములతోను, వమనములతోను బాధపడుచుండెను.

అతని అలమారునిండ మంచి మంచి మందులుండెను. కాని అవేమియు గుణమివ్వలేదు.

విరేచనముల వల్లను వమనముల వల్లను బాపుసాహెబు బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను.

బాబా ఆతనిని మసీదుకు రమ్మని కబురు పంపి, అతడు రాగానే తమ ముందు కూర్చొండబెట్టుకొని, తమ చూపుడు వ్రేలాడించుచూ, ”జాగ్రత్త  ! నీవిక  విరేచనము చేయకూడదు! వమనము కూడ ఆగవలెను !” అనెను.

బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను.

ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టరు పిళ్ళే యను వైద్యుడు యన్ని యౌషధములను ప్రయత్నించెను. కాని రోగము కుదురలేదు.

బాపుసాహెబు అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ యౌషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను.

బాదాముపప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను.

ఇది జబ్బును మరింత హెచ్చించునని యే డాక్టరయినను చెప్పును. కాని బాపుసాహెబు బాబా యాజ్ఞను శిరసావహించెను. పాలతో తయారుచేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను.

ఆళంది స్వామి(పద్మనాభేంద్ర స్వామి) :

ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటెక్కువగా నుండి నిద్రపట్టకుండెను.

శస్త్రచికిత్స కూడ చేయించుకొనెను. కాని వ్యాధి నయము కాలేదు. బాధ యెక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను.

తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుట కేదైన చేయుమని శ్యామా ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను.

బాబా అతని నిట్లు ఆశీర్వదించెను. ”అల్లా అచ్ఛా కరేగా” (భగవంతుడు నీకు మేలు చేయును). ఆ సన్యాసి పూనా చేరి, ఒక వారము రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను.

ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గెననియు, కాని ఇంకనూ వాపు తగ్గలేదనియు వ్రాసెను.

వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్ర చికిత్స అవసరము లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత యద్భుతమైనది.

కాకామహాజని :

కాకామహాజని యను నింకొక భక్తుడు గలడు. అతడు నీళ్ళ విరేచనములతో బాధపడుచుండెను.

బాబా సేవ కాటంకము లేకుండునట్లు ఒక చెంబు నిండ నీళ్ళు పోసుకొని, దానిని మసీదులో నొక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్ల పోవుచుండెను.

సర్వజ్ఞుడయిన బాబాతో నేమియు చెప్పనక్కరలేదనియు, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మెను.

మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను, కావున పని ప్రారంభమయ్యెను.

వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరచెను. అందరు పరుగెత్తి పారిపోయిరి. కాకా కూడ పరుగిడ మొదలిడెను.

కాని బాబా అతనిని పట్టుకొని యచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో నెవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి.

బాబా యొక పిడికెడు శనగపప్పు తీసి, చేతులతో నలిపి, పొట్టును ఊదివైచి, శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట శుభ్రపరచుట తినుట యొకేసారి జరుగుచుండెను.

బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్ళు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్ళు తెచ్చెను. బాబా కొన్ని నీళ్ళు త్రాగి, కాకాను గూడ త్రాగుమనెను.

అప్పుడు బాబా యిట్లనెను. ”నీ నీళ్ళ విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపనచేయు పనిని చూచుకొనవచ్చును”.

అంతలో పారిపోయిన వారందరును తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడ వారితో కలిసెను.

నీళ్ళ విరేచనములకు వేరుశెనగపప్పు ఔషధమా ? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన యౌషధము బాబా యొక్క వాక్కే.

హార్దా నివాసి దత్తోపంతు :

దత్తోపంతు హార్దాగ్రామ నివాసి. అతడు కడుపునొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ యౌషధము వానికి గుణము నివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను.

వారు జబ్బులను దృష్టిచేతనే బాగు చేసెదరను సంగతి తెలిసికొని షిరిడీకి పోయి బాబా పాదములపై బడెను. బాబా అతనిని దయాదృష్టితో యాశీర్వదించెను.

బాబా అతని తలపై తమ హస్తము నుంచి, ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగనే యతనికి గుణమిచ్చెను. ఆ జబ్బువలన తిరిగి అతడు యెన్నడు బాధపడలేదు.

ఇంకొక మూడు వ్యాధులు :

1. మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను.

రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా యాజ్ఞలేకుండ పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా యాశీర్వాదముతో నయమయ్యెను.

2. కాకామహాజని అన్నగారైన గంగాధరపంతు అనేక సంవత్సరములు కడుపునొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను.

కడుపునొప్పి బాగుచేయుమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి, భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటినుండి అతని కడుపునొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను.

3. ఒకప్పుడు నానాసాహెబు చాందోర్కరు కడుపునొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను.

డాక్టర్లు మందులు ఇంజక్షనులు ఇచ్చిరి. కాని యవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను.

ఈ కథలన్నియు నిరూపించునదేమన, అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములు మాత్రమేకాని, ఔషధములు కావు.

పదమూడవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles