🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది నాలుగవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా 🌹

శ్రీ సాయి సచ్చరిత్రము

ముప్పది నాలుగవ అధ్యాయము

ఊదీ మహిమ;

డాక్టరుగారి మేనల్లుడు; డాక్టరు పిళ్ళే; శ్యామా మరదలు; ఇరానీ బాలిక;

హార్దా పెద్దమనిషి; బొంబాయి మహిళ

ఈ అధ్యాయములో కూడ ఊదీ మహిమ వర్ణితము. ఊదీ ధరించినంత మాత్రమున నెట్టి ఫలములు కలిగెనో చూతము.

డాక్టరు గారి మేనల్లుడు :

నాసిక్‌ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టరుండెను(డాక్టర్ D.M. ముల్కీ). ఆయన వైద్యములో పట్టభద్రులు.

వారి మేనల్లుడు  నయముకానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టరుగారితో పాటు ఇతర డాక్టర్లు కూడ నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషను చేసిరి. కాని ఏ మాత్రము మేలు జరుగలేదు.

కుఱ్ఱవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనిరి.

షిరిడీ సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యెనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి.

బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి. కుఱ్ఱవానిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి.

దయార్ద్ర హృదయుడగు బాబా వారిని ఓదార్చి యిట్లనెను. ”ఎవరయితే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా నుండుడు.

కురుపుపై ఊదీని పూయుడు. ఒక వారము రోజులలో నయమగును. దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు ఇది ద్వారవతి.

ఎవరయితే యిందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును”.

వారు కుఱ్ఱవానిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా యా కురుపు మీద తన చేతిని త్రిప్పెను, ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను. రోగి సంతుష్టి చెందెను.

ఊదీ రాయగా కురుపు నెమ్మదించెను. కొద్దిరోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుఱ్ఱవానితో గూడ బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడచిరి.

బాబా ఊదీ ప్రసాదము వల్లను వారి దయాదృష్టివల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి.

ఈ సంగతి విని కుఱ్ఱవాని మామయగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవుచు మార్గమున బాబాను చూడగోరెను.

కాని మాలేగాంలోను మన్‌మాడ్‌లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగ చెప్పి అతని మనస్సును విరిచిరి.

కావున నతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలిబాగులో గడుపవలెననుకొనెను.

బొంబాయిలో మూడురాత్రులు వరుసగా నొక కంఠధ్వని ”ఇంకను నన్ను నమ్మవా !” యని వినిపించెను. వెంటనే డాక్టరు తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను.

అతడు బొంబాయిలో నొక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను.

కాని, తన మనస్సులో బాబాను పరీక్షించదలచి, ”రోగి యొక్క వ్యాధి యీనాడు కుదిరినచో, రేపే షిరిడీకి పోయెదను” అని యనుకొనెను.

జరిగిన చిత్రమేమన సరిగా మనో నిశ్చయము చేసినప్పటి నుంచి, జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను.

డాక్టరు తన మనో నిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారమొనర్చెను.

బాబా అతనికి గొప్ప యనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యెను.

అక్కడ 4 రోజులుండి, బాబా ఊదీతోను, ఆశీర్వచనములతోను ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బీజాపూరుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి.

అతని మేనల్లుడుని రోగము ఆ డాక్టరుకు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటినుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను.

డాక్టరు పిళ్ళే(డా. శివానంద్ పిళ్ళే) :

డాక్టరు పిళ్ళే యనునాతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని ‘భావూ’ (అన్నా) అని పిలుచువారు.

బాబా యతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతని నెల్లప్పుడు చెంత నుంచుకొనువారు.

ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే (నారిపుండు) బాధపడెను. అతడు కాకాసాహెబు దీక్షిత్‌తో, ”బాధ చాలా హెచ్చుగా నున్నది. నేను భరించలేకున్నాను. దీనికంటె చావు మేలని తోచుచున్నది.

గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేనీ బాధ ననుభవించు చున్నాను. కాన బాబా వద్దకు బోయి యీ బాధ నాపుచేసి, దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడు” మనెను.

దీక్షితు బాబా వద్దకు వెళ్ళి యా సంగతి చెప్పెను. బాబా మనస్సు కరగెను.

బాబా దీక్షితు కిట్లనెను. ”నిర్భయుడుగా నుండు మనుము. అతడేల పది జన్మల వరకు బాధ పడవలెను ? పది రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను.

నేనిక్కడుండి యిహపర సౌఖ్యము లిచ్చుటకు సిద్ధముగా నుండ అతడేల చావును కోరవలెను ? అతని నెవరి వీపు పయి నయిన తీసికొనిరండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను”.

ఆ స్థితిలో డాక్టరును దెచ్చి బాబా కుడివైపున, ఫకీరు బాబా యెప్పుడు కూర్చుండుచోట, కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి యిట్లనెను.

”ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసికొమ్ము. అసలయిన విరుగుడేమనగా గత జన్మ పాపము లనుభవించి, విమోచనము పొందవలెను. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము.

వచ్చినదాని నోర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడు ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును.

వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము” .

నానాసాహెబు కట్టుకట్టెననియు కాని, గుణమివ్వలేదనియు డాక్టరు పిళ్ళే చెప్పెను.

బాబా యిట్లనెను. ”నానా తెలివి తక్కువవాడు; కట్టు విప్పుము లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును” .

ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్‌ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగుచేయుచుండగా, అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి యుండెను.

దానిపయి అబ్దుల్‌ కాలు పడగనే యందులోనుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను.

డాక్టరు పిళ్ళే బిగ్గరగా యేడ్వసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తరువాత నింకొకటి వచ్చుచుండెను.

బాబా యిట్లనెను. ”చూడుడు ! మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు”. పిళ్ళే ”కాకి ఎప్పుడు వచ్చు”ననెను.

బాబా యిట్లు జవాబు నిచ్చెను. ”నీవు కాకిని చూడలేదా ? అది తిరిగి రాదు. అబ్దులే యా కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు”.

ఊదీపూయుటవలన, దానిని తినుట వలనను, ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయెను.

శ్యామా మరదలు(భగీరథి) :

శ్యామా తమ్ముడు బాపాజీ సావూల్‌ విహిర్‌ దగ్గర నుండువాడు. ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను.

ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో రెండు బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామా వద్దకు పరుగెత్తి వచ్చి సహాయపడుమనెను. శ్యామా భయపడెను.

కాని యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగుచేయుమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి బోవుటకు అనుజ్ఞ నిమ్మనెను.

బాబా యిట్లనెను. ”ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊదీ పంపుము. జ్వరము గాని, బొబ్బలను గాని లక్ష్యపెట్ట నవసరము లేదు. మన తండ్రియును, యజమానియు ఆ దైవమే.

ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయము వెళ్ళుము. వెంటనే తిరిగిరమ్ము”.

శ్యామాకు బాబా ఊదీయందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని బంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించిరి.

దానిని తీసికొనిన వెంటనే, బాగా చెమట పట్టెను; జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి యుదయము తన భార్యకు నయమగుట జూచి బాపాజీ యాశ్చర్యపడెను.

జ్వరము పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామా బాబా యాజ్ఞ ప్రకారము వెళ్ళగా, నామె పొయ్యి దగ్గర తేనీరు తయారుచేయుచుండుట చూచి యాశ్చర్యపడెను.

తమ్ముని అడుగగా బాబా ఊదీ ఒక్క రాత్రిలోనె యా బొబ్బలను బాగు చేసెననెను. అప్పుడు ”ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము” అను బాబా మాటల భావము శ్యామా తెలిసికొనగలిగెను.

టీ తీసికొని శ్యామా తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి యిట్లనెను. ”దేవా ! ఏమి నీ యాట ! మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగ జేసెదవు. తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు”.

బాబా యిట్లు జవాబిచ్చెను. ”కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను, నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు.

అది యదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షీభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ధ్రహృదయులు. నేను భగవంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును.

వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ యహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధము లూడి మోక్షమును పొందెదరు” .

ఇరానీ బాలిక :

ఇక ఇరానీ వాని యనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను.

మూర్ఛ రాగానే యామె మాటలాడ లేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు.

ఒక స్నేహితుడు బాబా ఊదీ నుపయోగించుమనెను. విలేపార్లేలోనున్న కాకాసాహెబు దీక్షిత్‌ వద్ద ఊదీ తీసికొని రమ్మనెను.

ఇరానీ వాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతిగంటకు వచ్చు మూర్ఛ 7 గంటల కొకసారి రాసాగెను. కొద్దిరోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను.

హార్దా పెద్దమనిషి :

హార్దాపుర (మధ్య పరగణాలు) నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను.

అట్టి రాళ్ళు ఆపరేషను చేసి తీసెదరు. కనుక ఆపరేషను చేయించుకొమ్మని సలహా యిచ్చిరి.

అతడు ముసలివాడు, మనో బలము లేనివాడు. ఆపరేషను కొప్పుకొనకుండెను. అతని బాధ యింకొక రీతిగా బాగు కావలసియుండెను.

ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊదీ యుండెను.

స్నేహితులు కొందరు చెప్పగా, వృద్ధుని కుమారుడు ఊదీ తీసికొని దానిని నీళ్ళలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊదీ గుణమిచ్చెను.

రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగ బాగయ్యెను.

బొంబాయి మహిళ :

కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ యొకతె ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను.

ఆమె గర్భవతియైన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమె కేమియు తోచకుండెను.

బాబా భక్తుడు కల్యాణ్‌వాసుడగు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించునాటికి షిరిడీకి తీసికొని పొమ్మని సలహా యిచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి.

కొన్ని మాసములక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి.

కొన్నాళ్ళకు ప్రసవవేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు గనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను.

ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్ళలో కలిపి యిచ్చిరి. 5 నిమిషములలో నా స్త్రీ సురక్షితముగా, ఎట్టి కష్టము లేక ప్రసవించెను.

దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి యుండెను. కాని తల్లి ఆందోళనము, బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందుంచుకొనిరి.

ముప్పది నాలుగవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles