🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది మూడవ అధ్యాయము🌹…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా 🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ముప్పది మూడవ అధ్యాయము

ఊదీ మహిమ – తేలుకాటు; ప్లేగుజబ్బు; జామ్మేరు లీల;

నారాయణరావు జబ్బు; బాలబువ సుతార్‌;

అప్పాసాహెబు కులకర్ణి; హరిభావ్‌ కర్ణిక్‌

గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊదీ మహిమను వర్ణించెదము.

మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను గూడ నశింపజేయును.

మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును. అమృతానందమును ప్రసాదించును.

ఇది నాది, అది నీది, యను భేదభావము వారి మనస్సులందు పుట్టదు.

వారి ఋణమును ఈ జన్మయందుగాని వచ్చే పెక్కు జన్మలయందు గాని మనము తీర్చుకొనలేము.

ఊదీ మహిమ :

బాబా యందరి వద్ద నుంచి దక్షిణ తీసికొనుచుండునని యందరికి తెలిసిన విషయమే. ఈవిధముగా వసూలు చేసిన మొత్తములో నెక్కువ భాగము దానము చేసి మిగతదానితో వంట చెఱకును (కట్టెలను) కొనుచుండెను.

ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది యిప్పటికి నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊదీ యనుచున్నాము.

బాబా దానిని భక్తులకు తమ తమ యిండ్లకు తిరిగి పోవునప్పుడు పంచి పెట్టెడివారు.

ఊదీ వలన బాబా యేమి బోధించ నుద్దేశించెను ? ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు.

పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద యగును. ఈ సంగతి జ్ఞప్తికి దెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచి పెట్టుచుండెను.

ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవారు కారని బాబా బోధించెను.

ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయెదము.

ఊదీ యనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను.

భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమానరాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను.

మొదటిది (ఊదీ) వివేకమును, రెండవది (దక్షిణ) వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము.

అందుచే బాబా యడిగి దక్షిణ తీసికొనుచుండెను. షిరిడీ నుంచి యింటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటిపై వ్రాసి వరద హస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను.

బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊదీ గురించి యొకటి పాడుచుండిరి.

దాని పల్లవి ”కళ్యాణరామ రారమ్ము ! గోనెలతో ఊదీని తేతెమ్ము !” బాబా దీనిని చక్కని రాగముతో మధురముగ పాడుచుండెడివారు.

ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక  ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడ కలదు.

అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను. ఇక ఊదీ గూర్చిన కథలను ప్రారంభించెదము.

తేలుకాటు :

నాసిక్‌ నివాసియగు నారాయణ మోతీ రాంజాని యనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామనమోదక్‌ యను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను.

అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్‌ సేవను మాని, తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యెను.

నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ‘ఆనందాశ్రమము’ అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను.

ఒకసారి యీ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను; దాని బాధ భరింపరానంత యుండెను.

అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును. నొప్పి యున్నచోట ఊదీని రాయవలెను. అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెదకెను. కాని యది కనిపించలేదు.

అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయము కోరి, బాబా నామజపము చేసి, బాబా పటము ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి, నొప్పి యున్నచోట రాసెను.

అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగనే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి.

ప్లేగుజబ్బు :

ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు ఒక బాబా భక్తునికి, వేరొక గ్రామమున నున్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసెను.

అతడు తన వద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమని నానాసాహెబు చాందోర్కరు గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వేస్టేషను వద్ద తెలిసెను.

అప్పుడతడు భార్యతో కూడ కల్యాణ్‌ పోవుచుండెను. వారివద్ద అప్పుడు ఊదీ లేకుండెను.

కావున నానాసాహెబు రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి, సాయినామజపము చేసి, బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను.

కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు జూచెను. ఆ భక్తుడు యింటికి పోవుసరికి మూడు రోజులనుండి బాధ పడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటినుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను.

జామ్నేరు లీల :

1904 – 1905వ సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్‌ జామ్నేర్‌లో మామలతదారుగా నుండెను.

ఇది ఖాందేషు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ల దూరములో నున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి; ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను.

ఆమె రెండు మూడు దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబు ఔషధములన్నియు వాడెను కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి దెచ్చుకొని వారి సహాయము వేడెను.

షిరిడీలో రామ్‌గీర్‌ బువాయను సన్యాసి యుండెను. బాబా అతనిని ‘బాపూగీర్‌ బువా’ యనువారు. అతని స్వగ్రామము ఖాందేషులో నుండెను.

అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని బిలిచి మార్గమధ్యమున జామ్నేర్‌లో కొంత విశ్రాంతి తీసికొని నానాసాహెబుకు ఊదీని హారతి పాటను ఇమ్మనెను.

తన వద్ద రెండే రూపాయలున్నవనియు అవి జలగామ్‌ వరకు రైలు టిక్కెట్టుకు సరిపోవుననియు, కాబట్టి జలగామ్‌ నుండి జామ్నేర్‌ పోవుటకు (సుమారు 30 మైళ్ళు) ధనము లేదని రామ్‌గీర్‌ బువా చెప్పెను.

అన్నియు సరిగా అమరును గాన, నతడు కలతజెందనవసరము లేదని బాబా పలికెను. శ్యామాను బిలిచి మాధవ ఆడ్కర్‌ రచించిన హారతిని వ్రాయుమనెను. హారతి పాటను ఊదీని రామ్‌గీర్‌ బువాకిచ్చి నానాసాహెబుకు అందజేయుమనెను.

బాబా మాటలపయి ఆధారపడి రామ్ గీర్ బువా షిరిడీ విడచి, రాత్రి రెండున్నర గంటలకు జలగామ్‌ చేరెను.

అచటికి చేరునప్పటికి అతని చెంత 2 అణాలు మాత్రమే యుండెను. కాబట్టి కష్టదశలో నుండెను.

అప్పుడే యెవరో ”బాపూగీర్‌ బువా యెవరు ?, బాపూగీర్‌ బువా యెవరు ?” అని కేక వైచుచుండిరి. బువా యచ్చటికి పోయి తనేయని చెప్పెను.

నానాసాహెబు పంపించినారని చెప్పుచు ఆ బంత్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసికొని పోయెను. దానికి రెండు మంచి గుఱ్ఱములు కట్టియుండెను.

ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదలిరి. టాంగా వేగముగా బోయెను.

తెల్లవారుఝామున టాంగా యొక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుఱ్ఱములను నీళ్ళు త్రాగించుటకు తీసుకు పోయెను.

బంత్రోతు రామ్‌గీర్‌ బువాను ఫలహారము చేయుమని, ఫలహారపు దినుసులను బెట్టెను.

గడ్డము మీసములున్న ఆ బంత్రోతు బట్టలు చూచి రామ్‌గీర్‌ బువా యతడు మహ్మదీయుడని సంశయించి ఫలహారము తినకుండెను.

కాని యా బంత్రోతు తాను హిందువుడననియు, గర్‌వాల్‌ దేశపు క్షత్రియుడననియు, నానాసాహెబు ఆ ఫలహారము బంపెన గాన, తినుట కెట్టి సంశయము వలదనెను.

అప్పుడిద్దరు కలిసి ఫలహారము చేసి బయలుదేరిరి. ఉషఃకాలము జామ్నేర్‌ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్‌గీర్‌ బువా టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చెను.

తిరిగి వచ్చుసరికి టాంగా గాని, టాంగా తోలువాడు గాని, బంత్రోతుగాని లేకుండిరి. బాపుగీర్‌ బువా నోటివెంట మాట రాకుండెను.

దగ్గరున్న కచేరికి బోయి యడుగగా నానాసాహెబు ఇంటి వద్దనే యున్నట్లు దెలిసెను. అతడు నానాసాహెబు గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను.

బాబా ఇచ్చిన ఊదీ, హారతి పాట నానాసాహెబుకు కందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరు ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి.

నానాసాహెబు తన భార్యను బిలిచి ఊదీని నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము బంపెననుకొనిరి.

కొద్ది నిముషములలో ప్రసవము సుఖముగా జరిగెనని వార్త వచ్చెను. గండము గడచినదని చెప్పిరి.

నానాసాహెబు గారు టాంగాను, నౌకరును, ఫలహారములను పంపినందుకు బాపుగీర్‌ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా నాతడు మిక్కిలి యాశ్చర్యపడెను.

షిరిడీ నుంచి యెవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు, కనుక నతడేమియు పంపియుండలేదని చెప్పెను.

బి.వి.దేవ్‌ గారీ విషయమై నానాసాహెబ్‌ చాందోర్కరు కొడుకు బాపూరావు చాందోర్కరును, రామ్‌గీర్‌ బువాను కలిసికొని విచారించి సాయిలీలా మాగజైన్‌లో ( xiii – 11, 12, 13) గొప్ప వ్యాసమును ప్రకటించినారు.

బి.వి. నరసింహస్వామిగారు మైనతాయి, బాపూరావు చాందోర్కరు, రామ్‌గీర్‌ బువాల వాజ్మూలమును సేకరించి ”భక్తుల అనుభవములు” అను గ్రంథమున (3వ భాగము) ప్రకటించినారు.

నారాయణరావు జబ్బు :

భక్త నారాయణరావుకు బాబాను రెండుసారులు దర్శనము చేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవలెననుకొనెను. కాని పోలేకపోయెను.

బాబా సమాధి చెందిన యొక సంవత్సరములో నతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు.

కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో నొక దృశ్యమును జూచెను.

అందు బాబా అతనిని ఓదార్చి యిట్లనెను. ”ఆందోళన పడవద్దు. రేపటి నుంచి బాగగును. వారము రోజులలో నడువ గలవు”.  స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను.

ఇచ్చట మనమాలోచించవలసిన విషయమిది. ”శరీరమున్నన్నాళ్ళు బాబా బ్రతికి యుండిరా ? శరీరము పోయినది గాన చనిపోయినారా ?” లేదు. ఎల్లప్పుడు జీవించియే యున్నారు.

వారు జనన మరణముల కతీతులు. ఎవరయితే బాబా నొకసారి హృదయ పూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికి ఎట్టి సమయమందుగాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు.

వారెల్లప్పుడు మన ప్రక్కనే యుందురు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు.

బాలబువ సుతార్‌ :

బొంబాయిలో నుండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలబువ సుతార్‌ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు.

ఎల్లప్పుడు అతడు భగవధ్యానము – భజన యందే తత్పరుడై యుండెడివాడు. అందుచే జనులు వారిని ‘నవయుగ తుకారామ్‌’ అని పిలిచేవారు.

వారు బాబాకు నమస్కరించగా బాబా ”నేనీతనిని నాలుగు సంవత్సరముల నుండి యెరుగుదును” అనిరి.

తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువా ఇదెట్లు సంభవమనుకొనెను.

కాని తీవ్రముగా నాలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫొటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను.

అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను.

”యోగు లెంతటి సర్వజ్ఞులు, లెంతటి సర్వాంతర్యాములు ? తమ భక్తులందు వారికెంత ప్రేమ ? నేను వారి ఫొటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి”.

అప్పా సాహెబు కులకర్ణి :

1917వ సంవత్సరమున అప్పాసాహెబు కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ యయ్యెను.

బాలాసాహెబు భాటే అతనికి బాబా ఫొటో నిచ్చి యుండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను.

పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యమర్పించుచు బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను.

ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగ చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచినదానితో సమానమే యని చెప్పవచ్చును (దీనికి నిదర్శనము పైన జెప్పబడిన కథ).

కులకర్ణి ఠాణాలో నుండగా భివండి పర్యటనకు బోవలసి వచ్చెను. ఒక వారము రోజుల లోపల తిరిగి వచ్చుట కవకాశము లేకుండెను.

అతడు లేనప్పుడు మూడవరోజున ఈ దిగువ యాశ్చర్యకరమయిన సంగతి జరిగెను. మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి యింటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయెను.

కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారా యని యడిగిరి.

వారిట్లు నుడివిరి. ”లేదు. నేను భగవంతుని సేవకుడను. వారి యాజ్ఞానుసారము మీ యోగ క్షేమములను కనుగొనుటకు వచ్చితిని”. అట్లనుచు దక్షిణనడిగెను.

ఆమె ఒక రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఊదీ నిచ్చి, దానిని పూజలో ఫొటోతో కూడ నుంచుకొని పూజించుమనిరి. పిమ్మట యిల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు.

భివండిలో తన గుఱ్ఱము జబ్బు పడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను.

ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్యవల్ల వినెను. ఫకీరు గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను.

ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుట కిష్టపడకుండెను. తానే యింటివద్ద నున్నచో 10 రూపాయలకు తక్కువ గాకుండ దక్షిణ యిచ్చి యుందుననెను.

వెంటనే ఫకీరును వెదకుటకై బయలుదేరెను. మసీదులలోను, తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెదకెను. అతని యన్వేషణ నిష్పలమయ్యెను.

ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను.

అప్పాసాహెబిచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమయిన తరువాత చిత్రేయను స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరెను.

కొంత దూరము పోగా నెవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు గాన్పించెను. వారి ముఖ లక్షణములను బట్టి వారు తన యింటికి 12 గంటలకు వచ్చినవారే యని యనుకొనెను.

వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ నడిగెను. అప్పాసాహెబు ఒక రూపాయినిచ్చెను. వారు తిరిగి యడుగగా ఇంకను రెండు రూపాయలిచ్చెను. అప్పటికి అతడు సంతుష్టి చెందలేదు.

అప్పాసాహెబు చిత్రే వద్ద నుంచి మూడు రూపాయలు తీసికొని ఫకీరుకు ఇచ్చెను. వారింకను దక్షిణ కావలెననిరి.

అప్పాసాహెబు వారినింటికి రావలసినదిగా వేడుకొనెను. అందరు ఇల్లు చేరిరి. అప్పాసాహెబు వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము తొమ్మిది రూపాయలు ముట్టెను.

అప్పటికి సంతుష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ యిమ్మనెను. అప్పాసాహెబు తన వద్ద పది రూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి యిచ్చివేసి యక్కడనుండి వెడలెను.

అప్పాసాహెబు పదిరూపాయ లిచ్చెదననెను గనుక ఆ మొత్తమును దీసికొని పవిత్ర పరచిన పిమ్మట తొమ్మిది రూపాయల నిచ్చివేసెను.

9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. (బాబా లక్ష్మీబాయి శిందేకు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి).

అప్పాసాహెబు ఊదీ పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వురెక్కలు అక్షతలుండెను.

కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక యొకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును, వెంట్రుకను, ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను.

అప్పాసాహెబు ఊదీ ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడయినప్పటికి నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను.

బాబా ఫొటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయల కెన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడ వృద్ధియగుచుండెను.

కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసికొని, కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను.

హరిభావ్‌ కర్ణిక్‌ :

ఠాణా జిల్లా దహను గ్రామము నుండి హరిభావ్‌ కర్ణిక్‌ అనునతడు 1917వ సంవత్సరమున గురుపౌర్ణమినాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను; వస్త్రములు దక్షిణ సమర్పించెను.

శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే యింకొక రూపాయి బాబాకు దక్షిణ నివ్వవలెనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా,

బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని యింటికి బయలుదేరెను.

మార్గమధ్యమున నాసిక్‌లో కాలారాముని మందిరము ప్రవేశించి, దర్శనము చేసికొని వెలుపలికి వచ్చుచుండగా

నరసింగ మహరాజ్‌ అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి, హరిభావ్‌ ముంజేతిని బట్టుకొని, ”నా రూపాయి నాకిమ్ము” అనెను. కర్ణిక్‌ మిగుల ఆశ్చర్యపడెను.

రూపాయిని సంతోషముగా నిచ్చి, సాయిబాబా యివ్విధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహరాజ్‌ ద్వారా గ్రహించెననుకొనెను.

యోగీశ్వరులందరొకటే యనియు ఏకాత్మ భావముతో కార్యము లొనర్తురనియు నీ కథ తెలుపుచున్నది.

ముప్పది మూడవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles