Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
ఏబది యొకటవ అధ్యాయము
సద్గురు సాయి యొక్క గొప్పదనము; ప్రార్థన; ఫలశృతి
శ్రీ సాయి సచ్ఛరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. ఇదియే చివరి అధ్యాయము.
ఇందు హేమాడ్‌పంతు ఉపసంహార వాక్యములు వ్రాసెను. పీఠికతో విషయసూచిక నిచ్చునట్లు వాగ్దానము చేసెను కాని యది హేమాడ్‌పంతు కాగితములలో దొరకలేదు.
కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బి.వి.దేవు (ఠాణా వాసి, ఉద్యోగమును విరమించుకొనిన మామలతదారు) కూర్చెను.
ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని యంశములను ఇచ్చుటచే విషయసూచిక యనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించెదము.
ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియున్నట్లు కనబడలేదు.
అచ్చటచ్చట చేతి వ్రాతను బోల్చుకొనుట గూడ కష్టముగా నుండెను. కాని యదంతయు నున్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను.
అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా జెప్పబడినవి.
సద్గురు సాయి యొక్క గొప్పదనము :
శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి యాశ్రయమును పొందెదము. వారు జీవజంతువులయందును, జీవములేని వస్తువుల యందును వ్యాపించియున్నారు.
వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని యన్నిటియందు వ్యాపించియున్నారు. జీవరాశి యందంతటను కూడ వ్యాపించి యున్నారు.
భక్తులందరు వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికిష్టమైనవి మయిష్టమయినవియు లేవు.
వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు.
ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయ సుఖములనెడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడ విరుగగొట్టుచుండును.
అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలనెడు మొసళ్ళు నిర్భయముగా సంచరించును.
అచట నేను, నాది యను సుడిగుండములును, ఇతర సంశయములును గిఱ్ఱున తిరుగుచుండును.
పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికి సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు (అనగా నాశనము చేయువారు).
సాయి భక్తులకు దానివల్ల భయమేమి యుండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు.
ప్రార్థన :
మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు బట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము.
మా మనస్సు అటు నిటు సంచారము చేయకుండుగాక. నీవు దప్ప మరేమియు కోరకుండుగాక.
ఈ సచ్ఛరిత్రము ప్రతి గృహమందుండు గాక. దీనిని ప్రతినిత్యము పారాయణ చేసెదము గాక. ఎవరయితే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి యాపదలు తొలగిపోవు గాక !
ఫలశృతి :
ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదుము.
పవిత్ర గోదావరిలో స్నానము చేసి, షిరిడీలో సమాధిని దర్శించి, సాయి సచ్ఛరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము.
నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును.
ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నియు నశించును.
జనన మరణములనే చక్రము నుండి తప్పించు కొనవలెనన్నచో సాయిలీలలను చదువుము. వాని నెల్లప్పడు జ్ఞప్తి యందుంచు కొనుము.
వారి పాదములనే యాశ్రయింపుము; వానినే భక్తితో పూజింపుము. సాయిలీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు.
శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును.
ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును.
భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో నతడు ‘తాను’ అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో గలియునట్లు భగవంతునిలో ఐక్యమగును.
మూడింటిలో ననగా జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలలో నేదయిన యొక్క యవస్థలో వారి యందు లీనమయినచో సంసార బంధమునుండి తప్పుకొందువు.
స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోను, పూర్తి నమ్మకముతోను పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో, వారి యాపదలన్నియు నశించగలవు.
దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి, నమ్మకములపై ఫల మాధారపడి యున్నది. ఈ రెండును లేనిచో నెట్టి యనుభవము కలుగదు.
దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ యజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యముల నొసంగును.
కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది యపరిమితానందమును కలుగజేయును.
ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలయును.
అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతసముతో జన్మజన్మములవరకు మదిలో నుంచుకొనును.
ఈ గ్రంథమును గురుపౌర్ణమినాడు (అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు) గోకులాష్టమినాడు, శ్రీరామనవమినాడు, విజయదశమినాడు (అనగా, బాబా పుణ్యతిథినాడు) ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను.
ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన యెడల వారల కోరికలన్నియును నెరవేరును.
నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన యెడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు.
దీనిని పారాయణ చేసిన యెడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు.
అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును.
ఓ ప్రియమైన భక్తులారా ! పాఠకులారా ! శ్రోతలారా !
మీకు కూడ మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు, ప్రతినెల మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు.
ఈ లీలల నెంత తీవ్రముగా చదివెదరో, వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి, మీకుపయుక్తముగా నుండునట్లు చేయును.
ఈ కార్యమందు రచయితయు, చదువరులును సహకరించవలెను. ఒండొరులు సహాయము చేసికొని సుఖపడవలెను.
ఈ గ్రంధమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్ధనతో ముగించెదము. కారుణ్యమును జూపుమని వారిని వేడెదము.
ఈ గ్రంధమును చదువు, విను భక్తులు హృదయ పూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరు గాక!
సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలచిపోవును గాక! వారు శ్రీ సాయిని సర్వజీవముల యందు చూచెదరు గాక! తథాస్తు!
శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము.
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above text has been typed by: Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది యొకటవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది యొకటవ అధ్యాయము🌹….Audio
- శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది యొకటవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది యేడవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹మొదటి అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments