Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయి సచ్చరిత్రము
ఐదవ రోజు పారాయణము
సోమవారము
ముప్పది యొకటవ అధ్యాయము
బాబా సముఖమున మరణించినవారు – సన్యాసి విజయానంద్;
బాలారామ్ మాన్కర్;
తాత్యా సాహెబు నూల్కర్ ; మేఘశ్యాముడు; పులి
ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడ మరణము పొందుటను గూర్చి హేమాడ్పంతు వర్ణించుచున్నాడు.
మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని, యాలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును.
భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడిట్లు చెప్పియున్నాడు. ”ఎవరయితే వారి యంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరయితే యేదో మరొక దానిని ధ్యానించెదరో, వారు దానినే పొందెదరు”.
అంత్యకాలమందు మనము మంచి యాలోచనలే మనస్సునందుంచు కొనగలమను నిశ్చయము లేదు. అనేకమంది అనేక కారణముల వల్ల భయపడి యదరి పోయెదరు.
కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా నేదో మంచి యాలోచనయందే నిలుప వలెనన్నచో నిత్యము దాని నభ్యసించు టవసరము.
భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తియందుంచుకొని యెల్లప్పుడు భగవన్నామస్మరణ చేసినచో, మరణ కాలమందు గాబరా పడకుండ ఉండగలమని యోగీశ్వరులందరు మనకు బోధించుచుందురు.
భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి, యంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని యిచ్చట చెప్పెదము.
సన్యాసి విజయానంద్ :
విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను.
మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలిసికొనెను.
మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళపైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నిటిని ఆ స్వామి వర్ణించెను.
మంచు యెక్కువనియు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వానిని జెప్పెను.
దీనిని విని సన్యాసి నిరాశచెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి యిట్లనెను.
”ఈ పనికిమాలిన సన్యాసిని తరిమి వేయుడు. వాని సాంగత్యము మన కుపయుక్తము గాదు”.
సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటిని గమనించు చుండెను.
అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్క్రిరిసి యుండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి.
కొందరు వారి పాదముల కభిషేకము చేయుచుండిరి. వారి బొటన వ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్ల కద్దుకొనుచుండిరి.
కొందరు బాబా శరీరమున కత్తరు చందనములను పూయుచుండిరి. జాతి మత భేదములు లేక యందరును సేవ చేయుచుండిరి.
బాబా తనను కోపించినప్పటికి ఆతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున నాతనికి ఆ స్థలము విడిచిపెట్టు కిష్టము లేకుండెను.
అతడు షిరిడీలో రెండు రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా నున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగుచెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను.
కాని బాబా యాజ్ఞ లేనిదే షిరిడీ విడువ లేకుండెను. ఉత్తరము తీసికొని బాబా దర్శనమునకై వెళ్ళెను.
ఇంటికి పోవుటకు బాబా యాజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా, ముందు జరుగబోవునది గ్రహించి, ”నీ తల్లిని అంత ప్రేమించువాడవయితే సన్యాసమెందుకు పుచ్చుకొంటివి?
కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగ కూర్చుండుము. ఓపికతో కొద్దిరోజులు కూర్చుండుము.
వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసికొని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయెదరు.
ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలిసికొని, నీ కర్తవ్యమును జేయుము.
ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల యభిమానము విడిచి పెట్టుము.
ఎవరయితే ఈ ప్రకారముగ జేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో, వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు.
ఎవరయితే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయము చేయును.
నీ పూర్వ పుణ్య మెక్కువగుటచే నీ విక్కడకు రాగలిగితివి.
నేను చెప్పిన దానిని జాగ్రత్తగ విని జీవిత పరమావధిని కాంచుము.
కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము.
భగవంతుడు సంతుష్టి జెంది నీ విచారములను దొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును” అనిరి.
అతని మరణము సమీపించినందున బాబా అతనికీ విరుగుడు నుపదేశించెను. బాబా కూడ తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే ‘రామ విజయము’ చదివించెను.
ఆ మరుసటి యుదయము స్నానము మొదలగునవి యాచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండీ తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను.
రెండు పారాయణములు చేయగనే యలసిపోయెను. వాడాకు వచ్చి రెండు దినములుండెను. మూడవరోజు ఫకీరు (బడే) బాబా తొడపై ప్రాణములు వదలెను.
బాబా ఒక రోజంతయు శవము నటులే యుంచుడనెను. పిమ్మట పోలీసువాండ్రు వచ్చి విచారణ జరిపి శవసంస్కారము కాజ్ఞనిచ్చిరి.
యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను.
బాలారామ్ మాన్కర్ :
బాలారామ్ మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయెను.
అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభార మప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని, అతనికి సద్గతి కలుగ జేయవలెనని యీ దిగువ రీతిగ జేసెను.
బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్ఛింద్రగడ్ లో నుండు మనెను. బాబాను విడిచిపెట్టి మచ్ఛింద్రగడ్ లో నుండుట అతనికిష్టము లేకుండెను.
కాని యిదే అతనికి మంచి మార్గమని బాబా యొప్పించెను. అచట రోజుకు మూడుసారులు ధ్యానము చేయుమనెను.
బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్ఛింద్రగడమునకు వచ్చెను.
అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును జూచి సంతసించి, బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలిడెను.
కొలది దినముల పిమ్మట యొక దృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధిస్థితియందు దివ్యాను భవములను పొందెదరు.
గాని మాన్కర్ విషయములో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్యదర్శనము లభించెను.
అతనికి బాబా స్వయముగా గాన్పించెను. మాన్కర్ బాబాను జూచుటయేగాక తన నచట కేల పంపితివని యడిగెను.
బాబా యిట్లు చెప్పెను. ”షిరిడీలో అనేకాలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగజేయవలెనని యిచటకు బంపితిని.
నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడు షిరిడీలోనే యుండెద ననుకొంటివి.
ఇప్పుడు నీ విచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచటికి బంపితిని”.
కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గఢమును విడచి బాంద్రాకు పయనమయ్యెను.
పూనా నుండి దాదరుకు రైలులో పోవలెననుకొనెను. టిక్కెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా నది మిక్కిలి క్రిక్క్రిరిసి యుండెను.
అతనికి టిక్కెట్టు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకొన్న ఒక పల్లెటూరివాడు వచ్చి ”మీరెక్కడికి పోవుచున్నా” రని యడిగెను. దాదరుకని మాన్కర్ బదులు చెప్పెను.
అతడిట్లనెను. ”దయచేసి నా దాదరు టిక్కెట్టు తీసికొనుము, నాకవసరమైన పని యుండుటచే దాదరుకు వెళ్ళుట మానుకొంటిని”. టిక్కెట్టు లభించినందున మాన్కర్ యెంతో సంతసించెను.
జేబులో నుంచి పైకము తీయునంతలో నా జానపదు డంతర్ధానమయ్యెను. మాన్కర్ ఆ గుంపులో నతనికై వెదకెను. కాని లాభము లేకపోయెను.
అతని కొరకు బండి కదలునంతవర కాగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత యనుభవములందు ఇది రెండవది.
ఇంటికి పోయివచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటినుంచి షిరిడీలోనే బాబా పాదముల నాశ్రయించి యుండెను.
వారి సలహాల ననుసరించి నడుచు కొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి యాశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో యదృష్టవంతుడని చెప్పవచ్చును.
తాత్యాసాహెబు నూల్కర్ :
తాత్యాసాహెబు నూల్కర్ గూర్చి హేమాడ్పంతు ఏమియు చెప్పియుండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రిక నుండి యీ వృత్తాంతమును గ్రహించితిమి.
1909 సంవత్సరములో తాత్యాసాహెబు పండరీపురములో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబు చాందోర్కరు అచట మామలతదారుగా నుండెను.
ఇద్దరు చాలాసార్లు కలిసికొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహెబుకు యోగుల యందు నమ్మకము లేకుండెను. నానాసాహెబుకు వారియందు మిగుల ప్రేమ.
అనేక పర్యాయములు నానాసాహెబు, నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయుమని బలవంత పెట్టెను. తుదకు రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను.
అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను.
భగవత్కటాక్షముచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబు నూల్కర్ వద్దకు పంపెను. ఎవరోగాని వంద కమలాఫలములను నూల్కర్కు పంపిరి.
రెండు షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబు షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను.
మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా యవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబు నూల్కర్కు లభించెను.
కనుక నతడు బాబా యెడ మక్కువపడి తన యంత్యదశ వరకు షిరిడీలోనే యుండెను. తన యంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను.
చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా యిట్లనెను. ”అయ్యో ! తాత్యా మనకంటె ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మము లేదు”
మేఘశ్యాముడు :
28వ అధ్యాయములో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరు శవము వెంట వెళ్ళిరి.
బాబా కూడ వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహనసంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్ళు కారెను.
సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువువలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను.
యోగులనేకులు భక్తులకు సద్గతి నిచ్చుట విందుము. కాని బాబా గొప్పదన మమోఘమైనది. క్రూరమైన పులి కూడ వారివలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును.
పులి :
బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను.
ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి యుంచిన పులి యుండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి యుండెను.
దానిని ముగ్గురు దర్వీషులు పెంచుచు ఊరూర త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి.
ఆ పులియేదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను.
బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసికొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి, దర్వీషులు బాబా వద్దకు బోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి.
అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరు దానివైపు చూచుచుండిరి.
బాబా దానిని తన వద్దకు దీసికొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసికొని వెళ్ళిరి.
బాబా కాంతికి తట్టుకొనలేక యది తల వాల్చెను. బాబా దానివైపు చూడగా నది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివితప్పి క్రిందపడి చచ్చెను.
అది చచ్చుట జూచి దర్వీషులు విరక్తి జెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను.
ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగ నుండుటచే నది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు గోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే యని భావించిరి.
అది వారికి బాకీపడి యుండెను. దాని బాకీ తీరిన వెంటనే యది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది.
యోగుల పాదములకడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును ?
ముప్పది యొకటవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above text has been typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది యొకటవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏబది యొకటవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది యొకటవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది నాలుగవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది తొమ్మిదవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments