🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది తొమ్మిదవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ముప్పది తొమ్మిదవ అధ్యాయము

పస్తావన; భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము;

సమాధి మందిర నిర్మాణము

ఈ యధ్యాయములో భగవద్గీతయందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన యర్థమున్నది.

కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు, అది నానాసాహెబు చాందోర్కర్‌ చెప్పినదనియు ననుటచే, హేమాడ్‌పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను.

రెండధ్యాయములలోను నొకే విషయముండుటచే రెండును నిందులో పొందుపరచడమైనది.

పస్తావన :

షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి యచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు, తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి.

షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారికొరకే చాల దూరము నుండి యచటకు వచ్చెను.

మొదట షిరిడీ చాలా చిన్న గ్రామము. సాయిబాబా యచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థల మాయెను. అచటనుండు స్త్రీలు కూడ ధన్యులు.

బాబా యందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు.

వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనఃశ్శాంతి కలుగజేయుచుండెను.

భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము :

బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని యర్థమును నానాసాహెబు చాందోర్కరుకు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను.

ఈ విషయమును గూర్చి బి.వి. దేవు గారు (శ్రీ సాయిలీల, సంపుటి – IV, పుట – 563, ‘ స్పుటవిషయ’ నందు) వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబు చాందోర్కర్‌ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలిసికొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను.

నానాసాహెబు చాందోర్కర్‌ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి యున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను.

బాబాకీ విషయము గాని, సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా యతని గర్వమణచెను.

ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల దీర్చుటకు నొంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను.

బాబా : నానా ! యేమి గొణుగుచున్నావు ?

నానా : సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను.

బాబా : ఏ శ్లోకము ?

నానా : భగవద్గీతలోనిది

బాబా : గట్టిగా చదువుము

నానా : (భగవద్గీత 4వ అధ్యాయము, 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను)

”తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః ”

బాబా : నానా ! అది నీకు బోధపడినదా ?

నానా : అవును.

బాబా : నీకు తెలిసినచో నాకు చెప్పుము.

నానా : దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని

           ప్రశ్నించుట,  వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలిసికొనుము. అప్పుడు

           మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా, పరబ్రహ్మమును దెలిసినవారు ఆ జ్ఞానము

           నుపదేశించెదరు.

బాబా : నానా ! శ్లోకము యొక్క తాత్పర్యమక్కరలేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని

          యర్థము చెప్పుము.

          అప్పుడు నానా ప్రతి పదమున కర్థము చెప్పెను.

బాబా : నానా ! ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా ?

నానా : ప్రణిపాతయను పదమున కింకొక యర్ధము నాకు తెలియదు. ప్రణిపాత యనగా సాష్టాంగ

            నమస్కారమని నాకు తెలియును.

బాబా : పరిప్రశ్న యనగా నేమి ?

నానా : ప్రశ్నలడుగుట

బాబా : ప్రశ్న యనగా నేమి ?

నానా : అదే, అనగా ప్రశ్నించుట.

బాబా : పరిప్రశ్న యన్నను ప్రశ్న యన్నను ఒక్కటే యయినచో, వ్యాసుడు ‘పరి’ యను

           ప్రత్యయమును ప్రశ్నకు ముందేల యుపయోగించెను ? వ్యాసుడు తెలివి తక్కువవాడా ?

నానా : పరిప్రశ్న యను మాటకు నాకితర యర్థమేమియు తెలియదు.

బాబా : సేవ యనగా నెట్టిది ?

నానా : ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది.

బాబా : అట్టిసేవ చేసిన చాలునా ?

నానా : సేవయను పదమున కింకను వేరే యర్థమేమి గలదో నాకు తోచుట లేదు.

బాబా : రెండవ పంక్తిలోని ”ఉపదేక్ష్యంతి తే జ్ఞానం” అనుదానిలో జ్ఞానమను పదముపయోగించకుండ

           యింకొక పదము ఉపయోగించగలవా ?

నానా : అవును

బాబా : ఏ పదము ?

నానా : అజ్ఞానము

బాబా : జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో, ఈ శ్లోకములో నేమైన అర్థము గలదా ?

నానా : లేదు; శంకర భాష్య మా విధముగా చెప్పుటలేదు.

బాబా : వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదము నుపయోగించిన యెడల తగిన యర్థము

           వచ్చునప్పుడు దాని నుపయోగించుట కేమైన ఆక్షేపణ కలదా ?

నానా : అజ్ఞానమను పదమును చేర్చి దాని యర్థమును విశదపరచుట నాకు తెలియదు.

బాబా : కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్త్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయుమని

           చెప్పనేల ? స్వయముగా కృష్ణుడు తత్త్వదర్శి  కాడా ? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా!

నానా : అవును, అతడు తత్త్వదర్శియే, కాని అర్జును నితర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు

           తోచుట లేదు.

బాబా : నీకది బోధపడలేదా ?

నానా సిగ్గుపడెను. అతని గర్వమణగెను. అప్పుడు బాబా ఇట్లు   వ్యాఖ్యానించెను.

  1. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగనమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలెను.
  2. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితోగాని, దొంగ యెత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకుగాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికిమాలిన యాసక్తితో గాని యడుగకూడదు. నిజముగా తెలిసికొని దానిచే మోక్షము పొందుటకు గాని, ఆధ్యాత్మికాభివృద్ధికి గాని యడగవలెను.
  3. సేవ యనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే యభిప్రాయముతో చేయునది సేవకాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును.

గురువజ్ఞానమును బోధించుననగా, నానాకు అర్థము కాలేదు.

బాబా : జ్ఞానము ఉపదేశ మెట్లగును ? అనగా సాక్షాత్కారము బోధించుట యెట్లు ? అజ్ఞానమును

           నశింపజేయుటయే జ్ఞానము.

జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పియున్నారు. ‘అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జునా ! స్వప్నము, నిద్ర తొలగిపోయినచో మిగులునది. నీవుగా గ్రహింపుము.

జ్ఞానమనగా నజ్ఞానమును నశింప జేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము.

ద్వైతమును నశింపజేసెద మనగా, అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసెద మనినచో, వెలుతురు గూర్చి చెప్పుట,

అద్వైతమును పొందవలెననినచో, ద్వైతమను భావమును మనలోనుంచి తీసివేయవలెను.

అదియే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే యుండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవ్వరు ?

ఎవరైన నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది యెట్లు తెలియును ? దాని నెట్లు పొందెదరు ?

శిష్యుడు గురువువలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము.

సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట, జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే.

దాని వలన వారి యసలయిన నిర్గుణ స్వభావము కొంచెము గూడ వికారము చెందదు.

వారి సత్యస్వరూపము, దైవికశక్తి, జ్ఞానము తరుగకుండ నుండును. శిష్యుడు కూడ నట్టి స్వరూపము కలవాడే. కాని యతని అనేక జన్మల యజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును.

అతడు ”నేను సామాన్య నికృష్టజీవుడను” అనుకొనును. గురువు ఈ యజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన యుపదేశము నివ్వవలెను.

లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుదేశించ వలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకొను శిష్యునికి గురువు ”నీవే దైవము, శక్తి యుతుడవు, ఐశ్వర్యశాలివి” అని బోధించును.

అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును.

తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా యహంకారమనియు, దేవుడు, లోకము తనకంటె వేరనియు తలంచు నితాంతభ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము దానిపై నాధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును.

ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ అజ్ఞానమెట్లు అంకురించినది ? అది యెక్కడ నున్నది ? అను దానిని చూపుటయే గురూపదేశమందురు.

ఈ దిగువ వివరించినవి యజ్ఞాన లక్షణములు :

     1 నేను జీవిని (ప్రాణిని)

     2 శరీరమే యాత్మ (నేను శరీరమును)

     3 భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు

     4 నేను దేవుడను కాను

     5 శరీర మాత్మ కాదని తెలిసికొనకుండుట

     6 దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటేయని తెలియకుండుట.

ఈ తప్పులన్నియు చూపించనిదే, శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా శరీరమనగానేమో తెలియజాలడు.

వానితో వానికి ఎట్టి సంబంధము కలదో ఒకటి యింకొకటికంటె వేరైనదా లేక రెండును ఒకటేనా యను సంగతి గ్రహింపజాలడు.

ఈ సంగతులను బోధించుటకు వాని యజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా ? అజ్ఞానమా ? జ్ఞానమూర్తియైన జీవునకు జ్ఞానోపదేశము చేయనేల ?

ఉపదేశమనునది వాని తప్పును వానికిచూపి వాని యజ్ఞానమును నశింపజేయుటకొరకే. బాబా యింకను యిట్లనెను :

1 ప్రణిపాత మనగా శరణాగతి చేయుట. 2. శరణాగతి యనగా తను (శరీరము), మన (మనస్సు), ధనముల (ఐశ్వర్యము) నర్పించుట, 3. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానుల నాశ్రయించు మననేల ?

సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణుడునిగనే భావించును.

గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావించును.

అటువంటి భక్తులు, గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి యుండుటచే, వారిని గూర్చి అర్జునునికి చెప్పెను.

అట్టివారి గొప్పతనము హెచ్చి యందరికి తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను.

సమాధిమందిర నిర్మాణము :

బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడును మాట్లాడువారు కారు. ఏమి సందడి చేయువారు కారు.

సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధిమందిర నిర్మాణము ఒక ఉదాహరణము.

నాగపూరు కోటీశ్వరుడు, శ్రీమాన్‌ బాపూసాహెబు బూటీ షిరిడీలో సకుటుంబముగా నుండెడివాడు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని యాలోచన కలిగెను.

కొన్నాళ్ళ పిదప దీక్షిత్‌వాడాలో నిద్రించు చుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి యొక వాడాను మందిరముతో సహ నిర్మించుమనెను.

అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడ అట్టి దృశ్యము గనిపించెను. బాపూసాహెబు లేచి శ్యామా యేడ్చుచుండుట చూచి కారణమడిగెను.

శ్యామా యిట్లు చెప్పెను. ”బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము. నేను అందరి కోరికలను నెరవేర్చెద ననెను.

బాబా ప్రేమ మధురమైన పలుకులు విని, భావావేశమున మైమరచితిని; నా గొంతుక యార్చుకొనిపోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలిడితిని”.

వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే యయినందులకు బాపూసాహెబు బూటీ విస్మయ మందెను.

ధనవంతుడగుటచేతను, చేతనయినవాడగుట చేతను, అచ్చొటోక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు (శ్యామా) సహాయముతో ఒక ప్లాను గీసెను.

కాకాసాహెబు దీక్షిత్‌ దాని నామోదించెను. దానిని బాబా ముందర పెట్టగా, బాబా కూడ వెంటనే యామోదించెను.

కట్టుట ప్రారంభించిరి. శ్యామా పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరిగృహము, భూగృహము, బావి పూర్తియయ్యెను.

బాబా కూడ లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను.

మిగిలిన పనియంతయు బాపూసాహెబు జోగును చూడుమనిరి. అది నిర్మించునప్పుడు, బాపూ సాహెబు బూటీకి ఒక యాలోచన కలిగెను.

చుట్టూ గదులుండి, దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీకృష్ణుని) ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెనని తట్టెను.

బాబాకీ సంగతి తెలియజేసి వారి యభిప్రాయమును కనుగొనవలెనని శ్యామాకు చెప్పెను.

వాడా ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామా యీ విషయము నడుగగా బాబా యందులకు సమ్మతించి ”దేవాలయము పూర్తికాగానే నేనే యచ్చట నివసించుటకు వచ్చెదను” అని వాడావయిపు జూచుచు

”వాడా పూర్తియయున పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొన వలెను. మనమందర మచ్చట నుందము. అందరు కలసి మెలసి యాడుకొందము. ఒకరి నొకరు కౌగిలించుకొని సంతోషముగా నుండవచ్చును” అనెను.

దేవస్థాన మధ్య మందిరము కట్టుట కది తగిన శుభసమయమా యని శ్యామా యడుగగా, బాబా సమ్మతించుటచే శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించెను.

కొద్దికాలములో పని పూర్తి యాయెను. మురళీధర్‌ విగ్రహము తయారుచేయుట కాజ్ఞాపించిరి.

అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి.

బాపూ సాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను; నిరాశపడెను. బాబా సమాది చెందినచో, తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థమగుననియు చింతించెను.

కాని బాబా సమాధి చెందక ముందు ”నన్ను రాతి వాడాలో నుంచుడు !” అన్నట్టి పలుకులు బాపూసాహెబుకే గాక యందరికి ఊరట కలిగించెను.

సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో బెట్టి సమాధి చేసిరి.

ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు, బూటీవాడాయే సమాధిమందిరమనియు అర్థము గ్రహించవలెను.

వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము గాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి యగుటచే బాపూసాహెబ్‌ బూటీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి.

ముప్పది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles